భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్‌ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్‌ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్‌ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్‌టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్‌ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.
హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్‌వర్క్ చిప్‌లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్ ఆధారిత 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్ ఆధారిత నెట్‌వర్క్‌ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్‌ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్‌లో బిడ్‌లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్‌ట్రాన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్‌వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్‌ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్‌ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. భారత్ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.
‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్‌లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్‌విడియా, క్వాల్‌కామ్, మీడియాటెక్ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్‌లో సిగ్నల్‌చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment