Internet access
-
సగానికిపైగా వినియోగదారులకు ఇంటర్నెట్ కష్టాలు!
జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సరఫరాకు సంబంధించి గత ఆరు నెలలుగా వందలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డీఎస్ఎల్ సేవలపై కొన్ని సంస్థలు ఇంటర్నెట్ అంతరాయంపై సర్వే నిర్వహించాయి. ఇంటర్నెట్ సేవలు అందించే కంపెనీలు దాదాపు రూ.75వేల కోట్లతో వినియోగదారులకు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. అయినప్పటికీ కనెక్టివిటీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. నిరంతరం ఇంటర్నెట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో 56శాతం మంది నెట్ కనెక్షన్లో అంతరాయం వల్ల ఇబ్బందిపడుతూ సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీలు ముందుగా వాగ్ధానం చేసిన వేగం కంటే నెట్ తక్కువ వేగంతో వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. వీరిలో 21శాతం మంది ప్రతి నెలా మూడుసార్లకు పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశం అంతటా 303 జిల్లాల నుంచి 51,000 మందితో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 67శాతం పురుషులు, 33శాతం మహిళలు ఉన్నారు. 46శాతం మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను పరిష్కరించడానికి సర్వీస్ ప్రొవైడర్లు 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ఇదీ చదవండి: డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రిమోట్ వర్క్, వర్క్‌ఫ్రంహోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నివేదిక చెబుతుంది. 70శాతం మంది యూజర్లు ఇంటర్నెట్ సరఫరాలో మెరుగైన సేవలందించే ఇతర సర్వీస్ ప్రొవైడర్‌కు మారడానికి ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కొన్ని సర్వేల నివేదికల ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగించే సరళి ఈ కింది విధంగా ఉంది. * ఇంటర్నెట్ వ్యాప్తి 2012లో దేశవ్యాప్తంగా 12.6 శాతం నుంచి 2022 నాటికి 48.7 శాతానికి పెరిగింది. * ప్రపంచ వ్యాప్తంగా 692 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో ఉంది. * గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఎక్కువ. * తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నప్పటికీ..పేదరికం, అవగాహన లేకపోవడం, స్పష్టమైన లింగ వ్యత్యాసం వంటి కారణాల వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఇంకా ఆశించినమేర ఉండడం లేదు. * 2028 నాటికి 244 మిలియన్ కుటుంబాలు ఇంటర్నెట్ వినియోగిస్తాయని అంచనా. * 2020 నాటికి దేశంలో 622 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వచ్చే ఐదేళ్లలో దాదాపు 45 శాతం పెరుగుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 900 మిలియన్లకు చేరుకోనుంది. -
సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లు 500 కోట్లు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇంటర్నెట్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంటే ప్రపంచ జనాభాలో 64% మంది సామాజిక మాధ్యమాల్లో అత్యధికంగా కాలం గడుపుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే వినియోగదారులు 3.7% పెరిగినట్టు డిజిటల్ అడ్వయిజరీ సంస్థ కెపియోస్ అధ్యయనంలో వెల్లడైంది. ► తూర్పు, మధ్య ఆఫ్రికా దేశాల్లో సోషల్ మీడియా యూజర్ల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతీ 11 మందిలో ఒక్కరికే సోషల్ మీడియాలో ఖాతాలున్నాయి. ► భారత్‌లో ప్రతీ ముగ్గురిలో ఒకరు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు ► రోజుకి సగటున 2 గంటల 26 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు ► బ్రెజిల్ వాసులు అత్యధికంగా సగటున 3 గంటల 49 నిమిషాలు సోషల్ మీడియాలో ఉంటే, జపాన్ వాసులు అత్యంత తక్కువగా గంటలోపు మాత్రమే సోషల్ మీడియాని చూస్తున్నారు. ► సోషల్ మీడియా యూజర్లకి దాదాపుగా ఏడు యాప్స్‌లో ఖాతాలుంటు న్నాయి. వీటిలో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విటర్ ప్రధానమైనవి. -
గ్రామీణ పేదలకు ఇంటర్నెట్: మైక్రోసాఫ్ట్, ఎయిర్‌జల్దీ మధ్య ఎంవోయూ
హైదరాబాద్: ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్లు అందించే ఎయిర్ జల్దీ, మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. మూడేళ్ల ఎంవోయూపై ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి దూరమైన పేద ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ను ఇవి అందించనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోకి కొత్తగా ఎయిర్ జల్దీ విస్తరించనుంది. ఈ రాష్ట్రాల్లో 20వేల కిలోమీటర్ల మేర తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం ద్వారా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సేవలను అందించనుంది. అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న తొమ్మిది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనున్నట్టు ఎయిర్ జల్దీ తెలిపింది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సైబర్ బీమా!
కరోనా వైరస్ పరిశ్రమల రూపురేఖలను మార్చేసింది. వైరస్ విస్తరించకుండా చూసే లక్ష్యంతో సేవల రంగ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) విధానాన్ని ఆచరణలో పెట్టాయి. ఐటీ, మీడియా తదితర చాలా రంగాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. వైరస్ ఇప్పట్లో కనుమరుగు కాకపోవచ్చని, వ్యాక్సిన్ వచ్చే వరకు సామాజిక దూరం పాటించక తప్పదంటున్నారు నిపుణులు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం భవిష్యత్తులోనూ కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఈ విధానంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ సాయంతో ఇంటర్నెట్ ద్వారా కార్యాలయ సర్వర్లతో అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ దాడుల రిస్క్ ఎక్కువగా పొంచి ఉంటుంది. ఏ కొంచెం అవకాశం ఇచ్చినా సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లు, సర్వర్లలోకి చొచ్చుకుపోయి నష్టానికి కారణం కావచ్చు. కరోనా వైరస్ పేరుతో నిత్యం 2,600 సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నాయని ఇటీవలే చెక్ పాయింట్ సర్వే వెల్లడించింది. కనుక ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువైన డేటాతోపాటు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును జాగ్రత్తగా కాపాడుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒక చక్కని పరిష్కారం. సైబర్ దాడి జరిగితే ఎదురయ్యే నష్టాన్ని సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ భరిస్తుంది. కనుక ఆన్లైన్ వేదికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు, తమ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారాన్ని ఉంచుకునే వారు తప్పకుండా ఈ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. కవరేజీ వీటికి... దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థలు.. బజాజ్ అలియాంజ్ జనరల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థలు ఈ తరహా సైబర్ కవరేజీలను అందిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. హెచ్డీఎఫ్సీ ఎర్గో అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ సైబర్ పాలసీని అందిస్తోంది. ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ప్రతీ ఏటా దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థలను బట్టి కవరేజీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ప్రధానంగా గుర్తింపు చోరీ, అనధికారిక ఆన్లైన్ లావాదేవీలు (మీ ప్రమేయం లేకుండా వేరే వారు చేసేవి) ఈ–ఎక్ట్సార్షన్ (డబ్బు కోసం డిమాండ్ చేస్తూ దాడి చేయం), సైబర్ బుల్లీయింగ్ (బెదిరింపులు), మాల్వేర్ దాడులు (సాఫ్ట్వేర్ సాయంతో కంప్యూటర్లను అధీనంలోకి తీసుకోవడం), కీలకమైన సమాచార వివరాలను (పాస్వర్డ్, యూజర్ నేమ్ వంటివి) చోరీ చేసే ఫిషింగ్ దాడులు, ఈమెయిల్ స్పూఫింగ్ (తప్పుదోవ పట్టించే, మోసపూరిత మెయిల్స్) తదితర దాడుల నుంచి సైబర్ పాలసీల్లో రక్షణ ఉంటుంది. వీటి వల్ల జరిగిన నష్టానికి పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. పరిహారం అన్నది గరిష్టంగా మీరు తీసుకునే సమ్ ఇన్సూర్డ్ వరకేనని గమనించాలి. సైబర్ దాడుల కారణంగా ఎదురయ్యే న్యాయపరమైన చర్యల ఖర్చును కూడా బీమా సంస్థ నుంచి పొందే అవకాశం ఉంటుంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ సంస్థలు ఈ కవరేజీలు అన్నింటినీ ఆఫర్ చేస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అదనంగా సోషల్ మీడియా కవర్‌ను కూడా అందిస్తోంది. దీని కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రొఫైల్‌పై దాడుల వల్ల గుర్తింపు వివరాల నష్టం జరిగితే పరిహారం తీసుకోవచ్చు. ఈ దాడుల వల్ల వేతన నష్టం జరిగితే హెచ్డీఎఫ్సీ ఎర్గో పరిహారం (గరిష్టంగా ఏడు రోజులకు మించకుండా) ఇస్తోంది. మొబిక్విక్ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఐసీఐసీఐ లాంబార్డ్ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే అనధికారిక లావాదేవీల వల్ల కలిగే ఆర్థిక నష్టం, వేతన నష్టాలకు పరిహారం అందిస్తోంది. క్లెయిమ్ విధానం.. సైబర్ దాడి ఏదైనా కానీయండి.. ఏడు రోజుల్లోపు బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ లేదా ఫోన్ లేదా ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని అందించొచ్చు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తూ, ఆధారంగా అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇవి అందిన రోజు నుంచి 30 రోజుల్లోగా బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిష్కరిస్తుంది. క్లెయిమ్ ఫామ్, ఎఫ్ఐఆర్ కాపీ, సైబర్ దాడి జరిగినట్టు ఆధారాలు, లీగర్ నోటీసులు ఏవైనా అందుకుంటే ఆయా కాపీలను కూడా బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది. గమనించాల్సినవి.. సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో పరిమితులు, మినహాయింపులతో ఉంటాయి. ముఖ్యంగా పాలసీదారుడు ఒక ఏడాదిలో ఒకటే క్లెయిమ్ చేయగలరు. ఒకటికి మించి దాడులు ఏకకాలంలో జరిగితే ఇందులో ఎక్కువ నష్టం జరిగిన దాడికి సంబంధించి హెచ్డీఎఫ్సీ ఎర్గో పరిహారం చెల్లిస్తుంది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేస్తున్న సైబర్‌సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో పరిహారానికి సంబంధించి ఉప పరిమితులు ఉన్నాయి. అంటే ప్రతీ కవరేజీకి విడిగా గరిష్ట పరిహారాన్ని కంపెనీ పరిమితం చేసింది. ఉదాహరణకు ఫిషింగ్, ఐటీ చోరీలో పరిహారం అన్నది బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్)లో 25 శాతానికే పరిమితం అవుతుంది. ఉదాహరణకు రూ.1 లక్షకు పాలసీ తీసుకున్నట్టయితే ఫిషింగ్ ఘటనలో లభించే గరిష్ట పరిహారం రూ.25 వేలుగానే ఉంటుంది. అదే విధంగా ఈమెయిల్ స్పూఫింగ్‌లో గరిష్ట బీమా 15 శాతానికే పరిమితం అవుతుంది. మిగిలిన అన్ని దాడుల్లోనూ పరిహారం బీమా కవరేజీలో 10 శాతంగానే ఉంటుందని గమనించాలి. అదే విధంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో ఈ సెక్యూర్ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలో సైబర్ బుల్లీయింగ్, ఈ ఎక్ట్సార్షన్, ఈ రిప్యుటేషన్ (పేరు ప్రతిష్ట) నష్టానికి క్లెయిమ్ చేసుకోవాలంటే 45 రోజులు వేచి ఉండే నిబంధన అమల్లో ఉంది. అంటే పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాతే వీటి విషయంలో క్లెయిమ్ హక్కు లభిస్తుంది. అలాగే, ఈ రిప్యుటేషన్ నష్టం, గుర్తింపు వివ రాల చోరీ, ఈమెయిల్ స్పూఫింగ్ ఘటనల్లో లభించే పరిహారం గరిష్టంగా బీమా కవరేజీలో 25 శాతంగానే ఉంటుంది. ఫిషింగ్‌లో ఇది 15 శాతంగాను, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఈ ఎక్ట్సార్షన్, సైబర్ బుల్లీయింగ్, మాల్వేర్ దాడుల్లో గరిష్ట పరిహారం 10%. అదే విధంగా క్లెయిమ్ మొత్తం రూ.50,000 మించి ఉంటే కనీసం రూ. 3,500ను తగ్గించి ఇస్తుంది. ఐసీఐసీఐ లాం బార్డ్ సైబర్ పాలసీలో 10% లోపే ఆప్షన్ ఉంది. అంటే పాలసీదారు క్లెయిమ్ మొత్తంలో తన వంతుగా 10 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. -
దానిలో చైనా ముందంజ.. భారత్ వెనుకంజ
వాషింగ్టన్ : భారత్, చైనా.. ప్రపంచంలో ఎక్కువగా పాపులర్ చెందిన దేశాలు. జనాభా పరంగా, అభివృద్ధి పరంగా ఈ రెండు పోటాపోటీగా దూసుకెళ్తుంటాయి. కానీ డిజిటల్ స్పేస్ లో మాత్రం భారత్, చైనాకు గట్టిపోటీని ఇవ్వలేకపోతుంది. 2013 నుంచి టెక్నాలజీ అందిపుచ్చుకునే దిశగా నడక ప్రారంభించిన ఈ రెండు దేశాల్లో చైనా శరవేగంగా దూసుకెళ్తుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో తెలిపింది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకంలో చైనా ముందంజలో ఉందని, 2016 వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉందని పేర్కొంది. సర్వే ప్రకారం చైనాలో 71 శాతం మంది ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నట్టు చెప్పగా... భారత్ లో మాత్రం 21 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నట్టు తెలిసింది. 68 శాతం మంది చైనీస్ దగ్గర సొంత స్మార్ట్ ఫోన్లుండగా.. భారత్ లో మాత్రం 18 శాతం మంది దగ్గరే సొంత ఫోన్లున్నాయి. 2013 నుంచి చైనాలో స్మార్ట్ ఫోన్ ఓనర్ షిప్ 31 శాతం జంప్ అయినట్టు వెల్లడైంది. కానీ అదేసమయంలో భారత్ మాత్రం 6 శాతమే పెరిగింది. బేసిక్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నవారు చైనాలో 98 శాతముంటే, భారత్ లో ఆ శాతం కేవలం 72 మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఓనర్ షిప్ లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతను కూడా ఈ సర్వే ఎత్తిచూపింది. 72 శాతం మంది పట్టణ చైనీస్ ప్రజలు సొంతంగా స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారని, గ్రామీణ చైనీస్ లో 63 శాతం మంది సొంతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని సర్వే తెలిపింది. కానీ భారత్ లో ఈ శాతం మరింత దిగువ స్థాయిలో ఉంది. పట్టణ భారతీయ ప్రజలు 29 శాతం, గ్రామీణ ప్రజలు 13 శాతం మందే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ల వాడకంలో జెండర్ గ్యాప్ కూడా ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. -
అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ ఇచ్చాం
దావోస్‌లో సీఎం చంద్రబాబు నేడు యూరోపియన్ తెలుగు ప్రజలతో సమావేశం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని, ఇకపై డిజిటల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వ పరిపాలనంతా ఆన్లైన్లో ఉందని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితర అన్ని విభాగాలు క్లౌడ్‌లో ఉన్నాయని తెలిపారు. దావోస్ నుంచే తాను డ్యాష్ బోర్డు చూస్తూ ఆదేశాలు జారీ చేయగలనని, ఇక్కడి నుంచే ఫైళ్లను కోర్ డ్యాష్ బోర్డు సాయంతో పరిష్కరించగల నన్నారు. దావోస్‌లో శుక్రవారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నిర్వహించిన ప్రత్యేక సెషన్లో ఇంటర్నెట్ ఫర్ ఆల్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ వివరాలతోపాటు పలు సంస్థలతో జరిగిన సమావేశాల వివరాలను ఆయన కార్యాలయ మీడియా విభాగం విడుదల చేసింది. శుక్రవారంతో ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన ముగిసింది. శనివారం జురిచ్ చేరుకుని యూరోపియన్ తెలుగు ప్రజల సమావేశంలో పాల్గొననున్నారు. పలు సంస్థలతో సమావేశం.. ► విశాఖలో టెక్నాలజీ సెంటర్ నెలకొ ల్పాలని మాస్టర్‌కార్డ్ అంతర్జాతీయ మార్కెట్ల అధ్యక్షుడు ఎన్కేన్స్ను ముఖ్యమంత్రి కోరారు. ►రాష్ట్రంలో 300 మెగావాట్ల సామర్థ్యం గల పవన్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు అవకాశాన్ని పరిశీలిస్తామని అబ్రాజ్ గ్రూప్ లిమిటెడ్ అసోసియేట్ డైరెక్టర్ కునాల్ పరేఖ్ హామీ ఇచ్చారు. ► ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు(ఈడీబీ)ను మరింత బలోపేతం చేసేలా శిక్షణ ఇచ్చేందుకు సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ బెహ్ స్వాన్ జిన్ అంగీకరించారు. ► ఎయిర్‌బస్ సంస్థ సీఈఓ డర్క్ హూక్, ఆటో గ్రిడ్ సిస్టమ్స్ సీఈఓ, పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్, ఎఫ్టీ క్యాష్ వ్యవస్థాప కుడు లోథా, డబుల్ యుఈఎఫ్ సాంకేతిక మార్గదర్శి అమిత్ నారాయణ్‌తో బాబు వివిధ అంశాలపై చర్చించారు. విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్‌ను కోరారు. ► వ్యవసాయం, ఉద్యానం, ఆక్వా, డెయిరీ తదితర అంశాల్లో నాలెడ్జ్ పార్ట్నర్గా ఉండేం దుకు నెదర్లాండ్‌కు చెందిన వేగెనింజన్ యూనివర్సిటీ అండ్ రీసెర్చి ప్రతినిధి డాక్టర్ రోథియస్ అంగీకరించారు. -
ఈ-ప్రగతితో అవినీతికి చెక్ శాసనసభలో సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2018 నాటికి అన్ని ఇళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు పురోగమనంలో ఉందన్నారు. పౌరులందరికీ నాణ్యమైన, తక్కువ సమాచార సామర్థ్యాన్ని అందిస్తామన్నారు. ఫైబర్‌గ్రిడ్, ఈ-ప్రగతి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శని వారం శాసనసభలో ప్రకటన చేశారు. ఇందులోని ముఖ్యాంశాలు.. ♦ రాష్ట్రంలో 61 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ భూగర్భంలో వేయాల్సి ఉంటుంది. దీనికి రూ.4,700 కోట్లు ఖర్చవుతుంది. మూడేళ్లు పడుతుంది. ఈ కారణం గా తొలిదశ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ స్తంభాలపైనే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ వేస్తున్నాం. దీనికి రూ.333 కోట్లతో, తొమ్మిది నెలల్లోనే పూర్తవుతుంది. ♦ కేబుల్ టీవీ, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, టెలి కాం సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, మరింత ఆదాయం పెరిగేలా చూస్తాం. డిజిటల్ ఏపీ ద్వారా బాటలు వేస్తున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు దీని వల్ల ప్రయోజనం ఉంటుంది. తొలిదశలో సర్వీస్ ఆపరేషన్ సెంటర్, నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్, ఏరియల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు. ♦ ఈఏడాది ఏప్రిల్ నాటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 2016 నాటికి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభమవుతాయి. జూన్ నాటికి 22,400 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు లక్ష్యం. ♦ విశాఖలో రూ.40 కోట్లతో నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్‌ను నెలకొల్పుతాం. ♦ నెలకు రూ.149 ప్యాకేజీతో కూడిన సేవలపై ఇప్పటికే అవగాహన కుదిరింది. ఈ ప్యాకేజీ కింద 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్, కనీసం 100 ఛానళ్లు, టెలిఫోన్ కనెక్షన్ వినియోగదారులకు ఇస్తాం. ♦ ఈ-ప్రగతి ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేస్తాం. తొలి దశలో 10 శాఖలను, సచివాలయం, రెండోదశలో మరో పది శాఖలను, మూడో దశలో 13 శాఖలను కలుపుతాం. -
హలో... హలోకు ఇంకెన్నాళ్లో!
తుపాను కారణంగా దెబ్బతిన్న 3,612 టవర్లు పలకని ఫోన్లు... స్తంభించిన ఇంటర్నెట్ ఇప్పటికీ పూర్తికాని పునరుద్ధరణ పనులు ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం విశాఖ రూరల్: హుదూద్ తుపాను వచ్చి వారం రోజులు గడిచినా ఉత్తరాంధ్రలో సమాచార వ్యవస్థ మెరుగుపడలేదు. మొబైల్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. టవర్ల పునరుద్ధరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ గాడిలో పడాలంటే 2 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు సెల్ఫోన్లకు మూగనోము తప్పదంటున్నారు. ఈనెల 12వ తేదీన తుపాను కుదిపేసి న రోజే సెల్ఫోన్లు మూగబోయాయి. ఇం టర్నెట్ బంద్ అయింది. దీంతో ఒకరి నుంచి మరొకరికి సమాచారం లేకుండా పోయింది. దెబ్బతిన్న టవర్లు... తెగిన కనెక్టివిటీ... తుపాను ధాటికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో అన్ని నెట్‌వర్క్‌ల సెల్ టవర్లు మొత్తం 3612 దెబ్బతిన్నాయి. విశాఖలో అత్యధికంగా 1929 టవర్లు, విజయనగరంలో 585, శ్రీకాకుళంలో 678, తూర్పుగోదావరి జిల్లాలో 420 టవర్లు పాడయ్యాయి. దీంతో గత వారం నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించిపోయింది. మొబైల్స్‌తోపాటు ల్యాండ్‌లైన్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి. ప్రపంచానికి నాలుగు జిల్లాలతో కనెక్టివిటీ తెగిపోయింది. కనీసం ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. వారం రోజులు గడిచినా పరిస్థితులు మెరుగుపడలేదు. ఇంకా 617 టవర్లకు మరమ్మతు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేయడానికి నెల రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ అంతరాయంతో మొరాయిస్తున్న టవర్లు విద్యుత్ లేకపోవడంతో ఉన్న టవర్లు సైతం మొరాయిస్తున్నాయి. సెల్ టవర్లకు జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం తుపానుకు ముందే సూచించింది. కానీ ఏ ఒక్క నెట్వర్క్ ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో విద్యుత్ అంతరాయం కారణంగా టవర్లు పనిచేయడం లేదు. ఫలితంగా సిగ్నల్స్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వమే అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం విద్యుత్ పూర్తి స్థాయిలో వస్తేనే గాని టవర్లు పనిచేసే అవకాశం లేదు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లు విశాఖలో మొబైల్ టవర్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో వినియోగదారులకు సేవలందడం లేదు. ఇక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎన్యూమరేషన్‌కు అవరోధాలు సమాచార వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నష్టం అంచనాలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు ఎటువంటి సమాచారం రావడం లేదు. ఇంటర్నెట్ కూడా లేకపోవడంతో ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నష్టం అంచనాలను తయారు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. బాధితుల జాబితాను ఆన్లైన్లో పొందుపర్చేందుకు ఎన్యూమరేషన్ బృందాలకు ట్యాబ్లెట్లను పంపిణీ చేసింది. విశాఖకు 300, విజయనగరానికి 100, శ్రీకాకుళంకు 100 ట్యాబెట్లు అందజేసింది. అయితే ఇంటర్నెట్ సేవలు లేని ఈ సమయంలో ఈ ట్యాబ్లెట్ల ద్వారా బాధితుల వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కావడం లేదు. దీంతో అంచనాల రూపకల్పనకు జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూతపడిన ఐటీ సంస్థలు సమాచార వ్యవస్థ స్తంభించడంతో విశాఖలో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు మూతపడ్డాయి. ఫోన్ సదుపాయంతోపాటు ఇంటర్నెట్ సేవలు కూడా లేకపోవడంతో సాఫ్ట్వేర్ ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈ వారం రోజుల్లో ఐటీ కంపెనీలకు రూ.350 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా సమాచార వ్యవస్థను వేగంగా పునరుద్ధరించలేని పక్షంలో నష్టం మరింత పెరగనుంది. విద్యుత్‌ను పూర్తి స్థాయిలో అందిస్తేనే టవర్లు పనిచేస్తాయని సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను శాశ్వతంగా పునరుద్ధరించడానికి కనీసం 2 నెలల సమయం పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం మరో 2 నెలలకు గాని సెల్ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.