‘‘నాకు బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లేదు... సెక్యూరిటీ లేదు... మీ ముందు నిల్చొని మనసు విప్పి మాట్లాడుతున్నా!’’ మూడు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఓ సభలో అన్న మాటలివి. అక్కడున్న కశ్మీరీ జనం మీద నమ్మకం కనబరుస్తూ, ప్రతీకాత్మకంగా ఆయన అలా బుల్లెట్ ప్రూఫ్ కవచం అడ్డు తీసేసి తమ ప్రభుత్వ దృఢసంకల్పాన్ని వ్యక్తం చేశారు. సరిహద్దు వెంట పూంఛ్ సెక్టార్‌లో రక్తపాతం కొద్దిరోజులుగా ఆగని నేపథ్యంలో అమిత్ షా పర్యటన, ఆయన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి–నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటూ గడచిన మూడు రోజుల్లో రెండు సార్లు సూచించారు. కానీ, పలుమార్ల పాకిస్తాన్ ద్రోహాలతో, మరీ ముఖ్యంగా పుల్వామా దాడితో కేంద్రానికి మబ్బులు వీడి, కేంద్రమంత్రి ఆ సూచనల్ని తోసిపుచ్చారు. ‘నయా కశ్మీర్’ కోసం కశ్మీరీ యువతరంతోనే మాట్లాడతానంటూ తెగేసి చెప్పడం గమనార్హం.
ప్రతిపక్ష కశ్మీరీ నేతలపై విరుచుకు పడడమే కాక సోమవారం డల్ సరస్సులో మిరుమిట్లు గొలిపే దీపకాంతుల మధ్య సాంస్కృతిక ప్రదర్శనల్లో షా పాల్గొన్నారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే భావన కలిగించేందుకు శతవిధాల ప్రయత్నించారు. షార్జాకు విమాన సర్వీసు, ఐఐటీ కొత్త ప్రాంగణం ప్రారంభోత్సవం వగైరా చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో అవినీతి, బంధుప్రీతి, తీవ్రవాదం నశించి, మునుపెన్నడూ లేని అభివృద్ధి జరుగుతోందని తన పర్యటనలో కశ్మీరీ యూత్ క్లబ్ సభ్యులతో నమ్మబలికారు.
కానీ, కశ్మీర్‌లో అల్పసంఖ్యాకులైన పండిట్లు, సిక్కులు, వలస కార్మికుల ఊచకోత... పదిహేను రోజులుగా తీవ్రవాదులపై ఆగని సైనిక చర్య – క్షేత్రస్థాయి ఉద్విగ్నతను కళ్ళకు కడుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లతో మూన్నాళ్ళ పర్యటనకు వచ్చిన మంత్రి మాటల్లోని ధైర్యం అక్కడి సామాన్యులకు ఉంటుందా అన్నది అనుమానమే. సోమవారం సైతం పుల్వామాలో పోలీస్‌స్టేషన్‌పై జరిగిన గ్రెనేడ్ దాడి లాంటివి కశ్మీర్ నిజంగా సురక్షితమేనా, గుండెలపై చేతులేసుకొని బతికే పరిస్థితి ఉందా అని భయం రేపుతున్నాయి.
హింసాకాండ, భయం కశ్మీర్‌తో పుట్టిన కవలపిల్లలు. 2019 ఆగస్టు 5న కేంద్రం రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. తద్వారా పరిస్థితి చక్కబడి శాంతి నెలకొంటుందని ఆశించింది. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ఎన్నికల సంఘం ఓకే అనగానే రెండు రాష్ట్రాలకూ ఎన్నికలు పెడతామనీ చెప్పింది. కానీ, రెండేళ్ళు దాటినా పరిస్థితి అలా లేదు. పైగా, కొద్ది రోజులుగా తీవ్రవాదులు ఎంచుకొని మరీ చేస్తున్న హత్యల్లో డజను మంది సామాన్యులు, అధీన రేఖకు దగ్గరలోని రాజౌరీ– పూంఛ్ సెక్టార్‌లో 9 మంది దాకా సైనికులు బలయ్యారు.
ఇది చొరబాటుదారులైన పాకిస్తానీ తీవ్రవాదుల పనే అన్నది అంచనా. బీహార్, యూపీల నుంచి వచ్చిన వలస కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత రెండేళ్ళలో తొలిసారిగా అమిత్‌షా కశ్మీర్‌లో పర్యటిస్తున్నది అక్కడి పరిస్థితిని కళ్ళారా చూడడానికే అనిపిస్తుంది. షా కన్నా కొన్నాళ్ళ ముందే సాక్షాత్తూ భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ ఎం.ఎం. నరవానే సైతం కశ్మీర్ పర్యటించారు. దాన్నిబట్టి విషయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
శ్రీనగర్‌లో అనేక గంటల ఉన్నతస్థాయి సమావేశంలో భద్రతా వ్యవహారాలను షా సమీక్షించారు. మోదీకి కుడిభుజంగా, అధ్యక్షస్థానంలో లేకున్నా బీజేపీ ఎన్నికల ప్రచారాల చుక్కానిగా, కశ్మీర్‌కు కిరీటం లేని కార్యనిర్వాహకుడిగా పేరున్న షా వస్తున్నారంటే, వెయ్యి మంది యువకులను అరెస్టు చేయాల్సి వచ్చింది. భద్రతకు డ్రోన్ కెమేరాలు, స్నైపర్లు, స్పీడ్‌బోట్లను దింపాల్సి వచ్చింది. నూటికి 70 మంది 35 ఏళ్ళ లోపు వారే ఉన్న కశ్మీర్‌లో నిరుద్యోగ రేటు ఇప్పటికీ దేశంలోనే అత్యధికం. మరి, ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోందంటే నమ్మేదెలా? అభివృద్ధి ఫలాల కోసం కర్ఫ్యూలు, ఇంటర్నెట్ అవరోధాలు, మీడియాపై ఆంక్షల లాంటి చేదు మాత్రలను సహించి, భరించాలన్న మంత్రివర్యుల మాటను అర్థం చేసుకొనేదెలా?
అఫ్గాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో కశ్మీర్‌లో మళ్ళీ హింస పేట్రేగడం గమనార్హం. కాబూల్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు తమకు కశ్మీర్‌ను కట్టబెట్టడంలో సాయపడతారన్న పాకిస్తానీ మంత్రి మాటనూ మర్చిపోలేం. అందుకే, పర్యటన సమయాన్ని పొడిగించుకొని, సోమవారం రాత్రి కూడా అక్కడే గడిపి, కశ్మీర్‌పై సీరియస్‌గా ఉన్నామన్న సంకేతాలిచ్చారు షా. కానీ, కశ్మీర్ భవితవ్యం ఇప్పుడు ఓ విషవలయంలో చిక్కుకుంది. తీవ్రవాదం తగ్గితే కానీ, పునర్విభజన, ఎన్నికలు సాధ్యం కావు. ఎన్నికలు జరిగితేనే కానీ, తీవ్రవాదానికి ముకుతాడు వేయడం కుదిరేలా లేదు.
వెరసి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. దాన్ని మార్చాలంటే, ఎంతో చేయాలి. ముందుగా లోయలో భద్రతనూ, నిఘా విభాగాన్నీ పటిష్ఠం చేయాలి. క్షేత్రస్థాయికి దూరంగా శ్రీనగర్ సుందర రాజభవనాల్లోని గవర్నర్ వ్యవస్థ కన్నా ఎన్నికలతో జనం మనసు గెలిచిన ప్రజాపాలకులపై బాధ్యత మోపాలి. పర్యటనలు, మాటలు సరిపోవు. మాటల్లోని సంకల్పం చేతల్లో చూపాలి. ముఖ్యంగా ప్రేమ, కారుణ్యాలతో స్థానికుల మనసును గెలుచుకొని, వారిని తమతో కలుపుకొనిపోతేనే పరిస్థితుల్లో మార్పు సాధ్యం. 370 రద్దు వేళ జరగనిది అదే! లేదంటే, ఎన్నేళ్ళయినా ‘మిషన్ కశ్మీర్’ సశేషమే!
Comments
Please login to add a commentAdd a comment