Shazia Ilmi
-
‘ఆ పార్టీలో నాతో అసభ్యంగా ప్రవర్తించారు’
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షురాలు షాజియా ఇమ్లి పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేటు పార్టీలో తనను బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. ‘‘సౌత్‌వెస్ట్ ఢిల్లీలో వసంత్ కుంజ్‌లో ఫిబ్రవరి 5న జరిగిన ఓ డిన్నర్ పార్టీలో అక్బర్ అహ్మద్ తప్పుగా ప్రవర్తించారు. చేతన్ సేత్ పార్టీకి హాజరైన ఆయన నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చేతన్ సేత్, ఆయన కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా నీచంగా వ్యవహరించారు. హిందీలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని పబ్లిక్ చేయాలనుకోలేదు. అలా అని ఆయనను అలాగే వదిలిపెట్టకూడదు. లేదంటే అలాంటి వాళ్లు మరింతగా రెచ్చిపోతారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను’’అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనపై సెక్షన్ 506(బెదిరించడం), 509(మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడం) కింద ఫిబ్రవరి 7న కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసుపై అక్బర్ అహ్మద్ ఇంతవరకు స్పందించలేదు. చదవండి: దిశ రవి బెయిలు పిటిషన్: జడ్జి కీలక వ్యాఖ్యలు -
నన్ను టార్గెట్ చేశారు: బీజేపీ మహిళా నేత
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు చేశారని బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మి ఆరోపించారు. ఇటీవల సైబర్ సెల్ అధికారులను కలసి ఫిర్యాదు చేసిన షాజియా.. ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. త్వరలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ మద్దతుదారులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 'నాపై అభ్యంతకర పోస్టింగ్‌లు ఎవరు చేశారన్నది తెలుసుకోవాలనుంది. నాకు సానుభూతి అవసరం లేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలి' అని షాజియా చెప్పారు. -
పిలిచారు గానీ.. మాట్లాడనివ్వలేదు
ట్రిపుల్ తలాక్ విషయమై జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన ఓ సెమినార్‌కు తనను పిలిచారు గానీ, అక్కడ మాట్లాడనివ్వలేదని బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ ఆరోపించారు. తాను బీజేపీలో ఉండటం వల్లే దీనిపై మాట్లాడేందుకు అనుమతించలేదని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, దానిపై విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందని.. కానీ నిర్వాహకులపై ఒత్తిడి ఉందని అన్నారు. తాను మాట్లాడితే అది క్యాంపస్‌లో లేనిపోని ఉద్రిక్తతలకు కారణం అవుతుందని వాళ్లు భావించి ఉంటారని ఆమె తెలిపారు. రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలు, హిపోక్రసీ ఉండకూడదని.. కేవలం బీజేపీలో ఉన్నానన్న కారణంతోనే అడ్డుకున్నారని ఇల్మీ అన్నారు. ఇప్పటివరకు తాను ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని, హింసకు వ్యతిరేకంగానే మాట్లాడతానని, అన్నా హజారే ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించానని గుర్తుచేశారు. అలాంటిది తనను వాళ్లు ఎందుకు అనుమానించి, ఇలా అవమానించారని ప్రశ్నించారు. ఇలా పార్టీల ఆధారంగా వివక్ష చూపడం సరికాదని తెలిపారు. నిర్వాహకులు కార్యక్రమ షెడ్యూలును మార్చడం, ఇల్మీని వక్తల జాబితాలో నుంచి తొలగించడంతో యూనివర్సిటీలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. -
రాజకీయాల్లోకి రండి..
‘రాజకీయాలను, ప్రభుత్వాలను తిట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు. స్వచ్ఛమైన, కల్మష రహిత నేపథ్యం ఉన్నవాళ్లు మరింత ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి’ అంటూ స్పష్టం చేశారు షాజియా ఇల్మి. దేశ రాజకీయాల్లో స్వల్పకాలంలోనే చిరపరిచితమైన నేతగా ఎదిగిన ఈ ఢిల్లీ మహిళ... సిటీకి వచ్చారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఒ),యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్ఎల్ఒ)లకు నూతన గవర్నింగ్ బాడీస్ ఏర్పాటైన సందర్భంగా హోటల్ తాజ్‌కృష్ణాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ‘రాజకీయాల్లో సిద్ధాంతాలు’పై మాట్లాడారు. ఆ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఆమె మాటల్లోనే.. మార్పు దిశగా పయనిద్దాం... రాజకీయం అనేది నా భావాలు వ్యక్తం చేసేందుకు, నిర్ణయాత్మక శక్తిగా నన్ను నేను మలచుకునేందుకు నేను ఎంచుకున్న వేదిక. ఒకప్పుడు జర్నలిస్ట్‌గా ఉన్న నేను కేవలం రిపోర్టింగ్ చేసేసి ఆ తర్వాత సెలైంట్‌గా ఉండిపోవడానికి పరిమితమవడం కన్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం కావాలనుకున్నా... రాజకీయాల్లోకి వచ్చింది అందుకే. మన సిస్టమ్ బాగోలేదనడం, ప్రభుత్వాలను తప్పుపట్టడమూ సులభమే. అయితే మనం మేల్కొని మార్పుకు కారణం కావాల్సిన సమయం ఇది. కార్యాచరణలోకి దిగాల్సిన సమయం ఇది. మార్పును స్వీకరిస్తూ దేశాన్ని మార్చే దిశగా మనం పయనించాలి. మన తలరాత రాసేది రాజకీయాలే... కులం, మతం, ప్రాంతం. తన మన భేదాలు ఇంకా అలాంటి అనేకానేక అంశాల ఆధారంగా ఓట్లేస్తున్నాం. ఇలా వేసినంత కాలం మనం రాజకీయాల్లో విలువల్ని ఆశించలేం. భారతదేశ తలరాతను రాసేవి రాజకీయాలే. మన బిడ్డల భవిష్యత్తును, మన జీవన స్థితిగతులను, పాఠశాలల్లో పద్ధతులను, మన అక్కా చెల్లెళ్ల భద్రతను, తోటి పౌరుల భద్రతను అన్నింటినీ నిర్ణయించేవి అవే. కాబట్టి దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి. మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాల్సి ఉందని నేను నమ్ముతున్నాను. - ఎస్.సత్యబాబు -
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేయనున్న ఇల్మీ?
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో ఒకనాటి ప్రముఖ నేత షాజియా ఇల్మీ .. ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఇల్మీ... గురువారం బీజేపీలో చేరే అవకాశముందని అంటున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమె కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేస్తారని కూడా అంటున్నారు. షాజియా ఇల్మీ గత విధానసభ ఎన్నికలలో ఆర్ కేపురం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేసి 326 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘజియాబాద్ నుంచి మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ వీకే సింగ్‌కు వ్యతిరేకంగా పోటీచేశారు. అప్పటికే ఆమెకు ఆప్ తో విబేధాలు మొదలయ్యాయని, అంతేకాకుండా అయిష్టంగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారని వార్తలొచ్చిన సంగతి విదితమే. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఆమె ఆప్‌కు దూరమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, ఆ పార్టీలో ఒక్కరి మాటే చెల్లుతుం దని ఆమె ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, స్వరాజ్గురించి మాట్లాడే అధిష్టానం ఆ విధానాన్ని పార్టీలో అమలు చేయడం లేదని విమర్శించారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో ఆమె పాల్గొన్నారు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు షాజియా ఇల్మీ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ ప్రతిస్పందిస్తూ తనకు ఆ విషయం తెలియదని, ఎక్కడి నుంచైనా పోటీ చేసే స్వేచ్ఛ పౌరులకు ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తరఫున బరిలోకి కిరణ్వాలియా ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కిరణ్ వాలియా బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు తొలుత వాలియా నిరాకరించినప్పటికీ పార్టీ ఆదేశించడంతో అందుకు ఆమె అంగీకరించారు. కాగా గత ఎన్నికల్లో ప్రతిష్టాత్మక న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన షీలాదీక్షిత్ పరాజయం పాలైన సంగతి విదితమే. కేజ్రీవాల్... 25 వేల ఓట్ల తేడాతో షీలాను ఓడించారు. షీలాదీక్షిత్ ప్రభుత్వంలో కిరణ్ వాలియా... వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన వాలియాను ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతి ఓడించారు. అయితే 1999చ 2003, 2008 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో వాలియా... విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. -
కేజ్రీవాల్‌పై ఆప్ మాజీనేత షాజియా పోటీ?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఫిరాయింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆప్ నాయకురాలు షాజియా ఇల్మి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ టిక్కెట్టు ఇవ్వడంతో 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాజియా పోటీచేశారు. కాగా నేడు రూటు మార్చిన ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. న్యూఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. స్వయంగా కేజ్రీవాల్ మీదే పోటీకి దిగుతారని కూడా చెబుతున్నారు. ఆమె అంతకుముందు స్టార్‌న్యూస్ చానల్లో పాత్రికేయ వృత్తిలో ఉండేవారు. సామాజిక కార్యకర్తగా కూడా పేరొందారు. గత రెండు వారాల నుంచి బీజీపీలో చేరనున్న ఆరో వ్యక్తి ఆమె. న్యూఢిల్లీ పార్టీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇల్మి పేరును ప్రకటించడం చూస్తే బీజేపీకి ఇది రాజకీయంగా కలిసొచ్చే అంశం అవుతుంది. -
కమలం గూటిలో ఇల్మి?
సాక్షి, న్యూఢిల్లీ:స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రచారం కోసం రాష్ట్ర బీజేపీ ప్రకటించిన తొమ్మిది మంది ప్రముఖుల పేర్లలో ఆప్ మాజీ నేత షాజియా ఇల్మి పేరు కూడా ఉండడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఈ పేర్లను ప్రకటించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు రాష్ట్ర శాఖ ఇంచార్జి ప్రభాత్ జోషీ కూడా పాల్గొన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేయడం కోసం మేధావులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులు, డాక్టర్లను ప్రచారకర్తల జాబితాలో చేర్చినట్లు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. అయితే ఈ జాబితాలో షాజియా ఇల్మీ పేరు ఉండడం చర్చకు దారితీసింది. మోదీపై ఇల్మి ప్రశంసలు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో భాగస్వామిని కాగలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంద న్నారు. బీజేపీలో చేరాలని యోచిస్తున్నారా? అని ప్రశ్నించగా ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. కాగా బీజేపీ రాష్ర్ట విభాగంప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడుస్తోంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ విజయవంతానికి సచిన్ టెండూల్కర్, సల్మాన్‌ఖాన్ మొదలైన తొమ్మిది మంది ప్రముఖులను ప్రధాని సూచించిన రీతిలోనే రాష్ట్ర బీజేపీ శాఖ కూడా తొమ్మిది మంది ప్రముఖులను ప్రచారకర్తలుగా ప్రకటించింది. నగరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ వారి పేర్లను ప్రకటించారు. వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత షాజియా ఇల్మీతో పాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ దినేష్‌సింగ్, రెజ్లర్ సుశీల్‌కుమార్, డా. కె..కె. అగర్వాల్, కథక్ కళాకారిణి ఉమాశర్మ , డీసీఎం గ్రూప్ ఎండీ వినయ్ భరత్‌రామ్, ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ ప్రసిడెంట్ సిరాజుద్దీన్ ఖురేషీ, సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) అధ్యక్షుడు మోహిత్ నాగర్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగల కుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నా రు. ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని, ఈ కార్యక్రమమాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని రంగాలకు చెందిన వారిని ఇందులో భాగ స్వాములను చేస్తున్నామని ఆయన చెప్పారు. స్వచ్ఛ్ భారత్ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాకపోయినా... దేశప్రజల సహకారంతో అక్టోబర్ 2, 2019 నాటికి భారత్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దగలుగుతామంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయస్వేచ్ఛ కంటే పారిశుధ్యం ముఖ్యమని మహాత్మాగాంధీ చెప్పారని, అది ఆయన నినాదమ ని, మన ఇంటిని, పరిసరాలను దుకాణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన కర్తవ్యమని, దానిలో విజయం సాధిస్తే అది గాంధీజీకి అత్యున్న త నివాళి అవుతుందని మంత్రి చెప్పారు. ప్రజలను జాగరూకులను చేయడం, మౌలిక వసతులను కల్పించడం, పారిశుధ్య వసతులు కల్పించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదని, అన్ని రాజకీయ పార్టీలు ఇం దులో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. యావద్భారతానికి స్ఫూర్తి రాష్ట్ర బీజేపీ శాఖ ఇంచార్జి ప్రభాత్ ఝా మాట్లాడుతూ విశిష్ఠ వ్యక్తులు స్వచ్ఛభారత్ ప్రచారంలో పాల్గొనడం యావత్ భారతావనికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ తొమ్మిది మంది ప్రముఖులతో పాటు సులభ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి బిదేశ్వర్ పాఠక్, ప్రముఖ గాయని శిబాని కశ్యప్, ఫిక్కీ మహిళా విభాగం సభ్యురాలు హరిజిందర్ కౌర్, ఢిల్లీ నివాస సముదాయ సమాఖ్య అధ్యక్షుడు జితేందర్ త్యాగి, కార్యదర్శి సౌరవ్ గాంధీ, వీడియో డెరైక్టర్ రవీంద్రలు కూడా స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగస్వామ్యానికి ముందుకువచ్చారని తెలిపారు. వాల్మీకికాలనీలో పారిశుధ్య కార్యక్రమం స్వచ్ఛ్ భారత్ అభియాన్ కింద రాష్ర్ట రెవెన్యూ శాఖ సిబ్బంది వాల్మీకినగర్‌లో గురవారం పారిశుధ్య కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మీడియాతో మాట్లాడుతూ అరబిందో మార్కెట్ అసోసియేషన్ సహకారంతో నివాస సంక్షేమ సంఘాలకు 50 డస్ట్ బిన్లను అందజేశామన్నారు. ప్రధానమంత్రి ఇచ్చి న పిలుపును స్ఫూర్తిగా తీసుకుని నగరవాసులు స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పెద్దసంఖ్యలో పాల్గొనాలని, పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవాలన్నారు. -
భూషణ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలి
న్యూఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామర్థ్యానికి సవాలువిసురుతూ శాంతిభూషణ్ చేసిన వ్యాఖ్యలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి హితవు పలికారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆప్‌కు ఆయన భీష్మ పితామహుడి వంటి వ్యక్తి అని, అందువల్ల ఆయన మాట ల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పరిశీలించాలన్నారు. పార్టీలో కచ్చితంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉం డాలన్నారు. తాను కూడా అంతర్గత ప్రజాస్వామ్యం గురించే మాట్లాడతానన్నారు. అందరూ గౌరవించే వ్యక్తి అయిన శాంతిభూషణ్ ఈ వ్యాఖ్యల్ని పార్టీలోనూ లేవనెత్తాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రశ్నించకూడదు: అశుతోశ్ శాంతిభూషణ్ వ్యాఖ్యలపై వివాదం రేకెత్తిన నేపథ్యంలో ఈ విషయమై ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు అశుతోశ్ మాట్లాడుతూ కేజ్రీవాల్‌కు పార్టీని నడిపించే సత్తా ఉందా లేదా అనే అంశాన్ని లేవనెత్తకూడద న్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందన్నారు. అవినీతి వ్యతిరేకోద్యమం అరవింద్ మానసిక పుత్రికగా ఆయన అభివర్ణించారు. ఆ తర్వాత ఏడాదిన్నర లోపే పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ 28 నియోజకవర్గాలను గెలుచుకుందన్నారు. అటువంటప్పుడు ఇటువంటి అంశాలను ఎందుకు లేవనెత్తుతున్నారని అశుతోశ్ ప్రశ్ని ంచారు. ఈసీని కలవనున్న ఆప్ ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే రంజిత్ సింగ్ నకిలీ కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారనే ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చేవారం ఎన్నికల కమిషన్‌ను కలవనుంది. 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గోలక్పూర్ (రిజర్వ్డ్) స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన రంజిత్ సింగ్ నకిలీ కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడంద్వారా అటు నియోజవర్గ ప్రజలతోపాటు ఇటు ఎన్నికల కమిషన్‌ను వంచించారని ఆప్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొ ంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. -
ఆప్ లో 'దుష్ట చతుష్టయం'
సాప్, యాప్, మాప్, పాప్ పార్టీల పేర్లెప్పుడైనా విన్నారా? సాప్ అంటే సంజయ్ ఆద్మీ పార్టీ. యాప్ అంటే యోగేంద్ర ఆప్ పార్టీ. మ్యాప్ అంటే మనీష్ ఆద్మీ పార్టీ, పాప్ అంటే పర్వీన్ అమానుల్లా పార్టీ. ఇవన్నీ నిజంగా పార్టీలు కాదండోయ్. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి గుప్పెట్లో ఉందని చెప్పేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రెబెల్స్ ఈ పేర్లు పెట్టారు. ఉత్తరప్రదేశ్ లో సాప్, హర్యానాలో యాప్, మధ్యప్రదేశ్ లో మ్యాప్, బీహార్ లో పాప్ గా మారిపోయిందని, ఆ నేత ఇష్టారాజ్యమే నడుస్తోందని రెబెల్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్త ఆమ్ ఆద్మీ రెబెల్స్ జోనల్ స్థాయిలో సభలు పెట్టి ఆప్ ఆపసోపాలు పడేలా చేయబోతున్నారు. మొదటి సభ బెంగుళూరులో జరగబోతోంది. ఇందులో ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే షాజియా ఇల్మీ, మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అశ్వినీ ఉపాధ్యాయ్, పార్టీ వ్యవస్థాపక సభ్యులు మధు భండారిలు పాల్గొంటారు. వీరంతా ఆప్ లో ఒక దుష్ట చతుష్టయం రాజ్యమేలుతోందని, పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారు. దుష్టచతుష్టయం అంటే అరవింద కేజరీవాల్, యోగేంద్ర యాదవ్, మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్ లేనని వారంటున్నారు. ఇప్పుడీ తిరుగుబాటుదారులు టీఎన్ శేషన్, యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ లేదా ఎన్ సి ఈ ఆర్ టీ మాజా డైరెక్టర్ జెఎస్ రాజ్ పుత్ లలో ఎవరో ఒకరిని తమఅధినేతగా ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద 'చీపురుకట్టలు' తిరగబడుతున్నాయి. -
షాజియా ఇల్మిపై నాన్‌బెయిలబుల్ వారంట్
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు విచారణకు హాజరుకానందుకును ఆమ్ ఆద్మీ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన షాజియా ఇల్మికి వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేసింది. కేంద్ర టెలికం శాఖను వీడనున్న మంత్రి కపిల్ సిబల్ కుమారుడు అమిత్ సిబల్.. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులపై ఈ పిటిషన్‌ను దాఖలుచేసిన సంగతి విదితమే. విచారణకు హాజరు కాకపోతే క ఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సునీల్‌కుమార్ శర్మ నెలరోజుల క్రితమే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్‌తోపాటు ఆ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, ఇల్మిలను హెచ్చరించిన సంగతి విదితమే. కేసు విచారణకు ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. ఇదిలాఉండగా తండ్రి చనిపోయినందువల్ల తనకు కేసు విచారణకు హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మనీష్ సిసోడియా చేసిన విన్నపాన్ని కోర్టు అంగీకరించింది. ఆయనకు ఎటువంటి జరిమానా విధించలేదు. ఇక మరో కేసులో చిక్కుకుని కారాగారంలో ఉన్నందువల్ల తన క్లెయింట్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అర్వింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది శాంతిభూషణ్ చేసిన విన్నపాన్ని కోర్టు మన్నించింది. మినహాయింపు దరఖాస్తును సమర్పించాలని, ఆగస్టు 23వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరయ్యేవిధంగా చూడాలని ఆదేశించింది. కాగా ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 23న జరగనుంది. -
ఆప్‌ను వీడిన ఇల్మి, గోపీనాథ్
కేజ్రీవాల్ తీరు నచ్చకే రాజీనామా చేశామన్న నేతలు అధినేత జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైపోయిందని విమర్శ న్యూఢిల్లీ /బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేతలు షాజియా ఇల్మి, జీఆర్ గోపీనాథ్ శనివారం ఆ పార్టీని వీడారు. కేజ్రీవాల్ జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని, పార్టీలో అసలు అంతర్గత ప్రజాస్వామ్యమనేదే లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా తర్వాత వారు ఢిల్లీలో విలేకరులతో మట్లాడారు. కేజ్రీవాల్ జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని, గడ్కారీ పెట్టిన పరువునష్టం కేసులో బెయిల్ తీసుకోవడానికి కేజ్రీవాల్ ఎందుకు నిరాకరించారని గోపీనాథ్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ పొరపాట్లే ఆయన వైఫల్యానికి కారణమవుతున్నాయన్నారు. ఇల్మి మాట్లాడుతూ... ‘‘అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలని చెప్పుకొనే ఆప్ పార్టీలోనే.. అంతర్గత ప్రజాస్వామ్యం కరువవడంతో ఈ పనిచేయాల్సి వచ్చింది. కేజ్రీవాల్ జైలులో ఉండి సమయాన్ని, శక్తిని వృథా చేయొద్దు. బెయిల్ తీసుకుని ప్రజల మధ్యకు వచ్చి పోరాడాలి..’’ అని పేర్కొన్నారు. తాను ఆప్‌ను వీడినా మరే పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాగా.. ఇంతకుముందే మాజీ దౌత్యవేత్త మధ భండారి ఆప్‌ను వీడారు. ఇద్దరు కీలక నేతలు వినోద్‌కుమార్ బిన్ని, అశ్విని ఉపాధ్యాయలను పార్టీ నుంచి వెలివేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి రాజీనామా కేజ్రీవాల్‌కు పెద్ద దెబ్బే కానుంది. మరోవైపు.. కపిల్‌సిబల్ కుమారుడు అమిత్ పెట్టిన పరువునష్టం కేసులో షాజియా ఇల్మిపై ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ప్రశాంత్‌భూషణ్‌లతో పాటు ఈ కేసులో నిందితురాలైన షాజియా పార్టీని వీడిన రోజే వారెంట్‌జారీ కావడం గమనార్హం. -
చీపురు వదిలేశారు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో డీలాపడిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు వ్యవస్థాపక సభ్యులు రాజీనామా చేశారు. అధిష్టానం తీరుపై ఈ సందర్భంగా వారిరువురూ మండిపడ్డారు. అరవింద్ చుట్టూచేరిన కొందరు పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారని షాజియా ఇల్మి విమర్శించగా, అధిష్టానం వైఖరి కారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయని గోపీనాథ్ తప్పుబట్టారు. అందువల్లనే తాము రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు, జాతీయ ప్రతినిధి షాజియా ఇల్మి ఆ పార్టీని వీడారు. శనివారం ఉదయం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ చుట్టూచేరిన కొందరు పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. పార్టీ అనేక తప్పిదాలు చేసిందని ఆమె విమర్శించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీ నామా చేస్తున్నట్లు ఇల్మి పేర్కొన్నారు. అత్యంత బాధతో పార్టీని వీడుతున్నానని, ఏ ఉద్యమానికి, ఏ పార్టీకి తాను మొదటినుంచి ముడిపడిఉన్నానో వాటితో తాను తెగతెంపులు చేసుకుంటున్నానని చెప్పారు. స్వరాజ్యం గురించి మాట్లాడే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని ఆమె విమర్శించారు. పార్టీని కొందరు గుప్పిట్లో పెట్టుకున్నారని, వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అయితే వారెవ రనే విషయం మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. కేజ్రీవాల్‌ను కలవడం తనకే కష్టంగా ఉందని, ఇక కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని సులువుగా ఊహించుకోవచ్చని ఆమె చెప్పారు. తాను సందేశం పంపిన వ్యక్తి చెప్పిన మాటలను అరవింద్ వినిపిం చుకోలేదని ఆమె ఆరోపించారు. తిరుగుబాటు స్వరం వినిపించినందుకు తనను పక్కనబెట్టారని, పార్టీ విధాన నిర్ణయ ప్రక్రియలో తనకు చోటులేకుండా చేశారని ఆమె చెప్పారు. పార్టీ నిర్ణయాలను తాను ఐదారు నెలలుగా ప్రశ్నిస్తున్నానన్నారు. పార్టీలో అనేకమంది తనలాగే అసంతృప్తితో ఉన్నారని ఆమె చెప్పారు. తాను రాజీనామా చేస్తే పార్టీలో కనీసం అంతర్మథనమైనా జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఘజియాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి ఓడిపోయినందుకు మాత్రం రాజీనామా చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నిక ల్లో గెలుపు ఓట ములు అత్యంత సహజమేనని ఆమె చెప్పారు. అయితే ఎన్నికల సమయంలోనే తనకు రాజీనామా చేయాలనిపిం చిందని, అయితే పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో మౌనం వ హించానని ఆమె చెప్పారు. కాగా షాజియా ఇల్మి... ఢిల్లీ నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే అధిష్టానం ఆమెను సోనియా గాంధీకి వ్యతిరేకంగా రాయ్‌బరేలీ నుంచి నిలబెట్టాలనుకుందని, అందుకు నిరాకరించిందనే వార్తలొచ్చాయి. ఢిల్లీ నుంచి టికెట్ ఇవ్వలేదని ఆగ్రహించిన షాజియాను సంతృప్తిపరచడం కోసం ఆమెను ఘజియాబాద్ నుంచి నిలబెట్టారు. ఆమె ఘజియాబాద్ నుంచి మనస్ఫూర్తిగా పోటీ చేయలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయమై ఇల్మి మాట్లాడుతూ కేజ్రీవాల్ తన తరపున ప్రచారం చేయకపోవడం కూడా ఆగ్రహం తెప్పించిందన్నారు. ఈ ఎన్నికల్లో ఇల్మి డిపాజిట్ కూడా కోల్పోయారు. అంతకు ముందు శాసనసభ ఎన్నికల్లో ఆర్.కె.పురం స్థానం నుంచి పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. చీటికిమాటికి ఆందోళనలు సరికాదు సంచలనాలను సృష్టించడం వల్ల మొదట్లో కొంత లాభం కలిగినప్పటికీ చీటికిమాటికి ధర్నాలు, ప్రదర్శనలు చేయడం సరికాదంటూ షాజియా ఆప్ విధానాలను విమర్శించారు. ప్రతిసారి రాజకీయ నేతపైనో, కార్పొరేట్ హౌస్పైనో ఆరోపణలు చేయడం అవసరమా అని ఆమె ప్రశ్నించారు. పార్టీ దిశాహీనంగా మారిందని ఆమె ఆరోపించారు. ప్రజలు కూడా ధర్నాలతో విసిగిపోయారని ఆమె చెప్పారు. జైలు, బెయిలు రాజకీయం కూడా సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత పూచీకత్తు చెల్లించడానికి నిరాకరించి జైలు లో ఆత్మచింతన చేసుకోవడానికి బదులు నలుగురి గుప్పిటి నుంచి విముక్తి పొంది జనం మధ్యలోకి వెళ్లి అంతర్మధనం చేసుకోవాలని ఆమె సూచించారు. అర్వింద్ కేజ్రీవాల్ అన్నా, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలన్నా తనకు ఇంకా గౌరముందని ఆమె చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని ఆమె చెప్పారు. పార్టీ తనకు సముచితమైన పాత్ర కల్పిస్తే తిరిగి పార్టీలో చేరడానికి అభ్యంతరం లేదని తెలిపారు. నచ్చజెప్పేందుకు యత్నించాం షాజియా ఇల్మీ ఆరోపణలపై పార్టీ నేత యోగేంద్ర యాదవ్ ప్రతిస్పందిస్తూ షాజియా రెండు నెలలుగా ఆగ్రహంతో ఉన్నట్లు అంగీకరించారు. ఆమె తన ఆగ్రహాన్ని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వెల్లడించారని, లేఖ కూడా రాశారని ఆయన చెప్పారు. షాజియా పార్టీని వీడనున్నట్లు తెలిసిన తరువాత ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశామని ఆయన చెప్పారు. షాజియా మనసు మార్చుకుని రెండు నెలలలో తిరిగి వస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. షాజియా లేవనెత్తిన అంశాలను పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. షాజియా రాజీనామా చేసిన సమయం సరిగ్గా లేదని యాదవ్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ కారాగారం నుంచి బయటకు వచ్చిన తరువాత రాజీనామా చేసి ఉండాల్సిందని ఆయన చెప్పారు. షాజియాకు ప్రశ్నించే హక్కు ఉందని, కానీ ఆమె తొందరపడ్డారని యాదవ్ వ్యాఖ్యానించారు. ఇల్మి నివాసానికి సోమ్‌నాథ్ షాజియాకు నచ్చచెప్పడం కోసం శనివారం ఉదయం వరకు పార్టీప్రయత్నించింది. ఆప్ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి శనివారం ఉదయం షాజియా నివాసానికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఆ తరవాత విలేకరులతో మాట్లాడుతూ షాజియా కోపంతో లేదని కూడా ప్రకటించారు. అదేబాటలో గోపీనాథ్.. దేశంలో మొట్టమొదటిచౌక విమానయాన సంస్థను ప్రారంభించిన వ్యాపారవేత్త గోపీనాథ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పనితీరు పట్ల తనకు అభ్యంతరాలున్నాయని, నితిన్ గడ్కరీ పరువునష్టం దావాలో ధరావత్తు చెల్లించకుండా కేజ్రీవాల్ కారాగారానికి వెళ్లడంతో ఈ నిర్ణయానికి వచ్చానని గోపీనాథ్ వివరించారు. తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చే స్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు కారణం పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల అంతర్గత విభేదాలు నానాటికీ పెరిగిపోతుండడమేనన్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో గోపీనాథ్... ఆప్‌లో చేరిన సంగతి విదితమే. తన మనోభావాలను గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా మీడియా ముందుంచానన్నారు. ఆప్ మున్ముందు మరింత ఎదగాలని కోరుకుంటున్నట్టు ఫ్రాన్స్‌లోని టౌలౌజ్‌లో ఉన్న ఆయన ఫోన్లో చెప్పారు. వాద్రాపై అర్వింద్ అవినీతి ఆరోపణలు చేసినపుడు బీజేపీ ఎంతో సంతోషించిందన్నారు. ఆ తర్వాత అర్వింద్... నితిన్ గ డ్కారీపై విమర్శలకు దిగారన్నారు. కాగా 2003వ సంవత్సరంలో ఎయిర్ డక్కన్ పేరిట దేశంలోనే తొలిసారిగా చవక విమాన సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ సంస్థను విజయ్‌మాల్యా కొనుగోలు చేసి దానికి కింగ్ ఫిషర్ రెడ్‌గా నామకరణం చేశారు. అది ప్రస్తుతం మూతపడిన సంగతి విదితమే. -
షాజియా ఇల్మిపై నాన్‌బెయిలబుల్ వారంట్
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు విచారణకు హాజరుకానందుకును స్థానిక న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన షాజియా ఇల్మికి వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేశారు. కేంద్ర టెలికం శాఖను వీడనున్న మంత్రి కపిల్ సిబల్ కుమారుడు అమిత్ సిబల్ ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ తదితరులపై ఈ పిటిషన్‌ను దాఖలుచేసిన సంగతి విదితమే. విచారణకు హాజరు కాకపోతే క ఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సునీల్‌కుమార్ శర్మ నెలరోజుల క్రితం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్‌తోపాటు ఆ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, ఇల్మిలను హెచ్చరించిన సంగతి విదితమే. కేసు విచారణకు ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. ఇదిలాఉండగా తండ్రి చనిపోయినందువల్ల తనకు కేసు విచారణకు హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మనీష్ సిసోడియా చేసిన విన్నపాన్ని కోర్టు అంగీకరించింది. ఆయనకు ఎటువంటి జరిమానా విధించలేదు. ఇక మరో కేసులో చిక్కుకుని కారాగారంలో ఉన్నందువల్ల తన క్లెయింట్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అర్వింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది శాంతిభూషణ్ చేసిన విన్నపాన్ని కోర్టు మన్నించింది. మినహాయింపు దరఖాస్తును సమర్పించాలని, ఆగస్టు 23వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరయ్యేవిధంగా చూడాలని ఆదేశించింది. కాగా ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 23న జరగనుంది. -
ఆమ్ ఆద్మీకి డబుల్ షాక్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి డబుల్ షాక్ తగిలింది. శనివారం ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోకడలను వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్నట్టు గోపీనాథ్, షాజియా ప్రకటించారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు షాజియా చెప్పారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆమె విమర్శించారు. బెంగళూరుకు చెందిన గోపీనాథ్ కూడా కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ పూచీకత్తుపై బెయిల్ తీసుకోకుండా జైలుకెళ్లడాన్ని తప్పుపట్టారు. -
కేజ్రీ రాజీనామా తొందరపాటు చర్య: ఆప్ నేత షాజియా
ఇండోర్: ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడం తొందరపాటుతనమేనని ఆ పార్టీ నేత షాజియా ఇల్మి అన్నారు. అలా రాజీనామా చేస్తాడని తాను అనుకోలేదని తెలిపారు. ఆయన అధికారంలో ఉండి జన్‌లోక్‌పాల్ బిల్లుపై చర్చపెట్టలేకపోయారని, కేజ్రీవాల్ అధికారదాహంతో ఉన్నారని విమర్శించారు. రాజీనామా అనంతరం కేజ్రీవాలో సమస్యలనుంచి, క్షేత్ర ంనుంచి పారిపోయారన్నారు. జన్‌లోక్‌పాల్ అంశమై రాజీనామా చేసినా, తాము ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనేవిషయాన్ని ప్రజలకు చెప్పి ఒప్పించలేకపోయారని ఆమె విమర్శించారు. ఆమ్ఆద్మీ పార్టీ ఇండోర్ అభ్యర్తి అనిల్ త్రివేదికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాజియా ప్రజలు అధికారం, నీళ్లు, రోడ్లు, విద్య, వైద్యం కావాలని కోరుకుంటున్నారని ‘హర-హర-మోడీ’ అనడం వల్ల ఏమొస్తుందని బీజేపీని ప్రశ్నించారు. భగవాన్, అల్లాలను భరించలేనివాళ్లు సామాన్యవ్యక్తులను ఎలా భరిస్తారని ఎద్దేవా చేశారు. -
ఘజియాబాద్ అభివృద్ధే ఆప్ ధ్యేయం
ఘజియాబాద్: నగరాన్ని అభివృద్ధే తమ ధ్యేయమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ జర్నలిస్టు షాజియా ఇల్మీ అన్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఘజియాబాద్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆమె విమర్శించారు. ఘజియాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా షాజియా ఇల్మీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాసేపటికే మీడియాతో ఆమె మాట్లాడుతూ... కులం, మతం, ప్రాంతం వంటి నినాదాలేవీ లేకుండా కేవలం అభివృద్ధి నినాదంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఘజియాబాద్‌తో అవినాభావ సంబంధముందని, ఆప్ కార్యక్షేత్రంగా ఘజియాబాద్ నిలుస్తోందన్నారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాస ప్రాంతం ఇదేనని, ఇక్కడ నివసిస్తూనే ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆప్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉందని, పార్టీలో ప్రముఖ నేతలుగా చెప్పుకుంటున్న మనీశ్ సిసోడియా, కుమార్ విశ్వాస్ వంటివారికి కూడా ఘజియాబాద్‌తో సంబంధాలున్నాయన్నారు. మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసిన ఇల్మీ జీ న్యూస్, స్టార్ న్యూస్ వంటి మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోకముందే అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమంలో కేజ్రీవాల్‌తో కలిసి పనిచేశారు. కేజ్రీవాల్ పార్టీని ఏర్పాటు చేశాక ఆప్‌లో చేరారు. రాయ్ బరేలీ, కాన్పూర్ లేదా ముంబై నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఇల్మీ భావించినా పార్టీ ఆమెను ఘజియాబాద్ నుంచి బరిలోకి దించింది. కాగా స్థానికేతరురాలైన తనను బరిలోకి దించడంపై ఆమె మాట్లాడుతూ. ఇక్కడి నుంచి గతంలో బరిలోకి దిగినవారిలో ఎక్కువమంది స్థానికేతరులేనని, బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగి గెలుపొందిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టకపోవడంతో నగరవాసులు ఆయనపట్ల అసంతృప్తిగా ఉన్నారని, దీనిని గమనించే ఆయన ఈసారి లక్నో నుంచి బరిలోకి దిగుతున్నారని ఇల్మీ ఆరోపించారు. ఇదిలాఉండగా ఘజియాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ గురించి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీ మెట్రోను దిల్షాద్ గార్డెన్ వరకు విస్తరించే ప్రతిపాదనను ఆమోదించింది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమని, దానిని సమాజ్‌వాదీ, బీజేపీ పార్టీలు తమ ఘనతగా చెప్పుకుంటూ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. -
ఘజియాబాద్ బరిలో షాజియా
సాక్షి, న్యూఢిల్లీ: ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షాజియా ఇల్మీని బరిలోకి దింపనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. షాజియా ఇల్మీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్.కె. పురం నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్పఓట్ల తేడాతో ఓడిపోయారు. ఢిల్లీలో పార్టీ టికెట్లు ఇచ్చిన తీరుపై అసంతృప్తి ప్రకటించిన షాజియా ఇటీవల వార్తల్లో ఎక్కారు. పార్టీ ఆమెను రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపాలనుకున్నా, ఆమె ఢిల్లీ నుంచి టికెట్ ఆశించారు. పార్టీ తనకు ఏడింటిలో ఏ ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడంతో నిరాశ చెందారు. తాను ఢిల్లీవాసినని, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోనని ప్రకటించారు. కుటుంబ కారణాల వల్ల తాను ఢిల్లీకి దూరంగా ఉన్నప్పటికీ, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని మీడియాకు తెలిపారు. న్యూఢిల్లీ లేదా దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేయడంపైనే ఆసక్తి ఉందని ఆమె చెప్పారు. న్యూఢిల్లీ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబడిన ఆశిష్ ఖైతాన్ తరపున ప్రచారం చేస్తానని కూడా షాజియా ప్రకటించారు. ఈమె అసంతృప్తిని గమనించిన ఆప్ పీఏసీ ఆమెకు ఘజియాబాద్ టికెట్ ఇచ్చి బుజ్జగించింది. ఘజియాబాద్‌లో ఆప్ బలంగా ఉంది. పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ తదితరుల నివాసాలతోపాటు పార్టీ కార్యాలయమూ ఇక్కడే ఉంది. ఘజియాబాద్ నుంచి కాంగ్రెస్ నటుడు రాజ్‌బబ్బర్‌కు టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన మళ్లీ ఘజియాబాద్ నుంచి పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు. ఘజియాబాద్‌లో ఆప్ ప్రభావం అధికంగా ఉన్నందువల్ల ఆయన ఇక్కడ నుంచి పోటీకి సంకోచిస్తున్నారని అంటున్నారు. -
సోనియాపై పోటికి షాజియా ఇల్మిపై ఆప్ దృష్టి!
రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీపై పోటీకి బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సోనియాపై పోటీకి షాజియా ఇల్మిని ఎన్నికల బరిలోకి దించేందుకు ప్రయత్నాల్ని ప్రారంభించింది. అయితే షాజియా అభ్యర్థిత్వంపై ఆధికారికంగా ఆప్ ప్రతినిధులు ధృవీకరించలేదు. అభ్యర్థుల తుది జాబితాను ఇకా ఫైనలైజ్ చేయలేదు అని ఆప్ అధికార ప్రతినిధి దిలీప్ పాండే తెలిపారు. ఆప్ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సేవలందిస్తున్న షాజియా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆర్కే పురం నియోజకవర్గం నుంచి తక్కువ ఓట్ల తేడాతో ఓటమిపాలైయ్యారు. దక్షిణా ఢిల్లీ స్థానం నుంచి కాని, కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ పోటీ చేయనున్న ఫరుక్కాబాద్ స్థానం నుంచి పోటీకి షాజియా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఖుర్షీద్ పై ఆప్ ముఖుల్ త్రిపాఠిని రంగంలోకి దించడంతో రాయ్ బరేలి నుంచి సోనియాపై షాజియాను నిలిపేందుకు ఆప్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ఆప్ అభ్యర్థిని అన్వేషిస్తోంది. అయితే గుజరాత్ లో కాకుండా వేరే స్థానం నుంచి మోడీ పోటీకి దిగితే.. ఏకంగా ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ను అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం.