ప్రతి 13 మంది కేన్సర్ బాధితుల్లో ఓ భారతీయుడు
భారత్లో కేన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజూరోజుకు పెరుగుతుంది. అది ఎంతగా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 మంది కేన్సర్ రోగుల్లో ఓ భారతీయుడు ఉన్నాడట. ఈ విషయం తమ పరిశీలనలో వెల్లడైందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖకు చెందిన ద నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ (ఎన్సీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో 18 లక్షల మంది ప్రజలు కేన్సర్ బారిన పడ్డారని వెల్లడించింది. వీరిలో రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్, నోటి కేన్సర్ సోకిన వారే అధికంగా ఉన్నారని తెలిపింది.
ఎన్సీఐ ఆధ్వర్యంలో సోమవారం నోయిడాలో ఈ అంశంపై అంతర్జాతీయ వర్క్ షాపు ప్రారంభమైంది. దక్షిణాసియాలో ఎన్సీఐ చేపట్టిన ఈ వర్క్షాప్ మొట్టమొదటిదని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి వర్క్ షాపులు 2010లో బ్రెజిల్, 2011లో మెక్సికో, 2012లో చైనా, అర్జెంటీనాలో, 2013లో పోర్టోరికాలో నిర్వహించామని చెప్పారు. ఈ వర్క్ షాప్ మంగళవారం ముగిసింది.