ఇంద్రుడు చంద్రుడు అనకండి
అవతలివాళ్లు ఎంత మేధావులు, మంచివారూ అయినా, వారిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు కొంతమంది. అయితే అది నిజానికి వారి తప్పు కాదు. వారి తలిదండ్రుల పెంపక లోపం. కొన్ని అధ్యయనాల ప్రకారం అతి గారాబంతో, ప్రత్యేక శ్రద్ధతో పెరిగే పిల్లలు, వారు పెద్దయ్యాక స్వయం ప్రేమికులుగా... అంటే ఎంతసేపటికీ తమను తాము గొప్పవాళ్లం అనుకోవడం తప్ప ఇతరులను పట్టించుకోరని రుజువైంది. పిల్లల్లో స్వయంప్రేమ లేదా స్వీయానురక్తికి దారి తీసే కారణాలపై అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో జరిగిన పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది.
తలిదండ్రులు తమ పిల్లలను సముదాయించడం కోసమో లేదా నిజంగానే వారిపట్ల తమకుండే మితిమీరిన ప్రేమ, గారాబం వల్లనో ‘ఫలానా వారికన్నా నువ్వు చాలా గొప్పవాడివి లేదా ఫలానా వారికీ, నీకూ అసలు పోలికే లేదు. తనకన్నా నువ్వు చాలా తెలివైనదానివి, నీ జ్ఞాపకశక్తి చాలా గొప్పది, నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు చాలా అందగత్తెవి...’’ అంటూ చెప్పే మాటలు పెద్దయ్యాక వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయట. ‘నువ్వు మా బంగారానివి, దేవుడు ఇచ్చిన అపూర్వమైన కానుక నువ్వు’ అంటూ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తలిదండ్రులు పిల్లలతో తరచు చెబుతుంటారు. అయితే అటువంటి మాటలు వారి మనసులపై గాఢమైన ముద్రవేస్తాయి. నిజంగానే తామేదో ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్లం కాబోలు’ అనుకుని, అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తుంటారు వారు. అందులో భాగంగా తామే అందరికన్నా గొప్పవాళ్లమని, తెలివితేటల్లో, అందచందాల్లో, ప్రతిభలో తమను మించిన వారే లేరని విర్రవీగుతారు.
ఎదుటివారిని పూచికపుల్లల్లా తీసిపారేస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే చిన్నారులను నువ్వు ఇంద్రుడు, చంద్రుడు అని పొగడకూడదు. దాని బదులు వారిలోని శక్తిసామర్థ్యాలను, మంచితనాన్ని వెలికి తీయాలి. వారిలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశాన్నివ్వాలి’’ అంటారు సహ అధ్యయనవేత్త, కమ్యూనికేషన్ అండ్ సైకాలజీ ప్రొఫెసర్ బ్రాడ్ బుష్‌మాన్. అంటే పిల్లల్ని అతి ప్రేమగా, ప్రత్యేకంగా పెంచే తలిదండ్రులు ఇకపై ఆ పద్ధతిని మార్చుకోవాలేమో!