ఇసుక దందాకు..మళ్లీ పచ్చజెండా | adain started to sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుక దందాకు..మళ్లీ పచ్చజెండా

Published Tue, Jan 5 2016 2:21 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

ఇసుక దందాకు..మళ్లీ పచ్చజెండా - Sakshi

ఇసుక దందాకు..మళ్లీ పచ్చజెండా

వేమగిరి-కడియపులంక ర్యాంపులో తాత్కాలిక
తవ్వకాలకు అనుమతులు!
మళ్లీ డ్వాక్రా సంఘాల ముసుగులోనే..
♦  ఇప్పటికే ఖరారైన సీనియర్ నేత వాటా!
నెలాఖరులోగా నదిని కొల్లగొట్టడానికి సన్నద్ధం

 రాజమండ్రి రూరల్ / కడియం:
జిల్లాలో ఇసుక అక్రమార్కులు.. గోదావరిని యథేచ్ఛగా పిండుకుని, పెన్నిధులను పండించుకున్న వులెన్నో. అలాంటి అక్రమ ‘సిరి’నామాల్లో పేరుమోసింది..వేమగిరి-కడియపులంక ఇసుక ర్యాంపు. ఆ ర్యాంపులో మరోసారి దోపిడీకి రంగం సిద్ధమైంది. దాదాపు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేందుకు ఇప్పటికే తాత్కాలిక అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది.
 
  దీంతో మరోసారి అనుమతులకు మించి, నిబంధనలను అతిక్రమించి ఇసుక నుంచి డబ్బును పిండుకునేందుకు అక్రమార్కులు సిద్ధమైపోతున్నారు. రానున్న అప్పనపు ఆదాయంలో ఎవరికెంత వాటా అన్నదానిపై పలు దఫాలుగా చర్చలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇలాంటి వ్యవహారాలతో సహా అనేక అవకతవకలకు పెద్దన్నలా ఉండే అధికార పార్టీ సీనియర్ నాయకుడికి ఇప్పటికే ‘ఇంత’ ఇస్తామంటూ రేటు ఖరారు చేసినట్టు సమాచారం.
 
 ఇప్పటికే డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహించిన ఇసుక రీచ్‌లలో భారీగా ఇసుక దోపిడీ జరిగినట్లుగా తేలింది. ముఖ్యంగా వేమగిరి-కడియపులంక ర్యాంపులో ఈ దోపిడీ అత్యధికంగా   సాగినట్లుగా విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. 52 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరిగినట్టు చూపగా 72 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ డీఎస్పీ రామచంద్రరావు నేతృత్వంలోని అధికారుల బృందం లెక్కలు తేల్చింది. గత ఏడాది ఫిబ్రవరి 10న జరిగిన ఈ తనిఖీల్లో అప్పటి ఇసుక ధరల ప్రకారం అదనంగా బయటకు వెళ్ళిన ఇసుక ఖరీదు రూ.కోటీ 33 లక్షల వరకు ఉంటుందని అధికారులే లెక్కలు గట్టారు.
 
 అయితే ఆ ఇసుకలో ఎక్కువ మొత్తం బాటలు తదితర అవసరాల కోసం వినియోగించినట్లు ర్యాంపు నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా స్టాక్‌పాయింట్‌లలో నిల్వ చేసిన ఇసుక సైతం అక్రమార్కులపాలైంది. దీని విలువ కూడా దాదాపు రూ.60 లక్షలకు పైమాటే. నిజానికి అదనంగా బయటకు వెళ్లిన ఇసుక విలువ అనేక రెట్లు ఎక్కువన్నది వాస్తవం.
 
  ఇదిలా ఉండగా ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చిన అనుమతులు కూడా మళ్ళీ డ్వాక్రా సంఘాల పర్యవేక్షణలోనే తవ్వకాలు జరిగే విధంగా ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాయకుల జేబులు నింపేందుకే డ్వాక్రా సంఘాల ద్వారా దోపిడీకి తెరలేపినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా సంఘాల మాటున తమ దందాను నడిపించేందుకు పలువురు నాయకులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.  
 
 ఇసుక కొరతను సాకుగా చూపి..
 ఇసుక కొరత కారణంగా పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయన్నది సాకుగా చూపి దాదాపు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేందుకు ప్రభుత్వం నుంచి తాత్కాలిక అనుమతులు తెస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడూ నిర్దేశించిన పరిమాణాని కంటే అత్యధికంగానే ఈ ర్యాంపులో ఇసుక తవ్వకాలు సాగాయి. ఇదే విషయాన్ని విజిలెన్స్ అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడా విషయాలేమీ పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి నదిని సొంత పెన్నిధిగా మార్చుకునేందుకు అక్రమార్కులు సిద్ధమవుతున్నారు.
 
 ‘రాటు దేలిన’ వాడికే ర్యాంపు నిర్వహణ
 జాతీయ రహదారి-16కు అత్యంత సమీపంలో ఉండే వేమగిరి-కడియపులంక ఇసుక ర్యాంపు రవాణాదారులకు ఎంతో అనుకూలమైంది. అలాగే ఇసుక కూడా నాణ్యతగా ఉండడంతో ఇక్కడి నుంచి ఇసుక తీసుకువెళ్ళేందుకు వ్యాపారులు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇసుకదోపిడీ దారుల కన్ను ఈ ర్యాంపుపైనే ఉంటోంది. డ్వాక్రా సంఘాల మాటున సాగిన దోపిడీలో జిల్లాలోనే అత్యధికంగా ఈ ర్యాంపు ద్వారానే సాగినట్లుగా కూడా చెబుతుంటారు.
 
  ఇదిలా ఉండగా.. స్థానికులు, వివిధ పార్టీల నాయకుల నుంచి వచ్చే అభ్యంతరాలను తట్టుకుని ‘ర్యాంపు నిర్వాహకుడు’గా నిలిచేవాడి ఎంపికే జరగాల్సి ఉందని, అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులు, స్థానికులను సమన్వయం చేయగల సత్తా ఉన్నవాడి ఎంపిక కోసం చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి ఒక బడా వ్యక్తి అందరినీ ‘సంతృప్తి’ పరుస్తామన్న హామీ ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఎదురయ్యే ఇబ్బందులను బేరీజు వేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు.
 
  కాగా గత సీజన్‌లో జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించి తమకేమీ ముట్టలేదని అసంతృప్తితో ఉన్న అధికార పార్టీకి చెందిన కొందరు ఈసారి తమ సత్తా చూపాలన్న కసితో ఉన్నట్టు చెపుతున్నారు. వారి సంకల్పం అక్రమాల్ని అడ్డుకోవడం కాదని, ఏదో రకమైన అవరోధం కల్పించడం ద్వారా ర్యాంపు నిర్వాహకులు తమను కూడా సంతృప్తి పరిచేలా చేసుకోవడానికేనని అన్న అభిప్రాయం వినబడుతోంది. ఏదేమైనా.. ఇసుక ర్యాంపులకు వేలం నిర్వహించే నాటికి అంటే ఈ నెలాఖరులోగా మరోసారి కోట్లు కొల్లగొట్టడానికి అంతా సిద్ధమైందంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement