The National Cancer Institute
-
ప్రతి 13 మంది కేన్సర్ బాధితుల్లో ఓ భారతీయుడు
భారత్‌లో కేన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజూరోజుకు పెరుగుతుంది. అది ఎంతగా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 మంది కేన్సర్ రోగుల్లో ఓ భారతీయుడు ఉన్నాడట. ఈ విషయం తమ పరిశీలనలో వెల్లడైందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖకు చెందిన ద నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ (ఎన్సీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో 18 లక్షల మంది ప్రజలు కేన్సర్ బారిన పడ్డారని వెల్లడించింది. వీరిలో రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్, నోటి కేన్సర్ సోకిన వారే అధికంగా ఉన్నారని తెలిపింది. ఎన్సీఐ ఆధ్వర్యంలో సోమవారం నోయిడాలో ఈ అంశంపై అంతర్జాతీయ వర్క్ షాపు ప్రారంభమైంది. దక్షిణాసియాలో ఎన్సీఐ చేపట్టిన ఈ వర్క్‌షాప్ మొట్టమొదటిదని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి వర్క్ షాపులు 2010లో బ్రెజిల్, 2011లో మెక్సికో, 2012లో చైనా, అర్జెంటీనాలో, 2013లో పోర్టోరికాలో నిర్వహించామని చెప్పారు. ఈ వర్క్ షాప్ మంగళవారం ముగిసింది. -
గోరువెచ్చని సూరీడు చాలా మంచివాడు!
ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల్లోపు కనీసం 20 నిమిషాల సేపు సూర్యకాంతిని ఆస్వాదిస్తే చాలు మీ జీవన శైలిలో ఎంతో ఉత్సాహవంతమైన మార్పులు వస్తాయని అంటున్నారు పరిశోధకులు. ఉదయం పూట ఎండతో శరీరానికి విటమిన్ డి సమకూరుతుందనే అంశం అందరికీ తెలిసిందే. అంతే కాదు.. ఉదయం పూట గోరవెచ్చని ఎండ రాత్రి వరకూ శరీరంపై ప్రభావం చూపగలదట. ప్రధానంగా ఉత్సాహాన్ని ప్రసాదిస్తాయట సూర్యకిరణాలు. శారీరకంగా యాక్టివ్ గా ఉండటంతో పాటు ఆకలి కొంచెం పెరగడం, శారీరక జీవ క్రియలు క్రమబద్ధం కావడం జరుగుతుందట. అమెరికాకు చెందిన నార్త్ వెస్ట్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం వారు ఈ విషయాలను వివరించారు. నడవండి.. కాన్సర్ బారికి దూరంగా! రోజులో రెండు గంటలసేపు అదనంగా కూర్చోవడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 10 శాతం పెరుగుతాయి. పెద్దప్రేవులకు క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 8 శాతం పెరుగుతుంది, ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆరు శాతం పెరుగుతాయి... నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. మామూలుగా వ్యాయామం చేస్తూ కూడా అదనంగా కూర్చొవడం వల్ల ఈ ప్రమాదాలు తప్పవట. అందుకే వీలైనంత ఎక్కువగా నడవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.