జ్మోతిర్మయం
మానవ ధర్మంగా తగినంత ప్రయత్నం చేయకుండా, ఫలాన్ని గురించి ఆలోచించడం వివేకంతో కూడుకున్న పని కాదు. మానకుండా మానవ ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే, ఆ ప్రయత్నానికి సరైన సమయంలో దైవం అందించే సహకారం తోడవుతుంది. ‘దేవుడిస్తాడులే!’ అనుకుంటూ ఏరోజు కారోజు, ఏవిధమైన ప్రయత్నమూ చేయ కుండా, ఇంట్లో కూర్చుంటే ఎవరికైనా సంపద ఎలా చేకూరుతుంది? పళ్ళెంలో వడ్డించివున్న పంచభక్ష్య పరమాణ్ణాలు, ఎవరికైనా గాని తింటేనే కదా కడుపులోకి వెళ్ళేది! తినే ప్రయత్నం కూడా చేయకపోతే కడుపెలా నిండుతుంది? ఆక లెలా తీరుతుంది?
అందువల్ల సారాంశంగా తేలేది ఏమిటంటే మనిషి కోరకుండా దేవుడు ఇవ్వడం కూడా సంభవం కాదు. ఆకలితో ఉన్న బిడ్డడు, ఆ విషయాన్ని తల్లికి చెప్పి అడగనిదే అమ్మయినా పెట్టలేదు. ఇంట్లో అన్ని రకాల దినుసులు పుష్కలంగా ముందు నుండీ ఉంటాయి. కాని, వండి వార్చకుండా భోజనానికి వీలయ్యే పదార్థాలుగా అవి మార్పు చెందవు కదా! ఈ విషయాన్నే గట్టుప్రభువు తన ‘కుచేలోపా ఖ్యానం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని ఈ కింది పద్యం ద్వారా చెప్పాడు.
కం. కావున మనుజుడు సేయక
దేవుండీయంగ లేడు తెగి యేమియు నా
నావిధ ధాన్యము లుండిన
వావిరి వండకయె రిత్త వంటక మగునే.
శ్రమించడం శరీర ధర్మం అని చెప్పడం పై పద్యంలోని మాటల ముఖ్యోద్దేశం. ఆ శరీర ధర్మాన్ని పాటించే వ్యక్తికే దైవ సహాయమైనా ,అంతకంటే ముందు ఆ కష్టాన్ని ప్రత్యక్షంగాతన కళ్ళతో చూసి స్పందించే తోటి మనిషి సహాయమైనా అందుతుంది తప్ప ఆ ఉత్తమ ధర్మాన్ని పాటించని వ్యక్తులకు కాదని తెలుసు కోవాలి.
– భట్టు వెంకటరావు
Comments
Please login to add a commentAdd a comment