జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సరఫరాకు సంబంధించి గత ఆరు నెలలుగా వందలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డీఎస్‌ఎల్ సేవలపై కొన్ని సంస్థలు ఇంటర్నెట్ అంతరాయంపై సర్వే నిర్వహించాయి. ఇంటర్నెట్ సేవలు అందించే కంపెనీలు దాదాపు రూ.75వేల కోట్లతో వినియోగదారులకు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. అయినప్పటికీ కనెక్టివిటీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. నిరంతరం ఇంటర్నెట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో 56శాతం మంది నెట్ కనెక్షన్‌లో అంతరాయం వల్ల ఇబ్బందిపడుతూ సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీలు ముందుగా వాగ్ధానం చేసిన వేగం కంటే నెట్ తక్కువ వేగంతో వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. వీరిలో 21శాతం మంది ప్రతి నెలా మూడుసార్లకు పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశం అంతటా 303 జిల్లాల నుంచి 51,000 మందితో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 67శాతం పురుషులు, 33శాతం మహిళలు ఉన్నారు. 46శాతం మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను పరిష్కరించడానికి సర్వీస్ ప్రొవైడర్లు 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
రిమోట్ వర్క్, వర్క్‌ఫ్రంహోం, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నివేదిక చెబుతుంది. 70శాతం మంది యూజర్లు ఇంటర్నెట్ సరఫరాలో మెరుగైన సేవలందించే ఇతర సర్వీస్ ప్రొవైడర్‌కు మారడానికి ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
కొన్ని సర్వేల నివేదికల ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగించే సరళి ఈ కింది విధంగా ఉంది.
* ఇంటర్నెట్ వ్యాప్తి 2012లో దేశవ్యాప్తంగా 12.6 శాతం నుంచి 2022 నాటికి 48.7 శాతానికి పెరిగింది.
* ప్రపంచ వ్యాప్తంగా 692 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో ఉంది.
* గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌లు ఎక్కువ.
* తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నప్పటికీ..పేదరికం, అవగాహన లేకపోవడం, స్పష్టమైన లింగ వ్యత్యాసం వంటి కారణాల వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఇంకా ఆశించినమేర ఉండడం లేదు.
* 2028 నాటికి 244 మిలియన్ కుటుంబాలు ఇంటర్నెట్ వినియోగిస్తాయని అంచనా.
* 2020 నాటికి దేశంలో 622 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వచ్చే ఐదేళ్లలో దాదాపు 45 శాతం పెరుగుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 900 మిలియన్లకు చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment