మన శరీరం ద్వారా స్మార్ట్ సిగ్నల్స్ పంపొచ్చు
మన శరీరం ద్వారా స్మార్ట్ సిగ్నల్స్ పంపొచ్చు
Published Tue, Oct 25 2016 5:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
వై-ఫై లాంటి రేడియో తరంగాలు లేదా బ్లూటూత్ ద్వారా పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను ఒక ఎలక్ట్రానిక్ పరికరం నుంచి మరో ఎలక్ట్రానిక్ పరికరానికి పంపిస్తే ఆ పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను మధ్యలోనే హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకు మనంటికి స్మార్ట్‌లాక్ ఉండి, దానికి మన సెల్‌ఫోన్‌ను అనుసంధానించి ఉంటే.. డోర్ లాక్ ఓపెన్ చేయాలంటే సీక్రెట్ కోడ్‌ను సెల్‌ఫోన్ ద్వారా ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్‌ను గాల్లో ఉండగానే తస్కరించే సైబర్ దొంగలు ఎప్పుడూ ఉంటారు. (సందేశాల విషయంలో అయితే ఇలా జరగకుండా ఎన్‌క్రిప్షన్ ఉంటుంది)
మరి అలాంటివారి బారిన పడకుండా పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను రిసీవర్‌కు పంపాలంటే ఎలా? అందుకు ఏదీ అత్యుత్తమ మార్గం. ఇలాంటి సందేహమే వాషింగ్టన్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధకులకు వచ్చింది. ఫింగర్ ప్రింట్స్, టచ్ స్క్రీన్లను ప్రస్తుతం ఇన్‌ప్రింట్‌గా వాడుతున్నామని, వాటినే అవుట్ ప్రింట్‌గా వాడలేమా అన్న అనుమానం కూడా వారికి వచ్చింది. అంతే తలలో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. అదే మన శరీరం నుంచి సిగ్నల్స్ ద్వారా పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను పంపించడం.
ఈ ఆలోచన రాగానే మానవ శరీరం సిగ్నల్స్ ప్రసార వాహకంగా పనిచేస్తుందా లేదా ముందుగా తెలుసుకోవాలనుకొని ప్రయోగం జరిపి చూశారు. ఊహించని విధంగా విజయం సాధించారు. పైగా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి మరో ఎలక్ట్రానిక్ పరికరానికి పంపించే సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ కంటే అతి తక్కువ ఫ్రీక్వెన్సీతో శరీరం గుండా సిగ్నల్స్‌ను పంపించవచ్చని గుర్తించారు. మానవ శరీరం ద్వారా సిగ్నల్స్‌ను 30 మెగాహెర్ట్జ్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీలో పంపించవచ్చని తేలింది. అలాగే ఫింగర్ ప్రింట్స్, టచ్ పాడ్స్ నుంచి రెండు నుంచి పది మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ సులభంగా ప్రసారం అవుతాయని పరిశోధకులు గుర్తించారు.
ఇంటికున్న స్మార్ట్‌లాక్‌ను ఓపెన్ చేయాలంటే మన స్మార్ట్ ఫోన్ నుంచి రేడియో తరంగాల ద్వారా సిగ్నళ్లను పంపించాల్సిన అవసరం లేదు. మన శరీరం ద్వారానే పంపించవచ్చని పరిశోధకుల ప్రయోగం ద్వారా రుజువైంది. అంటే ఫింగర్ ప్రింట్ ద్వారా స్మార్ట్ అప్లికేషన్‌ను పట్టుకొని మరో చేతితో డోర్ నాబ్‌ను పట్టుకుంటే మన శరీరం ద్వారా లాక్ పాస్‌వర్డ్ లేదా కోడ్ వర్డ్ డోర్ ఎలక్ట్రానిక్ డివైస్‌కు చేరుకొని డోర్ తెరుచుకుంటుంది. రేడియో తరంగాలు మధ్యలో గాలిలో ప్రయాణించవు కనుక వాటిని మధ్యలో ఎవరూ తస్కరించే అవకాశమే లేదు.
ఈ సిగ్నల్స్ ప్రసారం చేతి నుంచి చేతికే కాకుండా చేతి నుంచి కాలుకు, మోచేతికి, తలకు, శరీరంలో ఏ అవయం వరకైనా వెళతాయని కూడా పరిశోధకులు కనుగొన్నారు. తాము చేసిన ఈ ప్రయోగం ప్రాథమికంగా గ్లూకోమీటర్, ఇన్సులిన్ పంపింగ్ మిషన్ తదితర వైద్య పరికరాలతోపాటు ఇంట్లోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరాలను పని చేయించడానికి ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఊహించని ప్రయోజనాలు ఉండవచ్చని వారన్నారు. 'ది ఇంటెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పర్వేసివ్ కంప్యూటింగ్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్' ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది.
Advertisement
Advertisement