రాజకీయాల్లోకి రండి..
‘రాజకీయాలను, ప్రభుత్వాలను తిట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు. స్వచ్ఛమైన, కల్మష రహిత నేపథ్యం ఉన్నవాళ్లు మరింత ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి’ అంటూ స్పష్టం చేశారు షాజియా ఇల్మి. దేశ రాజకీయాల్లో స్వల్పకాలంలోనే చిరపరిచితమైన నేతగా ఎదిగిన ఈ ఢిల్లీ మహిళ... సిటీకి వచ్చారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఒ),యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌ఒ)లకు నూతన గవర్నింగ్ బాడీస్ ఏర్పాటైన సందర్భంగా హోటల్ తాజ్‌కృష్ణాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ‘రాజకీయాల్లో సిద్ధాంతాలు’పై మాట్లాడారు. ఆ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఆమె మాటల్లోనే..
మార్పు దిశగా పయనిద్దాం...
రాజకీయం అనేది నా భావాలు వ్యక్తం చేసేందుకు, నిర్ణయాత్మక శక్తిగా నన్ను నేను మలచుకునేందుకు నేను ఎంచుకున్న వేదిక. ఒకప్పుడు జర్నలిస్ట్‌గా ఉన్న నేను కేవలం రిపోర్టింగ్ చేసేసి ఆ తర్వాత సెలైంట్‌గా ఉండిపోవడానికి పరిమితమవడం కన్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం కావాలనుకున్నా... రాజకీయాల్లోకి వచ్చింది అందుకే. మన సిస్టమ్ బాగోలేదనడం, ప్రభుత్వాలను తప్పుపట్టడమూ సులభమే. అయితే మనం మేల్కొని మార్పుకు కారణం కావాల్సిన సమయం ఇది. కార్యాచరణలోకి దిగాల్సిన సమయం ఇది. మార్పును స్వీకరిస్తూ దేశాన్ని మార్చే దిశగా మనం పయనించాలి.
మన తలరాత రాసేది రాజకీయాలే...
కులం, మతం, ప్రాంతం. తన మన భేదాలు ఇంకా అలాంటి అనేకానేక అంశాల ఆధారంగా ఓట్లేస్తున్నాం. ఇలా వేసినంత కాలం మనం రాజకీయాల్లో విలువల్ని ఆశించలేం. భారతదేశ తలరాతను రాసేవి రాజకీయాలే. మన బిడ్డల భవిష్యత్తును, మన జీవన స్థితిగతులను, పాఠశాలల్లో పద్ధతులను, మన అక్కా చెల్లెళ్ల భద్రతను, తోటి పౌరుల భద్రతను అన్నింటినీ నిర్ణయించేవి అవే. కాబట్టి దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి. మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాల్సి ఉందని నేను నమ్ముతున్నాను.
- ఎస్.సత్యబాబు