గోరువెచ్చని సూరీడు చాలా మంచివాడు!
ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల్లోపు కనీసం 20 నిమిషాల సేపు సూర్యకాంతిని ఆస్వాదిస్తే చాలు మీ జీవన శైలిలో ఎంతో ఉత్సాహవంతమైన మార్పులు వస్తాయని అంటున్నారు పరిశోధకులు. ఉదయం పూట ఎండతో శరీరానికి విటమిన్ డి సమకూరుతుందనే అంశం అందరికీ తెలిసిందే. అంతే కాదు.. ఉదయం పూట గోరవెచ్చని ఎండ రాత్రి వరకూ శరీరంపై ప్రభావం చూపగలదట. ప్రధానంగా ఉత్సాహాన్ని ప్రసాదిస్తాయట సూర్యకిరణాలు. శారీరకంగా యాక్టివ్ గా ఉండటంతో పాటు ఆకలి కొంచెం పెరగడం, శారీరక జీవ క్రియలు క్రమబద్ధం కావడం జరుగుతుందట. అమెరికాకు చెందిన నార్త్ వెస్ట్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం వారు ఈ విషయాలను వివరించారు.
నడవండి.. కాన్సర్ బారికి దూరంగా!
రోజులో రెండు గంటలసేపు అదనంగా కూర్చోవడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 10 శాతం పెరుగుతాయి. పెద్దప్రేవులకు క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 8 శాతం పెరుగుతుంది, ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆరు శాతం పెరుగుతాయి... నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వారి జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. మామూలుగా వ్యాయామం చేస్తూ కూడా అదనంగా కూర్చొవడం వల్ల ఈ ప్రమాదాలు తప్పవట. అందుకే వీలైనంత ఎక్కువగా నడవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.