పని ప్రదేశాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవడం మంచిదే. అంతమాత్రానా సహోద్యోగులతో అన్ని విషయాలు పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలు, విశ్వాసాలు, ఆరోగ్య విషయాలు..వంటి కొన్ని అంశాలను తోటి ఉద్యోగులతో చర్చించకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఒకవేళ వారితో ఆయా విషయాలను చర్చిస్తే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జరిగే మేలు కంటే చేటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తోటి ఉద్యోగులతో పంచుకోకూడని కొన్ని అంశాలను నిపుణులు తమ మాటల్లో తెలియజేస్తున్నారు.
వ్యక్తిగత, ఆర్థిక సమాచారం
మీ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచాలి. మీరు పొందుతున్న జీతం, అప్పులు, పెట్టుబడులు కార్యాలయంలో అనవసరమైన ఒత్తిడి, పోటీని సృష్టిస్తాయి. మీ జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలపై తోటి ఉద్యోగులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా నష్టం జరగవచ్చు.
ఆరోగ్య సమస్యలు
సెలవులు తీసుకోవడానికి, టార్గెట్లు తప్పించుకోవడానికి తరచూ చాలామంది ఆఫీస్‌లో ఆరోగ్య సమస్యలున్నట్లు చెబుతారు. అందుకు బదులుగా మీకు నిజంగా ఏదైనా సమస్యలుంటే దాన్ని ఎలా అధిగమిస్తున్నారో హెచ్‌ఆర్, మేనేజర్‌కు మాత్రమే చెప్పండి. భవిష్యత్తులో మీరు సెలవు అడిగినప్పుడు మీ సమస్యపై వారికి అవగాహన ఉంది కాబట్టి అనుమతించే అవకాశం ఉంటుంది. తోటి ఉద్యోగులకు చెప్పడం వల్ల మీరు టార్గెట్లు తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయవచ్చు.
రాజకీయ, మత విశ్వాసాలు
పని ప్రదేశంలో విభిన్న విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు. మీ రాజకీయ, మత విశ్వాసాలను వారిపై రుద్దడం కంటే అసలు ఆ ప్రస్తావన లేకుండా వృత్తి జీవితం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలి.
సహోద్యోగులు, మేనేజ్‌మెంట్‌పై కామెంట్లు
సహచరులు / మేనేజ్‌మెంట్ గురించి తోటి ఉద్యోగులతో చెడుగా మాట్లాడటం లేదా గాసిప్‌లు క్రియేట్ చేయడం ఆపేయాలి. సంస్థకు సంబంధించిన మీ అభిప్రాయాలు సరైనవే అయినా ఇతరులతో పంచుకోకూడదు. మీ విమర్శలు ఏవైనా ఉంటే నేరుగా మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.
ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్‌డీఏఐ
భవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలు
మీరు అధికారిక ప్రకటన చేయకుండా కంపెనీ మారే ఆలోచనను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ భవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ఉత్తమం. ఈ విషయాన్ని ముందుగానే చెబితే ప్రస్తుత మీ స్థానానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment