నిత్యాగ్నిగుండమైన జమ్మూ–కశ్మీర్ మరోసారి నెత్తురోడింది. శనివారం ఆ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన దురదృష్ట ఘటనలో ఒక జవానుతోపాటు ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు మరణించారు. పౌరులందరూ ఎన్‌కౌంటర్ ప్రాంతానికి చొచ్చుకురావడానికి ‘ప్రమాదకరమైన రీతి’లో ప్రయత్నించడం వల్ల ఇలా జరిగిందన్నది భద్రతాదళాల కథనం. ఈ ఉదంతంలో 30మంది పౌరులు కూడా గాయాలపాల య్యారు. జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతూ ఆందోళనకరంగా మారుతు న్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆ పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమవుతు న్నారు.
అక్కడ చారిత్రక తప్పిదాలు చేయడం రివాజుగా మారింది. నాలుగురోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం చేసిన ప్రకటన దీనికి అద్దం పడుతుంది. 2010లో తమ ప్రభుత్వం కశ్మీర్‌పై ముగ్గురు మధ్యవర్తులతో నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక అమలుకు చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆ సమస్యతో సరిగా వ్యవహరించలేక పోయామని ఆయన ‘తీవ్ర పశ్చాత్తాపం’ వెలిబుచ్చారు. ఆయన పశ్చాత్తాపాలు ఇప్పుడెందుకూ కొరగావు. ముందూ మునుపూ అధికారం వచ్చినా ఇంతకన్నా మెరుగ్గా వ్యవహరిస్తారన్న నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే తమంత తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం వీసమెత్తు శ్రద్ధ చూపలేదు. ఆ కమిటీ నివేదికలో విలువైన అంశాలున్నాయి.
విలీనం సమయంలో ఆ రాష్ట్రానికి ఇచ్చిన అనేక అధికారాలకూ, రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక రక్ష ణలకూ కోత పెడుతూ వస్తున్న తీరును ఆ కమిటీ ప్రత్యేకంగా ఎత్తిచూపింది. వాటిని ‘కొంతమే రకైనా’ పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. సాయుధ దళాల (ప్రత్యేకాధి కారాల) చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లకు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసి వాటిద్వారా ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. అధికార వికేంద్రీకరణ జరిపి, పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు అప్పగించాలని కోరింది.
ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల చట్టం అమలుపై 2005లో నియమించిన జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి కమిటీ సైతం ఆ చట్టం రద్దు కావలసిందేనని అభిప్రాయపడింది. అది అణచివేతకు ప్రతీ కగా, విద్వేషాన్ని కలిగించేదిగా, వివక్ష, పెత్తందారీ పోకడల ఉపకరణంగా ఉన్నదని అభివర్ణిం చింది. మిలిటెన్సీని అదుపు చేయడానికి గట్టి చర్యలు అవసరమనుకుంటే అందులోని కొన్ని నిబం ధనలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో చేర్చవచ్చునని సూచించింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోనైనా, జమ్మూ–కశ్మీర్‌లోనైనా ఆ చట్టం అండ లేకుండా తాము పనిచేయలేమని సైన్యం చెప్పిన పర్యవసానంగా యూపీఏ ప్రభుత్వం అటు జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ సిఫార్సులనూ, ఇటు ముగ్గురు మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన నివేదికనూ పక్కనబెట్టింది.
2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా వచ్చాక ఎన్‌డీఏ ప్రభుత్వం కశ్మీర్‌ను కొత్త కోణంలో చూడటం ప్రారంభించింది. అంత క్రితం వరకూ తాము అధికారంలోకొస్తే కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామని చెబుతూ వచ్చిన బీజేపీ అక్కడ పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాక ఆ విషయంలో పట్టు బట్టరాదని నిర్ణయించుకుంది. అటు సాయుధ దళాల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ వచ్చిన పీడీపీ ఆ విషయంలో మెత్తబడింది. దాని అమలును తమ ప్రభుత్వం సమీక్షించి, చట్టం అవసరం లేని ప్రాంతాలేవో నిర్ణయించి, కేంద్రానికి సిఫార్సులు చేస్తుందని ఆ కూటమికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రకటించారు.
ఆయన మరణానంతరం వచ్చిన మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈలోగా నిరుడు ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్రోత్సవంనాడు జాతి నుద్దేశించి మాట్లాడుతూ కశ్మీర్ సమస్యకు చర్చలే పరిష్కారం తప్ప బుల్లెట్లు కాదని చెప్పినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను కేంద్రం ప్రత్యేక దూతగా నియమించింది. అయితే దానివల్ల ఆశించిన ఫలితాలేవీ రాకపోగా, ఈలోగా రాష్ట్రంలో పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కాస్తా కుప్పకూలింది. ఆ తర్వాత అసెంబ్లీ రద్దయి గవర్నర్ పాలన వచ్చింది.
ఇప్పుడు పుల్వామా జిల్లాలో జరిగిన ఘటన భద్రతా విభాగాల మధ్య సమన్వయం కొరవడటంవల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగే ప్రాంతానికి సాధారణ పౌరులు చేరకుండా స్థానిక పోలీసుల సాయం తీసుకోవాల్సి ఉండగా అది జరగలేదంటున్నారు. అలాగే కాల్పులు జరిపేముందు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనుకనే ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలని ఇంటి ముందు నిల్చున్న యువకుడు సైతం ప్రాణాలు కోల్పోయాడని కాంగ్రెస్, పీడీపీ ఎత్తిచూపుతున్నాయి. ఈ ఏడాది ఇంతవరకూ రాష్ట్రంలో 587 హింసాత్మక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వీటిలో 47మంది పౌరులు, 90మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా 245మంది మిలిటెంట్లు హతమయ్యారు.
పౌరుల మరణాలు 2016నాటితో పోలిస్తే 2017–18లో 167శాతం పెరిగాయని కేంద్ర హోంశాఖ చెప్పిందంటే అక్కడ ఎంతటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయో అర్ధమవుతుంది. జమ్మూ–కశ్మీర్ పొరుగున పాకిస్తాన్‌వైపు నుంచి ఉండే చొరబాట్లు మిలిటెన్సీని అంతకంతకు పెంచుతున్నాయి. ఉపాధి దొరక్క, భవిష్యత్తు అగమ్యగోచ రమై అక్కడ యువత మిలిటెన్సీ వైపు అడుగులేస్తోంది. ఇలాంటి ఉదంతాలు దానికి మరింత దోహ దపడతాయి. కనుక అక్కడ ఆచి తూచి అడుగులేయాలి. ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అవసరమైన చర్యలు ప్రారంభించాలి. అంతేతప్ప సమస్యకు బుల్లెట్లే పరిష్కారమన్నట్టు వ్యవహరించటం తగదు.
Comments
Please login to add a commentAdd a comment