* ఆన్‌లైన్ విధానంతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులు
* వివరాలు నమోదు చేసుకునేందుకు జూలై 15 వరకు గడువు
* తరచూ మొరాయిస్తున్న సర్వర్
* గడువు పెంచాలని కోరుతున్న వ్యాపారులు
శ్రీకాకుళం: వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రవేశ పెడుతున్న కొత్త నిబంధనలు వ్యాపారుల కాళ్లకు బంధనాలేస్తున్నాయి. వ్యాపారులంతా ఆన్‌లైన్‌లోనే వే బిల్లులు, ‘సి’ ఫారాలు, ఆర్‌సీ (రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం) తీసుకోవాలని, అది కూడా వాణిజ్య పన్నుల శాఖ వెబ్‌సైట్‌లో మాత్రమే తీసుకోవాలని సూచించారు.
అలాగే వ్యాట్ డీలర్లు ప్రతినెలా రిటర్న్స్ దాఖలు పరచాలనే నూతన నిబంధన విధించారు. ఈ విధానంపై తొలినాళ్లలో వ్యాపారుల నుంచి వ్యతిరేకత వచ్చినా, ఇప్పుడిప్పుడే దీనికి అలవాటు పడుతున్నా రు. అయితే ఇప్పుడు వ్యాట్ డీలర్లకు కష్టాలు రెట్టింపయ్యాయి.
ఇంతకు ముందు ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరిచేటపుడు చాలా మంది అవగాహన లోపం తో తప్పులు నమోదు చేశారు. ఇప్పుడు వాటిని సరి చేసుకోవడానికి అవకాశం కల్పించినా సమయం చాలక, సర్వర్ పనిచేయక డీల ర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యాట్ డీలరు మరో డీలరు నుంచి కొనుగోలు చేసిన సరుకుల బిల్లు నం బరు, సరుకుల వివరాలు, ఇన్‌వాయిస్ నంబరు, కొనుగోలు తేదీ తదితర వివరాల్ని ఇంతకుముందు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అయితే కొందరు కొత్త విధానంపై అవగాహన లేక తప్పుడు వివరాలు పొం దుపరిచారు.
దీంతో వ్యాపారులకు లక్షలాది రూపాయల పన్నులు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఒక వ్యాట్ డీలరు మరో డీలరు నుంచి సరకులు కొనుగోలు చేసిన సందర్భాల్లో కొనుగోలుదారుడు ఆన్‌లైన్లో వివరాల్ని పొందుపర్చకుంటే అమ్మకపుదారుడికి సీటీ శాఖ చెల్లించాల్సిన ఐటీసీ (ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్)ను నిలుపుదల చేస్తున్నారు.
అయితే ఇటీవల వ్యాపారుల కోరిక మేరకు ఆన్‌లైన్‌లో తప్పులు పడిన వ్యాపారులకు వాటిని సవరించుకొనే సౌలభ్యాన్ని కల్పించారు. కానీ ఆ తప్పుల సవరణను సీటీ శాఖ వెబ్‌సైట్‌లోనే మాత్రమే చేయాలని మెలిక పెట్టారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు ఆన్‌లైన్‌లో పొందుపరచిన తప్పుల్ని సవరించుకోవచ్చని తెలి పారు. కానీ గడువు తక్కువగా ఇచ్చి పరీక్ష పెడుతున్నారు.
ఇంత తక్కువ సమయంలోనా...?
ఒక్కో వ్యాపారి తమ వ్యాపార సంస్థలో నెలకు 30 నుంచి 40 బిల్లుల మేర తప్పుల సవరణ వివరాల్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది. పురుగు మందులు, హోల్‌సేల్ ఫ్యాన్సీ, టింబరు, ఆటోమొబైల్ తదితర వ్యాపార వర్గాలకు ప్రతి నెలా బిల్లులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రతి వ్యాట్ డీలరు గత ఏడాది జూన్ నెల నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు జరిగిన తప్పుల తాలూకు బిల్లుల్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది. అంటే సగటున ఒక్కో వ్యాపారి 10 నెలల తాలూకు బిల్లుల్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది.
ఇక్కడే వ్యాట్ డీలర్లకు కష్టాలు మొదలవుతున్నాయి. 13 జిల్లాల్లోని వ్యాపారులంతా ఒకేసారి ఆన్‌లైన్లో తప్పుల సవరణకు ఉపక్రమించిన సందర్భాల్లో సర్వర్ పనిచేయడం లేదు. తప్పుల సవరణకు ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. సర్వర్ స్తంభించడంతో అసలు వెబ్‌సైట్ పనిచేయడం లేదని వ్యాపారులంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల వ్యాపారులు, ఆడిటర్లు, అకౌంటెంట్లు, సీటీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
వ్యాపారులకు ని‘బంధనాలు’
Published Sat, Jul 9 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement
Advertisement