communication
-
కమ్యూనికేషన్ టెక్నాలజీ విస్తరణకు స్టార్టప్‌ల ఎంపిక
వైర్డు కమ్యూనికేషన్ టెక్నాలజీ ‘నెస్సుమ్ వైర్’ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాలుగు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు పానాసోనిక్, టీ-హబ్ తెలిపాయి. ఇటీవల ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో భాగంగా టీ-హబ్‌తో కలిసి పానాసోనిక్ ఈ స్టార్టప్‌లను ఫైనల్ చేసినట్లు ప్రకటించింది. ఈ నాలుగు స్టార్టప్‌ల్లో అక్యా కంట్రోల్ సిస్టమ్స్, గోవిద్యుత్ మొబిలిటీ, ప్యూర్లాజిక్ ల్యాబ్స్ ఇండియా, ఎక్సీడ్ఐవోలు ఉన్నాయని పేర్కొంది.ఇప్పటికే ఉన్న వైర్డ్ డేటా కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరిచేలా చేసే నెస్సమ్ వైర్ టెక్నాలజీని విస్తరించాడానికి ఈ స్టార్టప్ లు పానాసోనిక్, టీ-హబ్‌తో కలిసి పనిచేస్తాయి. డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి మారుమూల ప్రాంతాల్లో సాంకేతిక సేవలు అందించేందుకు ఈ సంస్థలు పని చేయనున్నాయి.ఈ స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు పానాసోనిక్, టీ-హబ్‌లు సెప్టెంబర్ 2024లో ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రారంభించాయి. నెస్సమ్ టెక్నాలజీని ప్రభావితం చేయడానికి సరైన స్టార్టప్‌లను అన్వేషించాయి. అందుకోసం టీ-హబ్‌కు దరఖాస్తు చేసుకున్న 197 స్టార్టప్‌ల పనితీరు, వాటి భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించింది. తర్వాత డెమో కోసం ఎనిమిది స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేశారు. అందులో నాలుగు కంపెనీలను చివరిగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన కంపెనీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.అక్యా కంట్రోల్ సిస్టమ్స్: ఇది ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలో ముందంజలో ఉంది.గోవిద్యుత్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్: ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.ప్యూర్లాజిక్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: వినూత్న పరిష్కారాల ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంది.ఎక్సీడ్ ఐఓ: ఇది తయారీ, ఎనర్జీ రంగాలకు డిజైన్లను అందిస్తోంది.ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్షార్ట్లిస్ట్ అయిన స్టార్టప్‌లను అభినందిస్తూ పానాసోనిక్ హోల్డింగ్స్‌లో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీస్ హెడ్ మిస్టర్ సైజో హిరోషి మాట్లాడారు. ‘పానాసోనిక్ మిషన్‌కు అనుగుణంగా నెస్సమ్ వైర్ టెక్నాలజీని ఉపయోగించి మా ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్‌లు జపాన్‌లోని భారత బృందంతో భాగస్వామ్యం అవుతాయి. ఈ కంపెనీల సాయంతో ప్రపంచ మార్కెట్లకు అనుకూలంగా పరిష్కారాలను అందించడానికి ఆసక్తిగా ఉన్నాం’ అని తెలిపారు. -
సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..
పని ప్రదేశాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవడం మంచిదే. అంతమాత్రానా సహోద్యోగులతో అన్ని విషయాలు పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలు, విశ్వాసాలు, ఆరోగ్య విషయాలు..వంటి కొన్ని అంశాలను తోటి ఉద్యోగులతో చర్చించకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఒకవేళ వారితో ఆయా విషయాలను చర్చిస్తే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జరిగే మేలు కంటే చేటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తోటి ఉద్యోగులతో పంచుకోకూడని కొన్ని అంశాలను నిపుణులు తమ మాటల్లో తెలియజేస్తున్నారు.వ్యక్తిగత, ఆర్థిక సమాచారంమీ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచాలి. మీరు పొందుతున్న జీతం, అప్పులు, పెట్టుబడులు కార్యాలయంలో అనవసరమైన ఒత్తిడి, పోటీని సృష్టిస్తాయి. మీ జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలపై తోటి ఉద్యోగులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా నష్టం జరగవచ్చు.ఆరోగ్య సమస్యలుసెలవులు తీసుకోవడానికి, టార్గెట్లు తప్పించుకోవడానికి తరచూ చాలామంది ఆఫీస్‌లో ఆరోగ్య సమస్యలున్నట్లు చెబుతారు. అందుకు బదులుగా మీకు నిజంగా ఏదైనా సమస్యలుంటే దాన్ని ఎలా అధిగమిస్తున్నారో హెచ్ఆర్, మేనేజర్‌కు మాత్రమే చెప్పండి. భవిష్యత్తులో మీరు సెలవు అడిగినప్పుడు మీ సమస్యపై వారికి అవగాహన ఉంది కాబట్టి అనుమతించే అవకాశం ఉంటుంది. తోటి ఉద్యోగులకు చెప్పడం వల్ల మీరు టార్గెట్లు తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయవచ్చు.రాజకీయ, మత విశ్వాసాలుపని ప్రదేశంలో విభిన్న విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు. మీ రాజకీయ, మత విశ్వాసాలను వారిపై రుద్దడం కంటే అసలు ఆ ప్రస్తావన లేకుండా వృత్తి జీవితం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలి.సహోద్యోగులు, మేనేజ్మెంట్పై కామెంట్లుసహచరులు / మేనేజ్మెంట్ గురించి తోటి ఉద్యోగులతో చెడుగా మాట్లాడటం లేదా గాసిప్‌లు క్రియేట్ చేయడం ఆపేయాలి. సంస్థకు సంబంధించిన మీ అభిప్రాయాలు సరైనవే అయినా ఇతరులతో పంచుకోకూడదు. మీ విమర్శలు ఏవైనా ఉంటే నేరుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐభవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలుమీరు అధికారిక ప్రకటన చేయకుండా కంపెనీ మారే ఆలోచనను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ భవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ఉత్తమం. ఈ విషయాన్ని ముందుగానే చెబితే ప్రస్తుత మీ స్థానానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. -
సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్‌ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్‌ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్‌ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్‌ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్వర్క్ చిప్‌లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్ ఆధారిత 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్ ఆధారిత నెట్‌వర్క్‌ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్‌లో బిడ్లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్‌ట్రాన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్లెస్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. భారత్ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్‌లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్విడియా, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్లో సిగ్నల్‌చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు. -
టెక్నాలజీయేతర రంగాల్లో టెకీలకు డిమాండ్
ముంబై: టెక్నాలజీయేతర రంగాల్లో సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. 2027–28 నాటికి 6 పరిశ్రమలు 10 లక్షల మందికి పైగా టెకీలను నియమించుకోనున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టెక్నాలజీయేతర రంగాలైన బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా).. కన్సల్టింగ్, కమ్యూనికేషన్ మీడియా, రిటైల్, లైఫ్ సైన్సెస్.. హెల్త్‌కేర్ తదితర రంగాల సంస్థలు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 లక్షల మంది టెక్ నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ రంగాల్లో 7 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రమేయం ఉంటోంది. 5జీ సేవలు ప్రారంభం కావడం, డిజిటల్ చెల్లింపుల వృద్ధి, కొత్త తరం వ్యాపారాల వస్తుండటం, ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం పెరుగుతుండటం, డిజిటల్ పరివర్తన మొదలైన పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో టెక్నాలజీయేతర రంగాల్లోనూ టెకీలకు డిమాండ్ ఏర్పడుతోంది‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ తెలిపారు. నిపుణుల కొరత.. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ నిపుణుల లభ్యత ఆ స్థాయిలో లేకపోవడం పరిశ్రమలకు పెద్ద సవాలుగా ఉంటోందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ (స్పెషలైజ్డ్ స్టాఫింగ్ విభాగం) మునీరా లోలివాలా తెలిపారు. టెకీలను నియమించుకోవడంతో పాటు సిబ్బందిలో సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడంపైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తద్వారా నిర్వహణ వ్యవస్థను నైపుణ్యాల ఆధారితమైనదిగా తీర్చిదిద్దుకునేందుకు పటిష్టమైన పునాది వేసుకోవచ్చని మునీరా వివరించారు. ‘ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెక్నాలజీయేతర రంగాల్లో ఇప్పటికీ నియామకాలనేవి పర్మనెంట్ ఉద్యోగాల ప్రాతిపదికన ఉండటం లేదు. 54 శాతం సంస్థలు మాత్రమే పర్మనెంట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఏకంగా 30 శాతం సంస్థల్లో నియామకాలు రకరకాల కాంట్రాక్టుల రూపంలో ఉంటున్నాయి‘ అని ఆమె పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ప్రాంతం, వేతనాలపరంగా చూస్తే బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్ మెరుగ్గా ఉంటున్నాయి. బెంగళూరులో టెకీల్లో 27 శాతం మందికి, హైదరాబాద్‌లో 16 శాతం, ఢిల్లీ.. పుణెల్లో 13 శాతం మందికి అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి. -
ఆ దేశంలో ఆంగ్లంలో మాట్లాడితే రూ. 82 లక్షలు జరిమానా!
ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా రాజ్యమేలుతున్న సంగతి తెలుసిందే. ఈ తరుణంలో ఒక దేశం మాత్రం ఆ భాషను ఉపయోగించడానికి వీలు లేదంటూ హుకూం జారీ చేసింది. అందుకోసం ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. పొరపాటున కూడా కమ్యూనికేట్ చేసేటప్పుడూ ఇంగ్లీష్ పదాలు దొర్లినా పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తానని కూడా పేర్కొంది. ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్ చేసిన తొలిదేశం కూడా అదే కాబోలు!. వివరాల్లో కెళ్తే.. ఇటాలీ ప్రధాన మంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏఇటాలియన్ అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడూ .. విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ప్రవేశ పెట్టారు. దీనికి ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు. ఆంగ్ల పదాలు లేదా ఆంగోమానియాను లక్ష్యంగా చేసకుని మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఈ ఆంగ్ల భాష ఇటాలియన్ భాషను కించపరుస్తున్నట్లు పేర్కొంది. బ్రిటన్ నిష్రమణతో బ్రెగ్జిట్‌గా పేరుగాంచిన యూరోపియన్ యూనిన్ కారణంగా ఆ పరిస్థితి దారుణంగా దిగజారిందని పేర్కొంది. అంతేగాదు ఆ బిల్లు..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదవిని కలిగి ఉన్నవారెవరైనా వ్రాతపూర్వకంనూ, కమ్యూనికేషన్ పరంగానూ ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఉద్యోగా స్థానాల్లో, వ్యాపార సంబంధ డాక్యుమెంట్లలోనూ, అధికారిక పత్రాలలోనూ కూడా ఆంగ్లంలో పేర్లను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఆఖరికి ఇటాలియన్ భాష రాని విదేశీయులతో కమ్యూనికేట్ చేసే కార్యాలయ్యాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది. ఆర్టికల్ 2 ప్రకారం.. జాతీయ భూభాగంలో ప్రజా వస్తువుల, సేవలు వినియోగం కోసం ఇటాలియన్‌ని ప్రాథమిక భాషగా ఉపయోగించాలిని ఆ ముసాయిదా బిల్లులో స్పష్టం చేసింది. అంతేగాదు దీన్ని అతిక్రమిస్తే రూ. 4 లక్షల నుంచి దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధిస్తాని బిల్లులో పేర్కొంది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చలు జరిపిన తదనంతరం పూర్తి స్తాయిలో అమలు చేయనుంది ఇటలీ. (చదవండి: లొంగిపోనున్న ట్రంప్..ఫుల్ బంధోబస్తుకు ప్లాన్) -
జియో చేతికి యూఎస్ కంపెనీ.. 5జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు మద్దతు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా యూఎస్ కంపెనీ మిమోసా నెట్‌వర్క్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు 6 కోట్ల డాలర్ల(రూ. 492 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కమ్యూనికేషన్ సంబంధ పరికరాలు తయారు చేసే మిమోసా కొనుగోలుతో 5జీ టెలికం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మరింత విస్తరించేందుకు వీలు చిక్కనుంది. అనుబంధ సంస్థ రాడిసిస్ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్ పేర్కొంది. రుణరహిత, క్యాష్ ఫ్రీ ప్రాతిపదికన మిమోసాను సొంతం చేసుకునేందుకు ఎయిర్‌స్పాన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్‌తో 6 కోట్ల డాలర్లకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. మిమోసా వైఫై–5 ఆధారిత పాయింట్ టు మల్టీపాయింట్ ప్రొడక్టులతోపాటు.. ఆధునిక వైఫై 6ఈ టెక్నాలజీలు, సంబంధిత పరికరాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 2018లో మిమోసాను ఎయిర్‌స్పాన్ కొనుగోలు చేసింది. కాగా.. చైనీస్ టెక్నాలజీ నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దూరం జరుగుతున్న నేపథ్యంలో మిమోసా కొనుగోలు జియో ప్లాట్‌ఫామ్స్‌కు కీలకంగా నిలవనుంది. మిమోసాకు జియో ప్రధాన కస్టమర్‌కావడం గమనార్హం! -
ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు
ఒకే దేశం, ఒకే భాష పేరుతో గతంలో హిందీని ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి ఇప్పుడు ప్రాంతీయ భాషా రాగం అందుకున్నారు. భారతీయుల ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అంటున్నారు. ఇది పూర్తిగా గ్రామీణ ప్రజానీకాన్ని వెనుకబాటుతనంలో ఉంచే సిద్ధాంతం. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం అర్థం చేసుకుంది. ఈ అవగాహనతోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాయి. ఇంగ్లిష్ వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ఏపీ ప్రజానీకం చూస్తోంది. అదే రానున్న ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓట్లు తేనుంది. దీన్నొక శక్తిమంతమైన ఆయుధంగా టీఆర్ఎస్ ఇంకా మల్చుకోవాల్సి ఉంది. ఒకే దేశం, ఒకే భాష సూత్రానికి నిరంతర సమర్థకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహరించి ఎక్కువ కాలం కాలేదు. ఆ ఒకే భాషగా హిందీని షా పదేపదే ప్రచారం చేశారు. కానీ అలాంటి ప్రతిపాదన పట్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రతిఘటించడం; ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ కూడా అన్ని భారతీయ భాషలూ సమాన ప్రాధాన్యత కలిగినట్టివే అని ప్రకటించడంతో అమిత్ షా కాస్తా గేర్లు మార్చారు. మోదీ తర్వాత ఆరెస్సెస్, బీజేపీలకు ప్రధాని అభ్యర్థి అమిత్ షాయేనని అన్ని సంకేతాలూ వెలువడుతున్నాయి. భారతీయ ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అనే అభిప్రా యాన్ని ఆయన కలిగివున్నారు. జాతీయ విద్యావిధానం 2020 (ఎన్ఈపీ) రెండో వార్షికోత్సవం సందర్భంగా అమిత్ షా ఆగస్టు 19న ఢిల్లీలో మాట్లాడారు. న్యాయ శాస్త్రం, వైద్యశాస్త్రం, ఇంజినీరింగ్ వంటివాటిని భారతీయ భాషల్లోనే బోధించాలని ఆయన నొక్కి చెప్పారు. ఎవరైనా తమ సొంత భాషలో ఆలోచించినప్పుడే పరిశోధన, అభివృద్ధి సాధ్యపడతాయన్నారు. సొంత భాషలో ఆలోచించకపోవడమే పరిశోధనా రంగంలో భారత్ వెనుకబడి ఉండటానికి ఒక కారణంగా చూపారు.ప్రత్యేకించి కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలమని ఆరెస్సెస్, బీజేపీ కూటమి పెద్ద ఆశలు పెట్టుకుని ఉంది. ఈ కొత్త సిద్ధాంతంతో అమిత్ షా దక్షిణాదిలో కూడా ఆమోద నీయమైన నాయకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యకు సంబంధించిన చైతన్యం గతంలో కంటే ఇప్పుడు దక్షిణాదిలో మరింత ఎక్కువగా విస్తరించింది. అంత ర్జాతీయ ఉపాధి మార్కెట్లలో స్థానం సంపాదించాలని దక్షిణాదిలోని ప్రతి గ్రామమూ ఆకలిగొని ఉంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం కూడా అర్థం చేసుకున్నారు. కానీ ప్రాంతీయభాషా ప్రాతిపదికన ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ వీరిని తమ భాషా రాష్ట్రాన్ని దాటి ముందుకు పోనీయడం లేదు. అదే సమయంలో ఎగువ, మధ్యతరగతి వర్గాలు ఇప్పటికే ప్రాంతీయ భాషా విద్యను దాటి ముందుకెళ్లిపోయాయి. వారిలోని ఈ కొత్త శక్తికీ, అధికార సంపదలకూ ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం విద్యే ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు వీరు ప్రాంతీయ భాషా విద్య వైపు వెనక్కు మళ్లరు. ఈ అవగాహనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రభుత్వరంగంలో ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యవైపు మరలేట్టు చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే, అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మీడియం తిరిగి తెలుగుకు మారుతుందా? అమిత్ షా ఆంతర్యం సరిగ్గా ఇదే మరి. కానీ అదే జరిగితే తెలంగాణలోని అత్యంత వెనుకబడిన గ్రామీణ వర్గాలు దెబ్బతిని పోతాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెలుగుకు మళ్లితే– రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు ఆగిపోవడం కంటే కూడా ఎక్కువ ప్రతికూలతను అది ప్రజల మీద కలిగిస్తుంది. తన కుమారుడైన జయ్ షాను ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివించిన అమిత్ షాకు... తన కార్పొరేట్ స్నేహితు లందరూ సంపన్నుల కోసం ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలను ప్రారంభిస్తున్నారని చక్కగా తెలుసు. అమిత్ షా ప్రాంతీయ భాషా విద్యా అజెండా ఈ సంపన్నుల కోసం ఉద్దేశించింది కాదు. ప్రాంతీయ భాషల్లోనే తమ పిల్లలను చదివిం చాలని గ్రామీణ ప్రజానీకాన్ని కోరడం ద్వారా, భాషా ప్రయోజనాలు ఏవీ పొందలేని చారిత్రక వెనుకబాటుతనంలో వీరిని ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు. నాణ్యమైన వసతులు, బోధనా సిబ్బందితో కూడిన ఇంగ్లిష్ మీడియం చదువు అంతర్జాతీయంగా అనుసంధానం కలిగి ఉండి, నాణ్యమైన జాతి నిర్మాణానికి పెట్టుబడిగా ఉంటుంది. అయితే ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ద్వారా విద్యాపరమైన సమానత్వం సాధించడానికి ఆరెస్సెస్, బీజేపీ కూటమి వ్యతిరేకం. ఇంగ్లిష్‌ను రహస్యంగా ఉపయోగిస్తూ, సంస్కృతం, హిందీని వీరు సైద్ధాంతి కంగా సమర్థిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనం చూస్తున్నట్లుగా ప్రజానీకం అంతర్జాతీయ అనుసంధానం కలిగిన నాణ్యమైన విద్యకు మద్దతు తెలుపుతున్నారు. పరిశోధన, వైద్యం, ఇంజనీరింగ్, తదితర అంశాలను ప్రాంతీయ భాషల్లోనే సాగించాలని అమిత్ షా చెబుతున్న సిద్ధాంతం ఆ వ్యవస్థలో భాగమైన వారికి విధ్వంసకరంగా పరిణమిస్తుంది. తెలంగాణలోని పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగపర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయవలసింది చాలానే ఉన్నప్పటికీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం సైద్ధాంతికంగా చదువులో సమానత్వం వైపు వేసిన తొలి అడుగు. కానీ తాము ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా బీజేపీ విద్యా విధానం ఉందని టీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపున ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమ పాఠశాల విద్యా వ్యవస్థ గురించిన ప్రచారం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలను ఆత్మరక్షణలో పడవేసిందనే చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీని విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయి ప్రచారంగా మలిచారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ, ప్రత్యేకించి ఇంగ్లిష్ వ్యతిరేకి అయిన అమిత్ షాతో, సాధార ణంగా ఆరెస్సెస్, బీజేపీ శక్తులతో పోరాటానికి తగిన శక్తిమంతమైన సైద్ధాంతిక సంక్షేమ పథకంగా దీన్ని టీఆర్ఎస్ పరిగణించడం లేదు. ఇంగ్లిష్ మీడియం విద్యపై ఉన్న అరకొర అవగాహన కారణంగా అతి పెద్ద సంఖ్యలో ఓట్లు రాబట్టే శక్తిగా దాన్ని గుర్తించడం లేదు. దక్షిణాదిలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే... ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య ప్రాధాన్యాన్ని అర్థం చేసు కున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కొంత శాతం మేరకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలు ఉంటుండగా, జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చడానికి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఏపీలోని అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని కూడా వైఎస్ జగన్ సంవత్సరం క్రితం ప్రకటించారు. అమ్మ ఒడి పథకంతో కూడిన ఇంగ్లిష్ విద్య కారణంగా ఏపీలో టీడీపీ సంకటస్థితిలో పడిపోయింది. పిల్లలందరికీ మెరుగైన ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య అనేది ‘ఉచితాల’లో భాగమేనని ఆరోపించడానికి ఎవరూ సాహసించలేరు. పాఠశాల విద్యపై పెట్టే వ్యయాన్ని ‘ఉచితాలు’ అని చెప్పి ఏ కోర్టూ, ఏ శాసన సభ కూడా ఖండించలేవు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య 2024లో భారీ స్థాయిలో ఓట్లను సమీకరించబోతోంది. ప్రధానంగా స్కూల్ విద్యపై వైఎస్ జగన్ రోజువారీ ప్రాతిపదికన చేసిన పోరాటం కారణంగా టీడీపీ, బీజేపీ రెండింటికీ పరాజయాలు ఇప్పటికే నమోదయ్యాయి. ఇంగ్లిష్ విద్య వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ప్రజానీకం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పోరాటమే... తెలంగాణలో ఎలాంటి వ్యతిరేకతా లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని సులభతరం చేసింది. కానీ దీన్ని ఇంకా ఓట్లుగా మల్చుకోవడం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా తన పాఠ శాల విద్యకు సంబంధించి సరైన ప్రచారం చేసుకోగలిగితే, ప్రతి తల్లీ తన పిల్లల శత్రువును ఓడించడానికి పోలింగ్ బూతుకు వెళ్తుంది. ప్రతి గ్రామీణ మహిళా కూడా అమిత్ షా కంటే ఉత్తమమైన జాతీయవాది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఊసులాడే ఫంగస్‌లు
లండన్: భూమి మీద పుట్టిన దాదాపు ప్రతి జీవి ఏదో రూపంలో సాటి జీవులతో సమాచార ప్రసారం చేస్తుంటాయి. మనిషి మాటల ద్వారా భావాన్ని ప్రసారం చేస్తే, జంతువులు పలు శబ్దాల ద్వారా, కదలికల ద్వారా చేస్తుంటాయి. వృక్షాలు రసాయన సంకేతాలతో సంభాషించుకుంటాయి. మరి జీవ పటంలో ఇంకా దిగువకు వెళ్లే కనిపించే శిలీంద్రాల సంగతేంటి? పుట్టగొడుగుల్లాంటి శిలీంద్రాలన్నీ మొద్దబ్బాయిల్లాంటివేనా? లేదా మనకు తెలీని రూపంలో వీటిలో సమాచార ప్రసారం జరుగుతుందా? వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్టు అండ్రూ అడమట్జీ్క చేపట్టిన నూతన పరిశోధన ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తోంది. శిలీంద్రాలు వాటికే సొంతమైన ఎలక్ట్రికల్ భాషలో ఊసులాడుకుంటాయని పరిశోధన సూచిస్తోంది. పుట్టగొడుగులు ఇరుగుపొరుగుతో సంభాషించేందుకు వాక్యాలను కూడా వాడతాయని పేర్కొంది. ప్రతి బహుకణ జీవిలో కూడా సమాచార ప్రసారానికి నాడులు కారణం. ఇవి విడుదల చేసే ఎలక్ట్రిక్ తరంగాల ఆధారంగానే జీవజాలంలో ప్రసారం సాధ్యమవుతోంది. ఫంగస్‌లో కూడా ఇలాంటి నాడులుంటాయి. వీటిని హైఫే అంటారు. ఒక ఫంగల్ కాలనీలోని జీవులన్నింటి హైఫేలన్నీ కలిసి భూమి ఉపరితలం దిగువన ఒక వలలాంటి నిర్మాణం (మైసీలియం)ను ఏర్పాటు చేస్తాయి. ఈ వల ద్వారా మొత్తం కాలనీకి సమాచారం అందుతుంది. ఈ నెట్‌వర్క్‌ను జీవుల్లోని నాడీ వ్యవస్థతో పోల్చవచ్చు. ఇలా కనుగొన్నారు చిన్న చిన్న ఎలక్ట్రోడులను ఉపయోగించి నాలుగు ప్రజాతుల ఫంగస్ మైసీలియంలు విడుదల చేసే విద్యుత్ ప్రేరణలను ఆండ్రూ రికార్డు చేశారు. వీటిని పరిశీలిస్తే ప్రతి ప్రేరణ తరంగధైర్ఘ్యం, తరచుదనం, కాలపరిమితి వేరేగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రేరణల నమూనాలను గణిత సూత్రాల ఆధారంగా విశ్లేషిస్తే అవి మానవ ప్రసంగ నమూనా(ప్యాటర్న్)తో పోలినట్లు గుర్తించారు. ఫంగస్ల భాషలో దాదాపు 50 వరకు పదాలు వివిధ వాక్యాల రూపంలో పేర్చడం గమనించినట్లు ఆండ్రూ చెప్పారు. ఒక్కో ఫంగస్ ప్రజాతిలో ఒక్కో రకమైన భాష వాడుకలో ఉందని, షైజోఫైలమ్ కమ్యూనే అనే ప్రజాతి అత్యంత క్లిష్టమైన భాషను వాడుతోందని తెలిపారు. దగ్గరలోని ఆహార లభ్యత, ప్రమాద హెచ్చరికలు, నష్టం కలిగించే అంశాల గురించి ఇవి మాట్లాడుకుంటాయని అంచనా వేశారు. ఫంగస్‌లు భూమిలోపల అంతర్గత నెట్‌వర్క్‌తో సమాచార ప్రసారం చేస్తాయని గతంలోనే అంచనాలున్నాయి. తాజా పరిశోధనతో ఈ సమాచార ప్రసారం ఆషామాషీగా జరగదని, మానవుల్లో జరిగినంత పకడ్బందీగా జరుగుతుందని తెలిసింది. ఫంగస్ల తెలివితేటలు, చేతనపై మరిన్ని పరిశోధనలకు తాజా సమాచారం ఉపయోగపడనుంది. సో, ఇకపై పుట్టగొడుగులు తినేముందు అవి ఏం చెబుతున్నాయో తెలుసుకోండి! -
మైక్రోసాఫ్ట్‌తో తాన్లా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ సేవలందించే తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారిత వైజ్లీ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ఇది రోజుకు 100 కోట్ల దాకా మెసేజీలను సురక్షితంగా, వేగవంతంగా ప్రాసెస్ చేయగలదని బుధవారం వైజ్లీ ఆవిష్కరించిన సందర్భంగా తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్, సీఈవో డి. ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇది కంపెనీలు, మొబైల్ క్యారియర్స్, ఓటీటీ సంస్థలు, మార్కెటర్లు, పరిశ్రమ నియంత్రణ సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. బీమా, బ్యాంకింగ్ తదితర రంగాల సంస్థలు తమ కస్టమర్లకు పంపే మెసేజీలు, ఓటీపీలు, మెయిల్స్ మొదలైనవి డెలివరీ అయ్యే క్రమంలో వివిధ ప్రక్రియల కారణంగా జాప్యం జరగడం, పూర్తి స్థాయిలో ఎన్క్రిప్షన్ లేకపోవడం వంటి సవాళ్లు ఉంటున్నాయని ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్క్రిప్షన్, డేటా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రారంభం నుంచి చివరి దాకా గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు వైజ్లీ తోడ్పడగలదని ఆయన వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సంబంధిత సాంకేతికతలతో కంపెనీలు సర్వీసుల నాణ్యతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉపయోగపడగలదని పేర్కొన్నారు. క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చెయిన్ ప్రాసెస్‌లకు సంబంధించి వైజ్లీ ఇప్పటికే మూడు పేటెంట్లు దక్కించుకుందని ఉదయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. డేటాకు ప్రైవసీ, భద్రత అత్యంత కీలకమైనవని, వీటికి వైజ్లీ తోడ్పడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు. వైజ్లీలో మార్కెట్ ప్లేస్ విధానం .. ఇప్పటికే ట్రూబ్లాక్ ప్లాట్‌ఫాం ద్వారా దేశీయంగా వివిధ సంస్థలకు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నామని ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడిక వైజ్లీతో ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు అందించనున్నామని ఆయన వివరించారు. దీనిలో ప్రప్రథమంగా మార్కెట్‌ప్లేస్ విధానాన్ని కూడా పొందుపర్చామని పేర్కొన్నారు. టెలికం సంస్థలు తదితర సర్వీస్ ప్రొవైడర్లను తమ అవసరాలకు అనుగుణంగా కంపెనీలు పారదర్శకంగా ఎంపిక చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్ (సీపాస్) విభాగంలో ఇలాంటిది అందించడం ప్రపంచంలోనే ఇదే ప్రథమమని ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. క్లౌడ్ ద్వారా వైజ్లీ ప్లాట్‌ఫాంను అందించడానికి మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. అలాగే మైక్రోసాఫ్ట్ అనుభవం .. దీని రూపకల్పనలో ఉపయోగపడిందని వివరించారు. ఇక, వైజ్లీ విక్రయంలో రెండు సంస్థలు కలిసి పనిచేసేందుకు కూడా భాగస్వామ్యం తోడ్పడగలదన్నారు. 40 బిలియన్ డాలర్లకు గ్లోబల్ సీపాస్ ... ప్రస్తుతం అంతర్జాతీయంగా సీపాస్ వ్యాపార విభాగం సుమారు 20 బిలియన్ డాలర్లుగా ఉందని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. గార్ట్నర్ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపై 40 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొన్నారు. ఇక భారత మార్కెట్ విషయానికొస్తే 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందన్నారు. పలు దిగ్గజ సంస్థలతో పాటు ప్రభుత్వానికి కూడా సర్వీసులు అందిస్తూ దేశీయంగా తాము ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల తర్వాత డిజిటైజేషన్ మరింత వేగవంతమైందన్నారు. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పుంజుకుంటుందని, తద్వారా అవకాశాలు మరింత పెరగగలవని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. -
బీపీవోలో ఏపీ ఫస్ట్
సాక్షి. అమరావతి: ఐటీ రంగానికి సంబంధించి బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీవో)లో రాష్ట్రం దూసుకుపోతోంది. కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రవేశపెట్టిన ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీం (ఐబీపీఎస్) కింద ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక బీపీవో యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఐబీపీఎస్ ద్వారా కేంద్రం 51,297 సీటింగ్ సామర్థ్యాన్ని కేటాయించగా మన రాష్ట్రం ఒక్కటే 14,692 సీట్లను దక్కించుకున్నట్లు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) విశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పీ దూబే తెలిపారు. ఈ స్కీం కింద మొత్తం 56 కంపెనీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేశాయని, ఒక్కో సీటుపై రోజుకు మూడు షిప్టులు చొప్పున దాదాపు 45,000 మందికి ప్రత్యక్షంగా, మరో రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. గత ఏడాది కాలంలో ఈ యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించాయని, ఇప్పటివరకు 9,560 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఇందులో 40 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. రానున్న కాలంలో మహిళా ఉద్యోగులను 52 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఐబీపీఎస్ అంటే..? గ్రామీణ ప్రాంతాల్లో బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ఐబీపీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో కాకుండా చిన్న పట్టణాల్లో ఏర్పాటయ్యే బీపీవో యూనిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీం కింద ఏర్పాటు చేసే ప్రతి సీటుకు గరిష్టంగా రూ.లక్ష ప్రోత్సాహం లభిస్తుంది. అదే మహిళలకు ఉపాధి కల్పిస్తే 5 శాతం, దివ్యాంగులకు మరో 5 శాతం అదనంగా ఆర్థిక ప్రయోజనం కల్పించనున్నారు. ఇందులో భాగంగా విశాఖలో అత్యధికంగా బీపీవో యూనిట్లు ఏర్పాటు కాగా భీమవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి పట్టణాలతో పాటు ప్రకాశం జిల్లా కందుకూరులో కూడా యూనిట్లు ఏర్పాటైనట్లు దూబే వివరించారు. రాష్ట్రానికి మరిన్ని బీపీవో కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం అను సరిస్తున్న పారిశ్రా మిక ప్రోత్సాహక వాతావరణంతో ఏపీలో మరిన్ని పెట్టు బడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు దూబే తెలిపారు. కరోనా సమ యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్ర మల పట్ల అనుసరించిన విధానం పారిశ్రామి క వేత్తల్లో నమ్మకాన్ని పెంచిందని, దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పలు బీపీవో కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నా యన్నా రు. ఇదే సమయంలో ఐబీపీఎస్ స్కీం కింద మరో 50 వేల సీట్లను కేటాయిం చే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఇది కూడా అమల్లోకి వస్తే రాష్ట్రానికి అత్యధికంగా బీపీవో కంపెనీలు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాలు దక్కించుకున్న బీపీవో సీట్లు -
సమర్థ భావ ప్రసారం.. ఇప్పుడు ప్రాణావసరం!
అర్థవంతమైన కమ్యూనికేషన్ మంచి కాఫీ లాంటిది. ఎందుకంటే, ఆ తర్వాత అది నిద్రపోనివ్వదని పాశ్చాత్యుడన్నా, నిత్య సంచలనశీలికి నిద్రలో కూడా నిద్రపట్టదని మన కవులన్నా అవి ప్రజాభిప్రాయానికి మూలమైన కమ్యూనికేషన్ ప్రభావానికి దర్పణం పట్టే మాటలే. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి అభినందపూర్వకంగా కొట్టిన చప్పట్లు, సకారాత్మక భావోద్వేగాలు వెల్లివిరియడానికి వెలిగించిన దీపాలు ఒక వ్యక్తి మదిలో ఆలోచనగా అంకురించి, చిగురించి, మొగ్గతొడిగి, వికసించి అద్భుతమైన భావప్రసారం ద్వారా కోట్లమంది భారతీయులను కర్తవ్యోన్ముఖులను చేశాయి. యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా వైరస్ వల్ల మానవాళి ప్రాణభయంతో బిక్కుబిక్కున బతుకుతున్న సమయాన ప్రభావశీలమైన ’కమ్యూనికేషన్’ గురించి మాట్లాడుకోవడం సముచితం. విద్యావిషయకంగా చూస్తే విస్తృతార్థంలో కమ్యూనికేషన్ నాలుగు రకాలుగా ఉంటుంది. అవి: ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ (వ్యక్తి మనసు లేదా మస్తిష్కం లోలోపల జరిగేది), ఇంటర్ పర్సనల్ (ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది), గ్రూప్ (ఒక సమూహపు సభ్యుల మధ్య), మాస్ (జనబాహుళ్యానికి ఉద్దేశించినది). కరోనా కరాళనృత్యం నేపథ్యంలో, ఈ నాలుగు రకాల కమ్యూనికేషన్ ప్రక్రియలను వినియోగించుకోవడం ద్వారా మన శారీ రక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు మన కుటుంబం, సమాజం భయాందోళనల నుంచి బైటపడి మహమ్మారిపై పోరాటంలో విజ యం సాధించడానికి ఉపకరించవచ్చు. ఈ లాక్డౌన్ తెచ్చిన ఖాళీ సమయంలో ఎప్పుడేమి ఉపద్రవం సృష్టిస్తుందో తెలియని మందులేని కరోనా, ధనిక దేశాల్లో సైతం పిట్టల్లా రాలుతున్న జనం, మనదగ్గరా పెరుగుతున్న కేసుల సంఖ్య అందరినీ లోలోపల భయంకరంగా వణికిస్తున్నాయి. అంబులెన్స్ వచ్చినట్లు, ప్రభుత్వం నిర్దేశించిన ఆసుపత్రికి తీసుకుపోయినట్లు, అయినవారికి దూరంగా 14 రోజులు ఆసుపత్రిలో ఉన్నట్లు, వైద్యుల ప్రయత్నాలు విఫలమయినట్లు, ఒకరిద్దరి మధ్యనే అంటరానివాడిగా అంతిమ సంస్కారం జరిగినట్లు...వివిధ భావనలు మస్తిష్కంలో రీలులా తిరగని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చావు భయం అధికంగా ఉన్నవారికి కరోనా లాంటి పరిస్థితులు మరీ ప్రమాదకరంగా పరిణమించి లేనిపోని రుగ్మతలకు దారితీస్తాయి. అందుకే, ఇలాంటి సమయాల్లో ఎక్కువసేపు ఒంటరిగా ఉండకపోవడం మంచిది. పుస్తక పఠనం, సంగీతం, నాట్యం వంటి ఇష్టమొచ్చిన వ్యాపకంపై దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలి. విపరీతమైన నెగెటివ్ వార్తల ప్రభావంతో మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటే...తమ అత్యంత సన్నిహితులతో వాటిని పంచుకుని వారి నుంచి ఊరట పొందవచ్చు. ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ, శూన్యంలోకి చూస్తూ గడపడాన్ని ఈ సమయంలో తేలిగ్గా తీసుకోకూడదని నిపుణులు సూచి స్తున్నారు. ఒక వ్యక్తి దగ్గర మొదలైన సమాచారం ఒకరి నుంచి మరొకరికి, అక్కడినుంచి మరొకరికి వెళ్ళేసరికి భావ, అర్థ, తాత్పర్యాలు మార్చుకుని వేరే రూపు సంతరించుకుంటుందని కమ్యూనికేషన్ పరి శోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా, చాట్ చేసుకున్నా అప్రయత్నంగా కరోనా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వస్తున్న భయానక సమాచారంతో ఉన్న మనం అప్రయత్నంగా ఆ సమాచారం మన మిత్రుడితో, సహచరుడితో పంచుకోవాలనుకుంటాం. మనవల్ల వేరే వాడిలో నిస్పృహ పెరగకూడదన్న నియమం పెట్టుకుంటే ఏ చింతా ఉండదు. కరోనా వ్యాప్తికి ఒక మతాన్ని తప్పుపట్టడం, వదంతులు వ్యాపింపజేయడం వంటి విద్వేషకారక భావాలను టెలిఫోన్ లేదా సోషల్ మీడియా మాధ్యమంగా సంభాషణ చేసేవారు విశాల సమాజ హితం దృష్ట్యా మొగ్గలోనే తుంచివేయాలి. గ్రూప్ కమ్యూనికేషన్‌తోనే విప్లవాలు వచ్చాయి. సరైన సమయంలో సరైన పదాలతో మాట్లాడే శక్తిసామర్థ్యాలు ఉన్నవారు సమాజంలోని వ్యక్తులను శక్తులుగా మలిచారు, కర్తవ్యోన్ముఖులను చేశారు. ఇప్పుడు వాట్సాప్, పేస్బుక్ వంటి మాధ్యమాల వల్ల గ్రూపులు కట్టడం తేలికైపోయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, కాలేజ్‌మేట్స్, కొలీగ్స్‌తో పాటు ఒకే అభిరుచి ఉన్నవారు సైతం ఒక గ్రూపుగా ఏర్పడి నిరంతరాయంగా భావ విని మయం సాగిస్తున్నారు. గ్రూప్ మొత్తానికి ఉత్తేజపూరితమైన, ఉత్సాహకారకమైన, ఉల్లాసభరితమైన సమాచారం పంచుకోవడం అభిలషణీయం. సకారాత్మక ఒక ఆలోచన లేదా ఒక సృజనాత్మక కథనం మొత్తం గ్రూపు సభ్యుల మనసుకు ఊరట కలిగించవచ్చు. పెను విషాదాన్ని మానవాళి మౌనంగా భరిస్తున్న దుర్భర రోజులివి. ఈ కాలంలో తిమిర సమానమైన నిరాశానిస్పృహలను పారదోలి విషాదంలో మునిగి ఉన్న ప్రజలకు వెలుగు దివ్వెలు చూపాలనే సత్సంకల్పం ముఖ్యం. అందుకే తెలం గాణ ముఖ్యమంత్రి ప్రజల కోసం రచనలు చేయండని కవిలోకాన్ని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఇప్పటికే పత్రికల్లో, సోషల్ మీడియా వేదికల్లో అనేక కవితలు జనం ముంగిటికి వచ్చాయి. కళాకారులు రాగయుక్తంగా ప్రజలకు బోధలు చేస్తూ, సంఘ సేవకులను ప్రస్తుతిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తూ చైతన్యపరుస్తున్నారు. ఈ కరోనా కాలంలో మంచి రచనలు జన బాహుళ్యానికి ఉత్సాహం, ఉత్తేజం ఇస్తాయి. ఈ వైరస్ మిగిల్చే విషాదం ఇంకా కొన్ని నెలలు ఉంటుంది. మంచి సాహిత్యం అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క మంచి మాట వెయ్యిన్నొక్క మస్తిష్కాలకు ఉత్ప్రేరకమని అంటారు. కరోనా పీడిత పలు దేశాల్లో ప్రజల మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిని, భీతావహులైన సున్నిత మనస్కులను ఆత్మహత్యలవైపు పురికొల్పుతున్నదని వస్తున్న బాధాకర వార్తల నేపథ్యంలో విద్యావంతుడైన ప్రతి వ్యక్తీ బాధ్యతతో ఈ నాలుగు రకాల భావ ప్రసరణ విధానాలను సమాజ సాంత్వన సాధనాలుగా వాడుకోవాలి. బాధ్యతాయుతమైన భావ ప్రసారం....ఇప్పుడు తక్షణావసరమే కాదు ప్రాణావసరం కూడా. డాక్టర్ ఎస్.రాము వ్యాసకర్త అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో శిక్షకుడు -
జమ్ము కశ్మీర్ : మొబైల్ సేవలు షురూ..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నియంత్రణలు, ఉద్రిక్తతల నడుమ నలిగిన కశ్మీర్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కమ్యూనికేషన్స్ వ్యవస్థపై ఇప్పటివరకూ ఆంక్షలు విధించగా గురువారం 5 జమ్ము జిల్లాల్లో మొబైల్ సేవలను పునరుద్ధరించారు. స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్ధలు తెరుచుకున్నా విద్యార్ధుల హాజరు సంఖ్య పరిమితంగా ఉంది. మరోవైపు సుప్రీం కోర్టు అనుమతించడంతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శ్రీనగర్‌ను సందర్శించనున్నారు. ఏచూరి తన పర్యటనలో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యే యూసఫ్ తరిగామితో భేటీ కానున్నారు. కాగా, జమ్ము కశ్మీర్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందాన్ని (జీఓఎం) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జీఓఎంలో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, తవర్ చంద్ గెహ్లోత్, జితేందర్ సింగ్, నరేంద్ తోమర్, దర్మేంద్ర ప్రధాన్‌లు సభ్యులుగా ఉన్నారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జీఓఎం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనుంది. -
కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్‌కు 30 ఏళ్ల చరిత్ర ఉందని ఆ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ వినోద్ పావరాల తెలిపారు. ఇండియా టుడే ర్యాంకింగ్‌లో హెచ్‌సీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్‌కు దేశంలోనే మూడో ర్యాంక్ వచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి పలు అంశాలు వెల్లడించారు. 1988లో ఆబిడ్స్‌లోని గోల్డెన్ «త్రెషోల్డ్లో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని సరోజినీనాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్‌గా నామకరణం చేశారన్నారు. ఇటీవలే 30 ఏళ్లు పూర్తి కావడం జరిగిందన్నారు. 2002లో గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్‌లోకి మారడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం పూర్తిస్థాయి సొంతభవనం ల్యాటరైట్తో రాతితో ఆకట్టుకునేలా భవనాన్ని డిజైన్ చేయడం జరిగిందన్నారు. సమష్టి కృషితోనే ఈ ర్యాంకింగ్ సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడి కోర్సులకు పోటీ ఎక్కువ... ప్రారంభంలో మా డిపార్ట్మెంట్లో మాస్టర్ డిగ్రీలో కేవలం 15 నుంచి 20 మందిని మాత్రమే తీసుకొనేవాళ్లం. ప్రస్తుతం 40 మందిని వరకూ తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ కూడా 50 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి రిజర్వు చేశారని, మిగతా 50 శాతం ఓపెన్‌లో ఉంటాయన్నారు. ఈ ఏడాది నుంచి 10 సీట్లు ఈబీసీలకు కేటాయించామన్నారు. కానీ ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ప్రస్తుత ఏడాది నాలుగు సీట్లు (44) సీట్లు చేయడం జరిగిందని, వచ్చే ఏడాది మరో ఆరు సీట్లు పెంచి మొత్తం 50 సీట్లుగా మారుస్తామన్నారు. ప్రస్తుత ఏడాది 40 సీట్లకు 900 పైచిలుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రవేశపరీక్ష నిర్వహించి అందులో 1:4 కింద ఇంటర్వ్యూకు పిలిచి 40 మందిని ఎంపిక చేస్తామన్నారు. అదే తరహాలో ప్రస్తుతం ఉన్న నాలుగు పీహెచ్డీ కోర్సులకు 160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నార చెప్పారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటిని వారిలో 1:4 కింద ఇంటర్వ్యూకు ఎంపిక చేసి అందులో నలుగురికి పీహెచ్‌డీలో సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదట్లో టెలివిజన్ ప్రొడక్షన్ కోర్సును ప్రారంభించామని, ఆతర్వాత ప్రింట్ జర్నలిజమ్/న్యూ మీడియా, కమ్యూనికేషన్ మీడియా స్టడీ వంటి కోర్సులు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడి కోర్సులు పూర్తి చేసినవారికి స్థానిక, జాతీయ స్థాయి చానళ్ళు, పేపర్లు, ఇతర వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి కోర్సులకు ప్రాధాన్యత పెరగడంతోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయన్నారు. పూర్తి స్థాయి మౌలిక వసతులు హెచ్‌సీయూలోని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయి మౌలిక వసతులున్నాయన్నారు. టీవీ స్టూడియో, కమ్యూనిటీ రేడియోస్టేషన్ ‘బోల్ హైదరాబాద్’, మల్టీ మీడియా ల్యాబ్ ఉన్నాయని, ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. ఫ్యాకల్టీ ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి తరగతులు నిర్వహించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 11 మంది ఎంతో అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ప్రతినిధులున్నారన్నారు. బోల్ హైదరాబాద్ 90.4 ఎఫ్ఎం రేడియో హెచ్‌సీయూ క్యాంపస్‌కు చుట్టూరా 15 నుంచి 20 కి.మీ. దూరం వరకు వస్తుందన్నారు. -
ఎవరు టాపర్లో తెలుసుకోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ పౌరల సామాజిక మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ‘సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్’ను సుప్రీం కోర్టు అభ్యంతరాల కారణంగా ఆగస్టు మూడవ తేదీన విరమించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎంతో మంది భారతీయుల సామాజిక ఖాతాలు ప్రభుత్వం నిఘా నేత్రంలో ఉన్నాయనే విషయం ఎందరికి తెలుసు? ఆ నిఘా నేత్రం పేరు ‘అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఫర్ సోషల్ మీడియా అనలిటిక్స్ (ఏఏఎస్‌ఎంఏ)’. ఈ టూల్‌ను కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ నిధులతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ 2013–2014లో రూపొందించింది. ఈ ఆస్మా టూల్‌ను ఎలాంటి ప్రచారం కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం 2017, ఏప్రిల్ నెల నుంచి దేశంలోని 40 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలోగా మరో 75 ప్రభుత్వ సంస్థల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని వ్యూహాత్మక ప్రాజెక్టుగా, వ్యూహాత్మక పురోగతిని పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేశామని కేంద్రం పేర్కొన్నట్లు ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ తన 2016–2017 వార్షిక నివేదకలో పేర్కొంది. ఆస్మాపై కేంద్రంలోని మంత్రి, కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయని, ఈ టూల్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీన్ని తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగిస్తున్న కొన్ని ఏజెన్సీలు లిఖిత పూర్వకంగా కూడా కేంద్రానికి తెలిపాయని ఆ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఆస్మాను ఏ ప్రభుత్వ సంస్థలు వాడుతున్నాయో, ఎందుకోసం వాడుతున్నాయో, ఏ ఏజెన్సీలు లిఖితపూర్వకంగా సంతృప్తి వ్యక్తం చేశాయో మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ ఆస్మాను ఇంటెలిజెన్సీ, భద్రతా విభాగాలకే పరిమితం చేశాయా, లేదా ? అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఆస్మా గురించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దీన్ని ఇన్స్టాల్ చేసినట్లయితే 24 గంటలపాటు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఫ్లికర్, గూగుల్ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగించే ఖాతాదారులు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే సమాచారాన్ని విశ్లేషించవచ్చు. సోషల్ మీడియా ప్రొఫైళ్లను, వారి పోస్టులను వీక్షించవచ్చు. వారి పోస్టింగులను సానుకూలం లేదా ప్రతికూలం అంటూ వర్గీకరణ కూడా చేయవచ్చు. అంటే ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో విశ్లేషించవచ్చు. ఏ సోషల్ మీడియాలో ఎవరు టాపర్లో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలోని పోలీసు విభాగంలో నేరస్థులపై నిఘాను కొనసాగించేందుకు ఓ సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలంటూ ‘నేషనల్ పోలీసు మిషన్’ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆస్మాను పోలీసు విభాగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు అనధికారికంగా తెల్సింది. ఎందుకంటే నేరస్థులెవరో, నేరస్థులు ఎవరుకాదో తెలుసుకోవడానికే కాకుండా ఎవరు నేర స్వభావులు ఎవరో ముందుగానే తెలుసుకొని వారిపై నిఘా కొనసాగించడం ద్వారా నేరం చేయకుండా వారిని నియంత్రించవచ్చన వాదన కూడా కొంత మంది పోలీసు అధికారుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ టూల్‌ను సైనిక బలగాలు కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. నేరస్థుల కదలికలను తెలుసుకునేందుకు వారి ఫోన్లపై నిఘా పెట్టడమన్నది పోలీసు విభాగంలో ఎప్పటి నుంచో కొనసాగుతోందని, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరిపై నిఘా పెట్టడం మంచిది కాదని ఉత్తరప్రదేశ్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్‌గా, సరిహద్దు భద్రతా దళానికి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ప్రకాష్ సింగ్ అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలనలో నిఘా అవసరమంటే ఆలోచించవచ్చని, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే అవకాశం ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిఘా అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలు పౌరుల సోషల్ మీడియా డేటాను పెద్ద ఎత్తున సేకరిస్తూ విశ్లేషిస్తుందంటే అది కచ్చితంగా పౌరులపై నిఘా కొనసాగించడమేనని ‘గ్లోబల్ డిజిటల్ రైట్స్’లో పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామన్ జిత్ సింగ్ చిమా వ్యాఖ్యానించారు. అందరికి అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషిస్తే పర్వాలేదుగానీ, వ్యక్తిగతమైన డేటాను విశ్లేషించడమంటే నేరమే అవుతుందని ఆయన అన్నారు. ఆస్మా టూల్ గురించి అన్నింటికన్నా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పారదర్శకత లేకపోవడమని ‘సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద పరిశోధనా సంస్థకు చెందిన అంబర్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ టూల్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో, ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియదు. ప్రతి వ్యక్తి సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా కొనసాగించడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లోని రాజకీయ కన్సల్టెంట్ సంస్థ ‘కేంబ్రిడ్జి అనలిటికా’ ఫేస్బుక్ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆస్మా లాంటి నిఘా టూల్స్‌పై ఆందోళన పెరిగింది. అన్నింటా ప్రచారానికి ముందుండే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ టూల్‌ను గుట్టుగా అమలు చేస్తుందంటే రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికేనని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కమ్యూనికేషన్ కోసం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యం, కార్మికులకు మధ్య సరైన కమ్యూనికేషన్ కోసం ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలు, గనుల్లో ఉత్పత్తి లక్ష్యాలు, సాధించలేక పోవడానికి గల కారణాలు, ఓపెన్‌కాస్ట్(ఓసీ) గనుల యంత్రాల పనితీరు వంటివాటిపై కార్మికులకు వివరించాలని నిర్ణయించారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా భారీ కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు. సదస్సులు, సమావేశాలకు ఐఈడీ విభాగం ఏరియా జనరల్ మేనేజర్లు సారథ్యం వహించనున్నారు. సింగరేణిలో మొత్తం 19 ఓసీ గనులు, 29 భూగర్భ గనులు, వర్క్‌షాపులు, తదితర విభాగాల నుంచి 54 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి ఆర్థిక స్థితి, ప్రణాళికలు, ఉత్పత్తి వంటి విషయాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అనంతరం ఆయా అంశాలపై కార్మికుల అభిప్రాయాలు సేకరించనున్నారు. కార్మికుల ఇబ్బందులను తొలగించేలా వారి నుంచి సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు. గతంలో ఇలాంటి సమావేశాల్లో కార్మికుల సలహాలు, సూచనలపై శ్రీధర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గనుల్లో క్యాంటీన్ల పరిశీలన, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో దీన్ని భారీ పరస్పర ప్రయోజనకర కమ్యూనికేషన్స్ ప్రక్రియగా సీఎండీ శ్రీధర్ భావించి ఏటా సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. యంత్రాల వినియోగం, గనుల్లో నష్ట నివారణ చర్యలు వంటి అంశాలను పొందుపరిచిన సీఎండీ లేఖను ఆదివారం నుంచి అన్ని ఏరియాల్లో పంపిణీ చేయనున్నారు. టీంలు సంసిద్ధం ప్రతి ఏరియాలో ఈ సమావేశాల కోసం ఏరియా జీఎం అధ్యక్షతన పర్సనల్, ఫైనాన్స్, ఐఈడీ, సేఫ్టీ అధికారులతో కూడిన మల్టీ డిపార్ట్మెంట్ టీంలను సిద్ధం చేశారు. సమావేశాలు, సదస్సుల్లో కార్మికులకు అర్థమయ్యే విధంగా వివరాలను వివరిస్తారు. మొత్తం 250కిపైగా సమావేశాలు నిర్వహించి సింగరేణిలోని ప్రతి కార్మికుడికి సందేశం చేరేలా ఏర్పాటు చేశారు. -
రష్యా ఆ పనిచేస్తే! భయంతో వణుకుతున్న బ్రిటన్!!
లండన్ : కమ్యూనిస్ట్ దేశమైన రష్యాను తలుచుకుని బ్రిటన్ భయపడుతోంది. ప్రధానంగా సముద్ర జలాల్లో ఉన్న కేబుల్స్‌కు రష్యా ఎక్కడ సమస్యలు తీసుకువస్తుందన్న భయంలో బ్రిటన్ ఆర్మీ ఉంది. సముద్ర జలాల్లోరి కేబుల్స్ రష్యా తెంచేస్తే.. బ్రిటన్ అత్యంత తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని బ్రిటన్ ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ స్టువర్ట్ పీచ్ ఆందోళన వ్యక్తం చేశారు. అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. రష్యా ప్రపంచంపై సమాచార యుద్ధానికి దిగే అవకాశం ఉందని.. దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. రష్యా నేవీ పూర్తిస్థాయిలో ఆధునీకరించడం ప్రమాద సంకేతాలను పంపుతోందని ఆయన అన్నారు. ప్రధానంగా న్యూక్లియర్, సంప్రదాయ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్స్ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో సమాచార వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయడం కూడా యుద్ధంలో భాగమవుతుందని ఆయన చెప్పారు. -
కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు స్క్రీనింగ్ టెస్టు
– అత్యాధునిక టెక్నాలజీతో దేహదారుఢ్య ఎత్తు, ఛాతీ కొలతలు సేకరణ – ఆర్ఎఫ్ఐడీ బార్‌కోడింగ్ ద్వారా పరుగు సమయం లెక్కింపు – బయోమెట్రిక్ విధానంతో అభ్యర్థుల ఫొటో, వేలిముద్రల సేకరణ – ఒరిజినల్ సర్టిఫికెట్ లేని 172 మంది అభ్యర్థులు వెనక్కు – మొదటిరోజు 590 మంది హాజరు... 362 మంది ఎంపిక కర్నూలు : పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో రాష్ట్రంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ కొలతలను గతంలో టేపు ఆధారంగా పోలీసు సిబ్బంది కొలిచేవారు. ఇందులో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈసారి కంప్యూటర్ సాయంతో ఎత్తు, ఛాతీ కొలతలను తీసుకున్నారు. ఎత్తు కొలిచే పరికరం ముందు నిలబడగానే కంప్యూటర్లో ఆటోమేటిక్‌గా ఎత్తు, బరువు నమోదవుతుంది. అభ్యర్థి చెస్ట్‌కు మిషన్‌తో అనుసంధానమైన టేపును అమర్చగానే ఆటోమేటిక్‌గా ఛాతీ కొలతలను కంప్యూటర్లో అప్లోడ్ చేస్తుంది. ఆరు జిల్లాల అభ్యర్థులకు ఏపీఎస్పీ మైదానంలోనే... పోలీసు కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్ల భర్తీకి (డ్రైవర్, మెకానిక్) ప్రభుత్వం అనుమతించడంతో స్థానిక ఏపీఎస్పీ మైదానంలో సోమవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి అర్బన్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఆరు జిల్లాలకు సంబంధించిన 23,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుళ్ల భర్తీ కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికృష్ణను ప్రభుత్వం చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించింది. ఆయన పర్యవేక్షణలో మొదటిరోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వచ్చే నెల 3వ తేదీ వరకు రోజుకు వెయ్యి మంది అభ్యర్థులను రప్పించి సర్టిఫికెట్ల పరిశీలన ఛాతీ, ఎత్తు కొలతలతో పాటు 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు. మొదటిరోజు 362 మంది ఎంపిక... మొదటి రోజు వెయ్యి మందిని దేహదారుఢ్య పరీక్షలకు ఆహ్వానించగా 590 మంది హాజరయ్యారు. ఏపీఎస్పీ పటాలం ప్రధాన గేటు వద్దనే అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను పరిశీలించి వారికి లోపలికి అనుమతించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం బరువు, ఎత్తు, ఛాతీ కొలతలను శారీరక సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ స్వయంగా దగ్గరుండి ఈ పరీక్షలను పర్యవేక్షించారు. ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా(ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్) పరీక్షలు నిర్వహించారు. అందులో బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగుపందెం నిర్వహించారు. పరుగుపందెం ఇలా... దేహదారుఢ్య పరీక్ష ల్లో ఎంపికైన అభ్యర్థులను బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ డివైజెస్(ఆర్ఎఫ్ఐడీ) ద్వారా ట్రాక్ వెంట అభ్యర్థులు పరిగెత్తేటప్పుడు ఎంత సమయంలో ఎన్ని రౌండ్లు పూర్తి చేశారన్నది బార్ కోడింగ్ ద్వారా అభ్యర్థుల సమయాన్ని లెక్కిస్తున్నారు. బార్కోడ్ కలిగిన నంబర్ ప్లేట్‌ను అభ్యర్థి ఛాతీకి తగిలిస్తారు. అందులో అమర్చిన సెన్సార్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. అభ్యర్థి పది నిముషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగు పూర్తి చేయాలి. పది నిముషాలకు మించి ఒక సెకండ్ దాటినా ఫెయిల్ అయినట్లే. సకాలంలో పరిగెత్తి విజయం సాధించిన అభ్యర్థుల జాబితా కంప్యూటర్ ద్వారా వెంటనే బయటకు వస్తుంది. మొదటిరోజు 362 మంది స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించారు. ప్రతిరోజు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఏర్పాట్లలో అసౌకర్యం, విద్యుత్ సరఫరాల అంతరాయం నేపథ్యంలో మొదటిరోజు ఉదయం 7:30 గంటలకు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాని 172 మంది అభ్యర్థులను క్రీడామైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీల(గజిటెడ్ సంతకంతో)తో అభ్యర్థులు హాజరుకావాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
పన్ను సమాచార మార్పిడికి భారత్ ఓకే
బీజింగ్: ఇతర దేశాలతో పన్ను సంబంధిత అంశాల సమాచార మార్పిడి కోసం భారత్.. ‘మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్’పై సంతకం చేసింది. చైనా, ఇజ్రాయెల్, కెనడా, ఐలాండ్, న్యూజిలాండ్ దేశాలు కూడా ఒప్పందంపై సంతకాలు చేసినవాటిలో ఉన్నాయి. ఇక్కడ జరుగుతోన్న పదవ ఫోరమ్ ఆన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) సదస్సులో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఒప్పందంలో భాగస్వాములైన దేశాలు వాటి వాటి పన్ను నివేదికలను పరస్పరం ఒకదానితో మరొకటి మార్చుకోవచ్చని ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఓఈసీడీ) తెలిపింది. ఆయా దేశాలు పన్ను వ్యవస్థ మెరుగుదలకు పర స్పరం సహకరించుకోవచ్చని పేర్కొంది. -
ప్రణాళికా బద్ధంగా నడుచుకోవాలి
2016 వార్షిక ఫలాలు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ప్రేమికులు లేదా దంపతుల మధ్య అన్యోన్యత కుదురుతుంది. ముందుకు దూసుకెళతారు. శక్తిసామర్థ్యాలను పుంజుకుంటారు. మీ మనసు చెప్పినట్లుగా నడుచుకుంటారు. సంప్రదాయ విలువలవైపు మొగ్గు చూపుతారు. ఔదార్యాన్ని అలవరచుకుంటారు. విజయాలు వరిస్తాయి. అయితే మీ విజయంలో ప్రేమ, కమ్యూనికేషన్లదే కీలక పాత్ర అని గుర్తించండి. భాగస్వామ్య వ్యవహారాలు మెరుగుపడతాయి. వివాహం లేదా నిశ్చితార్థం జరగవచ్చు. ప్రేమ ఫలిస్తుంది. బాస్‌ని మంచి చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తొందరగా ఎడ్జస్ట్ అయ్యే ధోరణి మీకు మంచి చేస్తుంది. ఆగస్ట్,సెప్టెంబర్, అక్టోబర్లలో పెద్ద పెట్టుబడులు, ముఖ్యనిర్ణయాలు వద్దు. లక్కీ కలర్: గ్రీన్; లక్కీ నంబర్:8 టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఈ సంవత్సరం మీకెంతో అదృష్టాన్నిస్తుంది. అయితే కీలకనిర్ణయాలలో తొందరవద్దు. ఆచితూచి ఆలోచించడం అవసరం. బంధుమిత్రులతో ఉన్న మనస్పర్థలను పరిష్కరించుకోవడం మంచిది. గుడ్డిగా మనసిచ్చేయడం మంచిది కాదు. ప్రేమ వ్యవహారంలో నిదానించడమే మేలు. పత్రాలు రాసుకోవడమంటే మీకు ముందు నుంచి ఉన్న బెరుకు లేదా బద్ధకం వల్ల మీరు పెద్ద మూల్యాన్నే చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. జనవరి మీకు అదృష్టాన్నిస్తుంది. మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్లలో కీలక నిర్ణయాలు వద్దు. మే, ఆగస్ట్ ప్రోత్సాహకరంగా ఉంటాయి. పెళ్లి ప్రతిపాదనల్లో తొందరపాటు వద్దు. కలిసొచ్చే రంగు: పర్పుల్; అదృష్ట సంఖ్య: 10 జెమిని (మే 21-జూన్ 21) ఈ సంవత్సరం మీ జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. మీ కలలన్నీ నెరవేరతాయి. మీ నమ్మకాలు, నిర్ణయాల విషయంలో స్థిరంగా ఉండండి. జీవితంలో కొత్త మలుపులు సంభవించవచ్చు. మీ ప్రేమ ఫలిస్తుంది. వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిమ్మల్ని సదా అంటి పెట్టుకుని ఉండే కొందరు హితుల మూలంగా మీరు ప్రమాదంలో పడకుండా తప్పించుకోగలుగుతారు. మేలో మీకు ఫారిన్ చాన్స్ ఉంది. జనవరి నుంచి జూన్ వరకు, నవంబర్, డిసెంబర్ నెలలు మీకు మంచివి. జులై నుంచి అక్టోబర్ వరకు కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. ఆయా నెలల్లో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. లక్కీ కలర్: ఎల్లో; లక్కీ నంబర్: 7. క్యాన్సర్ (జూన్22-జూలై 23) కొత్తసంవత్సరం ప్రజాసంబంధాలు పెరగడంలోనూ, గుర్తింపును తీసుకు రావడంలోనూ సాయం చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవకాశాలను జారవిడుచుకోవద్దు. మీరు రచయితలయితే మీ రచనల గురించి బ్లాగులో పెట్టుకోండి. పాకశాస్త్ర ప్రవీణులైతే మీరు చేసిన కొత్త వంటకాలను యూ ట్యూబులో అప్లోడ్ చేయడం, విదేశీయానం చేసే వారయితే ప్రయాణంలో పాటించవలసిన మెలకువల వంటివి సామాజిక మీడియాతో షేర్ చేసుకోండి. లవ్ లైఫ్‌లో కొత్తదనాన్ని నింపుకోండి. భార్యతో అన్యోన్యతను, తలిదండ్రులతో ప్రేమానుబంధాలను కాపాడుకోండి. జనవరిలో కెరీర్ బాగుంటుంది. మే, జూన్‌లల్లో కీలక నిర్ణయాలు వద్దు. లక్కీ కలర్: క్రీమ్; లక్కీ నంబర్: 1 లియో (జూలై 24-ఆగస్టు 23) నూత్న సంవత్సరం అదృష్టకరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోండి. పనిని శ్రద్ధతో చేయండి. ఈ సంవత్సరం మీ ముందు కొత్త సవాళ్లుండవచ్చు. కొన్ని సందర్భాల్లో సందిగ్ధావస్థలో కూరుకుపోవచ్చు. అయితే తొట్రుపడకండా జాగ్రత్తగా పని చేసుకుపోండి. నిధుల దుర్వినియోగానికి, మోసపు పనులకు పాల్పడటానికి మీకు అవకాశాలున్నప్పటికీ మీ నిజాయితీని, మీకున్న మంచి పేరును నిలుపుకోండి. అవిశ్రాంతంగా పని చేయాల్సి వస్తుంది. భయపడకండి. తగ్గ ఫలితం కూడా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరిలో కీలక నిర్ణయాలు వద్దు. ఏప్రిల్ వరకు ఆన్లైన్ వ్యవహారాలకు దూరంగా ఉండండి. షేర్‌మార్కెట్ జోలికే వెళ్లవద్దు. లక్కీ కలర్: ఆరంజ్; లక్కీ నంబర్: 5 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. భయాందోళనలు విడిచిపెట్టండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మీ వల్ల బాగా లబ్ధిపొందుతారు. రిస్క్‌తో కూడుకున్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. డబ్బు, నగలు, బంగారం కన్నా, అవసరంలో ఆదుకోగలిగే ఆప్తులు మాత్రమే నిశ్చింతని ఇవ్వగలరని గుర్తుంచుకోండి. మీ సహోద్యోగులు లేదా కిందివాళ్లు చేసిన పని నచ్చనప్పుడు నేర్పుగా తెలియజెప్పండి. కంపెనీ మీకు కొత్త కారు ఆఫర్ చేస్తుంది. కెరీర్‌పరంగా దూసుకుపోతారు. మేలో స్పెక్యులేషన్‌కి దూరంగా ఉండండి. మార్చి, ఏప్రిల్ ప్రోత్సాహకరంమైనవి. లక్కీ కలర్: సముద్రపు నురగ రంగు; లక్కీ నంబర్: 2 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ప్రశాంతంగా జీవించడం ఎలాగో ఈ సంవత్సరం తెలుసుకుంటారు. వచ్చిన దాంతో సంతృప్తిని, సంతోషాన్ని పొందకపోతే చిక్కులు తప్పవు. ఎంతకాలం జీవించామన్నది కాదు... ఎంత సంతృప్తితో జీవిస్తున్నామన్నది ముఖ్యం. కొత్త ప్రాజెక్టులో లేదా వ్యాపారంలో ఉన్నప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచించడం, మసలుకోవడం అవసరమని గుర్తుంచుకోండి. అహం వల్ల చిక్కులు తప్పవు. కంటికి నచ్చినవారికన్నా, మనసుకు దగ్గరగా ఉన్నవారిని ఎంచుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారని గుర్తుంచుకోండి. పెట్టుబడులకు ఫిబ్రవరి మంచిది. మేలో కీలక నిర్ణయాలు వద్దు. ఏప్రిల్‌లో తీవ్ర ఒత్తిడి తప్పదు. సెప్టెంబర్ తర్వాత జాగ్రత్త అవసరం. లక్కీ కలర్: ఆరంజ్; లక్కీనంబర్: 8 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఇది చాలా అదృష్టకరమైన సంవత్సరం. ప్రశంసలు, బహుమానాలు, ఇంక్రిమెంటులు పొందే సమయం ఇది. మీకు, మీ భాగస్వామికి మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. సంవత్సరమంతా ప్రశాంతంగానే గడుస్తుంది. ఏ పని చేసినా లాభనష్టాలను బేరీజు వేసుకోండి. ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో ఆలోచించి చేయండి. వీలైనంత వరకూ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇదో గొప్ప తరుణం. బాంధవ్యాలు సంతోషాన్ని కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్యాలు విసిగించే అవకాశం ఉంది. జనవరి బాగుంటుంది. మార్చిలో శ్రద్ధగా పని చేయండి. ఆగస్ట్‌లో చిన్న దుస్సంఘటన ఎదురు కావచ్చు. లక్కీ కలర్: వైట్; లక్కీ నంబర్: 6 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఎప్పటి నుంచో అనుకుంటోన్న కొత్త వ్యాపారాన్ని ఈ సంవత్సరం ప్రారంభిస్తారు. మీ తెలివితేటలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. అయితే ఆలోచనలను అమలు చేయడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మరి. ప్రేమ వ్యవహారాలు చేదును మిగల్చవచ్చు. మీకు తగిన వ్యక్తి తప్పకుండా వస్తారన్న నమ్మకంతో ఆ బాధను అధిగమించండి. వృత్తిపరంగా ఒడిదుడుకులు వస్తాయి. చేసే పనిలో నిరాసక్తత వల్ల ఓ మంచి అవకాశం చేజారిపోతుంది. అయితే తొందరలోనే మరో అవకాశం వస్తుంది కాబట్టి నిరుత్సాహపడకండి. నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రయాణాలు ఉండవచ్చు. ఫిబ్రవరి, జూన్‌లు బాగుంటాయి. లక్కీ కలర్: బేబీ పింక్, లక్కీ నంబర్: 11 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈ సంవత్సరం కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. బహుశా ఈ మార్పు మీ అంతట మీరుగా కాక పరిస్థితుల ప్రభావం కారణంగా ఏర్పడవచ్చు.వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకాస్త ప్రిపరేషన్ అవసరం. ఆచి తూచి అడుగేయండి. సంవత్సరమంతా విహార, వినోదయాత్రలతో సరదాగా గడిచిపోతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు చోటు చేసుకుంటాయి. అయితే చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపెట్టుకోకండి. మార్చి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కీలక నిర్ణయాలు వద్దు. మే, ఆగస్ట్‌లు బాగుంటాయి. లక్కీ కలర్: పర్పుల్; లక్కీ నంబర్: 10 అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ సంవత్సరం ఆర్థికంగా బలపడతారు కానీ అది క్రమంగా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి మీ పట్ల ఉన్న ప్రేమ ఇనుమడిస్తుంది. తనతో గడిపే మధుర క్షణాలను ఆనందమయం చేసుకోండి. ఊహించని గొప్ప అవకాశమొకటి మీ తలుపు తడుతుంది. దాన్ని వీలైనంత త్వరగా అందిపుచ్చుకుని పనిలో దిగండి. ఎప్పటి నుంచో ఉన్న ఓ బలమైన కోరిక నెరవేరుతుంది. ఇతరులను ప్రోత్సహించి ముందుకు నడుపుతారు. గతంలో మీ జీవితంలో ఉండి వెళ్లిన ఓ వ్యక్తితో మీ బంధాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తారు. బాగా ఆలోచించుకోండి. పనిపరంగా, ఆర్థికంగా మార్చి చాలా బాగుంటుంది. లక్కీ కలర్: ఆరంజ్, లక్కీ నంబర్: 5 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పెద్ద మొత్తంలో లాభాలు వచ్చి, ఈ సంవత్సరం సంతోషంగా గడుపుతారు. విజయం మీకు దగ్గరలోనే ఉంది. దాన్ని అంది పుచ్చు కోవాలంటే మీలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కూడా ఇది కలసివచ్చే సమయం. ఎంతో డైనమిక్‌గా, నిజాయతీగా ఉండే ఓ వ్యక్తితో ప్రేమలో పడతారు. ఒకవేళ ఇప్పటికే ప్రేమలో ఉండివుంటే... మీకు తనపై ఉన్న నమ్మకం, ప్రేమలను మరింత బలపర్చుకోవడానికి ప్రయత్నించండి. మేనుంచి జులై దాకా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగస్ట్‌లో కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విస్తృతంగా ప్రయాణాలు ఉంటాయి. లక్కీ కలర్: సీ గ్రీన్; లక్కీ నంబర్: 4 టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) అష్టమ శని కారణంగా ఈ రాశివారు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. కష్టాలూ నష్టాలు రావచ్చనే అభిప్రాయంతో ఉంటూ, ముందుగానే తగినంత ముందుచూపుతో వ్యవహరించాలి ఈ సంవత్సరమంతా. ఏదో జరిగిపోబోందనే భయం, మనోవ్యధ అసలు వద్దేవద్దు. ఏ సంశయం లేకుండా మీ పనిని మీరు చేసుకుంటూ సాగిపోండి. ధర్మబద్ధంగా చేస్తుండే మీ వ్యవహారశైలి కారణంగా ఏ నష్టమూ కష్టమూ మీకు కలగదు. పిల్లల పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకి కొంత సమయం పట్టవచ్చు కాబట్టి దిగులుపడిపోకండి. మానసికమైన బెంగ తప్ప, జరిగే పనులు జరుగుతూనే వెళ్తాయి. ఇంట్లో ఏ దుర్వార్తలనీ వినరుగానీ ఆందోళన తప్పకపోవచ్చు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) రోజులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని భావించవద్దు. ముఖ్యంగా రుణాలను ఈయడం, అనవసర వ్యవహారాల్లో జోక్యం, అంతపనినీ తామే చేయగలమని భావించడం సరి కాదు. అన్నిటికీ మించి ఈ రాశివారు తమని తాము ప్రశంసించుకోకూడదు. జీవితంలో ఒక కొత్తకోణంలో మీరు మీ దృష్టిని ప్రసరింపజేస్తారు. నిర్వేదం నిస్పృహ పూర్తిగా తొలగిపోయి పనిని సాధించి తీరాలనే పట్టుదల, పనికోసం వెంటపడటం, ముగిసేవరకు విశ్రమించకపోవడం, కొత్త పనుల్ని నెత్తిమీద వేసుకోకపోవడం, నా పనే నాకు ముఖ్యమనే ధోరణిలో ఉండడం... ఇలా అయిపోతారు. స్వప్రయోజనాలే ముఖ్యమనే ధోరణితో ఉంటే అవసరంలో మీకు ఎవరూ కలిసిరారు అని గ్రహించుకోండి. జెమిని (మే 21-జూన్ 21) ఏదో ఒక విషయాన్ని గురించి బాగా ఆలోచించి, అనుభవజ్ఞుల్ని సంప్రదించి ఆ సమస్య పరిష్కారానికి ఓ నిర్ణయాన్ని తీసుకోండి. మంచిదే. అయితే ఆ నిర్ణయాన్ని గురించి మళ్లీ వెనక్కి వెళ్లి ఆలోచిస్తూ సరికాదేమో అని మథనపడుతూ ఉండద్దు. మీ నిర్ణయం తప్పుకా(బో) దు. దాన్ని గురించిన వ్యధ సరికాదు. ఉద్యోగపరంగా స్థానచలనం, అద్దె ఇల్లు మారడం లేదా నివసిస్తున్న ఊరు మారడం లేదా స్వదేశాన్నే మారడం జరగవచ్చు. అలా వచ్చిన మార్పు పట్ల నిర్లక్ష్యం, మార్పు వచ్చేసిందన్నధీమా ఏమాత్రం సరికావు. జాగ్రత్తని పాటించండి. ఉన్నంతలోనే ఉండండి తప్ప, ఆడంబరాలకోసం ధనవ్యయం ఏ మాత్రమూ సరికాదు. ధనవిషయంలో మరింత జాగ్రత తప్పనిసరి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీకు ఇబ్బందులు రావుగాని, మీ కుటుంబ సభ్యులకో, మీ ఆప్తులకో వచ్చిన ఇబ్బందులని తీర్చడం కోసం మీరు శ్రమపడాల్సి వస్తుంది. ఈ రాశివారి దశ బాగున్న కారణంగా వీరి వల్ల సమస్యలు తీర్చబడతాయి గాని చిక్కు ముడిపడిపోవు. రచయితలూ వినోదరంగం వారూ గుర్తింపును పొందుతారు. లోపల అగ్నిపర్వతం ఉడుకుతున్నా, పైకి పెరుగుకుండలా చక్కగా ఉండగల శక్తి మీకు భగవంతుడిచ్చిన వరం. ఆ కారణంగానే సంతానం ఆరోగ్యం ఉద్యోగమనే వ్యవహారాల్లో మనోవ్యధని అనుభవిస్తున్నా బయటపడకుండా జీవిస్తుంటారు మీరు. నడిలోతు దాటి మెల్లగా ఒడ్డువైపుకి వస్తున్నారు కాబట్టి చెప్పుకోదగిన ఇబ్బందులుండవు. క్రమక్రమంగా సమస్యలు పరిష్కరింపబడుతూ వెళ్తాయి. లియో (జూలై 24-ఆగస్టు 23) ఆరిపోయిందనుకున్న నిప్పు మళ్లీ చిన్నగా చెలరేగుతూ ఉంటుంది అర్ధాష్టమ శని కారణంగా. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఆ లాభంతో రుణాలని తీర్చాలనే ఆలోచన వద్దు. మీకు ఎందరో సహాయపడుతూ మీ కష్టాల ఎండలకి చక్కని గొడుగు పడతారు. భయం వీడండి. అప్పు చేసి, ప్రయోజనాత్మకమైన స్థలాన్నో ఇంటినో వ్యాపార నిమిత్తం తీసుకుంటారు. అది మంచికే అవుతుంది. భర్త/భార్య ఆరోగ్యాన్ని గమనించుకుంటూ ఉండాలి. సంతానానికి విద్య అబ్బుతుంది. వ్యాపారం చేయాలనే ఆలోచన మంచిదే గాని, తగ్గ ప్రణాళికని ముందే స్థిరంగానూ, దృఢంగానూ వేసుకోవాల్సి ఉంది. సహాయం చేస్తామన్నవారు సహాయపడరని అనుకుంటూ ఆ ప్రణాళికని రచించుకోవాలి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ శరీరారోగ్యాన్ని సక్రమంగా రక్షించుకోలేక అశ్రద్ధ చేయడమే మీకు రాబోయే సమస్య. అనారోగ్యమనేది తీవ్ర ఉండదు కాని, నిరంతరం అనారోగ్యాన్ని గురించిన ఆలోచనని చేయకుండా ఉండ(లే)రు. వ్యాపారంలో భాగస్వాముల్ని గమనిస్తూ ఉండాలి. ‘ఇది తప్పు’ అని తెలిసీ చేయాల్సిన పరిస్థితిలో పడతారు. ‘వద్దు’ అనుకున్న వివాహమే నిర్ణయించుకోవలసి వస్తుంది. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో ఏమాత్రమూ సంశయించకుండా ‘కాదు- కుదరదు- వద్దు’ అని దృఢంగా నిశ్చయించుకోండి తప్ప మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్లద్దు. కొంతకాలమయ్యాక ‘అయ్యో! అలా చేసి ఉంటే బాగుండేది’ అని మీకు అనిపించినా ఆ పనిని చేసి ఉండకపోవడమే మంచిదని మీకు అర్థమౌతుంది అనుభవంలో. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) గట్టి పట్టుదలతోనూ, ఎందరో మిమ్మల్ని రెచ్చగొట్టిన కారణంగానూ అనవసరమైన న్యాయ(స్థాన)వివాదంలో పడి- మీకున్న అభిమానం కారణంగా వెనక్కి తిరిగి రాలేకపోతారు. సమస్య ఎవరితో వచ్చిందో నేరుగా వారితోనే మెత్తగా మాట్లాడినట్లయితే తప్పక చిక్కు వీడిపోతుంది. మీ జీవితం ఇతరులకోసం కాదు- మీ కోసమని ఆలోచించుకోవాలి. ఆర్థికమైన లోటుని అనుభవిస్తూ ఉండవచ్చు. చేస్తున్న పని లేదా చేసిన పని సరికాదనే ఆలోచన మనసుకి వచ్చినా- మంచిదే అని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. దానిక్కారణం మీ తలిదండ్రులూ విశేషించి తల్లీ కారణం కావచ్చు. ఆస్తిని అమ్మకానికి పెట్టి దాన్ని ఉపసంహరించుకోవచ్చు. మనశ్శాంతి లోపించడం, మరపు కూడా ఏర్పడవచ్చు. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ ధైర్యం మీ ధర్మబద్ధ విధానం మీ నిజాయితీలే మీ ఆయుధాలుగా యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో కొంత ఎలా నష్టపోక తప్పదో, అదే తీరుగా కొంత (ధనం పరిచయాలు పలుకుబడి, గౌరవం...) నష్టపోతారు తప్ప విజయం మీదే. మీరెవరెవరికి సహాయపడ్డారో, వారే మీ మార్గానికి అడ్డుపడుతూ మిమ్మల్ని యాతనలకి గురి చేయవచ్చు- బెదిరించవచ్చు-కోర్టుకి పోవచ్చు కూడా. బెదిరిపోవాల్సిన పని లేదని గ్రహించండి. ఆవేశం సాహసం, ఎదురు దాడిని చేయదలచడం వద్దు. మీకు కాలం సరిలేదు కాబట్టి, సముద్రపు కెరటం బలంగా వచ్చినప్పుడు తలవంచినట్లు తప్పుకోవడం మంచిది. వాగ్దానాలూ హామీలూ రాతకోతలూ వద్దు. శాంతి ఖడ్గమనేది కోట్ల తలల్ని నరకగలదు. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు ఆత్మస్థైర్యంతో పనిని చేయడమనేది స్వాగతించదగినదే అయినా, మీ కుటుంబ సభ్యులతో ముందుగా చెప్పడం అవసరం. లేనిపక్షంలో పనికి అభ్యంతరం కలగవచ్చు. భార్యాభర్తల అన్యోన్య విషయంలో భార్య తప్పక భర్తకి అనుకూలంగా ఉండవలసిందే. లేనిపక్షంలో ఈ రాశివారిలో పొరపచ్చాలు పెద్దవి అయ్యే అవకాశం ఉంది. సొమ్మువిలువ మీకు బాగా తెలిసొచ్చే కాలమిదే. ఇకనుండి రూపాయినీ వందగా లెక్కించవలసి వస్తుంది. రుణాలని పై వ్యక్తులనుంచి తీసుకోకూడని కాలమిది. పై అధికారులతోనూ కింది ఉద్యోగులతోనూ, తోటివారితోనూ మీ గొప్పదనాన్ని చాటుకోవద్దు- ఇతరుల అసూయ కారణంగా పరిస్థితులు తారుమారు కావచ్చు. ఎవరినీ విరోధించకండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) చేపట్టిన పని ఒక సందర్భంలో పూర్తి కాకపోవచ్చు. ఏమైనా సరే అని దూసుకుని వెళ్తే మొదటికి మోసం రావచ్చు. వివాదాల జోలికి వెళ్లద్దు. స్థానచలనం మంచిది కాదు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు తగినంత సిబ్బంది ఉన్నారా లేదా? పరిశీలించుకుని దిగండి. అనుకున్న ప్రయాణాలు వాయిదా పడవచ్చు. చేద్దామనుకున్న ఉద్యోగం దూరం జరిగిపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తీర్చడం లేదా పొందుదామనుకున్న రుణం తీసుకోవడం అనేవి వాయిదా పడుతూ వెళ్లవచ్చు. బంధుమిత్రుల ఉదాశీన వైఖరి వల్ల కొంత నిర్వేదం - మీలో కలగవచ్చు. కుటుంబ రహస్యాలని మీ తలిదండ్రులకీ అత్తమామలకీ తప్ప మరెవరికీ తెలియడం నాకిష్టమైనది కాదనే విషయాన్ని అందరికీ చెప్పండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) న్యాయస్థానంలో ఉన్న అపరిష్కత సమస్యల గురించి వ్యర్థ ప్రయత్నాలని మానండి. సంతానానికి సంబంధించిన ఓ సమస్యని గుర్తించిన తొలిరోజుల్లో మానసికంగా కుంగిపోవచ్చు. భయం అనవసరం. ఏదో ఇల్లూ స్థలం యంత్రం... ఇలా పెద్దమొత్తంలో దేన్నో ఒకదాన్ని కొనే ఆలోచన మీకు బలంగా రావచ్చు. దానికి తగిన ఆదాయం రుణసౌకర్యం... ఇవన్నీ అప్రయత్నంగా మీకు సిద్ధించవచ్చు. ఇంతకుముందు లేని విధంగా ఈసారి మీ అత్తమామలతోనూ దగ్గర బంధువులతోనూ సత్సంబంధాలని మీరు కొనసాగించవచ్చు. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో మీరు వెనకడుగు వేయడం సరికాదుగాని, చెప్పే శైలిలో తీరులో మాత్రం కాఠిన్యం ఉండకూడదని గ్రహించండి. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఒకప్పుడు పెద్దల సమక్షంలో చేసుకున్న ఒప్పందం తారుమారు కావచ్చు. మీదైన ఇల్లు, పొలం వాహనం వంటి వాటిని మొగమాటానికి పోయి మరెవరికో తాత్కాలికంగానైనా రిజిస్టర్ చేయకండి. ఇబ్బంది పెట్టే భార్యాభర్తల్లో భార్యతో ఆ భర్త మంచిగా ఉండగలిగితే సమస్య నివారింపబడుతుంది. సంతానాన్ని గురించి బాగా పట్టించుకుంటారు. పిల్లల చదువులకోసం మీరు, వాళ్లకి దగ్గరగా మీ నివాసాన్ని మార్చుకోవడం గాని, వాళ్లని మంచి చోటులో చేర్చాలనే ఆలోచనకి రావడంగాని చేస్తారు. మీ సమీప బంధువులు జీవితంలో ఓ సమస్యకి గురికావచ్చు. దాని ప్రభావం మీమీద పడవచ్చు. దానిని ఏమాత్రమూ పట్టించుకోకపోవడం మంచిది. దూరాభార ప్రయాణాల్లో ఆరోగ్యం చెడవచ్చు. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ఫోన్లోనే సగం వ్యాపారం..!
కోకో.ఇన్ పేరుతో క్లౌడ్ సర్వీసులు హైదరాబాద్‌లో ఏకైక క్లౌడ్ సేవల సంస్థ సౌదీ, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఎస్, యూకేల్లో విస్తరణ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైన విదేశీ సంస్థ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ‘మీ టీవీ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్‌కు మిస్ కాల్ ఇవ్వండి’ ‘మిస్ కాల్ ఇవ్వండి.. బహుమతులు గెల్చుకోండి’ .. ఇలాంటి ప్రకటనలు మనకు పరిచయమే. కాకపోతే మిస్‌కాల్ మీదే సగానికి సగం వ్యాపారం ఆధారపడి ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. ఆ విషయం పక్కన పెడితే.. మిస్డ్‌కాల్ ఇవ్వాలంటే కంపెనీకో టోల్ ఫ్రీ నంబర్.. కాల్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు ఓ కాల్ సెంటరూ ఉండాలి కదా. ఇక్కడే ఉంది అసలైన సమస్య. పెద్ద కంపెనీలైతే సొంతంగా కాల్ సెంటర్‌ను, ఉద్యోగుల్ని ఏర్పాటు చేసుకుంటాయి. మరి చిన్న సంస్థలు.. ప్రత్యేకించి స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పరిస్థితేంటి!! ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా కోకో.ఇన్ పేరుతో క్లౌడ్ కమ్యూనికేషన్ సేవల్ని ప్రారంభించింది ఓజోన్‌టెల్ సిస్టమ్స్ ప్రై.లి. హైదరాబాద్‌లోనే తొలి క్లౌడ్ కంపెనీ కూడా ఇదే. మరిన్ని వివరాలు సంస్థ సీఈఓ సీఎస్ఎన్ మూర్తి మాటల్లోనే.. కస్టమర్లతో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ (ఫోన్, ఈ-మెయిల్, సోషల్ మీడియా) ఉంటేనే వ్యాపారం విజయవంతం అవుతుందనేది నా అభిప్రాయం. ఈ కోణంలో చూస్తే దేశంలో ఏటా చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారం 50 మిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ, వీటిలో చాలా కొద్ది మందికే సొంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. అందుకే చిన్న కంపెనీలకూ కస్టమర్లతో మెరుగైన కమ్యూనికేషన్ సేవల్ని అందించేందుకే 2007లో 2 మిలియన్ డాలర్ల పెట్టుబడితో కోకో.ఇన్ సేవల్ని ప్రారంభించా. ప్రస్తుతం మన దేశంలోని 10 నగరాలతో పాటు మలేిసియాలోనూ కోకో సేవలు అందుబాటులో ఉన్నాయి. 500లకు పైగా కంపెనీలు..: ఈ-కామర్స్, రియల్ ఎస్టేట్, ట్రావెల్, ఎడ్యుకేషన్ ఇలా సుమారు 20 విభాగాల్లో 500లకు పైగా కంపెనీలు ఈ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. జొమాటో, ప్రొక్టో, రెడ్‌బస్, అభిబస్, ఇండియా మార్ట్, మణిపాల్ యూనివర్సిటీ, బిగ్ బాస్కెట్, ప్రొప్ ఈక్విటీ, కామన్‌ఫ్లోర్.కామ్, హౌజింగ్, షాదీ.కామ్, గోబిబో.కామ్, డీహెచ్ఎఫ్ఎల్, మహీంద్రా ఫైనాన్స్ వంటివి చెప్పుకోవచ్చు. 6 నెలల్లో వర్జీనియా, సౌదీ, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఎస్, యూకేల్లో సేవల్ని విస్తరించనున్నాం. ఈ ఏడాది రూ.75 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. నెల రోజుల్లో 10 మిలియన్ల పెట్టుబడులు..: ఇప్పటివరకు సొంత పెట్టుబడులతోనే కంపెనీని నడుపుతున్నాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. ఓ విదేశీ కంపెనీ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మరో నెల రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ప్రస్తుతం కంపెనీలో 65 మంది ఉద్యోగులున్నారు. మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు మరి కొంత మంది ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాం. త్వరలోనే వీడియో టెక్నాలజీ.. ప్రస్తుతం సోషల్ మీడియా, ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, వాయిస్ సర్వీసులను అందిస్తున్నాం. ఆయా సేవల్ని బట్టి ధరలున్నాయి. రూ.5 వేల నుంచి రూ.6 లక్షల వరకూ ధరలను నిర్ణయించాం. ఆయా సర్వీసులను ఎంచుకునే కంపెనీకి వాటికి సంబంధించిన ఎలాంటి చర్యనైనా క్షణాల్లోనే సంబంధిత కంపెనీకి సమాచారం అందిస్తాం. ఉదాహరణకు సోషల్ మీడియా సర్వీస్‌ను ఎంచుకుంటే.. ట్వీటర్, ఫేస్బుక్, లింక్డిన్ వంటి వాటిల్లో కంపెనీ గురించి ఎలాంటి కామెంట్లు, పోస్టులు చేసినా.. వాటిని ట్రాక్ చేసి సంబంధిత కంపెనీకి చేరవేస్తాం. ఇటీవలే స్పీచ్ రికగ్నేషన్ టెక్నాలజీ సర్వీస్‌ను ప్రారంభించాం. దీని ప్రత్యేకతేంటంటే.. కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి జెండర్ ఏంటి? వయస్సెంత ఉంటుంది. తన మూడ్ ఎలా ఉంది. వంటి వివరాలను సంబంధిత యాజమాన్యానికి క్షణాల్లోనే చెప్పేస్తాం. దీన్నిబట్టి కస్టమర్‌తో ఎవరు మాట్లాడాలో కంపెనీ నిర్ణయించుకునే వీలుకలుగుంది. ఈ సర్వీస్‌ను హౌజింగ్.కామ్, యూనీలివర్ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. మరో ఆరు నెలల్లో వీడియో టెక్నాలజీ సర్వీస్‌ను తీసుకొస్తాం. కోకో అంటే.. వెబ్ అప్లికేషన్‌కు కాలర్‌కు మధ్య కోకో ఓ అనుసంధానకర్త. అంటే మీ కంపెనీకి వచ్చే ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, సోషల్ వెబ్సైట్లలో లైకులు, పోస్టులు, కామెంట్లు.. ఇలా ప్రతీది తీసుకొని సంబంధిత కంపెనీ విభాగానికి (మార్కెటింగ్, సేల్స్, ఎగ్జిక్యూటివ్ వంటి వి) ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కోకో కూడా మీ కంపెనీ ప్రతినిధే. కాకపోతే ఇది పూర్తిగా వర్చుకల్ కమ్యూనికేషన్ అంతే. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఇంద్రుడు చంద్రుడు అనకండి
అవతలివాళ్లు ఎంత మేధావులు, మంచివారూ అయినా, వారిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు కొంతమంది. అయితే అది నిజానికి వారి తప్పు కాదు. వారి తలిదండ్రుల పెంపక లోపం. కొన్ని అధ్యయనాల ప్రకారం అతి గారాబంతో, ప్రత్యేక శ్రద్ధతో పెరిగే పిల్లలు, వారు పెద్దయ్యాక స్వయం ప్రేమికులుగా... అంటే ఎంతసేపటికీ తమను తాము గొప్పవాళ్లం అనుకోవడం తప్ప ఇతరులను పట్టించుకోరని రుజువైంది. పిల్లల్లో స్వయంప్రేమ లేదా స్వీయానురక్తికి దారి తీసే కారణాలపై అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో జరిగిన పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. తలిదండ్రులు తమ పిల్లలను సముదాయించడం కోసమో లేదా నిజంగానే వారిపట్ల తమకుండే మితిమీరిన ప్రేమ, గారాబం వల్లనో ‘ఫలానా వారికన్నా నువ్వు చాలా గొప్పవాడివి లేదా ఫలానా వారికీ, నీకూ అసలు పోలికే లేదు. తనకన్నా నువ్వు చాలా తెలివైనదానివి, నీ జ్ఞాపకశక్తి చాలా గొప్పది, నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు చాలా అందగత్తెవి...’’ అంటూ చెప్పే మాటలు పెద్దయ్యాక వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయట. ‘నువ్వు మా బంగారానివి, దేవుడు ఇచ్చిన అపూర్వమైన కానుక నువ్వు’ అంటూ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తలిదండ్రులు పిల్లలతో తరచు చెబుతుంటారు. అయితే అటువంటి మాటలు వారి మనసులపై గాఢమైన ముద్రవేస్తాయి. నిజంగానే తామేదో ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్లం కాబోలు’ అనుకుని, అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తుంటారు వారు. అందులో భాగంగా తామే అందరికన్నా గొప్పవాళ్లమని, తెలివితేటల్లో, అందచందాల్లో, ప్రతిభలో తమను మించిన వారే లేరని విర్రవీగుతారు. ఎదుటివారిని పూచికపుల్లల్లా తీసిపారేస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే చిన్నారులను నువ్వు ఇంద్రుడు, చంద్రుడు అని పొగడకూడదు. దాని బదులు వారిలోని శక్తిసామర్థ్యాలను, మంచితనాన్ని వెలికి తీయాలి. వారిలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశాన్నివ్వాలి’’ అంటారు సహ అధ్యయనవేత్త, కమ్యూనికేషన్ అండ్ సైకాలజీ ప్రొఫెసర్ బ్రాడ్ బుష్మాన్. అంటే పిల్లల్ని అతి ప్రేమగా, ప్రత్యేకంగా పెంచే తలిదండ్రులు ఇకపై ఆ పద్ధతిని మార్చుకోవాలేమో! -
హృదయ గాయం!
చూస్తుంటే బొద్దుగుమ్మ పరిణీతిచోప్రా రిలేషన్స్‌లో కాస్త వీక్లా ఉంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమో... అసలు వద్దనే భావనో... మొత్తానికి ఈ అమ్మడు రెండు హృదయాలకు గాయం చేసిందట. కానీ ఈ చిన్నదాని మనసు ఇప్పుడు ఓ జతగాడిని కోరుకుంటోందట. ‘గతంలో నాకుంది రెండే రిలేషన్స్. ఆ ఇద్దరినీ కాదని బాధపెట్టా. ఆ పాపం నాకు ఎప్పుడో అప్పుడు తగులుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరో ఒకరు నా హృదయాన్ని గాయపరుస్తారు. బట్... ఓకే (నవ్వులు). హార్ట్‌బ్రేక్స్ ఓ మంచి నటిని చేస్తాయి. చాలామంది విషయాల్లో ఇది రుజువైంది కూడా’ అంటూ ఎంతో పరిణతిగా మాట్లాడింది పరిణీతి. -
పల్లె ముంగిట్లో సాంకేతిక సౌరభాలు
దోమ: ఒకప్పుడు పట్టణాలకు, ఉన్నత కుటుంబాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ టెక్నాలజీ నిత్య నూతనమైంది. ఆయా రంగాల్లో సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలన్నీ మానవ జీవితాన్ని అత్యంత సుఖవంతం చేశాయి. అదే సమయంలో వాటిని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా శాస్త్ర, సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాటిని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకై ప్రతి ఏటా నవంబర్ మాసంలో 2వ గురువారాన్ని ప్రపంచ యూజబిలిటీ డేగా పాటిస్తున్నారు. ప్రపంచ యూజబిలిటీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ రోజు పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. పల్లె జీవన శైలి మార్చిన టెక్నాలజీ గత కొన్నేళ్ల క్రితం వరకు పట్టణాలు,నగరాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. కొన్నేళ్ల క్రితం వరకు సెల్‌ఫోన్ ఎవరిచేతిలోనైనా కనబడితే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నేడు పల్లెల్లో సెల్‌ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం పల్లెల్లో ఇంటర్నెట్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. పరిగి ప్రాంతాన్ని తీసుకుంటే మూడేళ్ల క్రితం కేవలం 2 ఇంటర్నెట్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. పరిగిలోనే కాకుండా దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ కేంద్రాలు వెలిశాయి. అన్ని చోట్లా కలిపి ప్రస్తుతం 20 ఇంటర్నెట్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇక ఇళ్లల్లో దాదాపు 200 మంది వరకు బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగిస్తున్నారు. నిర్మాణ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోయి బేస్మెంట్ దగ్గర నుంచి చెత్తు వేసే వరకు కూడా అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యా సంస్థల విషయానికొస్తే బ్లాక్‌బోర్డులకు బదులుగా ప్రస్తుతం కొన్ని చోట్ల ప్రొజెక్టర్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. అలాగే ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన కార్లు ప్రస్తుతం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా పల్లెల్లో ద్విచక్రవాహనం లేని ఇళ్లు లేదని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇక వ్యవసాయంలోనూ కూలీల అవసరం తగ్గి మి షన్లతోనే పనులు జరుగుతున్నాయి. గతంలో వారాలు పట్టే పనిని యంత్రాలతో గంటల్లోనే ముగిస్తున్నారు. వినియోగంలో లోపిస్తున్న విచక్షణ.... విజ్ఞాన శాస్త్రం అనేక సమస్యలు పరిష్కరించి మానవ జీవితాన్ని సుఖమయం చేసింది. కానీ మనిషి విచక్షణా లోపం వల్ల ఆ విజ్ఞానమే పర్యావరణ అసమతుల్యత, పరిసరాల కాలుష్యానికి దారి తీస్తోంది. ఉదాహరణకు సోషల్నెట్వర్కింగ్తో పరిచయాలు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. అదే సోషల్నెట్వర్క్ను కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో వస్తున్న పెద్ద పెద్ద సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదే విధంగా సెల్ఫక్షన్ సిగ్నల్స్‌తో కొన్ని రకాల పక్షులు ఇప్పుడు పల్లెల్లో కూడా కనుమరుగవుతున్నాయి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సహచరులతో మాట్లాడటం తగ్గించి ఫోన్లతోనే కాలక్షేపం చేస్తుండటంతో సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. మానవుడు తన పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించి సృష్టి ఔన్నత్యానికి పాటు పడాలే గానీ సృష్టి వినాశనానికి కాదని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. -
అసాధ్యాలను సుసాధ్యం చేశారు!
వండర్స్ ఆఫ్ సైన్స్ కాంతిని ముడివేయడం వీలవుతుందా? కాంతి వేగాన్ని మించి ప్రయాణించడం కుదురుతుందా? మెదడు నుంచి మెదడుకు సమాచార ప్రసారం జరిగే పనేనా? నిన్నటి వరకూ ఇవన్నీ అసాధ్యాలు. కానీ నేడు సాధ్యం అయ్యాయి! భవిష్యత్తులో ఇవి సుసాధ్యం అయితే గనక.. సైన్స్‌లో మరెన్నో అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి! విజ్ఞానశాస్త్రంలో ఎప్పుడు ఏ చిక్కుముడి వీడుతుందో ఎవరికీ తెలియదు. అసాధ్యం అనుకున్న పనులు అకస్మాత్తుగా జరిగిపోతాయి. ఊహకైనా అందని అద్భుతాలు కళ్ల ముందు చటుక్కున సాక్షాత్కరిస్తాయి. సైన్స్ చేసే మ్యాజిక్‌తో సాంకేతిక ప్రపంచం ఒక్కసారిగా కొత్త మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే అసలు ఎప్పటికీ సాధ్యం కావని అనుకున్న అద్భుతాలు ఇటీవల జరిగిపోయాయి! వాటిలో కొన్ని అద్భుతాలు.. వాటివల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... కాంతి పుంజాలను ముడివేశారు! మనకు తెలిసినంత వరకూ కాంతి కిరణాలు ఎల్లప్పుడూ నేరుగా సరళరేఖల్లోనే ప్రయాణిస్తాయి. వాటిని ముడివేయడం కాదు కదా కనీసం వంకరటింకరగా ప్రయాణించేలా కూడా చేయలేం. కానీ, బ్రిటన్‌లోని గ్లాస్గో, బ్రిస్టల్, సౌతాంప్టన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు కాంతిని ముడి వేయగలిగారు! ఇంతవరకూ అసాధ్యం అయిన ఒక గణితశాస్త్ర ప్రతిపాదనగానే ఉన్న ఈ భావనను వారు నిజం చేశారు. ప్రత్యేకమైన 3డీ హోలోగ్రామ్ చిత్రాలను ఉపయోగించి వారు ఈ అద్భుతాన్ని సాధించారు. (ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో వాడిన టెక్నాలజీ ఇదే) ఇదే 3డీ హోలోగ్రామ్ టెక్నాలజీని కొద్దిగా మార్చిన బ్రిటన్ పరిశోధకులు కాంతి ప్రవాహాన్ని సైతం ప్రభావితం చేయగలిగారు. కాంతి అనేది నదిలాంటిదని, అది సుడులు కూడా తిరగగలదని వీరు అంటున్నారు. కాంతి పుంజపు హోలోగ్రామ్ రూపం తెలిస్తే.. మీరూ దానిని వంచేయగలరని చెబుతున్నారు. దీనివల్ల ఉపయోగాలేంటంటే.. భవిష్యత్తులో కాంతితో ముడిపడిన అన్ని సాంకేతికతల్లోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయట. కాంతికన్నా 300 రెట్ల వేగం! ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సిద్ధాంతీకరించిన ప్రకారం విశ్వంలో కాంతిని మించిన వేగంతో ఏదీ ప్రయాణించలేదు. కానీ, అమెరికా, ప్రిన్స్టన్లోని ఎన్ఈసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ నియమాన్ని ఉల్లంఘించి చూపారు. కాంతికిరణాలు సెకనుకు 1.86 లక్షల మైళ్లు ప్రయాణిస్తాయి. కానీ, ప్రత్యేక గ్యాస్ చాంబర్లో వీరు లేజర్ కిరణాలను ఏకంగా కాంతి కంటే 300 రెట్ల వేగంతో ప్రయాణించేలా చేయగలిగారు! అయితే, సైన్స్‌పరంగా కాంతివేగమే అత్యధికమని, కానీ కొన్ని పరిస్థితులు కల్పిస్తే ఆ నియమాన్ని ఉల్లంఘించవచ్చని వీరు వెల్లడించారు. ఉపయోగాలేంటంటే.. ఫైబర్ ఆప్టిక్ పద్ధతిలో కాంతిద్వారా ఇంటర్నెట్ ప్రసారాలు ఇదివరకే వాడకంలోకి వచ్చేశాయి. అదే కాంతి కన్నా వేగం పెరగడం అంటే.. కాంతి ద్వారా సమాచార ప్రసారాన్ని కూడా వేగవంతం చేయొచ్చన్నమాట. దీనితో పాటు కాంతితో సంబంధం ఉన్న అనేక పనులను ఇంకా వేగంగా చేసేందుకు భవిష్యత్తులో వీలవుతుంది. మెదడు నుంచి మెదడుకు సందేశం! ఎదుటివారి మెదడులోని ఆలోచనలను చదవడం, ఒకరు ఆలోచిస్తే.. ఎక్కడో ఉన్న ఇంకొకరు ఆ ఆలోచనలను గ్రహించడం సాధ్యం అవుతుందా? కాదు. కానీ ప్రస్తుతానికి ఎలుకల్లో ఇది జరిగింది. బ్రెజిల్ శాస్త్రవేత్తల సాయంతో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని సాధించారు. వేలాది మైళ్ల దూరంలో ఉన్న రెండు ఎలుకల మధ్య టెలీపతీ(దూరసంవాదం) రూపంలో వీరు సమాచార ప్రసారం చేయగలిగారు. రెండు ఎలుకల మెదడుకు ఇంప్లాంట్లను అమర్చిన వీరు రెండింటి మధ్య ఇంటర్నెట్ ద్వారా మెదడు సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో ఒక బోనులో మీటను నొక్కేలా శిక్షణ పొందిన ఎలుక ఆ మీటను నొక్కగానే, అవతల బోనులో ఉన్న ఎలుక ఎలాంటి శిక్షణ లేకుండానే నేరుగా ఆ మీటను నొక్కేసింది. మనిషి మెదడు సంకేతాలను కూడా సమర్థంగా అనువదిస్తే మనుషుల్లో కూడా టెలిపతీ అసాధ్యమేమీ కాదని వీరు అంటున్నారు. ఒకే సమయంలో రెండు పనులు పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లే కాకుండా 12 ఉప పరమాణు కణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఉప పరమాణు కణాలను అత్యంత సూక్ష్మంగా క్వాంటమ్ స్థాయిలో ప్రభావితం చెందిస్తే పదార్థాలు చిత్రవిచిత్రాలు చేస్తాయట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా బార్బారా పరిశోధకులు ఇదే నిరూపించారు. ఓ చిన్న లోహపు ముక్కను ఒక డిగ్రీలో కోట్ల వంతు చల్లబర్చి, దానికి క్వాంటమ్ సర్క్యూట్‌ను తాకించి తిరిగి తీసివేయడం ద్వారా ఒకేసారి ఆ లోహపుముక్క సగం కదిలి, సగం కదలకుండా ఉండిపోయేలా చేశారు. వీరి ఆవిష్కరణ క్వాంటమ్ మెకానిక్స్‌లో విప్లవాత్మక మార్పులకు, మానవాళి వింత కోరికలను నెరవేర్చేందుకు ఉపయోగపడుతుందని ‘సైన్స్’ మేగజైన్ కితాబునిచ్చింది. వ్యతిరేక పదార్థం తయారీ! విశ్వంలో కంటికి కనిపించే పదార్థంతో పాటు కనిపించని వ్యతిరేక పదార్థం(యాంటీ మ్యాటర్) కూడా ఉందని అంచనా. అయితే విశ్వంలోని యాంటీ మ్యాటర్ సంగతి పెద్దగా తేలకపోయినా, ప్రయోగశాలలో మాత్రం శాస్త్రవే త్తలు వ్యతిరేక పదార్థాన్ని సృష్టించి, అది నిలకడగా ఉండేలా చేయగలిగారు. వ్యతిరేక పదార్థాన్ని దశాబ్దం క్రితమే తయారు చేసినా, దానిని బలమైన అయస్కాంత క్షేత్రం లోపల నిల్వ చేయడంలో సెర్న్ శాస్త్రవేత్తల బృందం విజయం సాధించింది. ప్రస్తుతం అయస్కాంత క్షేత్రం వల్ల ఇందులోని యాంటీ మ్యాటర్‌పై పరిశోధనలకు అడ్డంకి ఏర్పడుతోంది. ఈ అడ్డంకి తొలగితే గనక.. భవిష్యత్తులో మ్యాటర్/యాంటీ మ్యాటర్ రియాక్టర్లను తయారు చేయవచ్చని, సహజ ఇంధన వనరులు తరిగిపోయినా ఈ రియాక్టర్లతో ప్రపంచానికంతటికీ ఇంధన అవసరాలు తీర్చవచ్చని అంటున్నారు. హన్మిరెడ్డి యెద్దుల -
హలో... హలోకు ఇంకెన్నాళ్లో!
తుపాను కారణంగా దెబ్బతిన్న 3,612 టవర్లు పలకని ఫోన్లు... స్తంభించిన ఇంటర్నెట్ ఇప్పటికీ పూర్తికాని పునరుద్ధరణ పనులు ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం విశాఖ రూరల్: హుదూద్ తుపాను వచ్చి వారం రోజులు గడిచినా ఉత్తరాంధ్రలో సమాచార వ్యవస్థ మెరుగుపడలేదు. మొబైల్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. టవర్ల పునరుద్ధరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ గాడిలో పడాలంటే 2 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు సెల్ఫోన్లకు మూగనోము తప్పదంటున్నారు. ఈనెల 12వ తేదీన తుపాను కుదిపేసి న రోజే సెల్ఫోన్లు మూగబోయాయి. ఇం టర్నెట్ బంద్ అయింది. దీంతో ఒకరి నుంచి మరొకరికి సమాచారం లేకుండా పోయింది. దెబ్బతిన్న టవర్లు... తెగిన కనెక్టివిటీ... తుపాను ధాటికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో అన్ని నెట్‌వర్క్‌ల సెల్ టవర్లు మొత్తం 3612 దెబ్బతిన్నాయి. విశాఖలో అత్యధికంగా 1929 టవర్లు, విజయనగరంలో 585, శ్రీకాకుళంలో 678, తూర్పుగోదావరి జిల్లాలో 420 టవర్లు పాడయ్యాయి. దీంతో గత వారం నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించిపోయింది. మొబైల్స్‌తోపాటు ల్యాండ్‌లైన్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి. ప్రపంచానికి నాలుగు జిల్లాలతో కనెక్టివిటీ తెగిపోయింది. కనీసం ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. వారం రోజులు గడిచినా పరిస్థితులు మెరుగుపడలేదు. ఇంకా 617 టవర్లకు మరమ్మతు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేయడానికి నెల రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ అంతరాయంతో మొరాయిస్తున్న టవర్లు విద్యుత్ లేకపోవడంతో ఉన్న టవర్లు సైతం మొరాయిస్తున్నాయి. సెల్ టవర్లకు జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం తుపానుకు ముందే సూచించింది. కానీ ఏ ఒక్క నెట్వర్క్ ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో విద్యుత్ అంతరాయం కారణంగా టవర్లు పనిచేయడం లేదు. ఫలితంగా సిగ్నల్స్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వమే అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం విద్యుత్ పూర్తి స్థాయిలో వస్తేనే గాని టవర్లు పనిచేసే అవకాశం లేదు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లు విశాఖలో మొబైల్ టవర్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో వినియోగదారులకు సేవలందడం లేదు. ఇక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎన్యూమరేషన్‌కు అవరోధాలు సమాచార వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నష్టం అంచనాలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు ఎటువంటి సమాచారం రావడం లేదు. ఇంటర్నెట్ కూడా లేకపోవడంతో ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నష్టం అంచనాలను తయారు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. బాధితుల జాబితాను ఆన్లైన్లో పొందుపర్చేందుకు ఎన్యూమరేషన్ బృందాలకు ట్యాబ్లెట్లను పంపిణీ చేసింది. విశాఖకు 300, విజయనగరానికి 100, శ్రీకాకుళంకు 100 ట్యాబెట్లు అందజేసింది. అయితే ఇంటర్నెట్ సేవలు లేని ఈ సమయంలో ఈ ట్యాబ్లెట్ల ద్వారా బాధితుల వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కావడం లేదు. దీంతో అంచనాల రూపకల్పనకు జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూతపడిన ఐటీ సంస్థలు సమాచార వ్యవస్థ స్తంభించడంతో విశాఖలో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు మూతపడ్డాయి. ఫోన్ సదుపాయంతోపాటు ఇంటర్నెట్ సేవలు కూడా లేకపోవడంతో సాఫ్ట్వేర్ ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈ వారం రోజుల్లో ఐటీ కంపెనీలకు రూ.350 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా సమాచార వ్యవస్థను వేగంగా పునరుద్ధరించలేని పక్షంలో నష్టం మరింత పెరగనుంది. విద్యుత్‌ను పూర్తి స్థాయిలో అందిస్తేనే టవర్లు పనిచేస్తాయని సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను శాశ్వతంగా పునరుద్ధరించడానికి కనీసం 2 నెలల సమయం పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం మరో 2 నెలలకు గాని సెల్ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.