మల్టీ కల్చర్ టీమ్ సక్సెస్‌కు.. సమన్వయం
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు బృందాలుగా ఏర్పడి, తమకు అప్పగించిన అసైన్‌మెంట్లను పూర్తిచేస్తుంటారు. ఈ బృందాలకు అనుభవజ్ఞుడైన టీమ్ లీడర్ ఉంటాడు. ఒక టీమ్‌లో రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉండడం సహజమే. వారి సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రాంతాలు, ఆచార వ్యవహారాలు, మాతృభాష వేర్వేరుగా ఉండొచ్చు. బృందంలో ఎవరికి వారే అన్నట్లుగా ఉంటే ఆశించిన ఫలితం ఎండమావే అవుతుంది. టీమ్ విజయవంతం కావాలంటే.. సభ్యులందరి మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలి. ఈ సమన్వయం సాధించాల్సిన బాధ్యత టీమ్ లీడర్‌దే. ప్రాంతమేదైనా, ఆచారమేదైనా.. అందరూ కలిసికట్టుగా పనిచే సి, బృందస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి గుర్తింపు, పదోన్నతులు కచ్చితంగా వస్తాయి. భిన్న సంస్కృతులకు చెందిన సభ్యులు టీమ్‌లో ఉన్నప్పుడు కలహాలు, అభిప్రాయ భేదాలకు తావులేకుండా ఒకరికొకరు సంపూర్ణంగా సహకరించుకుంటూ ముందుకు సాగాలి.
సహచరులను గౌరవించాలి: మల్టీ కల్చర్ టీమ్‌లో పనిచేస్తున్నప్పుడు సహచర సభ్యులను గౌరవించడం నేర్చుకోవాలి. వారి అభిప్రాయాలను, ఆలోచనలను స్వాగతించాలి. మా వర్గం, మా ప్రాంతం, మాదే గొప్ప సంస్కృతి, ఎదుటివారు అనాగరికులు, అజ్ఞానులు అనే భేదభావం, వివక్ష ఎట్టిపరిస్థితుల్లోనూ చూపకూడదు. అందరినీ సమానంగా చూడాలి. సంకుచిత భావాలు మనసులో చేరితే ఎదుటివారిపై ద్వేషం పెరుగుతుంది. బృంద స్ఫూర్తిని అది దెబ్బతీస్తుంది. ఒకచోట కలిసి పనిచేస్తున్నప్పుడు తామంతా ఒక్కటేనన్న భావన టీమ్ సభ్యులందరిలోనూ ఉండాలి.
నమ్మకం పెంచుకోవాలి: ఒకే సమస్యను వ్యక్తులు వారి ఆలోచనా విధానాన్ని, పెరిగిన వాతావరణాన్ని బట్టి వేర్వేరుగా చూస్తారు. వేర్వేరు పరిష్కార మార్గాలను సూచిస్తారు. టీమ్‌లో భిన్నమైన నేపథ్యాలున్న సభ్యుల ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. సమస్యల పరిష్కారానికి సహచర సభ్యుల సాయం తీసుకోవాలి. ఎదుటివారిని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే వారి సహకారం పొందగలం. అపనమ్మకం ఉన్నచోట పరస్పర సహకారానికి చోటుండదు. కాబట్టి బృంద సభ్యులందరిపై నమ్మకం పెంచుకోవాలి.
కమ్యూనికేషన్ ప్రధానం: బృందం సక్సెస్ కావాలంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఒకరి భావాలు మరొకరికి స్పష్టంగా తెలియాలి. కొన్నిసార్లు అతి చొరవ పనికిరాదు. తోటి సభ్యుల సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకొని తదనుగుణంగా వారితో మసలుకోవాలి. ఇతరుల ఆచారాలు, భాష, యాసలను తక్కువ చేసి మాట్లాడకూడదు. వాటిని గౌరవించాలి. బృందంలో ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు తలెత్తితే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి. ఎక్కువ కాలం కొనసాగిస్తే టీమ్ నష్టపోవడం ఖాయం.