Hudood Katrina
-
హలో... హలోకు ఇంకెన్నాళ్లో!
తుపాను కారణంగా దెబ్బతిన్న 3,612 టవర్లు పలకని ఫోన్లు... స్తంభించిన ఇంటర్నెట్ ఇప్పటికీ పూర్తికాని పునరుద్ధరణ పనులు ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం విశాఖ రూరల్: హుదూద్ తుపాను వచ్చి వారం రోజులు గడిచినా ఉత్తరాంధ్రలో సమాచార వ్యవస్థ మెరుగుపడలేదు. మొబైల్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. టవర్ల పునరుద్ధరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ గాడిలో పడాలంటే 2 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు సెల్ఫోన్లకు మూగనోము తప్పదంటున్నారు. ఈనెల 12వ తేదీన తుపాను కుదిపేసి న రోజే సెల్ఫోన్లు మూగబోయాయి. ఇం టర్నెట్ బంద్ అయింది. దీంతో ఒకరి నుంచి మరొకరికి సమాచారం లేకుండా పోయింది. దెబ్బతిన్న టవర్లు... తెగిన కనెక్టివిటీ... తుపాను ధాటికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో అన్ని నెట్‌వర్క్‌ల సెల్ టవర్లు మొత్తం 3612 దెబ్బతిన్నాయి. విశాఖలో అత్యధికంగా 1929 టవర్లు, విజయనగరంలో 585, శ్రీకాకుళంలో 678, తూర్పుగోదావరి జిల్లాలో 420 టవర్లు పాడయ్యాయి. దీంతో గత వారం నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించిపోయింది. మొబైల్స్‌తోపాటు ల్యాండ్‌లైన్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి. ప్రపంచానికి నాలుగు జిల్లాలతో కనెక్టివిటీ తెగిపోయింది. కనీసం ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. వారం రోజులు గడిచినా పరిస్థితులు మెరుగుపడలేదు. ఇంకా 617 టవర్లకు మరమ్మతు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేయడానికి నెల రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ అంతరాయంతో మొరాయిస్తున్న టవర్లు విద్యుత్ లేకపోవడంతో ఉన్న టవర్లు సైతం మొరాయిస్తున్నాయి. సెల్ టవర్లకు జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం తుపానుకు ముందే సూచించింది. కానీ ఏ ఒక్క నెట్వర్క్ ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో విద్యుత్ అంతరాయం కారణంగా టవర్లు పనిచేయడం లేదు. ఫలితంగా సిగ్నల్స్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వమే అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం విద్యుత్ పూర్తి స్థాయిలో వస్తేనే గాని టవర్లు పనిచేసే అవకాశం లేదు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లు విశాఖలో మొబైల్ టవర్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో వినియోగదారులకు సేవలందడం లేదు. ఇక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎన్యూమరేషన్‌కు అవరోధాలు సమాచార వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నష్టం అంచనాలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు ఎటువంటి సమాచారం రావడం లేదు. ఇంటర్నెట్ కూడా లేకపోవడంతో ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నష్టం అంచనాలను తయారు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. బాధితుల జాబితాను ఆన్లైన్లో పొందుపర్చేందుకు ఎన్యూమరేషన్ బృందాలకు ట్యాబ్లెట్లను పంపిణీ చేసింది. విశాఖకు 300, విజయనగరానికి 100, శ్రీకాకుళంకు 100 ట్యాబెట్లు అందజేసింది. అయితే ఇంటర్నెట్ సేవలు లేని ఈ సమయంలో ఈ ట్యాబ్లెట్ల ద్వారా బాధితుల వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కావడం లేదు. దీంతో అంచనాల రూపకల్పనకు జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూతపడిన ఐటీ సంస్థలు సమాచార వ్యవస్థ స్తంభించడంతో విశాఖలో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు మూతపడ్డాయి. ఫోన్ సదుపాయంతోపాటు ఇంటర్నెట్ సేవలు కూడా లేకపోవడంతో సాఫ్ట్వేర్ ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈ వారం రోజుల్లో ఐటీ కంపెనీలకు రూ.350 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా సమాచార వ్యవస్థను వేగంగా పునరుద్ధరించలేని పక్షంలో నష్టం మరింత పెరగనుంది. విద్యుత్‌ను పూర్తి స్థాయిలో అందిస్తేనే టవర్లు పనిచేస్తాయని సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను శాశ్వతంగా పునరుద్ధరించడానికి కనీసం 2 నెలల సమయం పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం మరో 2 నెలలకు గాని సెల్ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. -
గొల్లుమన్న ‘గోవాడ’
దెబ్బతిన్న మిల్లు హౌస్ తడిసిపోయిన 2.61 లక్షల క్వింటాళ్ల పంచదార రూ. 100 కోట్ల నష్టం క్రషింగ్ మరింత ఆలస్యం చోడవరం : హుదూద్ తుపాను గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి భారీ నష్టం వాటిల్లింది. భీకర గాలులకు మిల్లు హౌస్ నాశనమైంది. బాయిలర్ హౌస్, టర్బైన్ ఎలక్ట్రానిక్స్ యూనిట్లు, క్లాడిగ్స్, ఏసీ మెషీన్లు, మోటార్లు దెబ్బతిన్నాయి. మొలాసిస్ ట్యాంక్ పైకప్పు కూడా పాడై వెయ్యి లీటర్ల మొలాసిస్ నీటిపాలైంది. మరోపక్క రూ.80 కోట్ల విలువైన పంచదార బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ప్రాథమికంగా సుమారు రూ.100 కోట్ల నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ వద్ద 4.14 లక్షల క్వింటాళ్ల బస్తాల పంచదార నిల్వ ఉంది. వీటిలో 2.61 లక్షల బస్తాలు హుదూద్ అర్పణమైంది. ఫ్యాక్టరీలోని 5,7,8 నంబర్ల గోడౌన్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయి అందులో ఉన్న 76 వేల క్వింటాళ్ల పంచదార తడిసిపోయింది. కశింకోట పౌర సరఫరాల విభాగం అద్దె గోడౌన్ కూలిపోవడంతో అందులో నిల్వ ఉంచిన లక్షా18 వేల బస్తాలు, వడ్లపూడి వద్ద అద్దెకు తీసుకున్న గోడౌన్ పైకప్పు రేకులు దెబ్బతిని 56 వేల బస్తాలు కూడా తడిసిపోయాయి. ఒకపక్క మిల్లు హౌస్, మరోపక్క ఆదాయాన్నిచ్చే పంచదార నష్టానికి గురికావడంతో యాజమాన్యం, పాలకవర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే రూ.100 కోట్ల వరకు నిల్వ ఉన్న పంచదారపై అప్పుగా తెచ్చి రైతులకు చెల్లింపులు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో పంచదార ధర క్వింటాలు రూ.2800 మాత్రమే ఉండటంతో మంచి ధర కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా తుపాను భారీ నష్టాన్ని తెచ్చింది. అయితే ఈ నిల్వలో లక్ష బస్తాలు పౌరసరఫరాల శాఖకు తాజాగా విక్రయించినా వారు సరుకు పూర్తిగా తరలించకపోవడంతో ఆ పంచదార కూడా నష్టంలో ఉంది. 2014-15 క్రషింగ్ సీజన్‌ను నవంబరు 15 నుంచి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో హుదూద్ తుపాను కుదేలు చేసింది. దెబ్బతిన్న మిల్లు హౌస్‌కు మరమ్మతులు చేసి క్రషింగ్ ప్రారంభించాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది. దీంతో డిసెంబరు నెలాఖరులో వరకు క్రషింగ్ ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. దెబ్బతిన్న మిల్లుహౌస్‌ను, పంచదారను మంగళవారం పరిశీలించిన ఫ్యాక్టరీ ఎండీ వి.వి.రమణారావు కంటతడిపెట్టారు. 24 వేల మంది రైతులకు, మూడు వేల మంది కార్మికులకు అండగా ఉన్న ఫ్యాక్టరీ ఇలా భారీ నష్టానికి గురికావడం ఆవేదన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎండీ రమణారావులు కోరారు.