హలో... హలోకు ఇంకెన్నాళ్లో! | Hello ... haloku inkennallo! | Sakshi
Sakshi News home page

హలో... హలోకు ఇంకెన్నాళ్లో!

Published Tue, Oct 21 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

Hello ... haloku inkennallo!

  • తుపాను కారణంగా దెబ్బతిన్న 3,612 టవర్లు
  •  పలకని ఫోన్లు... స్తంభించిన ఇంటర్నెట్
  •  ఇప్పటికీ పూర్తికాని పునరుద్ధరణ పనులు
  •  ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం
  • విశాఖ రూరల్: హుదూద్ తుపాను వచ్చి వారం రోజులు గడిచినా ఉత్తరాంధ్రలో సమాచార వ్యవస్థ మెరుగుపడలేదు. మొబైల్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. టవర్ల పునరుద్ధరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ గాడిలో పడాలంటే 2 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు సెల్‌ఫోన్లకు మూగనోము తప్పదంటున్నారు. ఈనెల 12వ తేదీన తుపాను కుదిపేసి న రోజే సెల్‌ఫోన్లు మూగబోయాయి. ఇం టర్నెట్ బంద్ అయింది. దీంతో ఒకరి నుంచి మరొకరికి సమాచారం లేకుండా పోయింది.
     
    దెబ్బతిన్న టవర్లు... తెగిన కనెక్టివిటీ...

    తుపాను ధాటికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో అన్ని నెట్‌వర్క్‌ల సెల్ టవర్లు మొత్తం 3612 దెబ్బతిన్నాయి. విశాఖలో అత్యధికంగా 1929 టవర్లు, విజయనగరంలో 585, శ్రీకాకుళంలో 678, తూర్పుగోదావరి జిల్లాలో 420 టవర్లు పాడయ్యాయి. దీంతో గత వారం నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించిపోయింది. మొబైల్స్‌తోపాటు ల్యాండ్‌లైన్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి. ప్రపంచానికి నాలుగు జిల్లాలతో కనెక్టివిటీ తెగిపోయింది. కనీసం ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. వారం రోజులు గడిచినా పరిస్థితులు మెరుగుపడలేదు. ఇంకా 617 టవర్లకు మరమ్మతు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేయడానికి నెల రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
     
    విద్యుత్ అంతరాయంతో మొరాయిస్తున్న టవర్లు

    విద్యుత్ లేకపోవడంతో ఉన్న టవర్లు సైతం మొరాయిస్తున్నాయి. సెల్ టవర్లకు జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం తుపానుకు ముందే సూచించింది. కానీ ఏ ఒక్క నెట్‌వర్క్ ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో విద్యుత్ అంతరాయం కారణంగా టవర్లు పనిచేయడం లేదు. ఫలితంగా సిగ్నల్స్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వమే అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం విద్యుత్ పూర్తి స్థాయిలో వస్తేనే గాని టవర్లు పనిచేసే అవకాశం లేదు. బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లు విశాఖలో మొబైల్ టవర్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో వినియోగదారులకు సేవలందడం లేదు. ఇక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
     
    ఎన్యూమరేషన్‌కు అవరోధాలు

    సమాచార వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నష్టం అంచనాలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు ఎటువంటి సమాచారం రావడం లేదు. ఇంటర్నెట్ కూడా లేకపోవడంతో ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నష్టం అంచనాలను తయారు చేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. బాధితుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు ఎన్యూమరేషన్ బృందాలకు ట్యాబ్లెట్లను పంపిణీ చేసింది. విశాఖకు 300, విజయనగరానికి 100, శ్రీకాకుళంకు 100 ట్యాబెట్లు అందజేసింది. అయితే ఇంటర్నెట్ సేవలు లేని ఈ సమయంలో ఈ ట్యాబ్లెట్ల ద్వారా బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడం కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కావడం లేదు. దీంతో అంచనాల రూపకల్పనకు జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
     
    మూతపడిన ఐటీ సంస్థలు

    సమాచార వ్యవస్థ స్తంభించడంతో విశాఖలో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు మూతపడ్డాయి. ఫోన్ సదుపాయంతోపాటు ఇంటర్నెట్ సేవలు కూడా లేకపోవడంతో సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈ వారం రోజుల్లో ఐటీ కంపెనీలకు రూ.350 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా సమాచార వ్యవస్థను వేగంగా పునరుద్ధరించలేని పక్షంలో నష్టం మరింత పెరగనుంది. విద్యుత్‌ను పూర్తి స్థాయిలో అందిస్తేనే టవర్లు పనిచేస్తాయని సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను శాశ్వతంగా పునరుద్ధరించడానికి కనీసం 2 నెలల సమయం పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం మరో 2 నెలలకు గాని సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement