ప్రాజెక్టులకు ఇసుక కష్టాలు తీరినట్లే
నేరుగా ఆ శాఖే ఇసుక తీసుకునే వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక కు కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో తరహాలో మైనింగ్ శాఖ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లు కేటాయించడం, తర్వాత అక్కడి నుంచి ఇసుక తరలించడమనే విధానానికి మంగళం పాడుతూ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. నేరుగా నీటి పారుదల శాఖే ఇసుకను తీసుకునే వెసులుబాటు కల్పించింది. పాత విధానంలో ఇసుక కేటాయింపులకు ఆరు నెలలకు మించి సమయం పట్టి, ప్రాజెక్టుల నిర్మాణాలు ఆలస్యం అవుతుండడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని పేర్కొంది.
కొత్త మార్గదర్శకాలతో ఊపిరి
ఇప్పటివరకు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను సమకూర్చుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్లపైనే ఉంది. అధికారులు కేవలం ఇసుక తవ్వకాలకు అనువుగా ఉండే క్వారీలను గుర్తించడం మాత్రమే చేసేవారు. మైనింగ్ శాఖ ఇసుక క్వారీలను గుర్తించి, ఎంత లభ్యతగా ఉందో జిల్లా కలెక్టర్‌కు నివేదించేది. దానికి అనుగుణంగా కలెక్టర్ క్వారీల కేటాయింపు చేసేవారు. ఈ మొత్తం ప్రక్రియకు నెలల గడువు పడుతుండటం, పలుమార్లు రీచ్‌లు కేటాయించినా ఇసుక లభ్యత లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. ఇక సీనరేజీ చార్జీల కింద క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.600 వరకు చెల్లించడంతోపాటు స్థానిక గ్రామాల నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు వసూలు చేసే ముడుపులతో క్యూబిక్ మీటర్‌కు రూ.1,500 వరకు ఖర్చవుతోందని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.
వీటన్నింటి నేపథ్యంలో నేరుగా నీటి పారుదల శాఖ ఇసుక తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీని ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఇక నుంచి నీటి పారుదల శాఖ సొంతంగా వెలికితీసి వినియోగించుకునేలా రాష్ట్ర ఇసుక పాలసీకి సవరణలు చేశారు. దీంతోపాటు రిజర్వాయర్లు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేట వేసిన ఇసుకను వెలికితీసి కేవలం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు మాత్రమే వినియోగించాలి. నీటి పారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జీపీఎస్ ద్వారా ఇసుక మేటలను గుర్తిం చాక మైనింగ్ ఏడీ, ఇరిగేషన్ ఈఈలు సంయుక్తంగా హద్దులను నిర్ణయించాలి.
మేటలను తొలగించడం ద్వారా లభించే ఇసుక పరిమాణం లెక్కించి, జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. ఇసుక వెలికితీతలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడటంతో పాటు, పరిమాణానికి అనుగుణంగా సీనరేజీ చార్జీలను మైనింగ్ విభాగానికి చెల్లించాల్సిన బాధ్యతను ఇరిగేషన్ ఈఈకి చూసుకోవాల్సి ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల్లో మేటల తొలగింపు ద్వారా వచ్చే ఇసుకను ఇతరులకు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్టులకు ఇసుక కొరత తగ్గుతుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
1.72 కోట్ల క్యూబిక్ మీటర్లు అవసరం
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అవసరం. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు చేరడం, గోదావరిలో నీరు పారుతుండడంతో ఇసుక లభిస్తుందా అన్న సందేహాలున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పనులకే 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. డిండికి 27 లక్షలు, ఏఎమ్మార్పీకి 5.5 ల క్షలు, దేవాదులకు 4 లక్షలు, కిన్నెరసానికి 2.5 లక్షలు, సీతారామ ఎత్తిపోతలకు 1.1 లక్షలు, మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నె ట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లకు 1.28 లక్షలు, పెన్‌గంగ 2 లక్షలు, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులకు 2.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం.