చిత్రావతి.. చిప్పేగతి!
ధర్మవరం అర్బన్ : డ్వాక్రా మహిళల సాధికారత కోసం కృషి చేస్తాం.. ఇసుక రీచ్‌ల ద్వారా వారిని లక్షాధికారులను చేస్తాం.. అంటూ ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే.. అధికార పార్టీ నేతలు మాత్రం ‘పేరు మీది.. పెత్తనం మాది’ అన్న చందంగా, డ్వాక్రా మహిళలకిచ్చిన ఇసుక రీచ్‌లను స్వాధీనం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాడిమర్రి మండల సరిహద్దుల్లో గల చిత్రావతి నదిలో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు కేటాయించింది.
446 ఎకరాల్లో ఇసుకను ఒక మీటరు లోతు మేర తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. చిత్రావతి ఇసుక త్రవ్వకం, అమ్మకం పరస్పర సహాయ సహకార సంఘం పేరిట మర్రిమాకులపల్లి గ్రామానికి చెందిన కావేరి గ్రామైక్య సంఘానికి ఈ అనుమతులు లభించాయి. వీరు యూనిట్ రూ.793కు విక్రయించాల్సి ఉంటుంది. 2.5 యూనిట్ల ఇసుక అయితే ఒక ట్రాక్టర్‌కు సరిపోతుంది. 5 ట్రాక్టర్ల ఇసుక ఒక లారీకి సరిపోతుంది.
రోజుకు 50 నుంచి 60 లారీలు
వాస్తవానికి ఇక్కడ కొనుగోలు చేసిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారానే తరలించాలని ప్రభుత్వ నిబంధన. అయితే ఇసుక రీచ్ నుంచి సమీపంలోని చింతతోపులోకి డంప్ చేసుకుని అక్కడి నుంచి లారీలకు లోడ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వారు ఒక లారీ రూ.10 వేలకు కొనుగోలు చేసి అక్కడి నుంచి ఆ ట్రాక్టర్లకు మంజూరు చేసిన పేస్లిప్‌లను(వే బిల్లులుగా) వాడుకుని ఇసుకను అక్కడి నుంచి తరలిస్తున్నారు.
ఇలా రోజుకు కనీసం 50 నుంచి 60 లారీలకు పైగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో లారీ ఇసుకను బెంగళూరులో రూ.35 నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నారు. తద్వారా ఒక్కో లారీ ఇసుకను ఇక్కడి నుంచి బెంగళూరుకు తరలించినందుకు రవాణా ఖర్చులు పోను రూ.15 నుంచి రూ.20 వేల దాకా లాభాన్ని గడిస్తున్నారు.
అక్రమాల వెనుక ప్రజా ప్రతినిధి
ఈ అక్రమ రవాణా ఇసుక వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కనుసన్నల్లోనే ఇసుక రవాణా మొత్తం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తమ లారీలను ఎక్కడా ఆపవద్దని, ఇప్పటికే పోలీస్ అధికారులకు హుకుం జారీ చేసిన నేపథ్యంలో ఈ ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
చిత్రావతి నది నుంచి జోరుగా ఇసుక అక్రమంగా తరలిస్తుండడంతో ఆ పరిసర గ్రామాల్లో రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటి, సాగు, తాగునీటి సమస్యలు పెరుగుతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన రైతన్నల వందలాది బోరు బావులు ఒట్టిపోతున్నాయి. బోరు బావుల్లో నీరు అడుగంటడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక రవాణాతో ఇప్పటికే పలు మార్లు తాగునీటి కొరత ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. చిత్రావతి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొరపాటున ఎవరైనా ప్రశ్నిస్తే ఇందిరమ్మ ఇళ్ల కోసమంటూ తప్పించుకుంటున్నారు.
ఇసుక రీచ్‌ల గుర్తింపు ఇలా..
అనంతపురం అర్బన్: భూగర్భ గనుల శాఖ, చిన్న నీటిపారుదల శాఖ అధికారులతో పాటు జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ), జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌డీఏ)తో సమన్వయ కమిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ కమిటీ ఇసుక రీచ్‌లను గుర్తిస్తుంది. రీచ్‌లను గుర్తించిన గ్రామ పరిధిలో పలు డ్వాక్రా సంఘాలు ఉంటాయి. అయితే అన్ని సంఘాల నుంచి ఒక్కొక్కరు చొప్పున గ్రామైక్య సంఘం ఉంటుంది. గ్రామైక్య సంఘానికి ఇసుక రీచ్‌లను కమిటీ సభ్యులు అప్పగిస్తారు.
ప్రభుత్వం సూచించిన ధరలకు ఇసుకను విక్రయిస్తారు. ఈ క్రమంలో జిల్లాలో పెద్దపప్పూరు మండలం చిన్న ఎక్కలూరు, తాడిమర్రి మండలం చిన్న చిగుల్లరేవు, శింగనమల మండలం హులికల్లులో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. తాడిమర్రి మండలం చిన్నచిగుల్లరేవులో ఇసుక రీచ్‌ను పర్యవేక్షిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు డీఆర్‌డీఏ అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.