వెరైటీ చారిటీ | Variety Charity | Sakshi
Sakshi News home page

వెరైటీ చారిటీ

Published Fri, Mar 13 2015 3:28 AM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM

వెరైటీ చారిటీ - Sakshi

వెరైటీ చారిటీ

ఒకప్పుడు చారిటీ యాక్టివిటీ అంటేనే గొప్ప అనుకునే పరిస్థితి. మరిప్పుడో.. ఎంతో కొంత వినూత్నంగా ఉంటే తప్ప సేవ.. ఆసక్తిని పెంచడం లేదు. దీంతో సిటీలోని కార్పొరేట్ సంస్థలు చారిటీలోనూ వెరైటీ మార్గాలు అన్వేషిస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీని ప్రదర్శిస్తున్నాయి.
 ..:: ఎస్.సత్యబాబు
వైవిధ్యం సేవకు సైతం సారథ్యం వహిస్తోంది.

కేవలం పైసలు ఇచ్చేసి హెల్ప్ చేసేశాం అనుకునే స్థాయిని సిటీ చారిటీ దాటేసింది. అవసరాలను గుర్తించడంలోనే కాదు వాటిని తీర్చడంలోనూ వినూత్న విధానాలను ఫాలో అవుతోంది.
 
విష్ మీ గుడ్‌లక్..
‘పరీక్ష రాయబోతున్నాను. మార్కులు బాగా వచ్చేలా బ్లెస్ మీ’ అంటూ శాంతాక్లాజ్‌ను వేడుకుందో అమ్మాయి. ‘ఖరీదైన సైకిల్ కొనుక్కోవాలనుంది. తీరుస్తావా?’ ఇది మరో బుడతడి కోరిక. నగరానికి చెందిన ‘ఓయే హ్యాపీ’ అనే సంస్థ బస్తీ చిన్నారుల అవసరాలు తెలుసుకుని, తీర్చడం కోసం.. ఓ వినూత్న ప్రయత్నం చేసింది. చిన్నారులకు ఎంతో ప్రియమైన క్రిస్మస్ తాత, శాంతాక్లాజ్‌కి తమ కోరికలు చెప్పుకోమంటూ చిన్నారుల క్లాస్‌రూమ్‌లోనే ఒక పోస్ట్‌డబ్బా ఏర్పాటు చేసింది.

కార్డ్స్ ఇచ్చింది. వాళ్లు స్వయంగా రాసిన కోరికల ఉత్తరాలను పోస్ట్‌డబ్బా ద్వారా శాంతాక్లాజ్‌కు చేరవేస్తున్నామని చెప్పి ఆ ఉత్తరాలను దేశవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు, స్టాఫ్‌కు పంపింది. వాళ్ల చేయూతతో పిల్లల విష్ లిస్ట్‌లో వీలున్నన్ని కోరికలను తీర్చగలిగింది. ‘చాక్లెట్ల నుంచి సైకిల్స్ దాకా 45 మంది బస్తీ పిల్లల కోరికలను నెరవేరేలా చేయగలిగామ’ని ఓయె హ్యాపీ ప్రతినిధి వర్ష ఆనందంగా చెప్పారు.
 
ఉద్యోగులే ఊతం...
‘రెండు నెలల పాటు మా ఉద్యోగం ఇదే’ అంటూ చెప్పారు సీతారామయ్య. మాసబ్‌ట్యాంక్ దగ్గరల్లోని ఐటీ టవర్స్ సమీపంలో ఉన్న వాయిస్ ఫర్ గాళ్స్ అనే ఎన్‌జీఓ ఆవరణలో ఉద్యోగం.. అదీ 2 నెలలు మాత్రమేనా..? ‘మా కంపెనీ సోషల్ రెస్పాన్సిబులిటీ యాక్టివిటీస్‌లో భాగంగా ఇక్కడ మమ్మల్ని నియమించింది’ అని వివరించారాయన. వొడాఫోన్ ఫౌండేషన్ తర ఫున సీతారామయ్య, ఏసుదాస్ ఆంటోనీలు అక్కడ సేవోద్యోగం చేస్తుంటే మరో ఇద్దరు సిటీలోని మరో రెండు ఎన్‌జీఓలకు పనిచేస్తున్నారు.

కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీ డెవలప్‌మెంట్.. వంటి అంశాల్లో, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫండ్‌రైజింగ్ మార్గాలు.. వృద్ధి చేయడంలో వాయిస్ ఫర్ గాళ్స్‌కు వీరిద్దరూ తోడ్పడుతారు. ‘ఈ తరహా చేయూత మేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిర్వహణాపరమైన అంశాల్లో నిపుణులైన ఉద్యోగుల స్వచ్ఛంద విధులు మాకు ఎంతో మేలు చేస్తాయి’ అని వాయిస్ ఫర్ గాళ్స్ ప్రతినిధి శరణ్య చెప్పారు.
 
ఖాన్ పాన్ దుకాన్..

ఈ పేరు వింటే ఏదో పాన్‌షాపో, మరొకటో అన్నట్టు ధ్వనిస్తుంది కదూ. అయితే ఇదొక చారిటీ ఈవెంట్. సద్గురు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఇది. ఈ సంస్థ  ‘ఖాన్ పాన్ దుకాన్’ పేరుతో ఈవెంట్ ప్లాన్ చేసి తమ క్లయింట్లను, మిత్రులను, సిబ్బందిని ఆహ్వానించింది. వారికి విభిన్న రకాల ఫుడ్ వెరైటీలను వండి వడ్డించింది. ఈ ‘దుకాన్’లో వంటకాలు రుచి చూసిన వారి దగ్గర రుసుము వసూలూ చేసింది. ఆడపిల్లల విద్యకు అవసరమైన ఆర్ధిక సాయం అందించేందుకు ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను వినియోగిస్తున్నామని.. సంస్థ ఆధ్వర్యంలోని ‘సంకల్ప్’ విభాగం కింద ఈ చారిటీ యాక్టివిటీ ఏర్పాటు చేశామని ‘సంకల్ప్’ ప్రెసిడెంట్ హేమలత తెలిపారు.
 
యాక్టివిటీ సెంటర్...

పాఠశాలలో చారిటీ అంటే కాసిన్ని పుస్తకాలు పెన్నులు ఇచ్చేసి వచ్చేయడం కాదు. చిన్నారుల కోసం పూర్తిస్థాయి యాక్టివిటీ సెంటర్‌ను, ఇద్దరు టీచర్లను రెండేళ్లపాటు సేవలందించేలా ఏర్పాటు చేయడం ద్వారా వినూత్న ట్రెడిషన్‌కు నాంది పలికాయి టీచ్ ఫర్ ఇండియా, క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అయిన సేల్స్ ఫోర్స్ ఇండియా డాట్‌కామ్‌లు. నారాయణగూడలోని గవర్నమెంట్  స్కూల్‌లో వీరు ఏర్పాటు చేసిన ఆసక్తికరమైన యాక్టివిటీ సెంటర్.. చిన్నారులకు ఒక లైబ్రరీలా, ఒక గేమ్స్ రూమ్‌లా.. ఇలా విభిన్న రకాలుగా ఉపకరిస్తుంది. ‘పిల్లలకు యాక్టివిటీ ద్వారా లెర్నింగ్ అనేది ఇప్పటి ట్రెండ్. ఇలాంటి సెంటర్‌లు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు చాలా ఉపయోగపడతాయి’ అని టీచ్ ఫర్ ఇండియా ప్రతినిధి సిరిచందన చెప్పారు.
 
జాబ్ శాటిస్‌ఫాక్షన్..

మాలాంటి ఉద్యోగులకు చారిటీ యాక్టివిటీ చేయాలంటే.. వారాంతాలు.. లేకపోతే సెలవుదినాలే మార్గం. అయితే మా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు ఉద్యోగంతో పాటు ఇటు అవసరార్థులకు తోడ్పడుతున్నామనే సంతృప్తి కూడా లభిస్తోంది
-సీతారామయ్య, ఆంటోని
 
మార్గాలు ఏవైనా గమ్యం చేరడం ముఖ్యం. సేవ ఎలాంటిదైనా అవసరార్థులకు ఆసరా అందడం ముఖ్యం.ఈ విషయాన్ని గుర్తించిన సిటీ చారిటీ కొత్త పుంతలు తొక్కడాన్ని స్వాగతిద్దాం. ఆధునిక ‘సేవ’కులను అభినందిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement