Online policy
-
ఏపీ: పాఠ్యపుస్తకాల విషయంలో విద్యాశాఖ కొత్త విధానానికి బీజం
సాక్షి, విజయవాడ: పాఠ్య పుస్తకాల విషయంలో ఏపీ విద్యాశాఖ కొత్త విధానానికి బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వెబ్సైట్లో ఫ్రీ డౌన్ లోడ్స్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. వెబ్సైట్ నుంచి ఎవరైనా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించటం నిషేధమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కేవలం 22 రోజుల వ్యవధిలో విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి అయ్యింది. చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్-3 జిల్లాలు ఇవే.. ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని మంత్రి బొత్స తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు, ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలని, విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని మంత్రి అన్నారు. -
ఇంటర్ ఫస్టియర్‌లోకి.. నేటి నుంచి అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు నేటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది వీటిని ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌లో చేపట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శనివారం నోటిఫికేషన్ జారీచేశారు. నిజానికి ఈ విద్యా సంవత్సరంలో ఫస్టియర్ ప్రవేశాలను ఆన్లైన్లో చేపట్టేందుకు బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆన్లైన్ విధానాన్ని నిలిపివేసింది. దీంతో విద్యా సంవత్సరం మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ ఏడాది వరకు ఆఫ్‌లైన్‌లో ఫస్టియర్ అడ్మిషన్లను పూర్తిచేయాలని నిర్ణయించింది. సర్టిఫికెట్లను కాలేజీలు ఉంచుకోరాదు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల మార్కుల మెమోల ఆధారంగా విద్యార్థులకు ప్రొవిజినల్ ప్రవేశాలు కల్పించాలి. ఎస్సెస్సీ సర్టిఫికెట్లు, స్కూల్ టీసీలు వచ్చాక ఆ ప్రవేశాలను ధ్రువీకరించాలి. ఎస్సెస్సీ, కుల ధృవీకరణ సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం వాటిని విద్యార్థులకు ఇచ్చేయాలి. ఏ విద్యాసంస్థ కూడా వాటిని తన వద్ద ఉంచుకోరాదు. విద్యార్థులకు తిరిగి ఇవ్వకుండా సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకునే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు సీట్లను రిజర్వేషన్ కోటా మేరకు ఆయా వర్గాల విద్యార్థులతో భర్తీ చేయాల్సిందేనని బోర్డు కార్యదర్శి స్పష్టంచేశారు. ఇలా చేయని సంస్థల గుర్తింపు రద్దు సహ ఇతర చర్యలు తప్పవన్నారు. అంతేకాక.. ► బాలికేతర కాలేజీల్లోని అన్ని కేటగిరీ సీట్లలో కూడా బాలికలకు 33.33 శాతం కేటాయించాలి. ► ఏ ఒక్క విద్యార్థికి కూడా కులం, మతం, ప్రాంతం తదితర కారణాలతో అడ్మిషన్లు నిరాకరించరాదు. ► అడ్మిషన్లు పూర్తిగా పదో తరగతి.. తత్సమాన అర్హతల మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుసరిస్తూ మాత్రమే చేపట్టాలి. ► ముఖ్యంగా.. ఏ విద్యా సంస్థ కూడా ప్రవేశ పరీక్షలు, టాలెంట్ టెస్టులు వంటివి నిర్వహించరాదు. ► ప్రతీ కాలేజీలో బాలికల రక్షణ, భద్రతకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలి. ► విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా బోర్డు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. షెడ్యూల్ ఇలా.. ► దరఖాస్తుల అమ్మకం: సెప్టెంబర్ 19 నుంచి ► దరఖాస్తుల స్వీకరణ తుది గడువు: సెప్టెంబర్ 28 ► అడ్మిషన్ల ముగింపు: సెప్టెంబర్ 28 ► తరగతుల ప్రారంభం: సెప్టెంబర్ 29 అనుమతికి మించి ప్రవేశాలు కుదరదు ► హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి కాలేజీలోనూ మంజూరు చేసిన సెక్షన్లలో సెక్షన్‌కు గరిష్టంగా 88 మందిని మాత్రమే చేర్చుకోవాలి. ► కేవలం బైపీసీ, ఎంపీసీలే కాకుండా.. బోర్డు రూపొందించిన కాంబినేషన్లలోని (బైపీసీ, ఎంపీసీలతో పాటు సీఈసీ, హెచ్ఈసీ తదితర) సెక్షన్లన్నింటిలో కూడా ప్రవేశాలు చేపట్టాలి. ► ఏ కాలేజీలో కూడా అనుమతిలేకుండా అదనపు సెక్షన్లలో ప్రవేశాలను చేపట్టడానికి వీల్లేదు. ► అలా చేసే కాలేజీలపై పెనాల్టీలతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని రామకృష్ణ హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సెకండియర్‌లో నో అడ్మిషన్ తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇక్కడ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలకు అనుమతిలేదని రామకృష్ణ నోటిఫికేషన్లో తెలిపారు. ఆయా రాష్ట్రాల ఇంటర్ సిలబస్, ఏపీ ఇంటర్ సిలబస్‌లో వ్యత్యాసాలున్నందున ఇతరులు ఏపీలోని జూనియర్ కాలేజీల్లో నేరుగా సెకండియర్‌లో ప్రవేశించడానికి అర్హులుకాదని స్పష్టంచేశారు. ఫస్టియర్‌లో మాత్రమే వారిని చేర్చుకోవాలన్నారు. అలాగే, అడ్మిషన్ల సమయంలో ప్రతి కాలేజీ ప్రవేశద్వారం ముందు 2021?–22 విద్యా సంవత్సరానికి కాలేజీకి ఉన్న అనుమతుల పత్రాలను కనిపించేలా ప్రదర్శించాలన్నారు. ఎన్ని సెక్షన్లు, ఎన్ని సీట్లకు అనుమతులున్నాయి?.. భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాలను సెక్షన్ల వారీగా పేర్కొనాలని తెలిపారు. -
క్లిక్ చేస్తే.. ఇసుక
సాక్షి, అరసవల్లి: సహజ వనరుల దోపిడీకి చెక్ పెట్టేలా.. రాష్ట్ర సర్కార్ ఇసుక రవాణా విషయంలో పారదర్శక విధానంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. రివర్స్ టెండర్ విధానంలో నిర్వహించిన ఈ ప్రక్రియతో ఇసుక దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట పడబోతోంది. ప్రజలు కోరుకున్న ప్రాంతానికి ఇసుకను నేరుగా సరఫరా చేయడం కోసం జగన్ సర్కార్ ‘ఆన్లైన్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఎంత పరిమాణంలో ఇసుక కావాలో... ఎక్కడి నుంచి కావాలో నమోదు చేస్తే ఒక్క క్లిక్‌తో నేరుగా కోరుకున్న స్థలానికే ఇసుక చేరనుంది. వచ్చే నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఇసుక పాలసీని అమలు చేయనున్నారు. ఇందుకోసం నదీతీర ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను గుర్తించి, అక్కడి నుంచి ప్రత్యేకంగా రవాణా వ్యవస్థ ద్వారా ఇసుక స్టాక్ యార్డులకు తరలించి.. అక్కడి నుంచి కావాల్సిన వారికి కావాల్సినంత ఇసుకను నిర్ణీత రుసుము చెల్లించి సరఫరా జరిగేలా చేయనున్నారు. జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా తదితర ప్రధాన నదీతీరాల వద్ద 12 ఇసుక రీచ్‌లను మైన్స్ అధికారులు గుర్తించారు. కొత్త పాలసీ అమలుకు ఈ రీచ్‌లను సిద్ధం చేశారు. ఇసుక సరఫరా బాధ్యతలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. వంశధార, నాగావళి నదుల్లోనే 12 రీచ్‌లు.. జిల్లాలో ప్రధాన నదులుగా ఉన్న వంశధార, నాగావళి నదీ తీరాల్లో మొత్తం 12 రీచ్‌లను గుర్తించారు. ఇవన్నీ మైనింగ్ ప్లాన్ ఆమోదంతోపాటు పర్యావరణ అనుమతులను కూడా పొంది సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా జిల్లాలో మరో 19 చోట్ల ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించిన గనుల శాఖ అధికారులు.. ఈమేరకు ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి భవిష్యత్ అవసరాల దృష్ట్యా పర్యవేక్షించారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్ల నుంచి నేరుగా మన నిర్మాణ ప్రదేశాలకు ఇసుక పొందేందుకు ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఉన్న మొత్తం స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుక నిల్వల వివరాలన్నీ ఏపీఎండీసీ శాండ్ పోర్టల్‌లో కన్పించనున్నాయి. ఏ రీచ్ నుంచి ఇసుక కావాలో క్లిక్ చేస్తే.. ధర ఎంతో కన్పిస్తుంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతరతా మార్గాల ద్వారా నేరుగా రాష్ట్ర ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రవాణా వాహనాలను కూడా ఇదే విధానంలో బుక్ చేసుకోవచ్చు. ఇసుక బాధ్యతలు ఏపీఎండీసీకే..! జిల్లాలో పెద్ద నదుల వద్ద ఇసుక వినియోగంపై స్పష్టమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా పాలసీలో పేర్కొంది. ఈమేరకు ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్‌లో ఉన్న వం«శధార, నాగావళి నదుల తీరంలో ఇసుక తవ్వకాలు జరిపి, ప్రజలకు సరసమైన ధరకు ఆన్లైన్లో విక్రయించే బాధ్యతలన్నీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు అప్పగిస్తూ జగన్ సర్కార్ నూతన ఇసుక విధానాన్ని ప్రకటించింది. ఈ ప్రకారం ఇసుక తవ్వకాల కోసం ఇక జిల్లా కలెక్టర్ అనుమతితో పర్యావరణ, ఇతరత్రా అనుమతులతో సిద్ధమైన ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తవ్వి, స్టాక్ యార్డుల వరకు తీసుకెళ్లేందుకు వీలుగా నోడల్ ఏజెన్సీగా ఉన్న ఏపీఎండీసీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నారు. ఇలా తవ్విన ఇసుకను ఆయా రీచ్‌లకు సమీపంలో ఏర్పాటు చేయనున్న స్టాక్ పాయింట్లలో (యార్డులు) నిల్వ చేయనున్నారు. నదుల (రీచ్) నుంచి ఇసుకను స్టాక్ యార్డుల వరకు తోడ్కొని వెళ్లేందుకు అవసరమైన వాహనాలతోపాటు రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిల ఏర్పాటు తదితర కేటగిరీల వారీగా ఏపీఎండీసీ ఆధ్వర్యంలో రివర్స్ టెండరింగ్ విధానం ద్వారానే కాంట్రాక్టర్లను రాష్ట్రం యూనిట్‌గా తాజాగా టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. కొత్త విధానానికి సంసిద్ధం.. జిల్లాలో ఇసుక కొత్త విధానం వచ్చే నెల 5 నుంచి అమల్లోకి రానుంది. ఈ విధానం కోసం కొత్తగా రీచ్‌లను 12 వరకు గుర్తించాం. వంశధార, నాగావళి నదీతీరాల్లో ఈమేరకు రీచ్‌లకు దగ్గరగా స్టాక్ యార్డులను కూడా గుర్తించాం. అన్ని దగ్గర సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిల ఏర్పాటుకు చర్యలు చేపడతాం, ఈమేరకు రవాణాతోపాటు సాంకేతిక వ్యవస్థ కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. తదుపరి చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నాం. – ఎస్.కె.వి.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్, మైన్స్ శాఖ -
హోర్డింగ్‌లపై కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎన్ని హోర్డింగులకు అనుమతులున్నాయో, వాటికి ఎంత గడువుందో తెలియదు. అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులెన్నో. వాటిద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. ఈ నేపథ్యంలో అక్రమ హోర్డింగుల తొలగింపుతో పాటు అనుమతులున్న హోర్డింగులను ఆన్లైన్ నుంచే మానిటరింగ్ చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. జూలై 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగా యూనిపోల్స్, హోర్డింగులు ఉన్న ప్రాంతాలు, వాటికి జారీ చేసిన అనుమతులు, కేటాయించిన నెంబరు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ తదితర వివరాలు కూడా ఆన్లైన్లోనే ఉంచనున్నారు. ఇందుకోసం ప్రకటనల విభాగానికి ప్రత్యేకంగా వెబ్‌ను రూపొందించారు. దీని ద్వారా హోర్డింగ్ జియోగ్రాఫికల్ లొకేషన్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. త్వరలో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లే అధికారులు యాప్ ద్వారా ఏవైనా అవకతవకలుంటే గుర్తించి కార్యాలయాల్లోని ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు. నగర మేయర్, కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ సీనియర్ అధికారులు కూడా ఈ యాప్ ద్వారా హోర్డింగ్‌లను నిరంతరం పరిశీలిస్తారు. లైసెన్స్‌ల చెల్లింపు కూడా ఆన్లైన్లోనే ఇప్పటి దాకా హోర్డింగులకు సంబంధించిన రికార్డులు, ఫైళ్ల నిర్వహణ మాన్యువల్‌గా ఉంది. లైసెన్సు ఫీజులు చెల్లించని వారికి సంబందిత క్లర్కులు నోటీసులిస్తేనే తెలిసేది. ఇకపై ఏజెన్సీలు తమ లాగిన్‌కు వెళితే చెల్లించాల్సిన ఫీజు, నోటీసులు నేరుగా తెలసుకుని ఆన్లైన్లోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ వినియోగంతో జవాబుదారీతనం పెరుగుతుందని, ఇందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. -
భర్తీ ఆన్లైన్లోనే..
♦ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటాపై ఉన్నత విద్యామండలి ♦ సాక్షి కథనంపై స్పందన.. ♦ ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తెస్తాం ♦ అఫిలియేషన్లు ఇంకా రాలేదు.. ఎన్ని వస్తాయో తెలియదు ♦ కన్వీనర్ నోటిఫికేషన్ తర్వాతే మేనేజ్మెంట్ కోటా భర్తీ: పాపిరెడ్డి ♦ ముందుగా డబ్బులు కట్టి ఇబ్బందుల్లో పడొద్దని తల్లిదండ్రులకు సూచన సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానం అమల్లోకి తెస్తామని చెప్పారు. ‘సీటుకో రేటు.. అడ్గగోలుగా ఇంజనీరింగ్ సీట్ల అమ్మకాలు’శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఉన్నత విద్యా మండలి స్పందించింది. కాలేజీ యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోవడానికి వీల్లేదని, అలాంటి కాలేజీలపై చర్యలు తప్పవని çఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. అది పూర్తయ్యాక అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, సీట్ల వివరాలు తమకు అందుతాయన్నారు. అనంతరం సీట్ల భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పారు. అప్పటివరకు యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ చేయొద్దని స్పష్టంచేశారు. తల్లిదండ్రులు కూడా అప్పటివరకు మేనేజ్మెంట్ కోటా సీట్లలో తమ పిల్లలను చేర్చవద్దని సూచించారు. తాము ఆన్లైన్ భర్తీ విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నందున వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ‘‘అనాలోచితంగా ఇప్పుడే మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపు వస్తుందో.. ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. ముందుగానే డబ్బులు కట్టి తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దు. ఏవైనా కాలేజీ యాజమాన్యాలు సీట్లు అమ్ముకుంటున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే.. మాకు ఫిర్యాదు చేయాలి. అలాంటి కాలేజీలపై కఠిన చర్యలు చేపడతాం’’ అని ఆయన స్పష్టం చేశారు. -
వ్యాపారులకు ని‘బంధనాలు’
* ఆన్లైన్ విధానంతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులు * వివరాలు నమోదు చేసుకునేందుకు జూలై 15 వరకు గడువు * తరచూ మొరాయిస్తున్న సర్వర్ * గడువు పెంచాలని కోరుతున్న వ్యాపారులు శ్రీకాకుళం: వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రవేశ పెడుతున్న కొత్త నిబంధనలు వ్యాపారుల కాళ్లకు బంధనాలేస్తున్నాయి. వ్యాపారులంతా ఆన్లైన్లోనే వే బిల్లులు, ‘సి’ ఫారాలు, ఆర్సీ (రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం) తీసుకోవాలని, అది కూడా వాణిజ్య పన్నుల శాఖ వెబ్సైట్లో మాత్రమే తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యాట్ డీలర్లు ప్రతినెలా రిటర్న్స్ దాఖలు పరచాలనే నూతన నిబంధన విధించారు. ఈ విధానంపై తొలినాళ్లలో వ్యాపారుల నుంచి వ్యతిరేకత వచ్చినా, ఇప్పుడిప్పుడే దీనికి అలవాటు పడుతున్నా రు. అయితే ఇప్పుడు వ్యాట్ డీలర్లకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఇంతకు ముందు ఆన్లైన్లో వివరాలు పొందుపరిచేటపుడు చాలా మంది అవగాహన లోపం తో తప్పులు నమోదు చేశారు. ఇప్పుడు వాటిని సరి చేసుకోవడానికి అవకాశం కల్పించినా సమయం చాలక, సర్వర్ పనిచేయక డీల ర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యాట్ డీలరు మరో డీలరు నుంచి కొనుగోలు చేసిన సరుకుల బిల్లు నం బరు, సరుకుల వివరాలు, ఇన్వాయిస్ నంబరు, కొనుగోలు తేదీ తదితర వివరాల్ని ఇంతకుముందు ఆన్లైన్లో పొందుపరిచారు. అయితే కొందరు కొత్త విధానంపై అవగాహన లేక తప్పుడు వివరాలు పొం దుపరిచారు. దీంతో వ్యాపారులకు లక్షలాది రూపాయల పన్నులు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఒక వ్యాట్ డీలరు మరో డీలరు నుంచి సరకులు కొనుగోలు చేసిన సందర్భాల్లో కొనుగోలుదారుడు ఆన్లైన్లో వివరాల్ని పొందుపర్చకుంటే అమ్మకపుదారుడికి సీటీ శాఖ చెల్లించాల్సిన ఐటీసీ (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్)ను నిలుపుదల చేస్తున్నారు. అయితే ఇటీవల వ్యాపారుల కోరిక మేరకు ఆన్లైన్లో తప్పులు పడిన వ్యాపారులకు వాటిని సవరించుకొనే సౌలభ్యాన్ని కల్పించారు. కానీ ఆ తప్పుల సవరణను సీటీ శాఖ వెబ్సైట్లోనే మాత్రమే చేయాలని మెలిక పెట్టారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు ఆన్లైన్లో పొందుపరచిన తప్పుల్ని సవరించుకోవచ్చని తెలి పారు. కానీ గడువు తక్కువగా ఇచ్చి పరీక్ష పెడుతున్నారు. ఇంత తక్కువ సమయంలోనా...? ఒక్కో వ్యాపారి తమ వ్యాపార సంస్థలో నెలకు 30 నుంచి 40 బిల్లుల మేర తప్పుల సవరణ వివరాల్ని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. పురుగు మందులు, హోల్‌సేల్ ఫ్యాన్సీ, టింబరు, ఆటోమొబైల్ తదితర వ్యాపార వర్గాలకు ప్రతి నెలా బిల్లులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రతి వ్యాట్ డీలరు గత ఏడాది జూన్ నెల నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు జరిగిన తప్పుల తాలూకు బిల్లుల్ని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. అంటే సగటున ఒక్కో వ్యాపారి 10 నెలల తాలూకు బిల్లుల్ని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. ఇక్కడే వ్యాట్ డీలర్లకు కష్టాలు మొదలవుతున్నాయి. 13 జిల్లాల్లోని వ్యాపారులంతా ఒకేసారి ఆన్లైన్లో తప్పుల సవరణకు ఉపక్రమించిన సందర్భాల్లో సర్వర్ పనిచేయడం లేదు. తప్పుల సవరణకు ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. సర్వర్ స్తంభించడంతో అసలు వెబ్సైట్ పనిచేయడం లేదని వ్యాపారులంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల వ్యాపారులు, ఆడిటర్లు, అకౌంటెంట్లు, సీటీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. -
రింగ..రింగా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళంః రీచ్‌లు దక్కించుకునేందుకు ప్రాథమికంగా దరఖాస్తు నమోదు తప్పనిసరి. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఎస్టీసీ కార్యాలయం కేవలం విశాఖ లోనే ఉంది. ఈ విభాగానికి మూడు జిల్లా ల నుంచి మైనింగ్ దరఖాస్తులొచ్చి పడుతున్నాయి. అయితే బిడ్డర్లకు అక్కడా ఇసుక కొత్త పాలసీని అనుకూలంగా మలచుకునేందుకు టీడీపీ నాయకులు కుట్రపన్నుతున్నారు. ఆన్లైన్ విధానంలో మోసాలకు తావులేదంటున్నా తమ వారికే ఇసుక రీచ్‌లు దక్కాలని నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఎస్టీసీ కార్యాలయాల్లోనూ తమ మనుషుల్ని పెట్టి ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాకుళానికి చెందిన ఇసుక రీచ్‌లకు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తున్నారేమో పసిగట్టి వారికి బెదిరించేటట్టు వ్యూహం పన్నారు. పొరుగూళ్ల నుంచి ఇక్కడకొచ్చి ఏం వ్యాపారం చేయగలరంటూ ఫోన్లు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కొత్త పాలసీపై అవగాహన కూడా లేని వ్యక్తులు బిడ్లు దాఖలు చేస్తున్నారన్న సమాచారంపై జిల్లా మంత్రి, ఎంపీ సహచరులు అప్రమత్తపోయిన ట్టు సమాచారం. లోకి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈనెల 25నాటికి జిల్లాలోని 17రీచ్‌లకు సంబంధించి సుమారు 1వేయి దరఖాస్తులందినట్టు చెబుతున్నారు. ఈ ప్రక్రియ అనంతరం వచ్చే నెల 6వ తేదీన షెడ్యూలు విడుదలవుతుందని, 8న వేలం ఉంటుందని, ఆన్లైన్లో ఈ-వేలంలో పాల్గొనాలని మాత్రం సిబ్బంది చెబుతున్నారు. ‘గోపాలపెంట’పై కన్ను పర్యావరణ అనుమతులు పొంది పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలకు సిద్ధంగా ఉన్న గోపాలపెంట, హయాతినగరం ర్యాంపుల్లో టీడీపీ నేతలు దృష్టిసారించారు. ఈనెల 31తో గడువు తీరిపోనుండడంతో స్థానిక రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు అడ్డు లేకుండా చేసుకుని సరకు రవాణాను ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. 31దాటితే జిల్లా ఇసుక జిల్లాలోనే వాడుకోవాలన్న నిబంధన అమల్లోకి వస్తుందని తెలుసుకున్న నేతలు ఆ లోగా ఇక్కడి ఇసుకను విశాఖకు భారీగా తరలించి సొమ్ము చేసుకునేందుకు కుట్రపన్నుతున్నారు. ఇటీవల కలెక్టరేట్ వెనుక మూడు ఇసుక నాటుబళ్లను గుర్తించిన స్థానిక అధికారులు ఆ ఇసుకను జేసీకి అప్పగిస్తామని చెప్పి సీజ్ చేసిన ఇసుకను మాత్రం తమకు అనుకూలంగా ఉన్న లారీల్లోకి డంప్ చేశారని, ఫైన్లు తప్పదని నాటుబళ్ల యజమానుల్ని బెదిరించడంతో వారంతా మిన్నకుండిపోయారని తెలుస్తోంది. ఆన్లైన్ వ్యవహారంలో అధికశాతం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు కోటరీయే ఉన్నట్టు చెబుతున్నారు. కొత్త విధానంపై కొంతమందికి అవగాహన లేకపోవడం, స్థానిక అధికారులు కూడా ఇందుకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించకపోవడం టీడీపీ నాయకులకు అనుకూలంగా మారిందని తెలిసింది. బినామీలను రంగంలోకి దింపి వారితోనే వ్యాపారం చేయించేందుకు నాయకులు కసరత్తు మొదలెట్టారు. ఆన్లైన్ దరఖాస్తులు, బిడ్లు వ్యవహారానికి సంబంధించి 6వ తేదీనే ఏమైనా చెప్పగలం అని స్థానిక మైన్స్ ఏడీ కార్యాలయ సిబ్బంది వివరణ ఇస్తున్నారు. -
పారదర్శకంగా పని చేయిస్తా..
ఉన్నత స్థాయి అధికారులే వ్యవస్థకు ఆదర్శం నాగార్జున వర్సిటీతో 30 సంవత్సరాల అనుబంధం వృత్తి నైపుణ్యం, ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీకి ఆన్లైన్ విధానం ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీ ఆచార్య వీఎస్ఎస్ కుమార్ ఏఎన్‌యూ: ఏ వ్యవస్థకైనా ఉన్నత స్థాయి అధికారులే ఆదర్శమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇన్చార్జి వీసీ ఆచార్య వెల్లంకి సాంబశివకుమార్ అన్నారు. ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వర్సిటీలో అవినీతిని రూపుమాపేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏమీ అవసరం లేదని తాను ఉన్నన్ని రోజులు పారదర్శకంగా పనిచేస్తూ కింది స్థాయి వారితో కూడా పని చేయిస్తానన్నారు. ఏఎన్యూతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. 1984 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం, వివిధ తనిఖీలు, ప్రత్యేక కమిటీలు తదితర విధులకు తాను ఏఎన్‌యూలో బాధ్యత వహించానన్నారు. ఏఎన్‌యూకు చెందిన అధికారులు, అధ్యాపకులతో మంచి పరిచయాలు ఉన్నాయని ఇతర యూనివర్సిటీకి ఇన్చార్జిగా వచ్చానన్న భావన తనకు లేదన్నారు. ఆర్ట్స్ కోర్సుల విద్యార్థులకు కూడా మంచి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు దోహదం చేసే భాష, భావ వ్యక్తీకరణ అంశాలపై శిక్షణను వీలైనంత మేరకు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏఎన్‌యూ నుంచి విద్యార్థులకు వివిధ సర్టిఫికెట్లు, పత్రాల పంపిణీలో ఆన్లైన్ డెలివరీ విధానాన్ని అతి త్వరలో ప్రవేశ పెడతానన్నారు. విద్యార్థులు యూనివర్సిటీకి రాకుండా ఇంటివద్ద నుంచే సర్టిఫికెట్లు పొందే విధంగా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తానని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు ఇస్తుందని ఏఎన్‌యూ అధ్యాపకులు మంచి ప్రాజెక్టు సిద్ధం చేస్తే ఢిల్లీలో ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. -
ఎస్సీ రుణాలకు ఆన్లైన్ కష్టాలు
గుడివాడ టౌన్ : దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందజేస్తున్న ఎస్సీ రుణాల పంపిణీ వ్యవహారం దరఖాస్తు చేసుకోదలచిన అర్హులను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. రుణాలకు సంబంధించిన దరఖాస్తులను అర్హులు పూర్తిచేసి పీఓ కార్యాలయంలో ఇవ్వడానికి అలవాటుపడ్డారు. రుణాల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ముందుగా కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలను మీ-సేవ ద్వారా పొందాలి. అనంతరం వాటిని తిరిగి మీ-సేవ లేదా ఇంటర్నెట్ కార్యాలయాల్లో ఆన్లైన్లో నమోదుచేసి దరఖాస్తు అంగీకరించినట్లు రశీదు పొందాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేమి, ఈ విధానాన్ని అర్థం చేసుకోలేని తాము రుణాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోగలమని అర్హులు ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో లేని రెవెన్యూ అధికారులు తొలుత ధృవీకరణ పత్రాల కోసం అర్హులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోంది. రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా బ్యాంకులు రెవెన్యూ కార్యాలయానికి భారీసంఖ్యలో ఉన్న లబ్ధిదారుల జాబితాలను పంపాయి. వాటికి సంబంధించిన ఆధార్, రేషన్‌కార్డుల వివరాల సేకరణలో రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ధృవీకరణ పత్రాలపై సంతకాలు చేయడానికి వారు అందుబాటులో ఉండటం లేదు. దీంతో దరఖాస్తుదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 చివరిరోజు కావడంతో ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు అందించలేని ‘మీ-సేవ’లు పట్టణంలో మీ-సేవ కేంద్రాలు మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలోని సిబ్బంది కరెంటు బిల్లులు, డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల, మున్సిపల్ ట్యాక్సులు వంటివి కట్టించుకోవడంతో పాటు ఆన్లైన్ దరఖాస్తులు కూడా చూడాల్సి వస్తోంది. ఇన్ని అవసరాలకు సరిపడా కంప్యూటర్లు, సిబ్బంది లేకపోవడంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకోదలచినవారికి అందించాల్సిన సేవల గురించి పట్టించుకునేవారే లేరు. ఒక్కో మీ-సేవ కేంద్రంలో ఒక్క స్కానర్ మాత్రమే అందుబాటులో ఉంది. ఐదు నుండి 10 రకాల పత్రాలు ఇక్కడ స్కాన్‌చేసి జత చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో రోజుకు ఒక్కో మీ-సేవ కేంద్రంలో 100 దరఖాస్తులు కూడా పూర్తికావడం లేదు. మధ్యలో ఈ నెల 23న ఆదివారం కావడంతో ఒకరోజు వృథా అవుతుందని, ఎప్పటికి తమ దరఖాస్తులు పూర్తవుతాయోనని అర్హులు తలలు పట్టుకుంటున్నారు. దళారుల ప్రభావం... ఇదిలా ఉండగా రుణానికి సంబంధించి అన్నీ మేమే చూసుకుంటామని కొందరు దళారులు తమను ప్రలోభపెట్టి సొమ్ము చేసుకుంటున్నారని దరఖాస్తు చేసుకోదలచిన అర్హులు ఆరోపిస్తున్నారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు వారే తెచ్చి దరఖాస్తు పూర్తిచేస్తే ఒకరేటు, సర్టిఫికెట్లు తెచ్చుకుంటే కేవలం దరఖాస్తు చేయడానికి మరో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని, అమాయకులు వీరి వలలో చిక్కుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా పైరవీ చేసేవారిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. -
అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్.. గేట్-2015
ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్ విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి, ప్రభుత్వ స్కాలర్షిప్స్/అసిస్టెంట్షిప్స్కు అర్హత కోసం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2015కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. అర్హతలు: బీఈ/బీటెక్/బీఆర్క్/బీఫార్మసీ/బీఎస్‌లో ఉత్తీర్ణత. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1 చివరి తేది: అక్టోబర్ 1 పరీక్ష తేదిలు: 2015 జనవరి 31, ఫిబ్రవరి 1, 7 ,8, 14 వెబ్సైట్: http://gate.iitk.ac.in/ జేఎన్టీయూ- హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ మస్సాచుసెట్స్(అమెరికా) కోర్సు: బీఎస్ అండ్ ఎంఎస్(గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్) విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్(ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఐఐటీ-జేఈఈ మెయిన్స్/ఎంసెట్-214లో అర్హత సాధించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: http://www.sriit.ac.in/ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా -మొహాలీ కోర్సు: ఎల్ఎల్ఎం; సీట్ల సంఖ్య: 15 అర్హతలు: ఇంటిగ్రేటెడ్ లా లేదా బీఏ, ఎల్ఎల్బీ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.armyinstituteoflaw.org/ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పోస్టులు: 1.ఇంజనీర్(సివిల్-గ్రేడ్ 2) 2.అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్ 1) అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 9 వెబ్సైట్: www.hal-india.com నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పోస్టులు: కన్సల్టెంట్(సోషల్ ఆడిట్) అర్హతలు: సోషల్ సెన్సైస్‌లో పీజీ లేదా సివిల్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో పరిజ్ఞానం ఉండాలి. వయసు: 60 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.nird.org.in బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 50 ఏళ్లకు మించకూడదు. డిప్యూటీ జనరల్ మేనేజర్ అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 15 వెబ్సైట్: www.becil.com -
ఒకే ఒక్క క్లిక్...
ఇంటర్నెట్ను వినియోగించుకోవడంలో గ్రామీణ ప్రాంతాల యువత, ప్రైవేటు ఉద్యోగులు పోటీ పడుతున్నారు. డ్రైవింగ్ లెసైన్సు పొందాలన్నా, మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఆన్లైన్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్సేవలు, క్రెడిట్ కార్డులు పొంది ఇంటి వద్దే సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉద్యోగులే కాకుండా విద్యార్థులు, రైతులు, వ్యాపారులకు ఏ సమాచారం కావాలన్నా సమస్తం ఇంటర్నెట్లో లభిస్తుంది. జిల్లా సమాచారం కోసం... జిల్లాకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్నా, జిల్లా నుంచి వెలువడే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చూడాలన్నా, ఇటీవల ప్రారంభించిన ఈ-గ్రీవెన్స్ వివరాలు తెలుసుకోవాలన్నా www.guntur.nic.inవెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇటీవల జిల్లా నుంచి విడుదలైన వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగ ప్రకటన, ఖాళీల వివరాలు, రిజర్వేషన్ల వారీగా పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేసిన పంచాయతీ కార్యదర్శుల మెరిట్ లిస్టు, బంగారుతల్లి, దీపం పథకం తదితర లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. నోటిఫికేషన్లు, తదితర వివరాలు ఏరోజుకు ఆరోజు వెబ్సైట్లో పొందుపరుస్తారు. వ్యవసాయ మార్కెట్... రైతులకు వారు పండించిన పంటలకు ప్రభుత్వం అందించే మద్దతు ధర వివరాలు, రైతులకు మార్కెట్ కమిటీల ద్వారా అందించే సేవలకు సంబంధించిన అన్నిరకాల వివరాలను www.marketap.nic.inవెబ్సైట్లో తెలుసుకోవచ్చు. వ్యవసాయ మార్కెట్ వారు వెబ్సైట్లో వివరాలన్నింటిని పొందుపరిచారు. ఉద్యానవన సమాచారం కోసం... కూరగాయాలు, పండ్లు పండించే రైతులు పలు సూచనలు, సలహాలు అందించేందుకు ప్రభుత్వం నుంచి అందించే సబ్సిడీ వివరాలు, తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు www.apshin.ap.nic.in వెబ్సైట్లోకి వెళ్లాలి. ఉద్యాన శాఖ కార్యాలయాలకు వెళ్లే రైతులకు అక్కడి కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేక రుణాలు, సబ్సిడీ వంటి అంశాలపై అవగాహన ఉండడం లేదు. కొత్త అంశాలు తెలుసుకునేందుకు ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. ఓటరు నమోదుకు... నూతన ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నా, చిరు నామా మార్చుకోవాలన్నా, తమ ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకోవాలన్నా www.ceoandra.nic.in వెబ్సైట్లోకి వెళితే చాలు. హోమ్ పేజీలోని ఈ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయగానే నూతన ఓటరు నమోదు చేసుకునేవారు ఫారం -06, మార్పులు చేసుకునేవారు ఫారం -07, తప్పుల సవరణకు 08, ఓటరు కార్డు ట్రాన్స్ఫర్ చేసుకునేవారు ఫారం 08ఏ లను ఎంపిక చేసుకుని అందులో వివరాలు నమోదు చేసుకోవాలి డ్రైవింగ్ లెసైన్సు కోసం.. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాహనాలు నడపడంలో పోటీ పడుతున్నారు. డ్రైవింగ్ లెసైన్సులు పొందాలంటే మీసేవ కేంద్రాలకు వెళ్లి లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్సు పరీక్షలకు ముందుగా తేదీలను బుక్ చేసుకోవాలి. దీంతో సమయం లేక చాలా మంది లెసైన్సులు పొందేందుకు ఆసక్తి చూపడం లేదు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బీమా రాదు. పోలీసు కేసులతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందుకే డ్రైవింగ్ చేసేవారు విధిగా లెసైన్సు పొందాలి. మీ సేవ కేంద్రాల్లో ఏ తేదీల్లో లెసైన్సు పొందేందుకు ఖాళీగా ఉందో తెలుసుకునేందుకు సమయం వృథా అవుతుంది. అందుకే అలాంటివారికోసం కూడా వెబ్సైట్ ఉంది.www.aptransport.orgవెబ్సైట్ లోకి వెళ్లి బుక్ లెర్నర్, డ్రైవింగ్ లెసైన్సు, స్లాడ్స్పై క్లిక్ చేయాలి. అందులో జిల్లా స్థానిక ఆర్టీఏలను ఎంపిక చేసుకోవాలి. తేదీ, సమయాన్ని ఎంపిక చేసి సబ్ మీట్ చేయాలి. తరువాత వచ్చే విండోలో వివరాలు నమోదు చేసి క్రెడిట్‌కార్డు, లేదా నెట్ బ్యాంకింగ్ఉంటే ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లించాలి. నెట్‌బ్యాంకింగ్ లేనివారు 24 గంటల వ్యవధిలో సమీపంలోని మీసేవలో లెసైన్సు ఫీజు చెల్లించవచ్చు. విద్యుత్ బిల్లుల చెల్లింపు.. ప్రతినెలా విద్యుత్ బిల్లుల చెల్లింపు కొంత ఇబ్బందితో కూడుకుంది. క్యూల్లో నిలబడి సమయం వృథా చేసుకుని బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్లైన్ విధానం ఆ శ్రమను దూరం చేసింది. www.apnpdcl.inవెబ్సైట్ ఓపెన్ చేస్తే పే బిల్లు ఆన్లైన్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మరో పేజీ వస్తుంది. అందులో సర్కిల్ ఎంపిక చేసుకుని సర్వీసు నెంబరు వేయాలి. కరెంటు పేమెంట్, అడ్వాన్సు పేమెంట్లలో మనకు కావాల్సిన దానిని ఎంపిక చేసుకుని ఇంటర్నెట్ బ్యాంకింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. వివరాలకు టోల్ ఫ్రీ నెంబరు 18004250028 లో సంప్రదించవచ్చు. బస్సు, రైల్వే టిక్కెట్టు బుకింగ్.. రైలు ప్రయాణికుల కోసం రైల్వే శాఖ www. irctc.co.inవెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా www.apsrtconline.in వెబ్సైట్లో పొందవచ్చు. సంబంధిత వెబ్సైట్లలోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే లాగిన్ అయ్యేందుకు సులభంగా ఉంటుంది. రైలులో ప్రయాణించేందుకు సరిపడ సీట్లు, స్లీపర్, ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ లిస్టు పరిస్థితిపై వివరాలు అందులో ఉంటాయి. వాటి ప్రకారం మనకు అనుకూలంగా ఉన్న తేదీల్లో టికెట్టు బుక్ చేసుకోవచ్చు. ఇక బస్సు టికెట్లను ఏరోజు కావాలంటే ఆ రోజు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకునేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లను ఉపయోగించుకోవచ్చు. మున్సిపాలిటి ఆస్తి పన్ను చెల్లింపు మున్సిపాలిటీల పరిధిలో పన్నుల వసూలుకు తగిన సిబ్బంది లేకపోవడంతో పన్ను కట్టేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పన్నుల బకాయిలు పేరుకుపోగా ప్రజలకు ఆలస్యం రుసుం పేరిట అదనపు భారం పడుతుంది. దీన్ని అరికట్టేందుకు మున్సిపాలిటీలో ఆన్లైన్ ద్వారా పన్నుల చెల్లింపును ఏర్పాటు చేశారు. www.cdina.gov.in వెబ్సైట్లో పే యువర్ టాక్స్ ఆన్లైన్లింక్పై క్లిక్ చేయగానే వివరాలు కన్పిస్తాయి. మరో విండోలో ప్రాపర్టీ టాక్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ పన్ను మదింపు సంఖ్యను నమోదు చేయాలనే ఆప్షన్ వస్తుంది. ఆ సంఖ్య తెలిస్తే ముందుకు వెళ్లవచ్చు. లేకుంటే ఇంటి నంబరు, యజమాని పేరు ఎంటర్ చేయడం ద్వారా ఇంటి పన్ను మదింపు సంఖ్య తెలుసుకోవచ్చు. తద్వారా ఆస్తి పన్ను చెల్లించేందుకు వీలుంటుంది.