వాట్సప్... మొన్నటి వరకూ నెట్‌శావీలకు మాత్రమే పరిచయం ఉన్న వెబ్ అప్లికేషన్. వారు మాత్రమే విస్తృతంగా వినియోగిస్తున్న సేవ.
వాట్స్ అప్?!
వాట్సప్... మొన్నటి వరకూ నెట్‌శావీలకు మాత్రమే పరిచయం ఉన్న వెబ్ అప్లికేషన్. వారు మాత్రమే విస్తృతంగా వినియోగిస్తున్న సేవ. అయితే ఫేస్‌బుక్‌తో డీల్ తర్వాత ప్రపంచానికి వాట్సప్‌తో పరిచయం పెరిగింది. వినియోగం మరింత విస్తృతం అయ్యింది. వాట్సప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొనే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మరి కమ్యూనికేషన్ విషయంలో ఇలాంటి కొత్తపుంతను తొక్కడానికి ఆసక్తి చూపుతున్నారు. కేవలం వాట్సప్ అనే కాదు... కమ్యూనికేషన్ విషయంలో అచ్చం వాట్సప్‌లాంటి అప్లికేషన్‌లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాట్సప్‌లాగే అవి కూడా వావ్ అనిపిస్తున్నాయి. అవేంటంటే...
వైబర్...
వాట్సప్ కన్నా ఎక్కువ కమ్యూనికేషన్‌కు అవకాశాన్ని ఇచ్చే అప్లికేషన్ వైబర్. వాట్సప్ టెక్ట్స్‌మెసేజ్, వాయిస్ మెసేజ్‌లకు మాత్రమే అవకాశం ఇస్తే... వైబర్ ద్వారా డెరైక్ట్‌గా వాయిస్ ఎక్స్‌ఛేంజ్‌కు అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఫోన్‌కాల్స్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
వీ చాట్...
డబ్బుల డీల్‌లో వాట్సప్ దూసుకుపోయింది కానీ.. మొన్నటి వరకూ వీచాట్, వాట్సప్ అప్లికేషన్‌లు ఒకదానితో ఒకటి పోటీ దశలో ఉండేవి. ఈ అప్లికేషన్ కూడా ఫ్రీ మెసేజింగ్, లైవ్ టాకింగ్‌కు అవకాశాన్ని ఇస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లపై పనిచేస్తుంది.
లైన్...
విశ్వవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా టెక్ట్స్ మెసేజ్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ అప్లికేషన్. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లపై మాత్రమే పనిచేస్తుంది.
ఫేస్‌బుక్ మెసెంజర్...
తిరిగి తిరిగి అక్కడకే వచ్చినట్టుగా... ఫేస్‌బుక్ మెసెంజర్ కూడా స్మార్ట్‌పోన్లతో సందడి చేయవచ్చు. వాట్సప్‌ను ఫేస్‌బుక్ వాళ్లే కొనుగోలు చేశారు. ఇదే సమయంలో ఫేస్‌బుక్ మెసెంజర్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను ఉపయోగించే వారికి ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
స్కైప్..
ఇప్పటికే నెటిజన్లకు బాగా పరిచయం ఉన్న స్కైప్‌ను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ సైట్‌లో అకౌంట్ అవసరం ఉన్నా, ఫేస్‌బుక్ అకౌంట్‌తోనైనా స్కైప్‌తో వీడియో చాటింగ్‌కు అవకాశం ఉంటుంది.
టాంగో...
కొత్త ఫ్రెండ్స్‌ను సంపాదించుకోవడానికి, ఉన్నఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండడానికి కూడా టాంగో అవకాశాన్ని ఇస్తుంది. వెబ్ వీధుల్లో ఇవేగాక ఇంకా కిక్ మెసెంజర్, ఇమ్సీ, గ్రూప్‌మీ, చాట్ ఆన్... వంటి చాటింగ్, మెసేజింగ్ అప్లికేషన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాట్సప్‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలో సేవలను అందిస్తున్నాయి.