రూ.2 వేల కోట్ల విలువైన ఇసుక స్వాహా
విజయవాడ: పదహారు నెలల కాలంలో రూ. 2000 కోట్ల విలువైన ఇసుకను మాఫియా స్వాహా చేసిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గురువారం స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇసుక క్వారీల వేలం నిర్వహణ, తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఆయనతోపాటు మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమామహేశ్వరావు ఉన్నారు. యనమల మాట్లాడుతూ డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక అమ్మిస్తే ఆదాయం బాగా వస్తుందని అనుకున్నామని, అయితే 16 నెలల కాలంలో మాఫియా చేతుల్లోకి రూ.2వేల కోట్ల విలువైన ఇసుక వెళ్లినట్లు గుర్తించామన్నారు.
ఈ మేరకు తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో ఇది స్పష్టమైందన్నారు. అందుకే ఇసుక పాలసీని మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్వారీలు వేలం వేయాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీ విధానం అమలులోకి వస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చే ఆదాయం నుంచి డ్వాక్రా సంఘాలకు 20 శాతం, రైతులకు 25 శాతం ఇస్తామన్నారు. 375 ఇసుక క్వారీల నుంచి 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఇంకా అనుమతులు ఇవ్వాల్సి వస్తే రెండోసారి నిర్వహించే వేలంలో మరికొన్ని క్వారీలకు వేలం వేస్తామన్నారు. క్యూబిక్ మీటరు ఇసుక ధరను రూ. 550గా నిర్ణయించినట్లు చెప్పారు. ఎవరైనా ఇంతకంటే ఎక్కువ ధర తీసుకుంటే వారి కాంట్రాక్ట్‌ను రద్దుచేస్తామన్నారు. ఇసుక ద్వారా ఈ సంవత్సరం ప్రభుత్వానికి రూ.850కోట్లు ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఇసుకపై మొదటిసారి సమావేశం జరిగిందని, పీఆర్, ఇరిగేషన్, మైనింగ్, ఆర్ అండ్ బీ కార్యదర్శులతో సమావేశం జరగాల్సి ఉందన్నారు. వాల్టా యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉందని, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ వచ్చిందన్నారు.