205 మందిని వెనక్కి పంపిన అమెరికా | Trump govt sending 205 illegal Indian migrants back home | Sakshi
Sakshi News home page

205 మందిని వెనక్కి పంపిన అమెరికా

Published Wed, Feb 5 2025 4:32 AM | Last Updated on Wed, Feb 5 2025 4:32 AM

Trump govt sending 205 illegal Indian migrants back home

శాన్‌ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం 

అమెరికాలో చట్టవిరుద్ధంగా 7,25,000 మంది భారతీయులు

వాషింగ్టన్‌: అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం సీ–17 స్థానిక కాలమానం ప్రకారం సోమవారం శాన్‌ ఆంటోనియో నుంచి భారత్‌కు బయలుదేరింది. విమానం 24 గంటల తరువాత పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకుంటుందని, వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరినీ పరిశీలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ విమానం ఇంధనం కోసం జర్మనీలోని రామ్‌స్టీన్‌లో ఆగనుంది. ఈ పరిణామాలను ధ్రువీకరించడానికి యూఎస్‌ ఎంబసీ నిరాకరించింది. 

18వేల మందితో జాబితా.. 
అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్ఫోర్సె్మంట్‌ (ఐసీఈ) దాదాపు 18,000 మంది డాక్యుమెంట్లు లేని భారతీయ పౌరుల తొలి జాబితాను రూపొందించింది. టెక్సాస్‌లోని ఎల్‌పాసో, కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో నుంచి 5,000 మందికి పైగా వలసదారులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పెంటగాన్‌ ప్రకటించింది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ డేటా ప్రకారం, 725,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు, మెక్సికో, ఎల్‌ సాల్వడార్‌ తరువాత అనధికారిక వలసదారుల జనాభాలో భారత్‌ మూడోస్థానంలో ఉంది. డాక్యుమెంట్లు లేని భారతీయులను చట్టబద్ధంగా తమ దేశానికి తిరిగి తీసుకురావడానికి భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని గత నెలలో న్యూఢిల్లీ తెలిపింది.

దీనికి ఏ దేశం మినహాయింపు కాదని, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నవారిలో భారతీయులు ఉంటే చట్టబద్ధంగా స్వదేశానికి తీసుకు రావడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని జైశంకర్‌ తెలిపారు. చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చిన భారతీయ వలసదారులను వెనక్కి రప్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సరైనదే చేస్తారని అధ్యక్షుడు ట్రంప్‌ జనవరిలో ఆశాభావం వ్యక్తం చేశారు.  అమెరికా సైనిక విమానాలు గ్వాటెమాలా, పెరూ, హోండురాస్‌ దేశాలకు వలసదారులను తరలించాయి.

ఇమ్మిగ్రేషన్‌పై తన ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ లో భాగంగా ట్రంప్‌ గత వారం మిలటరీ బహిష్కరణ విమానాలను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆరు విమానాల్లో వలసదారులను లాటిన్‌ అమెరికాకు విమానాల్లో పంపారు. అందులో రెండో సి –17 కార్గో విమానాల ల్యాండింగ్‌కు కొలంబియా నిరాకరించింది. దీంతో నాలుగు మాత్రమే గ్వాటెమాలాలో ల్యాండ్‌ అయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement