![Racheal Kaur: Indian Super Mom flies from one city to another for job](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/rachel-kaur.jpg.webp?itok=6MJzsx1e)
మలేసియాలో పెనాంగ్ నుంచి కౌలాలంపూర్‌కు 350 కిలోమీటర్లు. ట్రైన్ లో నాలుగ్గంటలు. విమానంలో గంట. వివిధ కారణాల రీత్యా పెనాంగ్‌లో నివాసం ఉంటున్న రేచల్ కౌర్(Racheal Kaur) కౌలాలంపూర్‌లోని తన ఉద్యోగానికి రోజూ విమానంలో వెళ్లి వస్తోంది. ‘టీనేజ్ పిల్లలు ఉన్నారు... వారికి తల్లి అవసరం ఎక్కువ’ అంటోంది. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా తల్లులు తమ పిల్లలకు ఇవ్వాల్సిన సమయం గురించి ఈ భారతీయ తల్లి కథనం గుర్తు చేస్తోంది.
పిల్లల పెంపకం, కెరీర్... ఈ రెండు కత్తిమీద సామే వర్కింగ్ ఉమెన్‌కు. పిల్లలకు పూర్తిసమయం ఇస్తున్నామా లేదా అనేది ఒక ఆందోళనైతే వృత్తిలో ముందుకుపోగలమా లేదా అనేది మరో ఆందోళనగా ఉంటుంది. వీటిమధ్య నలగడం కంటే శక్తికి మించి ఎంతమేరకు చేయగలమో అంతమేరకు చేసి తృప్తిపడుతున్న తల్లులూ ఉన్నారు.
మలేసియాలో స్థిరపడ్డ మన పంజాబీ రేచల్ కౌర్ కథ అలాంటిదే. ఆమె తన పిల్లల కోసం బహుశా ఏ తల్లీ చేయని పని చేస్తోంది. అదేంటంటే రోజూ విమానంలో పనికి వెళ్లి విమానంలో రావడం! చాలామంది ఇది పిచ్చా... వెర్రా... అని ఆశ్చర్యపోతారుగాని నాకు ఇదే బాగుందని రేచల్ అంటోంది.
ఇల్లు ఒకచోట.. పని ఒకచోట!
రేచల్ కౌర్ తన భర్త జగ్‌జిత్ సింగ్ ఇద్దరు పిల్లలతో మలేసియాలోని పెనాంగ్‌లో ఉంటోంది. ఆమె ఉద్యోగం కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో. ఎందుకంటే ఆమె ఎయిర్ ఏసియాలో బిజినెస్ మేనేజర్. ఈ రెండు చోట్ల మధ్య 350 కిలోమీటర్లు ఉంది. బస్సు మార్గం కష్టం. రైలు సులువు. కాని ఉద్యోగానికిపోయి వచ్చేంత వీలుగా రైళ్లు
ఉండవు. ‘అందుకే నేను ఉద్యోగం కోసం కౌలాలంపూర్‌లో ఉంటూ వారానికి ఒకసారి వచ్చి వెళ్లేదాన్ని. కౌలాలంపూర్‌లో ఉండటానికి రూమ్‌కు, నా తిండికి బాగానే ఖర్చయ్యేది. దానిబదులు రోజూ వచ్చి వెళితే కేవలం లంచ్ ఖర్చు, చార్జీల ఖర్చు తప్ప మరే ఖర్చూ ఉండదనిపించింది. దాంతో విమానంలో వచ్చి వెళ్లాలని
నిశ్చయించుకున్నాను’ అంటుంది రేచల్ కౌర్.
చార్జీల్లో రాయతీ
రేచల్ కౌర్ ఎయిర్ ఏసియాలో పని చేస్తుంది. ఆ సంస్థ వారు ఆమెకు రాయితీ ఇవ్వడం వల్ల రాకపోకల ఖర్చు బాగా తగ్గింది. ‘మా ఉద్యోగి ఉద్యోగాన్ని, ఇంటిని బేలెన్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తే సహకరించడం మా బాధ్యత. ఇలా పని చేయాలని కోరుకునేవారికి మేము పూర్తి సహకారం అందిస్తాం’ అని ఎయిర్ ఏసియా ప్రతినిధులు రేచల్‌ను ప్రస్తావిస్తూ అన్నారు.
ఉదయం 4 గంటలకు లేచి
రేచల్ ఇల్లు పెనాంగ్‌లో ఎయిర్‌పోర్ట్‌కు బాగా దగ్గర. ‘నేను ఉదయాన్నే నాలుగు లేదా నాలుగుంపావుకు నిద్ర లేస్తాను. ఐదు గంటలకంతా రెడీ అయ్యి నా కారులో ఎయిర్
పోర్టుకు బయలుదేరుతాను. మా ఎయిర్ ఏసియా రోజువారీ విమానం బోర్డింగ్ టైమ్ 5.55 నిమిషాలు. నేను ఎయిర్‌పోర్ట్‌లో కారుపార్క్ చేసి సులభంగా బోర్డ్ చేయగలిగేంత సమయం ఉంటుంది.
ఆరున్నరకు బయలుదేరిన విమానం ఏడున్నరకంతా కౌలాలంపూర్ చేరుతుంది. ఇంకో పదిహేను నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌లోని మా ఆఫీస్‌లో ఉంటాను’ అని చెప్పింది రేచల్. ‘ప్రతి రోజూ విమానంలో ఉదయంపూట కాసేపు ప్రార్థన చేసుకుంటాను. అక్కడే బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీ ముగిశాక మళ్లీ విమానం ఎక్కుతాను. ఏడున్నరకంతా ఇంట్లో ఉంటాను’ అంది రేచల్. 2024 ప్రారంభం నుంచి ఇలా రోజూ తిరుగుతున్నాను. వీకెండ్ రెండు రోజులు తప్పించి ఇప్పటికి 200 రోజులకు పైగా విమానంలో రోజూ వచ్చి వెళ్లాను’ అందామె.
నా పిల్లల కోసం..
‘నా కొడుక్కు 12 సంవత్సరాలు. నా కూతురికి 11 సంవత్సరాలు. వారు ఎదిగే సమయం. నేను వారానికి ఒకసారి కనపడితే వాళ్ల తిండి, హోమ్ వర్కులు, ఎమోషన్స్ ఎలా తెలుస్తాయి. వారికి నేను కావాలి. అందుకే ఈ మార్గం కష్టమైనా సరే ఎంచుకున్నాను. నా ఆఫీస్‌లోని కలీగ్స్ నన్ను అర్థం చేసుకుని సహకరిస్తారు. ఇంట్లో నా భర్త. అందుకే రోజంతా ఎంత కష్టపడినా ఇంటికి చేరి నా పిల్లల ముఖాలు చూసేసరికి నా కష్టమంతాపోతుంది.
ఇంతకుమించి ఏం కావాలి’ అంటుంది రేచల్.టీనేజ్ వయసులో కూతురికైనా, కొడుక్కైనా తల్లి తోడ్పాటు ఉండాలి. తండ్రితో చెప్పుకోలేనివి వారు తల్లితో చెప్పుకుంటారు. ఏ కెరీర్‌లో ఉన్నా తల్లి ఈ సంగతిని మిస్ చేయకూడదని నిపుణులు అంటారు. రేచల్ ఉదంతం తల్లి బాధ్యతను గట్టిగా గుర్తు చేసేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment