మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది? ఆత్మలున్నాయా? ఇలాంటి సందేహాలు సాధారణంగా చాలా మందికి వస్తాయి కదా. దీనిపై పురాణాల్లో ప్రస్తావనలు, సైన్స్ రచనల్లో కొన్ని కీలక విషయాలు న్నప్పటికీ అమెరికాకు చెందిన సీనియర్ నర్సు కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కెరీర్‌లో అనేక మరణాలను చూసిన ఆమె, మరణం చుట్టూ కొన్ని అపోహలు, భయాల్ని తొలగించాలనే లక్ష్యంతో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై వెలుగులోకి తెచ్చిన అంశాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.
ఇంటెన్సివ్ కేర్‌లో విస్తృతమైన అనుభవం ఉన్న నర్సు జూలీ మెక్‌ఫాడెన్, మరణం తర్వాత సంభవించే శారీరక మార్పులపై కొన్ని విషయాలను తాజాగా వివరించింది. చనిపోవడం గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఉద్దేశంతో ఈమె ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే మరణం తరువాత ఏమి జరుగుతుందనే అంశంపై చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.
నర్స్ జూలీ అందించిన వివరాల ప్రకారం, మరణించిన వెంటనే శరీరం 'రిలాక్స్' అవుతుంది. సహజమైన రిలాక్సేషన్ ప్రక్రియకు లోనవుతుంది. మరణం తరువాత శరీరం కుళ్లిపోవడంలో ఇదే మొదటి దశ, దీనిని హైపోస్టాసిస్ అంటారు. అందుకే కొంత మందికి మూత్ర విసర్జన, ప్రేగు కదలికలు ఉండవచ్చు లేదా ముక్కు, కళ్ళు లేదా చెవుల నుండి ద్రవాలు స్రవిస్తాయి. ఆ తరువాత అన్ని కండరాలు, వ్యవస్థలు రిలాక్స్ అయిపోతాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది
మరణం తర్వాత ఒక్కో శరీర స్పందన భిన్నంగా ఉంటుంది. అల్గోర్ మోర్టిస్ అనే శీతలీకరణ ప్రక్రియ కొందరికి వెంటనే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో ఒకటి లేదా రెండు గంటలదాకా ఆలస్యం కావచ్చు. ఈ ప్రక్రియలో సగటున, శరీర ఉష్ణోగ్రత గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది.
ఎవరికీ తెలియని విషయం
నర్స్ జూలీ ప్రకారం, శరీరంలోని గురుత్వాకర్షణ కారణంగా రక్తం కింది వైపు కదలడం ప్రారంభమవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. దీన్నే లివర్ మోర్టిస్ అంటారు. అలాగే సాధారణంగా మన ఆప్తులు చనిపోయిన తరువాత చాలాసేపు బాడీని ఇంట్లో ఉంచుకుంటాం. అపుడు వారి బాడీ తిప్పి చూసినా, పాదాలను గమనించినా మొత్తం ఊదారంగు లేదా నల్లగా మారిపోతుంది. దీనికి కారణం రక్తం కిందికి ప్రవహించడమే.
శరీరం గట్టిపడుతుంది
జీవక్రియ ప్రక్రియల ఆగిపోవడం వల్ల కండరాలు గట్టిపడతాయి. ఇది (రిగర్ మోర్టిస్) సాధారణంగా పోస్ట్‌మార్టం తర్వాత 2-4 గంటలలోపు ప్రారంభమవుతుంది. అయితే ఇది వివిధ భౌతికఅంశాలపై ఆధారపడి 72 గంటల వరకు కూడా సమయం పట్టవచ్చు. శరీరం బరువెక్కిపోతుంది.
బాడీ చల్లగా అయిపోతుంది
దాదాపు 12 గంటల తర్వాత, జీవక్రియ ఆగిపోవడంతో ఉష్ణోగ్రత నియంత్రణ ఆగిపోతుంది. వైటల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోతుంది. దీంతో బాడీ చల్లగా అయిపోతుంది. కుళ్ళిపోవడంలో చివరి దశ మొదలైనట్టు అన్నమాట. కుళ్ళిపోవడం అనేది ఒక సాధారణ భాగం. అయితే ఈ ప్రక్రియ మొదలు కాకముందే అంత్యక్రియలు జరిగిపోతాయి కాబట్టి చాలా అరుదుగా ఈ విషయాన్ని మనం గమనిస్తాం అని నర్స్ జూలీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment