గొల్లుమన్న ‘గోవాడ’ | Damaged the mill house | Sakshi
Sakshi News home page

గొల్లుమన్న ‘గోవాడ’

Published Wed, Oct 15 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

Damaged the mill house

  • దెబ్బతిన్న మిల్లు హౌస్
  •  తడిసిపోయిన 2.61 లక్షల క్వింటాళ్ల పంచదార
  •  రూ. 100 కోట్ల నష్టం
  •  క్రషింగ్ మరింత ఆలస్యం
  • చోడవరం : హుదూద్ తుపాను గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి భారీ నష్టం వాటిల్లింది. భీకర గాలులకు మిల్లు హౌస్ నాశనమైంది. బాయిలర్ హౌస్, టర్బైన్ ఎలక్ట్రానిక్స్ యూనిట్లు, క్లాడిగ్స్, ఏసీ మెషీన్లు, మోటార్లు దెబ్బతిన్నాయి. మొలాసిస్ ట్యాంక్ పైకప్పు కూడా పాడై వెయ్యి లీటర్ల మొలాసిస్ నీటిపాలైంది. మరోపక్క రూ.80 కోట్ల విలువైన పంచదార బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ప్రాథమికంగా సుమారు రూ.100 కోట్ల నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ వద్ద 4.14 లక్షల క్వింటాళ్ల బస్తాల పంచదార నిల్వ ఉంది. వీటిలో 2.61 లక్షల బస్తాలు హుదూద్ అర్పణమైంది.

    ఫ్యాక్టరీలోని 5,7,8 నంబర్ల గోడౌన్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయి అందులో ఉన్న 76 వేల క్వింటాళ్ల పంచదార తడిసిపోయింది. కశింకోట పౌర సరఫరాల విభాగం అద్దె గోడౌన్ కూలిపోవడంతో అందులో నిల్వ ఉంచిన లక్షా18 వేల బస్తాలు, వడ్లపూడి వద్ద అద్దెకు తీసుకున్న గోడౌన్ పైకప్పు రేకులు దెబ్బతిని 56 వేల బస్తాలు కూడా తడిసిపోయాయి.

    ఒకపక్క మిల్లు హౌస్, మరోపక్క ఆదాయాన్నిచ్చే పంచదార నష్టానికి గురికావడంతో యాజమాన్యం, పాలకవర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే రూ.100 కోట్ల వరకు నిల్వ ఉన్న పంచదారపై అప్పుగా తెచ్చి రైతులకు చెల్లింపులు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో పంచదార ధర క్వింటాలు రూ.2800 మాత్రమే ఉండటంతో మంచి ధర కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా తుపాను భారీ నష్టాన్ని తెచ్చింది.

    అయితే ఈ నిల్వలో లక్ష బస్తాలు పౌరసరఫరాల శాఖకు తాజాగా విక్రయించినా వారు సరుకు పూర్తిగా తరలించకపోవడంతో ఆ పంచదార కూడా నష్టంలో ఉంది. 2014-15 క్రషింగ్ సీజన్‌ను నవంబరు 15 నుంచి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో హుదూద్ తుపాను కుదేలు చేసింది. దెబ్బతిన్న మిల్లు హౌస్‌కు మరమ్మతులు చేసి క్రషింగ్ ప్రారంభించాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది. దీంతో డిసెంబరు నెలాఖరులో వరకు క్రషింగ్ ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు.

    దెబ్బతిన్న మిల్లుహౌస్‌ను, పంచదారను మంగళవారం పరిశీలించిన ఫ్యాక్టరీ ఎండీ వి.వి.రమణారావు కంటతడిపెట్టారు. 24 వేల మంది రైతులకు, మూడు వేల మంది కార్మికులకు అండగా ఉన్న ఫ్యాక్టరీ ఇలా భారీ నష్టానికి గురికావడం ఆవేదన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎండీ రమణారావులు కోరారు.
     

Advertisement
Advertisement