మాఫియాకు మరింత రీచ్ | Mafia to the more Reach | Sakshi
Sakshi News home page

మాఫియాకు మరింత రీచ్

Published Fri, Jan 1 2016 11:35 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

మాఫియాకు మరింత రీచ్ - Sakshi

మాఫియాకు మరింత రీచ్

ఇసుక రీచ్‌ల వేలానికి  సర్కారు నిర్ణయం
అధికార పార్టీ సిండి‘కేట్ల’గురి
డ్వాక్రా సంఘాలకు అన్యాయం

 
విశాఖపట్నం: డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌ల కేటాయింపు మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. ప్రారంభంలో రీచ్‌లను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారంటూ డ్వాక్రా సంఘాలకు కితాబిచ్చిన సర్కారు.. ఆ తరువాత తమ నాయకుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సంఘాలపై బురద జల్లింది. ‘సెర్ఫ్’ నుంచి రీచ్‌ల నిర్వహణ  బాధ్యతను మైనింగ్ శాఖకు అప్పగించారు. ఏడాది తిరక్కుండానే రీచ్‌ల కేటాయింపును పాత పద్ధతిలో వేలం పాటల ద్వారా కేటాయించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం మాఫియాకు మరింత ఊతమిస్తోంది. ఫిబ్రవరి కల్లా రీచ్‌ల కేటాయింపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయం   తీసుకోవడంతో సిండి‘కేట్లు’ రంగంలోకి దిగుతున్నారు.జిల్లాలో  2014 డిసెంబర్‌లో డీ నోటిఫై చేసిన 25 రీచ్‌లను  దశల వారీగా డ్వాక్రా సంఘాలకు కేటాయించారు. తొలుత ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇస్తామని నమ్మబలికి చివరకు క్యూబిక్ మీటర్‌కు రూ.25ల చొప్పున వేతనం ముట్టజెప్పారు. ఆ మొత్తం కూడా ఇంకా పూర్తి స్థాయిలో వారికి జమకాలేదు.

పరాకాష్టకు చేరిన అవినీతి
డ్వాక్రా సంఘాల మాటున 25 రీచ్‌ల్లో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికి తీయగా, అనధికారికంగా అధికార పార్టీ నేతలు మరో మూడులక్షల క్యూ.మీ. వరకు పిండేశారు. శారద, వరహా, తాండవ తదితర నదీ పరీవాహక ప్రాంతాలకు తూట్లు పొడిచారు. ఏటిగట్లను ధ్వంసం చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా తవ్వకాలు సాగించి అందినకాడికి దోచుకుతిన్నారు.కావాలనే ఇసుకకు కృత్రిమ కొరత సృష్టిస్తూ మూడు యూనిట్ల లారీ ఏకంగా పాతిక వేలు పలికేలా చేశారు. దీంతో సామాన్యులకు ఇసుక గగన కుసుమంగా మారేలా చేశారు. లక్షలాది మంది నిర్మాణ రంగ కూలీలకు పనుల్లేకుండా అల్లాడిపోయారు. పొరుగు జిల్లాల నుంచి రప్పించిన ఇసుకను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని దండిగా సొమ్ము చేసుకున్నారు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.25కోట్ల ఆదాయం వస్తే పచ్చనేతల జేబుల్లోకి మరో పాతిక కోట్ల వరకు చేరినట్టు విజిలెన్స్ వర్గాల అంచనా.

చేజిక్కించుకునేందుకు వ్యూహం
ఏడాదిగా సెర్ఫ్ అధీనంలో ఉన్న ఇసుక రీచ్‌లను ఈ నెల 2న మైనింగ్ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలు విడుదల కాలేదనే సాకుతో ఇప్పటి వరకు మైనింగ్ శాఖ రీచ్‌లను స్వాధీనం చేసుకోలేదు. తాజాగా రెండు రోజుల కిందట రాష్ర్ట కేబినెట్ రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇసుక రీచ్‌లను వేలం పాటల ద్వారా కేటాయించాలని తీసుకున్న నిర్ణయంతో ఇసుక మాఫియాకు రెడ్‌కార్పెట్ పరిచినట్టయింది.  గతంలో మాదిరిగానే సిండికేట్లుగా ఏర్పడి రీచ్‌లను తమపరం చేసుకునేందుకు ఇసుకాసురులు అప్పుడే వ్యూహం రచిస్తున్నారు. గతంలో ఇసుక వ్యాపారులు మాత్రమే వేలం పాటల్లో పాల్గొనే వారు. అయితే త్వరలో జరుగనున్న రీచ్‌ల వేలం పాటల్లో మెజార్టీ రీచ్‌లను చేజిక్కించుకోవాలని అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.   విధివిధానాలు విడుదలైన తర్వాత వేలం పాటల నిర్వహణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారం పదిరోజుల్లో ఇసుక రీచ్‌ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement