శ్రమో నమః
వందల కోట్ల చేతులు ప్రపంచమనే ఈ మహాయంత్రాన్ని పని చేయిస్తున్నాయి. పని అంటే కర్మ. కాలగతిలో కర్మ శబ్దం ఆ ప్రాథమికార్థపు నేల విడిచి విధిలిఖితమనే తాత్వికార్థపు గగనసీమను తాకింది. మనుగడకు అవసరమైన సాధారణ కర్మల స్థాయిని దాటి మతపరమైన తంతులతో సహా ఇతరేతర అర్థాలకు విస్తరించింది. కర్మలో శ్రమ ఉంటుంది, శ్రమలో కర్మ ఉంటుంది. రెండూ అన్యోన్యాశ్రితాలు. మళ్ళీ ప్రపంచాన్నే ఒక యాంత్రిక మహాశకటమనుకుంటే, దానిని ముందుకు నడిపించేది కోట్లాది జనాల శ్రమ ఇంధనమే. పుట్టిన ప్రతిజీవీ అంతో ఇంతో కర్మయోగే. అందరికీ వందనం.
వేదం కర్మవాదమే. అందులో కర్మ గురించిన ఉగ్గడింపే ఆద్యంతం వ్యాపించి ఉంటుంది. వేదకాలపు కర్మభావనలో హెచ్చుతగ్గుల వింగడింపు లేదు; దేవతలు, మనుషులన్న తారతమ్యం లేదు. సూర్యచంద్రులు, ఉషస్సు, అగ్ని సహా అందరూ క్రమం తప్పకుండా తమ విధ్యుక్త కర్మలను నిర్వహించవలసిందే. ఇంద్రుడు కర్మ చేతనే గొప్పవాడయ్యాడంటుంది వేదం. అతని చేతి వేళ్ళు అనేక వేల కర్మలను చేస్తూ ఉంటాయి. ఆహార పచనం, దేవతలకు హవ్యాన్ని అందించడంతో సహా అగ్ని బహువిధ కర్మదక్షుడు.
అగ్నిని అనేక విధాలుగా వినియోగంలోకి తెచ్చిన కార్మిక నిపుణులు అంగిరసులు. సర్వకర్మకుశలురైన పుత్రపౌత్రులు కావాలని వేదజనం కోరుకుంటారు. కర్మనిరతిని ప్రకృతితో ముడిపెట్టి వేదం అందంగా చెబుతుంది. ‘‘మనుషుల్లారా! నిద్రలేవండి, చీకట్లు తొలిగాయి, మన దేహాలకు ప్రాణం వచ్చింది, ఉష ఉదయించి సూర్యుని రాకను ప్రకటించింది, అన్నం సమృద్ధిగా దొరికే చోటుకి వెడదాం పదండి’’ అని ఒక ఋక్కు చెబుతుంది. ఉష ఉదయించి మీ మీ వృత్తి వ్యాపారాల వైపు మిమ్మల్ని జాగృతం చేస్తోందని మరో ఋక్కు అంటుంది.
‘‘జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నా’’ల స్మరణ ఆధునిక మహాకావ్యంలోనే కాదు; కవిత్వానికే ఆదిమమైన వేదంలోనూ కనిపిస్తుంది. త్వష్ట నిపుణుడైన లోహకార్మికుడు... స్వర్ణమయమై, వేయి అంచులు కలిగిన వజ్రాయుధాన్ని నిర్మించి ఇంద్రునికి ఇచ్చాడు. దేవతలతో సమానమైన గౌరవాన్ని పొందాడు.
ఋభులనే అన్నదమ్ములు మానవులైనా లోహవిద్యలో త్వష్టను మించిన ప్రావీణ్యం చూపి దేవతలయ్యారు. మరుత్తులనే దేవతలు ప్రవాహానికి అడ్డుపడిన ఓ పర్వతాన్ని బద్దలుకొట్టి నీటికి దారి చేశారు. అశ్వినులు మనువుకి విత్తనాలిచ్చి వ్యవసాయం చేయించారు; వైద్యం చేసి ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఆయుష్షును ఇచ్చారు. క్షురకుడు కేశఖండన చేసినట్లుగా ఉష చీకట్లను ఉత్తరిస్తోందని ఒక ఋక్కు అంటుంది.
శ్రమ ఉచ్చమా, న్యూనమా అని చూడకుండా; శ్రామికుల మధ్య హెచ్చుతగ్గుల తేడా తేకుండా శ్రమను మాత్రమే గౌరవించిన దశ అది. ఇంద్రాదులు సమాజానికి ఏదో ఒక మేలు చేసే సేవకులు కనుకనే దేవతలయ్యారు. వేదకాలంలో అలాంటి సేవకులను పన్నెండుగురిని గుర్తించి పన్నిద్దరు ఆయగార్లు అన్నారు. శారీరక శ్రమను తక్కువ చేసి మేధోశ్రమను ఆకాశానికి ఎత్తడం ఆనాటికి లేదు. తిథివారనక్షత్రాలు చూసే వ్యక్తి కన్నా మృతపశువుల చర్మాన్ని ఒలిచే చర్మకారునికి ఎక్కువ ప్రతిఫలం ముట్టిన కాలం అది. కర్మ, కర్మఫలం రెండూ ఆనాడు సాముదాయికమే.
చెరువుల వంటి నిర్మాణాలలో రాజు, రాజుగారి భార్యా కూడా మట్టితట్టలు మోసిన ఉదాహరణలు పురాచరిత్రలో కనిపిస్తాయి. అది పోయి చాకిరొకరిది, సౌఖ్యమొకరిదైన తర్వాతే పరిస్థితి తలకిందులైందని పండితులంటారు. అందరూ అన్నిరకాల పనులూ చేయడం పోయి వృత్తి విభజన రావడంతోనే వృత్తుల మధ్య, వ్యక్తుల మధ్య చిన్నా పెద్దా తారతమ్యాలూ పొటమరించాయి. ఇష్టపూర్వక కర్మ నిర్బంధకర్మగా మారి దుఃఖదాయిని అయింది.
అప్పుడు కూడా వృత్తి నైపుణ్యంలో ఆనందాన్ని, తృప్తిని అనుభవించే అవకాశం ఎంతోకొంత ఉండేది. వృత్తిదారులు పారిశ్రామిక యంత్రంలోని పరికరాలుగా మారిపోవడంతోనే అదీ పోయింది. ఈ మార్పును కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో అద్భుతంగా చిత్రీకరిస్తారు. ప్రకృతి సమవర్తి. శ్రుతిమించిన అసమానతలను ఆట్టే కాలం సహించదు, ఎప్పటికైనా కత్తెర వేసి సమతుల్యతను తెస్తుంది. అడుగంటిన శ్రమ విలువను, గౌరవాన్ని, తగిన ప్రతిఫలాన్ని ఉద్ధరించే ప్రయత్నం ఆధునిక కాలంలోనే మళ్ళీ ఊపందుకుంది.
‘శ్రమ నిష్ఫలమై, జన నిష్ఠురమై నూతిని గోతిని వెదికే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే విలాపాగ్నులకు, గలగల తొణికే విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులు’ ఉద్భవించారు. ఏ ఒకడి ఆస్తిహక్కైనా శ్రమపునాది మీదే ఆధారపడుతుందని జాన్ లాక్ అనే ఆర్థికవేత్త నొక్కిచెప్పి శ్రమకు తిరిగి పట్టం కట్టాడు. ఆడమ్ స్మిత్ అనే మరో ఆర్థికవేత్త విలువకు మూలం శ్రమేనన్నాడు.
దాని ఆధారంగా డేవిడ్ రికార్డో అనే మరో ఆర్థికవేత్త శ్రమవిలువ సిద్ధాంతాన్ని ముందుకుతెచ్చాడు. కార్ల్ మార్క్స్ తాత్వికతకు అదే సారవంతమైన వనరు అయింది. శ్రమ విలువను తిరిగి గుర్తించడమే జరిగింది కానీ శ్రామికుని బతుకు బండి ఇంకా పూర్తిగా పట్టాలకెక్కలేదు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్న కవి ఆకాంక్ష నెరవేరే రోజు ముందుకు జరుగుతూనే ఉంది. అయినా మనిషి నిత్య ఆశాజీవి కదా!