పల్లెల్లో 82 శాతం వినియోగం
పట్టణాల్లో 92% మందికి చేరువ
95 శాతం ఇళ్లకు టెలిఫోన్ సేవలు
వైద్యం కోసం రూ.5,000కుపైనే వ్యయం
జాతీయ సర్వేలో వెల్లడైన విషయాలు
స్మార్ట్‌ఫోన్ సాయంతో యువతకు ఇంటర్నెట్ చేరువ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో 82 శాతం మంది (15–24 ఏళ్ల వయసులోని వారు), పట్టణాల్లో 92 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 15–24 ఏళ్ల వయసులోని 95.7 శాతం గ్రామీణ యువత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఇది 97 శాతంగా ఉంది. కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ ‘కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే’ (సీఏఎంఎస్) వివరాలను విడుదల చేసింది. 79వ జాతీయ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్)లో భాగంగా ఇది జరిగింది.
ఇదీ చదవండి: గాల్లో ఎగిరిన ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..
సర్వే వివరాలు..
- 15–24 ఏళ్లలోని 78.4 శాతం యువత అటాచ్డ్ ఫైల్స్‌తో మెస్సేజ్‌లు పంపుకుంటున్నారు. 71.2 శాతం మంది కాపీ–పేస్ట్ టూల్స్ వాడుతున్నారు.
- 26.8 శాతం మంది సమాచారం కోసం శోధిస్తున్నారు. అలాగే, మెయిల్స్ పంపడం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
- 95.1 శాతం ఇళ్లల్లో టెలిఫోన్/మొబైల్ ఫోన్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతంగా ఉంటే, పట్టణాల్లో 97.1 శాతం ఇళ్లకు ఈ సదుపాయం ఉందని సర్వేలో తెలిసింది.
- 9.9 శాతం ఇళ్లల్లోనే డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం ఇళ్లకే ఈ సదుపాయం ఉంటే, పట్టణాల్లో 21.6 శాతంగా ఉంది.
- 96.9 శాతం మంది యువతీ యువకులు సులభంగా ఉండే ప్రకటనలు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం చేస్తున్నారు. సులభమైన లెక్కలు వేయగలుగుతున్నారు. పురుషుల్లో ఇలాంటి వారు 97.8 శాతంగా ఉంటే, మహిళల్లో 95.9 శాతంగా ఉన్నారు.
- ఆస్పత్రిపాలైనప్పుడు వైద్యం కోసం జేబులోంచి చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో కుటుంబం నుంచి ఏడాదికి రూ.4,129గా ఉంటే, పట్టణాల్లో రూ.5,290గా ఉంది. అదే ఆస్పత్రిలో చేరకుండా పొందే వైద్యం కోసం గడిచిన 30 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటివారు రూ.539 ఖర్చు చేయగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.606గా ఉంది.
- బస్సు, కారు, ట్యాక్సీ, ఆటో వంటి చౌక ప్రజా రవాణా సాధనాలను పట్టణాల్లోని 93.7 శాతం మంది సౌకర్యవంతంగా పొందుతున్నారు.
- విద్య, ఉపాధి, శిక్షణ పొందని యువత గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మేర ఉంటే, పట్టణాల్లో 19 శాతం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment