కుట్రీరం
నీడ నుంచి ఓడ దాకా పచ్చని చెట్టు ఇచ్చే ప్రతిఫలాలకు లెక్కేలేదు. చెట్టుకీ మనిషికి ఉన్న అనుబంధాన్ని కాంక్రీట్ జంగిల్ కాసింత తగ్గించగలదే కాని తుడిచేయలేదు. ఆ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి ఈ ట్రీహౌస్‌లు. సిటీలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ట్రెండ్.. పచ్చదనం నీడలో పయనించాలనే మనిషి ఆకాంక్షకు అచ్చమైన ప్రతిరూపంగా నిలుస్తోంది.
- ఎస్.సత్యబాబు
ఇల్లు, ఆఫీస్, హోటల్స్, థియేటర్స్.. ఇలా సిటీవాసి వెళ్లే ప్రతి చోటు సిమెంట్ మేటలు పరుచుకుని సహజత్వాన్ని దూరం చేసేవే. పార్క్‌లు మినహాయిస్తే.. పది రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా.. ప్రకృతి చిరునామా ఇక్కడ దొరకడం కష్టమే. వెదురుతో వెలిసిన ట్రీహౌస్‌లు ఈ సమస్యకు చెక్ పెడుతున్నాయి. ఆధునికతను అందిపుచ్చుకున్న వెదురు.. ఓ చెట్టునీడలో కుటీరాల్లా వెలిసి.. చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. పల్లె పొలాల్లో.. రైతులు నిర్మించుకునే మంచెలను తలపిస్తూ.. పట్నవాసంలో పల్లెవాసనలు తీసుకొస్తున్నాయి. భూమికి కాసింత ఎత్తులో ఉండే ఈ ట్రీ హౌస్‌ను చూడగానే సగం రిలాక్స్ అయిపోతాం.
ఎంత సేపయినా హాయిగా..
‘నేను ఈ హౌస్ కట్టినప్పుడు నందివర్ధనం చెట్టు ఉండేది. ఒక కొమ్మ కొట్టేసి కట్టాం. ఇప్పుడు ఆ నందివర్ధనం బాగా పెరిగి ట్రీ హౌస్ పైకి వచ్చేసింది. చూడముచ్చటగా ఉంటుంది. ఈ ట్రీహౌస్‌లో ఎంతసేపైనా గడిపేయవచ్చు’ అంటూ తన ట్రీహౌస్ ప్రత్యేకతను వివరిస్తారు కొత్తపేటకు చెందిన డాక్టర్ సూర్యప్రకాశ్. కూకట్‌పల్లిలోని ఆలంబన ఎన్జీవో నిర్వాహకురాలు శిరీషకు ఈ ట్రీహౌస్ అంటే చాలా ఇష్టం. ‘మా స్కూల్ ఎదుట దీన్ని మూడేళ్ల కిందట కట్టాం.
మా పిల్లలకు ఇది మంచి రిక్రియేషన్ ప్లేస్. నేల నుంచి 15 అడుగుల ఎత్తులో నిర్మించిన కుటీరంలో కూర్చునేందుకు ఇక్కడి విద్యార్థులతో పాటు టీచర్లు కూడా పోటీపడుతుంటారు. ట్రీహౌస్ కట్టే సమయంలో ఇక్కడో పెద్ద చెట్టు ఉండేది. ఇటీవల ఆ చెట్టు కొట్టివేయడంతో ట్రీ హౌస్ కొంత బోసిపోయినా.. ఇప్పటికీ ఇది బెస్ట్ మీటింగ్ పాయింట్‌గా నిలుస్తోంది. మా విద్యార్థులు హోమ్‌వర్కులు చేసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. ఇక్కడికే వచ్చేస్తుంటార’ని తెలిపారు శిరీష.
గృహస్థు ఆశ్రమం..
ఎన్జీవోల నుంచి ప్రారంభమైన ఈ ట్రీ హౌస్‌ల ట్రెండ్.. ఇప్పుడు వ్యక్తిగత ఇళ్లకు కూడా విస్తరించింది. వ్యక్తిగత విశ్రాంతి నిలయంగా, రొటీన్‌కు భిన్నమైన ఆవాసంగా నగరవాసులు దీనిని భావిస్తున్నారు. అదే కోవలో ‘మంచిపుస్తకం’ పబ్లిషర్ అయిన సురేష్ కొసరాజు నాగోల్‌లోని తన ఇంటి టై మీద ఈ తరహా ఇల్లు కట్టుకుంటే.. వనస్థలిపురంలోని హస్తినాపురంలో నివసించే విమలాచార్య మామిడి చెట్టు కింద కట్టుకున్నారు.
అస్సాం అయితే బెస్ట్..
ప్రస్తుతం నగరంలో నిర్మితమవుతున్న ట్రీ హౌస్‌లకు అస్సాం నుంచి వచ్చిన వెదురునే ఉపయోగిస్తున్నారు. మన దగ్గర లభించే వెదురుతో పోలిస్తే థిక్‌నెస్ ఎక్కువుంటుందని, మరింత బలమైనదని అంటున్నారు. ఎక్కువ బరువును భరించడంతో పాటు.. పురుగులు కూడా పట్టవని చెబుతున్నారు. భూమిలోకి రెండున్నర అడుగులు, పైకి 5 అడుగులు మొత్తం 8 అడుగుల్లో రూపొందించగలిగిన ఈ ట్రీ హౌస్ నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.20 వేలలోపే.
విరివిగా కట్టాలి..
నగరంలో గూడులేని వారెందరో ఫుట్‌పాత్‌లపైనే విశ్రమిస్తుంటారు. అలాంటి వారికి ఈ ట్రీ హౌస్‌లు అందుబాటులోకి తీసుకురాగలితే వారికి ఎంతో మేలు చేసిన వారం అవుతాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తలుచుకుంటే, ట్రీ హౌస్‌లను విరివిగా కడితే ఎందరికో ఉపకరిస్తుంది.
-డా.సూర్యప్రకాష్, ఓపెన్ హౌస్ చారిటీ సంస్థ నిర్వాహకుడు