దుకాణంలోకి చొరబడి తండ్రీ కొడుకులపై పిడిగుద్దులు
నరసరావుపేట టౌన్: ఓ దుకాణంలోకి చొరబడి వ్యాపారిపై జనసేన నాయకులు దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన పువ్వాడ నాగేశ్వరరావు కోట సెంటర్‌లోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్‌లోని ఓ షాపులో రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. 4 రోజుల క్రితం బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన కస్టమర్ (జనసేన కార్యకర్త)తో దుకాణ యజమానికి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో జనసేన నేతలు నాని, సాంబలను వెంటబెట్టుకొని వచ్చిన జనసేన కార్యకర్తలు దుకాణంలో ఉన్న నాగేశ్వరరావు, అతని కుమారుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.
పిడిగుద్దులతో వీరంగం సృష్టించారు. కేసు పెడితే మరో మారు దాడి చేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూ టౌన్ సీఐ హైమారావు తెలిపారు. కాగా, ఇటీవలే నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుకు మద్యం దుకాణాల్లో వాటా ఇవ్వలేదని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ రెస్టారెంట్ పై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు 2 రోజుల క్రితం తన అనుచరులతో దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇలా..టీడీపీ, జనసేన నేతల వరుస దాడులతో నరసరావుపేటలోని వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment