భానుడి వరం... | The gift of the sun | Sakshi
Sakshi News home page

భానుడి వరం...

Published Mon, Feb 16 2015 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

భానుడి  వరం...

భానుడి వరం...

అసలు విషయం చెప్పుకునే ముందుగా ఒక్కసారి పురాణకాలంలోకి వెళ్దాం. కుంతీదేవికి సూర్యుడి అంశతో కర్ణుడు సహజకవచకుండలాలతో పుట్టాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే... అది మన పూర్వికులు సూర్యుడి వల్ల ఎముకలూ, శరీరం అభేద్యంగా ఉంటాయన్న సంగతిని  ప్రతీకాత్మకంగా చెప్పారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మళ్లీ నవీనకాలంలోకి వద్దాం. భానుడి కాంతి తమ శరీరంపై సరైన రీతిలో ప్రసరించనివారి ఎముకలు గుల్లబారిపోతున్నాయి.  అంతేకాదు... ఆ సూర్యుడి వెలుగుకి తగినంత మోతాదులో ఎక్స్‌పోజ్ కానివారు ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నారు. కారణం... విటమిన్ ‘డి’ లోపం! బహుశా ఈ విటమిన్ అనేక వ్యాధులకు, అంతులేనంతగా ఇచ్చే వ్యాధినిరోధకతనే మన పూర్వికులు సహజ ‘కవచం’ అంటూ అభివర్ణించారేమో అనిపిస్తోంది కదా! పురాణాల మాట ఎలా ఉన్నా... ఈ నవీనకాలంలో విటమిన్ డి అంటే వ్యాధుల పట్ల అది సహజకవచమే. ఆ వ్యాధినిరోధక కవచాన్ని ధరించడం ఎలా అన్నది తెలిపేందుకే ఈ ప్రత్యేక కథనం.
 
ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. అందుకే వారి రచనల్లో ఆహ్లాదకరమైన రోజును ‘సన్నీడే’ అంటూ అభివర్ణిస్తుంటారు. ఎప్పుడూ మబ్బుపట్టి ముసురుతుంటుంది కాబట్టి ‘రెయిన్ రెయిన్... గో అవే’ అంటూ రయిమ్స్ పాడుతుంటారు. కాబట్టి... అక్కడ విటమిన్ ‘డి’ లోపం చాలా సహజం, సాధారణం. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ అంటే నూరు కోట్లమంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు  సూర్యకాంతి కోసం సన్‌బాత్‌ల వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తుంటారు. కానీ ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట కూడా ఇప్పుడు ప్రజల్లో విటమిన్ ‘డి’ లోపం వేధిస్తోంది. సామాజికంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు క్రమంగా పెరిగిపోవడం, ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశాలు తగ్గడమే దీనికి కారణం. విటమిన్ డి లోపం కారణంగా వస్తాయని పేర్కొనే అనేక అనర్థాలు ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తుండటంతో డాక్టర్లు సైతం పెద్ద ఎత్తున రోగులకు విటమిన్ ‘డి’ సప్లిమెంట్లు వాడుతుండటం ప్రస్తుత  చికిత్సాశైలిగా మారింది.
 
 
విటమిన్ ‘డి’ అంటే...
 

శరీరానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి. అయితే ఈ పోషకం ఆహారంలో కంటే సూర్మరశ్మి నుంచే ఎక్కువగా లభ్యమవుతుంది. సూర్యకాంతి వల్ల దొరికేది 80 శాతమైతే... కేవలం మిగతా 20 శాతం మాత్రమే ఆహార పదార్థాల నుంచి  లభ్యమవుతుంటుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. దీన్ని సాంకేతికంగా సెకోస్టెరాయిడ్ అంటారు. అంటే దీని నిర్మాణంలో పరమాణు వలయాలు తెగినట్లుగా ఉంటాయి. (సెకో అంటే బ్రోకెన్ అని అర్థం). పైగా స్టెరాయిడ్ వంటి పదార్థాల నుంచి ఆవిర్భవించిందనే మరో అర్థం కూడా ఉంది. కాబట్టి స్వాభావిక స్టెరాయిడ్‌తో పాటూ విటమిన్ కూడా! ఫలితంగా ఇది శరీరానికి కలిగించే ప్రయోజనాలెన్నో ఉన్నాయి.
 
 ఎలా తయారవుతుంది?...

చర్మానికి సూర్యకాంతి తగలగానే విటమిన్ డి ఆవిర్భవిస్తుంది. ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో అది ‘క్యాల్సీడియల్’ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్‌కు తొలిరూపాన్ని తీసుకుంటుంది. మళ్లీ అది రక్తప్రవాహంలో కలిసి ‘క్యాల్సీడియల్’ నుంచి క్యాల్సిట్రియల్‌గా మారుతుంది. ఈ క్యాల్సిట్రియాల్‌నే ‘విటమిన్-డి’ అనుకోవచ్చు. రక్తప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి  ‘విటమిన్-డి’గా రూపొందుతుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ రూపొందుతుంది. అందుకే ఈ విటమిన్ ఇంత ప్రభావపూర్వకమైన ‘సహజవ్యాధి నిరోధకారి’గా పనిచేస్తుంది. అంటే ఇది ఒక శరీరానికి అవసరమైన పోషకం, దాంతోపాటూ శరీరం తయారు చేసుకునే ఒక హార్మోన్ లాంటిది కూడా కావడంతో రెండు రకాల భూమికలనూ పోషిస్తుంది.
 
 కనుగొన్న తీరు  ఆసక్తిదాయకం...

 
విటమిన్-డి ని కనుగొన్న తీరును కథలా చెబితే ఒక థ్రిల్లర్‌ను తలపింపజేస్తుంది. రెండు శతాబ్దాల క్రితం రికెట్స్ అనే ఎముకల వ్యాధి వ్యాప్తి విస్తృతంగా ఉండేది. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎముకలు తమ సహజ ఆకృతిని కోల్పోయి వంకరలు తిరిగిపోవడం, దొడ్డికాళ్లలా మారడం వంటివి జరిగేవి. పిల్లల్లో వచ్చిన రికెట్స్‌ను ‘ఆస్టోమలేసియా’ అనేవారు. దాదాపు నూరేళ్ల క్రితం హాలెండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఈ రికెట్స్‌కు విరుగుడుగా వైద్యులు ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే నూనెను ఉపయోగించేవారు. దీన్ని కాడ్ అనే రకం చేప కాలేయం నుంచి సంగ్రహించేవారు.

1918లో  ఎడ్వర్డ్  మెలాన్‌బీ అనే శాస్త్రవేత్త - కాడ్‌లివర్ ఆయిల్‌లోని కొవ్వులో కరిగే ఒక నిర్దిష్టమైన పోషకమే ఈ రికెట్స్ వ్యాధికి సమర్థమైన చికిత్సగా పని చేస్తోందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 1924లో హెచ్. స్టీన్‌బాక్, ఆల్ఫ్రెడ్ ఫేబియన్ హెస్ అనే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు కొన్ని జీవులను తాకినప్పుడు ఆ జీవుల్లో కొవ్వులాంటి పోషకం ఉత్పత్తి అవుతుంటుందని కనుగొన్నారు. ఆ పోషకాన్ని ‘వయొస్టెరాల్’ అని పిలిచేవారు. ఇక 1935లో దీన్ని ల్యాబ్‌లో ఐసోలేట్ చేసి, దానికి ‘క్యాల్సిఫెరాల్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత అందులో కొద్దికొద్ది నిర్మాణపరమైన మార్పులతో... అనేకరకాల విటమిన్ డి (డి1, డి2, డి3.... డి7, డి8)లను కనుగొన్నారు.
 
విటమిన్ ‘డి’లో రకాలు...
 
‘విటమిన్ డి’లో విటమిన్ డి1, డి2, డి3...డి7... ఇలా చాలా రకాలు (దాదాపు పది వరకు) ఉన్నాయి. కానీ వాటిల్లో  విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) ముఖ్యమైనవి.
 
 ఇతర సమస్యలకూ చికిత్సగా...


ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికీ విటమిన్ ‘డి’ని వైద్యులు ప్రిస్క్రయిబ్ చేస్తారు. హై కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి, డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి, మల్టిపుల్ స్క్లిరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి, ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులకు, మహిళల్లో ప్రీ-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి, పంటి, చిగుళ్ల వ్యాధుల నివారణకు, విటిలిగో (బొల్లి), స్క్లిరోడెర్మా, సోరియాసిస్ వంటి చర్మరోగాలు ఉన్నవారికి డాక్టర్లు  విటమిన్-డిని సూచిస్తారు. సోరియాసిస్ చికిత్సలో ‘క్యాల్సిట్రియల్’ లేదా ‘క్యాల్సిపోట్రియాల్ / క్యాల్సిపోట్రిన్’ అనే రూపంలో విటమిన్-డిని పైపూతమందుగా పూస్తారు. ఇక  విటమిన్-డి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. అందుకే  అనేక రకాల క్యాన్సర్ల చికిత్సల్లో ‘విటమిన్-డి’ని ఒక మందులాగానే ప్రిస్క్రిప్షన్‌లో సూచిస్తారు.
 
విటమిన్ డి లోపాన్ని  నిర్ధారణ చేస్తారిలా...

 
రక్తపరీక్ష ద్వారా విటమిన్-డి ఉండాల్సిన పరిమాణంలో ఉందా, లేదా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఇందుకోసం 25 (ఓహెచ్)డీ అనే పరీక్షనూ లేదా 1,25 (ఓహెచ్) డీ3 అనే పరీక్షను చేస్తారు. విటమిన్-డి ఉండాల్సిన పాళ్లు తెలుసుకునేందుకు పైన పేర్కొన్న మొదటి పరీక్ష అయిన 25 (ఓహెచ్)డీ మంచి ఫలితాలను ఇస్తుందని చాలామంది వైద్యుల అభిప్రాయం. 25 (ఓహెచ్)డీ పరీక్షనే 25-హైడ్రాక్సీక్యాల్సిఫెరాల్ లేదా 25-హైడ్రాక్సీ విటమిన్- డి అనే మాటకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో విటమిన్ డీ పాళ్లు 50-65 ఎన్‌జీ/ఎమ్‌ఎల్ ఉండాలి. దాని కంటే తక్కువగా ఉంటే విటమిన్-డి మాత్రలను డాక్టర్లు సూచిస్తారు.
 
విటమిన్ ‘డి’ - విశేషాలు...

 
 ఎండవేళలోనే విటమిన్-డి తయారవుతుంది. పైగా చర్మాన్ని తాకాక అది కాలేయాన్ని చేరుతుంది. ఇలా విటమిన్-డి తయారీలోనూ, నిక్షిప్తం చేయడంలోనూ కాలేయం కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి... ఎండ తక్కువగా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమైన విటమిన్-డిని కాలేయం నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది.
     
క్యాల్షియమ్ సక్రమంగా ఎముకల్లోకి ఇంకి... వాటిని పటిష్టం చేసేందుకు విటమిన్-డి ఎంతో అవసరం. ఆహారంలోని క్యాల్షియమ్‌ను శరీరం తీసుకునే ప్రక్రియలో అది పేగుల్లోనే జరిగేలా విటమిన్-డి తోడ్పడుతుంది.గర్భిణులకు తగినంత విటమిన్ -డి  ఇవ్వడం వల్ల భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. వాళ్ల వికాసానికి విటమిన్-డి ఎంతగానో తోడ్పడుతుంది.జుట్టు ఒత్తుగా పెరగడం కోసం కూడా విటమిన్-డి తోడ్పడుతుంది.విటమిన్-డి లోపం ఉన్నవారు సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే వేళల్లో మాత్రం సన్‌స్క్రీన్ వాడకూడదు. సన్‌స్క్రీన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అల్ట్రావయొలెట్ కిరణాలను చర్మంలోకి ఇంకనివ్వక లోపాన్ని పెంచుతుంది.
 
విటమిన్-డి లోపాలతో వచ్చే సమస్యలు...
 
విటమిన్-డి లోపాలతో వచ్చే ఆరోగ్య సమస్యల చిట్టా చాలా పెద్దదే. అందుకే ఇటీవల సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే రోగుల్లోనూ డాక్టర్లు విటమిన్‌‘డి’ లోపాన్ని ఎక్కువగా కనుగొంటున్నారు. విటమిన్ ‘డి’లోపం వల్ల కనిపించే సమస్యలు...  శరీరంలో ఖనిజలవణాల అసమతౌల్యత (ముఖ్యంగా జింక్, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి)  హార్మోన్ల అసమతౌల్యత  అత్యంత వేగంతో భావోద్వేగాలు మారిపోవడం (మూడ్స్ స్వింగింగ్)  మానసిక ఆరోగ్యం దెబ్బతినడం  గర్భవతుల్లో పిండం ఎదుగుదలలో లోపాలు  మెదడు కణాలైన న్యూరాన్లు (నరాల కనెక్షన్లలో) లోపాలు  కండరాల కదలికల్లో సమన్వయలోపాలు  రక్తపోటు  ధమనుల్లో రక్తప్రసరణ లోపాలు  చక్కెర నియంత్రణలో లోపాలు  దంతసంబంధమైన సమస్యలు  కణ విభజనలో లోపాలు  ఎముకల బలం లోపించడం  వ్యాధి నిరోధక శక్తి తగ్గడం  రికెట్స్ వ్యాధి  ఆస్టియోపోరోసిస్  ఆస్టియోమలేసియా  ఒక్కోసారి ఫిట్స్ రావడం మొదలైనవి.  
 
విటమిన్ ‘డి’ని పొందడం ఇలా...

 
ముఖం, చేతులు, భుజాలు, సాధ్యమైనంత వరకు శరీర భాగాలు లేత ఎండ కాంతికి ఎక్స్‌పోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మంచి మార్గం. దీనితో పాటూ... డాక్టర్లు అనేక రకాల విటమిన్ ‘డి’ మాత్రలను, వాటిని ఉపయోగించాల్సిన మోతాదులను సూచిస్తుంటారు. ఒకవేళ మాత్రలు సరిపడక స్వాభావిక రూపంలోనే విటమిన్-డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాలివి...
 
చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి దొరుకుతుంది. ప్రధానంగా కాడ్, మాక్‌రెల్, సొరచేప (షార్క్), సార్‌డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలలో.
     
వేటమాసం, అందులోనూ ప్రత్యేకంగా కాలేయంతో పాటు వెన్న, నెయ్యి, గుడ్డులోని పచ్చసొనలో ‘విటమిన్-డి’ ఎక్కువ. ఇటీవల చాలామంది పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదంటూ దాన్ని పరిహరిస్తున్నారు. కానీ దానిలో కొలెస్ట్రాల్‌తో పాటు క్యాలిటరాల్ అని పిలిచే విటమిన్-డి ఉంటుంది. కాబట్టి విటమిన్-డి కోసం పచ్చసొన తీసుకోవడం చాలా మంచిది. పచ్చసొనను పరిహరించడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే క్యాల్సిటరాల్ వంటి ఎన్నో పోషకాలు పోగొట్టుకునే నష్టమే ఎక్కువ. అందుకే పరిమిత స్థాయిలో పచ్చసొన తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.
     
పుట్టగొడుగుల్లో విటమిన్-డి2 ఎక్కువగా ఉంటుంది. విటమిన్-డి లోపం ఉన్నవారు పుట్టగొడుగులతో చేసిన రకరకాల ఆహార పదార్థాలతో పాటు ఎండలో నడవటం వల్ల స్వాభావికంగానే విటమిన్-డి2 సమకూరుతుంది.
     
ఫోర్టిఫైడ్ ఆహారాల్లో...:  పాలు, జ్యూస్ వంటి కొన్ని రకాల ఆహారపదార్థాల్లో ఇతర పోషకాలతో మరింత సంతృప్తం చేస్తారు. ఇలాంటి ఆహారాలను ఫోర్టిఫైడ్ ఆహారాలుగా పేర్కొంటారు. మామూలుగా అయితే పాలలో విటమిన్-డి పాళ్లు తక్కువే. కానీ ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ సోయామిల్క్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్, ఫోర్టిఫైడ్ ఓట్‌మీల్, ఫోర్టిఫైడ్ సిరేల్స్ (తృణధాన్యాల) వంటి ఆహార పదార్థాల్లో విటమిన్-డి పాళ్లు ఎక్కువ.
 
 ఏయే పదార్థాలలో ఎంతెంత...?
 
వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు  చర్మం కింది పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి...
 
ఆహార పదార్థం    పరిమాణం (మైక్రోగ్రాముల్లో)

కాడ్‌లివర్ ఆయిల్       175
షార్క్ లివర్ ఆయిల్     50
గుడ్లు (పచ్చసొనతో)    1.5
నెయ్యి                    2.5
వెన్న                    1.0
(ఇవన్నీ 100 గ్రాముల ఎడిబుల్ పోర్షన్‌లో లభించే మోతాదులు)
 
విటమిన్ - డి కోసం డైట్‌ప్లాన్
 
ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా విటమిన్-డిని స్వాభావికంగానే పొందాలంటే న్యూట్రిషనిస్టులు వ్యక్తిగతంగా వారిని పరిశీలించి, డైట్ ప్లాన్ చెబుతారు. ఇక్కడ పేర్కొన్న డైట్ ప్లాన్ సగటు వ్యక్తి కోసం రూపొందించినదిగా భావించవచ్చు.
 
ఉదయం 6.30కి: ఒక గ్లాసు విటమిన్-డితో ఫోర్టిఫై చేసిన (వాస్తవ అర్థంలో చెప్పాలంటే మరింత బలోపేతం చేసిన అని చెప్పుకో వచ్చు) లో ఫ్యాట్ (కొవ్వు తక్కువగా వున్న) పాలు.
 
బ్రేక్‌ఫాస్ట్ 8 గం.లకు: ఒక కప్పు ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ డి ఓట్‌మీల్ లేదా ఒకకప్పు కార్న్‌ఫ్లేక్స్ ప్లస్ ఒక ఉడికించిన గుడ్డు (పచ్చసొనతో సహా ఇందులో 42 ఐయూ విటమిన్ డి ఉంటుంది).
 
బ్రంచ్ 11 గంటలకు: విటమిన్-డి ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ / ఆపిల్ జ్యూస్ / స్ట్రాబెర్రీ జ్యూస్ ఒక గ్లాసు.
 

లంచ్ (ఒంటిగంటకు): రాగులు / జొన్నలు / పొట్టు తీయని ముడిబియ్యంతో ఒక పెద్ద కప్పు అన్నం ప్లస్ అంతే మోతాదులో ఆకుపచ్చని ఆకుకూరలతో చేసిన కూర ప్లస్ 100 గ్రాముల చేపల కూర (ఈ చేపలు ట్యూనా/సార్డిన్ రకానికి చెందినవైతే మంచిది) ప్లస్ ఒక కప్పు వెజ్ సలాడ్. ప్లస్ చివర్లో పెరుగు.

 సాయంత్రానికి కాస్త ముందు అంటే 3 గంటలప్పుడు: ఫోర్టిఫైడ్ సోయా మిల్క్.సాయంత్రం వేళ అంటే 5 గంటల ప్రాంతంలో: మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) ఒక కప్పు ప్లస్ చీజ్ శాండ్‌విచ్ / టోఫూ శాండ్‌విచ్. రాత్రి భోజనంలో అంటే రాత్రి 8 గంటలకు : ఫోర్టిఫైడ్ ఓట్‌మీల్ ఒక కప్పు ప్లస్ మష్రూమ్‌తో చేసిన కూర లేదా ఆకుపచ్చటి ఆకుకూరలతో చేసిన కూర. నిద్రకు ఉపక్రమించే ముందు 10 గంటలకు: ఒక గ్లాసెడు విటమిన్-డి ఫోర్టిఫైడ్ అండ్ లో ఫ్యాట్ పాలు.
 
విటమిన్ డి టాక్సిసిటీ అంటే
 

ఇంతటి ఉపయోగకరమైన విటమిన్-డి ఉండాల్సిన మోతాదు కంటే మించితే... అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు సొంతంగా విటమిన్-డి మాత్రలు వాడటం, కాడ్‌లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటితే ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం సాధారణం. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని గోడలపైనా, మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు (క్యాల్సిఫికేషన్) రావచ్చు.  రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా... ఇతరత్రా రూపాల్లో విటమిన్-డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement