సాక్షి, అరసవల్లి: సహజ వనరుల దోపిడీకి చెక్ పెట్టేలా.. రాష్ట్ర సర్కార్ ఇసుక రవాణా విషయంలో పారదర్శక విధానంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. రివర్స్ టెండర్ విధానంలో నిర్వహించిన ఈ ప్రక్రియతో ఇసుక దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట పడబోతోంది. ప్రజలు కోరుకున్న ప్రాంతానికి ఇసుకను నేరుగా సరఫరా చేయడం కోసం జగన్ సర్కార్ ‘ఆన్‌లైన్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఎంత పరిమాణంలో ఇసుక కావాలో... ఎక్కడి నుంచి కావాలో నమోదు చేస్తే ఒక్క క్లిక్‌తో నేరుగా కోరుకున్న స్థలానికే ఇసుక చేరనుంది. వచ్చే నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఇసుక పాలసీని అమలు చేయనున్నారు. ఇందుకోసం నదీతీర ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను గుర్తించి, అక్కడి నుంచి ప్రత్యేకంగా రవాణా వ్యవస్థ ద్వారా ఇసుక స్టాక్ యార్డులకు తరలించి.. అక్కడి నుంచి కావాల్సిన వారికి కావాల్సినంత ఇసుకను నిర్ణీత రుసుము చెల్లించి సరఫరా జరిగేలా చేయనున్నారు. జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా తదితర ప్రధాన నదీతీరాల వద్ద 12 ఇసుక రీచ్‌లను మైన్స్ అధికారులు గుర్తించారు. కొత్త పాలసీ అమలుకు ఈ రీచ్‌లను సిద్ధం చేశారు. ఇసుక సరఫరా బాధ్యతలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
వంశధార, నాగావళి నదుల్లోనే 12 రీచ్‌లు..
జిల్లాలో ప్రధాన నదులుగా ఉన్న వంశధార, నాగావళి నదీ తీరాల్లో మొత్తం 12 రీచ్‌లను గుర్తించారు. ఇవన్నీ మైనింగ్ ప్లాన్ ఆమోదంతోపాటు పర్యావరణ అనుమతులను కూడా పొంది సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా జిల్లాలో మరో 19 చోట్ల ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించిన గనుల శాఖ అధికారులు.. ఈమేరకు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలిసి భవిష్యత్ అవసరాల దృష్ట్యా పర్యవేక్షించారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్ల నుంచి నేరుగా మన నిర్మాణ ప్రదేశాలకు ఇసుక పొందేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఉన్న మొత్తం స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుక నిల్వల వివరాలన్నీ ఏపీఎండీసీ శాండ్ పోర్టల్‌లో కన్పించనున్నాయి. ఏ రీచ్ నుంచి ఇసుక కావాలో క్లిక్ చేస్తే.. ధర ఎంతో కన్పిస్తుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతరతా మార్గాల ద్వారా నేరుగా రాష్ట్ర ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రవాణా వాహనాలను కూడా ఇదే విధానంలో బుక్ చేసుకోవచ్చు.
ఇసుక బాధ్యతలు ఏపీఎండీసీకే..!
జిల్లాలో పెద్ద నదుల వద్ద ఇసుక వినియోగంపై స్పష్టమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా పాలసీలో పేర్కొంది. ఈమేరకు ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్‌లో ఉన్న వం«శధార, నాగావళి నదుల తీరంలో ఇసుక తవ్వకాలు జరిపి, ప్రజలకు సరసమైన ధరకు ఆన్‌లైన్‌లో విక్రయించే బాధ్యతలన్నీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు అప్పగిస్తూ జగన్ సర్కార్ నూతన ఇసుక విధానాన్ని ప్రకటించింది. ఈ ప్రకారం ఇసుక తవ్వకాల కోసం ఇక జిల్లా కలెక్టర్ అనుమతితో పర్యావరణ, ఇతరత్రా అనుమతులతో సిద్ధమైన ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తవ్వి, స్టాక్ యార్డుల వరకు తీసుకెళ్లేందుకు వీలుగా నోడల్ ఏజెన్సీగా ఉన్న ఏపీఎండీసీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నారు. ఇలా తవ్విన ఇసుకను ఆయా రీచ్‌లకు సమీపంలో ఏర్పాటు చేయనున్న స్టాక్ పాయింట్లలో (యార్డులు) నిల్వ చేయనున్నారు. నదుల (రీచ్) నుంచి ఇసుకను స్టాక్ యార్డుల వరకు తోడ్కొని వెళ్లేందుకు అవసరమైన వాహనాలతోపాటు రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిల ఏర్పాటు తదితర కేటగిరీల వారీగా ఏపీఎండీసీ ఆధ్వర్యంలో రివర్స్ టెండరింగ్ విధానం ద్వారానే కాంట్రాక్టర్లను రాష్ట్రం యూనిట్‌గా తాజాగా టెండర్ల ద్వారా ఎంపిక చేశారు.
కొత్త విధానానికి సంసిద్ధం..
జిల్లాలో ఇసుక కొత్త విధానం వచ్చే నెల 5 నుంచి అమల్లోకి రానుంది. ఈ విధానం కోసం కొత్తగా రీచ్‌లను 12 వరకు గుర్తించాం. వంశధార, నాగావళి నదీతీరాల్లో ఈమేరకు రీచ్‌లకు దగ్గరగా స్టాక్ యార్డులను కూడా గుర్తించాం. అన్ని దగ్గర సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిల ఏర్పాటుకు చర్యలు చేపడతాం, ఈమేరకు రవాణాతోపాటు సాంకేతిక వ్యవస్థ కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. తదుపరి చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఎస్.కె.వి.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్, మైన్స్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment