సంపాదకీయం
ప్రకృతిని వికృతపరిస్తే పర్యవసానాలెలా ఉంటాయో మరోసారి జమ్మూ-కాశ్మీర్ విలయం కళ్లకు కట్టింది. వరసబెట్టి ఆరురోజులపాటు ఆ రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షాలకు నదులు, సరస్సులు పొంగి ప్రవహించడంతో రాజధాని నగరం శ్రీనగర్‌తో సహా అనేక పట్టణాలు, గ్రామాలు మునిగిపోగా ఇంతవరకూ 200 మంది మృత్యువాతబడ్డారు. సైన్యం రంగంలోకి దిగి సహాయచర్యల్లో తలమునకలైనా ఇంకా ఆపన్నహస్తం అందని గ్రామాలెన్నో ఉన్నాయి. ఆరులక్షలమంది ప్రజలు ఇప్పుడు జలగండంలో చిక్కుకున్నారని సమాచారం. కొండచరియలు విరిగిపడి రోడ్లన్నీ దెబ్బతినడంతోపాటు కమ్యూనికేషన్ సదుపాయాలు కూడా ధ్వంసంకావడంతో గల్లంతైన ఆప్తుల జాడ తెలియక ఎన్నో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆదివారం ఆ రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇది జాతీయ విపత్తని ప్రకటించారు. సాధారణంగా వానలు పెద్దగా కురవని సెప్టెంబర్ మాసం ఆ రాష్ట్ర ప్రజలకు ఈసారి నరకం చూపింది. జీలం, చీనాబ్, రావి నదులు ఉగ్రరూపం దాల్చి అనంతనాగ్, కుల్గామ్, షోపియాన్, పుల్వా మా, గందర్‌బాల్, శ్రీనగర్, బడ్‌గామ్ జిల్లాల్లోని వందల గ్రామాలను నీట ముంచాయి. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా ఇదే స్థితి. సెప్టెంబర్ నెలంతా శ్రీనగర్‌లో సగటు వర్షపాతం 26.6 మిల్లీమీటర్లు కాగా, కేవలం 24 గంటల వ్యవధిలో అక్కడ కురిసిన వర్షం 51.8 మిల్లీ మీటర్లు. ఈ నగరవాసులు ఇంకా అదృష్టవంతులనే చెప్పాలి. పొరుగు నున్న కాజీగండ్‌లో 24 గంటల వ్యవధిలో పడిన వర్షపాతం 156.7 మిల్లీమీటర్లు.
మనిషి సాగిస్తున్న విధ్వంసమే ప్రకృతి విపత్తులకు కారణమవు తున్నదని పర్యావరణవేత్తలు చాన్నాళ్లనుంచి చెబుతున్నారు.
ఏళ్లతరబడి చినుకు రాలకపోవడం, ఒక్కోసారి ఉన్నట్టుండి పగబట్టినట్టు గంటల తరబడి కుంభవృష్టి కురియడం ఇలాంటి విధ్వంస పర్యవసానమేనని వారంటారు. ప్రపంచం మొత్తం ఇలాంటి ధోరణి కనిపిస్తున్నా కనీసం మన వంతు జాగ్రత్తలు తీసుకుందామని, ప్రజలను చైతన్యవంతం చేద్దామని ప్రభుత్వాలు అనుకోవడం లేదు. సరిగదా అవాంఛిత నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులిస్తూ ఆ విధ్వంసంలో తమ చేయీ వేస్తున్నాయి. హిమవన్నగాలు కొలువుదీరిన జమ్మూ- కాశ్మీర్‌లో ఉన్నట్టుండి వర్షాలు విరుచుకుపడి, వరదలొస్తే కొండవాలున ఉండే జనావాసాలు ఏమవుతాయో అధికార యంత్రాంగానికి అంచనా ఉండాలి. ఆపత్సమయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ధారించు కోవాలి. ఆ పని చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ)వంటివి దాన్ని అప్రమత్తం చేయాలి. కానీ, విషాదమేమంటే వీరంతా ఒకరిని మించి ఒకరు మొద్దునిద్రపోయారు. సీడబ్ల్యూసీ వెబ్‌సైట్‌లో వరద అంచనాలను తెలిపే విభాగంలో అసలు జమ్మూ- కాశ్మీర్ ప్రాంత వివరాలే లేవు. ఈ అంచనాలను తెలుసుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సీడబ్ల్యూసీ 175 వరద హెచ్చరిక కేంద్రాలను ఏర్పాటుచేస్తే అందులో జమ్మూ-కాశ్మీర్‌కు చోటులేదు. అలాగని ఆ రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు కొత్తగాదు. 1959, 1992, 2010 సంవత్సరాల్లో అక్కడ జలప్రళయాలు సంభవించాయి. రెండేళ్లక్రితం రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల విపత్తు నివారణ విధానాన్ని ప్రకటించింది. అయితే, దానికి కొనసాగింపుగా ప్రభుత్వంలో ఏర్పాటు కావలసిన ప్రత్యేక విభాగం ఆచూకీ లేదు. విపత్తులు వచ్చిపడినప్పుడు ఈ ప్రత్యేక విభాగం ప్రభుత్వంలోని అన్ని విభాగాలనూ ఉరికించి, సహాయచర్యలు పర్యవేక్షించాల్సి ఉంది. కానీ, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనుక ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్‌ను చుట్టుముట్టింది ప్రకృతి విపత్తు మాత్రమే కాదు...అంతకుమించిన ప్రభుత్వ అచేతనస్థితి, నిర్లిప్తత.
భౌగోళికంగా చూస్తే మన దేశం ప్రకృతి విపత్తులకు ఆలవాలమైన ప్రాంతం. దేశంలో 76 శాతం భూభాగం తీర ప్రాంతం. అక్కడ తుపానులు, సునామీల ముప్పు ఉంటుంది. 10 శాతం భూమి వరదలు, నీటి కోతలతో నిత్యం ఇబ్బందులు పడుతుంది. ఇవిగాక భూకంపాలు, కరువు వంటి విపత్తుల ప్రభావమూ ఉంటుంది. పైగా భూతాపోన్నతి కారణంగా ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఇంతక్రితంతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. కనుక మనం నిత్యమూ అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. ఒకచోట విపత్తు సంభవించినప్పుడు అలాంటివి తమ ప్రాంతంలో ఏర్పడితే ఏమి చేయాల్సివుంటుందో, నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని ప్రభుత్వాలూ అధ్యయనం చేసే సంస్కృతి ఉంటే కాశ్మీర్‌లో ఇప్పుడు జరిగినలాంటి విపత్తుకు ఆస్కారం ఉండేది కాదు. ఎక్కడివరకో అవసరం లేదు...నిరుడు ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో సంభవించిన విషాదంపై సుప్రీంకోర్టు నియమించిన ఉన్నతస్థాయి కమిటీ సవివరమైన నివేదిక సమర్పించింది. హిమలయ పర్వత ప్రాంత రాష్ట్రాలన్నిటా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి విపత్తులు కలిగించే నష్టాన్ని కనిష్టం చేయవచ్చునో ఆ కమిటీ తెలిపింది. ఆ కమిటీ నివేదికను ఉత్తరాది రాష్ట్రాలన్నీ అధ్యయనం చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా అసలు ఉత్తరాఖండ్ రాష్ట్రమే దాన్ని పట్టించుకోలేదు. ఇక జమ్మూ-కాశ్మీర్‌నుంచి అలాంటిది ఆశించడమే సాధ్యంకాదు. ఇప్పటికైనా ప్రకృతి వైపరీత్యాలపై జాతీయ స్థాయి విధానమూ, దృక్పథమూ అవసరమని కేంద్రం గుర్తించాలి. దాంతోపాటు విదేశాల్లో ఇలాంటి సమయాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేయించి ఒక సమగ్ర విధానానికి రూపకల్పనచేస్తే ఈ తరహా విపత్తులను నివారించడానికీ, వాటివల్ల సంభవించే నష్టాలను గణనీయంగా తగ్గించడానికీ వీలవుతుంది.