ఒకే ఒక్క క్లిక్... | Single-click on the Internet Services | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్క క్లిక్...

Published Thu, Jan 30 2014 11:57 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Single-click on the Internet  Services

ఇంటర్నెట్‌ను వినియోగించుకోవడంలో గ్రామీణ ప్రాంతాల యువత, ప్రైవేటు ఉద్యోగులు పోటీ పడుతున్నారు. డ్రైవింగ్ లెసైన్సు పొందాలన్నా, మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌సేవలు, క్రెడిట్ కార్డులు పొంది ఇంటి వద్దే సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉద్యోగులే కాకుండా విద్యార్థులు, రైతులు, వ్యాపారులకు ఏ సమాచారం కావాలన్నా సమస్తం ఇంటర్నెట్‌లో లభిస్తుంది.
 
 జిల్లా సమాచారం కోసం...
 జిల్లాకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్నా, జిల్లా నుంచి వెలువడే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చూడాలన్నా, ఇటీవల ప్రారంభించిన ఈ-గ్రీవెన్స్ వివరాలు తెలుసుకోవాలన్నా www.guntur.nic.inవెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఇటీవల జిల్లా నుంచి విడుదలైన వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగ ప్రకటన, ఖాళీల వివరాలు, రిజర్వేషన్‌ల వారీగా పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేసిన పంచాయతీ కార్యదర్శుల మెరిట్ లిస్టు, బంగారుతల్లి, దీపం పథకం తదితర లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. నోటిఫికేషన్‌లు, తదితర వివరాలు ఏరోజుకు ఆరోజు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. 
 
 వ్యవసాయ మార్కెట్...
 రైతులకు వారు పండించిన పంటలకు ప్రభుత్వం అందించే మద్దతు ధర వివరాలు, రైతులకు మార్కెట్ కమిటీల ద్వారా అందించే సేవలకు సంబంధించిన అన్నిరకాల వివరాలను www.marketap.nic.inవెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. వ్యవసాయ మార్కెట్ వారు వెబ్‌సైట్‌లో వివరాలన్నింటిని పొందుపరిచారు. 
 
 ఉద్యానవన సమాచారం కోసం...
 కూరగాయాలు, పండ్లు పండించే రైతులు పలు సూచనలు, సలహాలు అందించేందుకు ప్రభుత్వం నుంచి అందించే సబ్సిడీ వివరాలు, తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు www.apshin.ap.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఉద్యాన శాఖ కార్యాలయాలకు వెళ్లే రైతులకు అక్కడి కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేక రుణాలు, సబ్సిడీ వంటి అంశాలపై అవగాహన ఉండడం లేదు. కొత్త అంశాలు తెలుసుకునేందుకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది.
 
 ఓటరు నమోదుకు...
 నూతన ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నా, చిరు నామా మార్చుకోవాలన్నా, తమ ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకోవాలన్నా www.ceoandra.nic.in వెబ్‌సైట్‌లోకి వెళితే చాలు. హోమ్ పేజీలోని ఈ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయగానే నూతన ఓటరు నమోదు చేసుకునేవారు ఫారం -06, మార్పులు చేసుకునేవారు ఫారం -07, తప్పుల సవరణకు 08, ఓటరు కార్డు ట్రాన్స్‌ఫర్ చేసుకునేవారు ఫారం 08ఏ లను ఎంపిక చేసుకుని అందులో వివరాలు నమోదు చేసుకోవాలి
 
 డ్రైవింగ్ లెసైన్సు కోసం..
 మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాహనాలు నడపడంలో పోటీ పడుతున్నారు. డ్రైవింగ్ లెసైన్సులు పొందాలంటే మీసేవ కేంద్రాలకు వెళ్లి లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్సు పరీక్షలకు ముందుగా తేదీలను బుక్ చేసుకోవాలి. దీంతో సమయం లేక చాలా మంది లెసైన్సులు పొందేందుకు ఆసక్తి చూపడం లేదు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బీమా రాదు. పోలీసు కేసులతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందుకే డ్రైవింగ్ చేసేవారు విధిగా లెసైన్సు పొందాలి. మీ సేవ కేంద్రాల్లో ఏ తేదీల్లో లెసైన్సు పొందేందుకు ఖాళీగా ఉందో తెలుసుకునేందుకు సమయం వృథా అవుతుంది. అందుకే అలాంటివారికోసం కూడా వెబ్‌సైట్ ఉంది.www.aptransport.orgవెబ్‌సైట్ లోకి వెళ్లి బుక్ లెర్నర్, డ్రైవింగ్ లెసైన్సు, స్లాడ్స్‌పై క్లిక్ చేయాలి. అందులో జిల్లా స్థానిక ఆర్టీఏలను ఎంపిక చేసుకోవాలి. తేదీ, సమయాన్ని ఎంపిక చేసి సబ్ మీట్ చేయాలి. తరువాత వచ్చే విండోలో వివరాలు నమోదు చేసి క్రెడిట్‌కార్డు, లేదా నెట్ బ్యాంకింగ్‌ఉంటే ఆన్‌లైన్ ద్వారా డబ్బు చెల్లించాలి. నెట్‌బ్యాంకింగ్ లేనివారు 24 గంటల వ్యవధిలో సమీపంలోని మీసేవలో లెసైన్సు ఫీజు చెల్లించవచ్చు. 
 
 విద్యుత్ బిల్లుల చెల్లింపు..
 ప్రతినెలా  విద్యుత్ బిల్లుల చెల్లింపు కొంత ఇబ్బందితో కూడుకుంది. క్యూల్లో నిలబడి సమయం వృథా చేసుకుని బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్‌లైన్ విధానం ఆ శ్రమను దూరం చేసింది.  www.apnpdcl.inవెబ్‌సైట్ ఓపెన్ చేస్తే పే బిల్లు ఆన్‌లైన్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మరో పేజీ వస్తుంది. అందులో సర్కిల్  ఎంపిక చేసుకుని సర్వీసు నెంబరు వేయాలి. కరెంటు పేమెంట్, అడ్వాన్సు పేమెంట్‌లలో మనకు కావాల్సిన దానిని ఎంపిక చేసుకుని ఇంటర్నెట్ బ్యాంకింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. వివరాలకు టోల్ ఫ్రీ నెంబరు 18004250028 లో సంప్రదించవచ్చు. 
 
 బస్సు, రైల్వే టిక్కెట్టు బుకింగ్..
 రైలు ప్రయాణికుల కోసం రైల్వే శాఖ www. irctc.co.inవెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా  www.apsrtconline.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. సంబంధిత వెబ్‌సైట్‌లలోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే లాగిన్ అయ్యేందుకు సులభంగా ఉంటుంది. రైలులో ప్రయాణించేందుకు సరిపడ సీట్లు, స్లీపర్, ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ లిస్టు పరిస్థితిపై వివరాలు అందులో ఉంటాయి. వాటి ప్రకారం మనకు అనుకూలంగా ఉన్న తేదీల్లో టికెట్టు బుక్ చేసుకోవచ్చు. ఇక బస్సు టికెట్లను ఏరోజు కావాలంటే ఆ రోజు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకునేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లను ఉపయోగించుకోవచ్చు.
 
 మున్సిపాలిటి  ఆస్తి పన్ను చెల్లింపు
 మున్సిపాలిటీల పరిధిలో పన్నుల వసూలుకు తగిన సిబ్బంది లేకపోవడంతో పన్ను కట్టేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పన్నుల బకాయిలు పేరుకుపోగా ప్రజలకు ఆలస్యం రుసుం పేరిట అదనపు భారం పడుతుంది. దీన్ని అరికట్టేందుకు మున్సిపాలిటీలో ఆన్‌లైన్ ద్వారా పన్నుల చెల్లింపును ఏర్పాటు చేశారు. www.cdina.gov.in వెబ్‌సైట్‌లో పే యువర్ టాక్స్ ఆన్‌లైన్‌లింక్‌పై క్లిక్ చేయగానే వివరాలు కన్పిస్తాయి. మరో విండోలో ప్రాపర్టీ టాక్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ పన్ను మదింపు సంఖ్యను నమోదు చేయాలనే ఆప్షన్ వస్తుంది. ఆ సంఖ్య తెలిస్తే ముందుకు వెళ్లవచ్చు. లేకుంటే ఇంటి నంబరు, యజమాని పేరు ఎంటర్ చేయడం ద్వారా ఇంటి పన్ను మదింపు సంఖ్య తెలుసుకోవచ్చు. తద్వారా ఆస్తి పన్ను చెల్లించేందుకు వీలుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement