నియామకాల్లో నయా ట్రెండ్స్ | Trends in the recruitment | Sakshi
Sakshi News home page

నియామకాల్లో నయా ట్రెండ్స్

Published Sat, Oct 25 2014 11:45 PM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM

నియామకాల్లో నయా ట్రెండ్స్ - Sakshi

నియామకాల్లో నయా ట్రెండ్స్

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలక మార్పులు జరుగుతున్నాయి. రిక్రూటింగ్ ట్రెండ్స్ పూర్తిస్థాయిలో ఆధునిక రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ విషయంలో నూతన సమాచార సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది. పత్రికలో కొలువుల ప్రకటన చూసి, కాగితంపై దరఖాస్తు రాసి, సంస్థకు పంపించి, మౌఖిక పరీక్ష కోసం ఎదురు చూసే పాతతరం ధోరణి క్రమంగా కనుమరుగవుతోంది. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అభ్యర్థులు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారాల్సిందే. కార్పొరేట్ రిక్రూటింగ్ మార్కెట్‌లో సరికొత్త ధోరణుల గురించి తెలుసుకుంటే తదనుగుణంగా సన్నద్ధం కావొచ్చు.
 
టాలెంట్ నెట్‌వర్క్


ప్రతిభ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవడమే కంపెనీలు చేసే పని. రిక్రూట్‌మెంట్ల కోసం సంస్థలు టాలెంట్ నెట్‌వర్క్ పేరిట ఆన్‌లైన్ వేదికలను ప్రారంభిస్తున్నాయి. కంపెనీలు వివరాలను, ఉద్యోగాల సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తున్నాయి. అభ్యర్థులను, ఉద్యోగులను, తమ భాగస్వాములను, కస్టమర్లను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాయి. ప్రతిభావంతులను గుర్తించేందుకు ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నాయి.
 
 సోషల్ నెట్‌వర్క్

ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్ వంటి సామాజిక అనుసంధాన వేదికలు.. కంపెనీల్లో ఖాళీల భర్తీకి ఒక వాహకంగా మారాయి. వీటిలో మీ జాబ్ ప్రొఫైల్‌ను, రెజ్యూమెను రిక్రూటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. నచ్చితే ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో మీ రాతలు, వ్యాఖ్యలు, పోస్టు చేసిన వీడియోలపై కూడా దృష్టి పెడుతున్నారు. అవి అభ్యంతరకరంగా ఉంటే మీరు కొలువు ఆశలు వదులుకోవాల్సిందే. కంపెనీలు మిగిలిన సైట్ల కంటే లింక్డ్‌ఇన్‌పై ఎక్కువ ఆధారపడుతున్నాయి.
 
 రిక్రూటర్లకు శిక్షణ

 ప్రపంచీకరణతో వ్యాపార, వాణిజ్యాలు ఖండాంతరాలను దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన అర్హతలు, నైపుణ్యాలున్న అత్యుత్తమ అభ్యర్థులు కావాలని కార్పొరేట్ సంస్థలు ఆశిస్తున్నాయి. ఇందుకు రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లపై అదనపు బాధ్యతలను మోపుతున్నాయి. ఎలా ఇంటర్వ్యూ చేయాలి? అభ్యర్థుల్లోని అసలైన ప్రతిభను ఎలా గుర్తించాలి? తదితర అంశాలను వారికి నేర్పిస్తున్నాయి. అభ్యర్థులను సరిగ్గా అంచనా వేసే సామర్థ్యాలను వారిలో పెంపొందిస్తున్నాయి. ఇందుకోసం హ్యూమన్ అసెస్‌మెంట్ టూల్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి.
 
దరఖాస్తులు సరళతరం

దరఖాస్తు పత్రంలో 20కిపైగా ఖాళీలుంటాయి. వాటన్నింటినీ పూరించాలంటే అభ్యర్థులు కొంత శ్రమించాల్సిందే. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు కంపెనీలు బిలియన్ల డాలర్ల సొమ్మును ఖర్చు పెడుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి పరుస్తున్నాయి. ఇవి అభ్యర్థుల డేటా ప్లాట్ ఫామ్‌గా మారనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను అభ్యర్థులకు అనుకూలంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు సంస్థలు కృషి చేస్తున్నాయి.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement