signal transmition
-
సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్‌ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్‌ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్‌ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్‌ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్వర్క్ చిప్‌లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్ ఆధారిత 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్ ఆధారిత నెట్‌వర్క్‌ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్‌లో బిడ్లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్‌ట్రాన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్లెస్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. భారత్ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్‌లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్విడియా, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్లో సిగ్నల్‌చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు. -
వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు విక్రయించొద్దు
న్యూఢిల్లీ: ప్రభుత్వ అనుమతులు అవసరమయ్యే వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు వంటి టెలికం పరికరాలను విక్రయించరాదని ఈ–కామర్స్ సంస్థలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులిస్తే తప్ప సెల్యులార్ సిగ్నల్ జామర్లు, జీపీఎస్ బ్లాకర్లు లేదా ఇతరత్రా సిగ్నల్స్‌ను జామ్ చేసే పరికరాలను వినియోగించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దేశీయంగా ప్రైవేట్ రంగ సంస్థలు లేదా ప్రైవేట్ వ్యక్తులు వీటిని కొనుగోలు చేయడం లేదా వినియోగించుకోవడం వంటివి చేయరాదు‘ అని ఒక ప్రక టనలో తెలిపింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న దానికి భిన్నంగా సిగ్నల్ జామింగ్ పరికరాల ప్రకటనలు ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం, దిగుమతి చేసుకోవడం లేదా ఇతరత్రా మార్కెటింగ్ చేయడం వంటివన్నీ కూడా చట్టవిరుద్ధమని పేర్కొంది. గడిచిన 4–5 ఏళ్లుగా డాట్ ఈ అంశాన్ని అనేక సార్లు లేవనెత్తింది. ఈ పరికరాల అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు పలు మార్లు దాడులు కూడా నిర్వహించింది. వైర్లెస్ జామర్లను విక్రయించడం లేదా వాటి అమ్మకానికి వెసులుబాటు కల్పించడం వంటివి చేయరాదంటూ ఈ–కామర్స్ కంపెనీలన్నింటికీ జనవరి 21న డాట్ నోటీసు కూడా జారీ చేసింది. మరోవైపు, మొబైల్ సిగ్నల్ బూస్టర్ల వంటి అక్రమ పరికరాల అనధికారిక వినియోగం వల్ల టెలికం సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడుతోందని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. వీటి వినియోగం చట్టరీత్యా నేరమన్న సంగతి చాలా మంది ప్రజలకు తెలియదని, తాజా ఆదేశాలతో ఈ అంశంపై అవగాహన పెరగగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. -
మన శరీరం ద్వారా స్మార్ట్ సిగ్నల్స్ పంపొచ్చు
వై-ఫై లాంటి రేడియో తరంగాలు లేదా బ్లూటూత్ ద్వారా పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను ఒక ఎలక్ట్రానిక్ పరికరం నుంచి మరో ఎలక్ట్రానిక్ పరికరానికి పంపిస్తే ఆ పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను మధ్యలోనే హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకు మనంటికి స్మార్ట్‌లాక్ ఉండి, దానికి మన సెల్‌ఫోన్‌ను అనుసంధానించి ఉంటే.. డోర్ లాక్ ఓపెన్ చేయాలంటే సీక్రెట్ కోడ్‌ను సెల్‌ఫోన్ ద్వారా ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్‌ను గాల్లో ఉండగానే తస్కరించే సైబర్ దొంగలు ఎప్పుడూ ఉంటారు. (సందేశాల విషయంలో అయితే ఇలా జరగకుండా ఎన్క్రిప్షన్ ఉంటుంది) మరి అలాంటివారి బారిన పడకుండా పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను రిసీవర్‌కు పంపాలంటే ఎలా? అందుకు ఏదీ అత్యుత్తమ మార్గం. ఇలాంటి సందేహమే వాషింగ్టన్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధకులకు వచ్చింది. ఫింగర్ ప్రింట్స్, టచ్ స్క్రీన్లను ప్రస్తుతం ఇన్ప్రింట్గా వాడుతున్నామని, వాటినే అవుట్ ప్రింట్‌గా వాడలేమా అన్న అనుమానం కూడా వారికి వచ్చింది. అంతే తలలో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. అదే మన శరీరం నుంచి సిగ్నల్స్ ద్వారా పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను పంపించడం. ఈ ఆలోచన రాగానే మానవ శరీరం సిగ్నల్స్ ప్రసార వాహకంగా పనిచేస్తుందా లేదా ముందుగా తెలుసుకోవాలనుకొని ప్రయోగం జరిపి చూశారు. ఊహించని విధంగా విజయం సాధించారు. పైగా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి మరో ఎలక్ట్రానిక్ పరికరానికి పంపించే సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ కంటే అతి తక్కువ ఫ్రీక్వెన్సీతో శరీరం గుండా సిగ్నల్స్‌ను పంపించవచ్చని గుర్తించారు. మానవ శరీరం ద్వారా సిగ్నల్స్‌ను 30 మెగాహెర్ట్జ్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీలో పంపించవచ్చని తేలింది. అలాగే ఫింగర్ ప్రింట్స్, టచ్ పాడ్స్ నుంచి రెండు నుంచి పది మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ సులభంగా ప్రసారం అవుతాయని పరిశోధకులు గుర్తించారు. ఇంటికున్న స్మార్ట్‌లాక్‌ను ఓపెన్ చేయాలంటే మన స్మార్ట్ ఫోన్ నుంచి రేడియో తరంగాల ద్వారా సిగ్నళ్లను పంపించాల్సిన అవసరం లేదు. మన శరీరం ద్వారానే పంపించవచ్చని పరిశోధకుల ప్రయోగం ద్వారా రుజువైంది. అంటే ఫింగర్ ప్రింట్ ద్వారా స్మార్ట్ అప్లికేషన్‌ను పట్టుకొని మరో చేతితో డోర్ నాబ్‌ను పట్టుకుంటే మన శరీరం ద్వారా లాక్ పాస్వర్డ్ లేదా కోడ్ వర్డ్ డోర్ ఎలక్ట్రానిక్ డివైస్‌కు చేరుకొని డోర్ తెరుచుకుంటుంది. రేడియో తరంగాలు మధ్యలో గాలిలో ప్రయాణించవు కనుక వాటిని మధ్యలో ఎవరూ తస్కరించే అవకాశమే లేదు. ఈ సిగ్నల్స్ ప్రసారం చేతి నుంచి చేతికే కాకుండా చేతి నుంచి కాలుకు, మోచేతికి, తలకు, శరీరంలో ఏ అవయం వరకైనా వెళతాయని కూడా పరిశోధకులు కనుగొన్నారు. తాము చేసిన ఈ ప్రయోగం ప్రాథమికంగా గ్లూకోమీటర్, ఇన్సులిన్ పంపింగ్ మిషన్ తదితర వైద్య పరికరాలతోపాటు ఇంట్లోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరాలను పని చేయించడానికి ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఊహించని ప్రయోజనాలు ఉండవచ్చని వారన్నారు. 'ది ఇంటెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పర్వేసివ్ కంప్యూటింగ్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్' ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది.