
తెలిసీ తెలియని జ్ఞానంతో యూట్యూబర్లు, వెల్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్లమంటూ ఇంటర్నెట్‌లో ఇచ్చే ఆరోగ్య సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే లేనిపోని అనుమానాలు, అపోహలు ఆందోళన తప్పదు. ఇంటర్నెట్‌లో వచ్చి సూత్రాలను, లేదా వారి ప్లాన్‌లను దినచర్యలో చేర్చుకోవాలని నిర్ణయించుకునే ముందు ఖచ్చితంగా నిపుణులచే ధృవీకరించు కోవాలి. అశాస్త్రీయమైన భావాలతో అలాంటి వారిచ్చే సలహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు ఈ స్టోరీని చదవండి.
పేరు తెలియని ప్రసవానంతర వెల్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్ ఒకటి చర్చకు దారి తీసింది. రోజు సమయం, సూర్యేడి దిశ, మీరు స్నానం చేసే సమయాన్ని బట్టి శరీరం విటమిన్ డి గ్రహించే స్థాయిలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ‘‘ఎండలోంచి వచ్చిన వెంటనే సూర్యరశ్మికి గురైన వెంటనే స్నానం చేయవద్దు, ఒక గంట వేచి ఉండండి (మీ చర్మానికి దానిని గ్రహించడానికి సమయం కావాలి!) సలహా ఇచ్చేసింది. వెంటనే స్నానం చేస్తే మన శరీరం గ్రహించిన విటమిన్ డీ కరిగిపోతుందని ఈ పోస్ట్ ఉద్దేశం.
ఇంకా ఏం చెప్పిందంటే..
మహిళలకు గర్భధారణ విషయంలో గర్భధారణ సమయంలో విటమిన్ డీ, బిడ్డ ఎముక, మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.తక్కువ విటమిన్ డి గర్భధారణ మధుమేహం, ప్రీక్లాంప్సియా & అకాల జనన ప్రమాదాన్ని పెంచుతుంది. శక్తి, రోగనిరోధక పనితీరును మెరుగు పరుస్తుంది. మానసిక శక్తినిస్తుంది. ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్ లాంటి వాటి నుంచి రక్షణిస్తుంది. సన్‌కు ఎక్స్‌పోజ్ కాకపోవడం వల్లే మహిళల్లో విటమిన్ డీ లోపం వస్తోందని, ఈ విటమిన్ లభించే పదార్థాల గురించి కూడా సమాచారం ఇచ్చింది. ఇదంతాబాగానే ఉంది. కానీ ఎండలోంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే విటమిన్ డీ పోతుంది. వెంటనే స్నానం చేయవద్దు, ఒక గంట వేచి ఉండండి (మీ చర్మానికి దానిని గ్రహించడానికి సమయం కావాలి!) అంటూ చెప్పిన ఈ పోస్ట్ వాదనను నిపుణులు తోసిపుచ్చారు.
ఈ వాదనలో నిజం ఎంత?
తీవ్రమైన ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్ల నీటితో స్నానం చేయడం మంచిది కాదని కూడా చెబుతారు. కానీ విటమిన్ డీ నష్టం గురించి ఎక్కడా ప్రస్తావనలేదు. ముంబైలోని గ్లెనీగల్స్ హాస్పిటల్ పరేల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మంజూషా అగర్వాల్ ఈ వాదనను తోసిపుచ్చారు. వెంటనే స్నానం చేసినా లేదా గంట తర్వాత స్నానం చేసినా, విటమిన్ డీ ఎక్కడికీ పోదని స్పష్టం చేశారు. ఇది అంతర్గతంగా జరిగే చర్య కాబట్టి ఆందోళన అవసరం లేదని భరొసా ఇచ్చారు. “UVB కిరణాలు చర్మ కణాలలోని కొలెస్ట్రాల్‌తో సంకర్షణ చెందినప్పుడు విటమిన్ D చర్మంలో సంశ్లేషణ చెందుతుంది. ఈ ప్రక్రియ ఉపరితలంపై కాకుండా అంతర్గతంగా జరుగుతుంది. చర్మాన్ని కడగడం వల్ల, మురికి పోయినట్టు విటమిన్ తుడిచిపెట్టుకుపోదని అధ్యయనాలు నిర్ధారించాయని తెలిపారు. దీనికి బదులుగా సురక్షితమైన సూర్యరశ్మి ని స్వీకరించడం, చర్మాన్ని, దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం పై దృష్టి పెట్టడం మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. <
విటమిన్ డీ ప్రాధాన్యత
మన శరీరానికి కావాల్సిన విటమిన్ డీ పొందాలంటే సూర్యరశ్మి కీలకం. సూర్యకాంతి మన శరీరం తగలడం ద్వారా బాడీలో విటమిన్ డి తయారవుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. డీ విటమిన్ పుష్కలంగా ఉంటేనే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పలు జీవక్రియలు సక్రమంగా జరగాలంటే విటమిన్ డీ ప్రాధాన్యత చాలా ఉంది.
రోజులో ఉదయం లేదా సాయంత్రం సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావానికి మన శరీరం గురైనపుడు,ముఖ్యంగా ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సూర్య కాంతి తగిలేలా ఎండలో ఉంటే విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డిని శరీరం అలా తయారు చేసుకుని పలు అవసరాలకు ఉపయోగించుకుంటుంది. విపరీతమైన ఎండతీవ్రతకు గురైతే అతినీలలోహిత కిరణాలతో ఎక్కువ హాని కలుగుతుంది. అందుకే ఉదయం 8 గంటల లోపు వాకింగ్ చేసినా, సూర్య నమస్కారాలు చేసినా, ఎండలో నిలబడినా మంచిదని వైద్య నిపుణులు చెబుతారు. సూర్యోదయం కంటే ముందు స్నానం చేయడం ఉత్తమమైన విధానమని కూడా పెద్దలు చెబుతారు.
నోట్: సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ పోస్ట్ లేదా ట్రెండ్‌ను గుడ్డిగా నమ్మేయొద్దు. ఇపుడు ఎక్కడ ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం విరివిగా వ్యాప్తి చెందుతోంది. ఏ సమాచారాన్నైనా ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవడం అవసరం. విశ్వనీయత కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం.