కాస్తంత ఎండ తగలనీయండి!
ఈమధ్యే నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో 65–75% మంది విటమిన్ డి లోపంతో ఉన్నారని తెలిసింది. మరి ఆ విటమిన్ డి అందడానికి కష్టపడాల్సిన పనేమైనా ఉందా? అంటే అదీ లేదు. ప్రకృతి నుంచి చాలా సహజంగా అందే విటమిన్ అది. సూర్యరశ్మి ఒంటికి తగిలితే కావాల్సిన విటమిన్ డి దానంతట అదే అందుతుంది. కాగా మారిన జీవన విధానంతో సహజసిద్ధంగా లభించే ఆ సూర్యరశ్మికి కూడా ఇప్పటి తరం దూరమవుతోంది.
ఇది ఇలాగే జరుగుతూ పోతే పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. విటమిన్ డి లోపం ఎన్నో రోగాలకు దారితీసే అవకాశం ఉంది. విటమిన్ డి తగ్గుతూ పోతే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే అది ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విటమిన్ డి తగ్గితే ఒంట్లో కాల్షియం నిలవదు. దీంతో ఎముకల్లో పటిష్టత తగ్గిపోతుంది. సాధారణంగా 30–100 యూనిట్ల మధ్య విటమిన్ డి ఉండాలి. అంతకు తగ్గితే జాగ్రత్త పడడం చాలా అవసరం.
మరి ఏం చేయాలి?
విటమిన్ డి పొందాలంటే సూర్యరశ్మి తగిలేలా చూస్కోవడమే సులువైనది, ఉత్తమమైనది. రోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల మధ్య ఓ పావుగంట పాటు బాడీకి ఎండ తగలనివ్వాలి. చేపలు, చికెన్, సోయాబిన్ లాంటివి తినడం ద్వారా కూడా కొంత విటమిన్ డి అందుతుంది. కౌంట్ మరీ 10 యూనిట్లకు తగ్గిపోతే డాక్టర్ సలహాతో విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవడం తప్పక చేయాల్సిన పని.