ఫోన్లోనే సగం వ్యాపారం..! | Half of the business on the phone | Sakshi
Sakshi News home page

ఫోన్లోనే సగం వ్యాపారం..!

Published Sat, Mar 21 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

ఫోన్లోనే సగం వ్యాపారం..!

ఫోన్లోనే సగం వ్యాపారం..!

కోకో.ఇన్ పేరుతో క్లౌడ్ సర్వీసులు
 హైదరాబాద్‌లో ఏకైక క్లౌడ్ సేవల సంస్థ
 సౌదీ, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఎస్, యూకేల్లో విస్తరణ
 10 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైన విదేశీ సంస్థ

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ‘మీ టీవీ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్‌కు మిస్ కాల్ ఇవ్వండి’ ‘మిస్ కాల్ ఇవ్వండి.. బహుమతులు గెల్చుకోండి’  .. ఇలాంటి ప్రకటనలు మనకు పరిచయమే. కాకపోతే మిస్‌కాల్ మీదే సగానికి సగం వ్యాపారం ఆధారపడి ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. ఆ విషయం పక్కన పెడితే.. మిస్డ్‌కాల్ ఇవ్వాలంటే కంపెనీకో టోల్ ఫ్రీ నంబర్.. కాల్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు ఓ కాల్ సెంటరూ ఉండాలి కదా. ఇక్కడే ఉంది అసలైన సమస్య. పెద్ద కంపెనీలైతే సొంతంగా కాల్ సెంటర్‌ను, ఉద్యోగుల్ని ఏర్పాటు చేసుకుంటాయి. మరి చిన్న సంస్థలు.. ప్రత్యేకించి స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పరిస్థితేంటి!! ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా కోకో.ఇన్ పేరుతో క్లౌడ్ కమ్యూనికేషన్ సేవల్ని ప్రారంభించింది ఓజోన్‌టెల్ సిస్టమ్స్ ప్రై.లి. హైదరాబాద్‌లోనే తొలి క్లౌడ్ కంపెనీ కూడా ఇదే. మరిన్ని వివరాలు సంస్థ సీఈఓ సీఎస్‌ఎన్ మూర్తి మాటల్లోనే..

కస్టమర్లతో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ (ఫోన్, ఈ-మెయిల్, సోషల్ మీడియా) ఉంటేనే వ్యాపారం విజయవంతం అవుతుందనేది నా అభిప్రాయం. ఈ కోణంలో చూస్తే దేశంలో ఏటా చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారం 50 మిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ, వీటిలో చాలా కొద్ది మందికే సొంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. అందుకే చిన్న కంపెనీలకూ కస్టమర్లతో మెరుగైన కమ్యూనికేషన్ సేవల్ని అందించేందుకే 2007లో 2 మిలియన్ డాలర్ల పెట్టుబడితో కోకో.ఇన్ సేవల్ని ప్రారంభించా. ప్రస్తుతం మన దేశంలోని 10 నగరాలతో పాటు మలేిసియాలోనూ కోకో సేవలు అందుబాటులో ఉన్నాయి.

500లకు పైగా కంపెనీలు..: ఈ-కామర్స్, రియల్ ఎస్టేట్, ట్రావెల్, ఎడ్యుకేషన్ ఇలా సుమారు 20 విభాగాల్లో 500లకు పైగా కంపెనీలు ఈ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. జొమాటో, ప్రొక్టో, రెడ్‌బస్, అభిబస్, ఇండియా మార్ట్, మణిపాల్ యూనివర్సిటీ, బిగ్ బాస్కెట్, ప్రొప్ ఈక్విటీ, కామన్‌ఫ్లోర్.కామ్, హౌజింగ్, షాదీ.కామ్, గోబిబో.కామ్, డీహెచ్‌ఎఫ్‌ఎల్,  మహీంద్రా ఫైనాన్స్ వంటివి చెప్పుకోవచ్చు. 6 నెలల్లో వర్జీనియా, సౌదీ, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఎస్, యూకేల్లో సేవల్ని విస్తరించనున్నాం. ఈ ఏడాది రూ.75 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం.

నెల రోజుల్లో 10 మిలియన్ల పెట్టుబడులు..: ఇప్పటివరకు సొంత పెట్టుబడులతోనే కంపెనీని నడుపుతున్నాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. ఓ విదేశీ కంపెనీ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మరో నెల రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ప్రస్తుతం కంపెనీలో 65 మంది ఉద్యోగులున్నారు. మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు మరి కొంత మంది ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాం.

త్వరలోనే వీడియో టెక్నాలజీ..

ప్రస్తుతం సోషల్ మీడియా, ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్, వాయిస్ సర్వీసులను అందిస్తున్నాం. ఆయా సేవల్ని బట్టి ధరలున్నాయి. రూ.5 వేల నుంచి రూ.6 లక్షల వరకూ ధరలను నిర్ణయించాం. ఆయా సర్వీసులను ఎంచుకునే కంపెనీకి వాటికి సంబంధించిన ఎలాంటి చర్యనైనా క్షణాల్లోనే సంబంధిత కంపెనీకి సమాచారం అందిస్తాం. ఉదాహరణకు సోషల్ మీడియా సర్వీస్‌ను ఎంచుకుంటే.. ట్వీటర్, ఫేస్‌బుక్, లింక్‌డిన్ వంటి వాటిల్లో కంపెనీ గురించి ఎలాంటి కామెంట్లు, పోస్టులు చేసినా..  వాటిని ట్రాక్ చేసి సంబంధిత కంపెనీకి చేరవేస్తాం. ఇటీవలే స్పీచ్ రికగ్నేషన్ టెక్నాలజీ సర్వీస్‌ను ప్రారంభించాం. దీని ప్రత్యేకతేంటంటే.. కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి జెండర్ ఏంటి? వయస్సెంత ఉంటుంది. తన మూడ్ ఎలా ఉంది. వంటి వివరాలను సంబంధిత యాజమాన్యానికి క్షణాల్లోనే చెప్పేస్తాం. దీన్నిబట్టి కస్టమర్‌తో ఎవరు మాట్లాడాలో కంపెనీ నిర్ణయించుకునే వీలుకలుగుంది. ఈ సర్వీస్‌ను హౌజింగ్.కామ్, యూనీలివర్ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. మరో ఆరు నెలల్లో వీడియో టెక్నాలజీ సర్వీస్‌ను తీసుకొస్తాం.
 
కోకో అంటే..


వెబ్ అప్లికేషన్‌కు కాలర్‌కు మధ్య కోకో ఓ అనుసంధానకర్త. అంటే మీ కంపెనీకి వచ్చే ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, సోషల్ వెబ్‌సైట్లలో లైకులు, పోస్టులు, కామెంట్లు.. ఇలా ప్రతీది తీసుకొని సంబంధిత కంపెనీ విభాగానికి (మార్కెటింగ్, సేల్స్, ఎగ్జిక్యూటివ్ వంటి వి) ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కోకో కూడా మీ కంపెనీ ప్రతినిధే. కాకపోతే ఇది పూర్తిగా వర్చుకల్ కమ్యూనికేషన్ అంతే.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే  startups@sakshi.com కు మెయిల్ చేయండి...
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement