ఘజియాబాద్ అభివృద్ధే ఆప్ ధ్యేయం
ఘజియాబాద్ అభివృద్ధే ఆప్ ధ్యేయం
Published Tue, Mar 18 2014 10:59 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
ఘజియాబాద్: నగరాన్ని అభివృద్ధే తమ ధ్యేయమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ జర్నలిస్టు షాజియా ఇల్మీ అన్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఘజియాబాద్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆమె విమర్శించారు. ఘజియాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా షాజియా ఇల్మీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాసేపటికే మీడియాతో ఆమె మాట్లాడుతూ... కులం, మతం, ప్రాంతం వంటి నినాదాలేవీ లేకుండా కేవలం అభివృద్ధి నినాదంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఘజియాబాద్‌తో అవినాభావ సంబంధముందని, ఆప్ కార్యక్షేత్రంగా ఘజియాబాద్ నిలుస్తోందన్నారు.
పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాస ప్రాంతం ఇదేనని, ఇక్కడ నివసిస్తూనే ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆప్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉందని, పార్టీలో ప్రముఖ నేతలుగా చెప్పుకుంటున్న మనీశ్ సిసోడియా, కుమార్ విశ్వాస్ వంటివారికి కూడా ఘజియాబాద్‌తో సంబంధాలున్నాయన్నారు. మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసిన ఇల్మీ జీ న్యూస్, స్టార్ న్యూస్ వంటి మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోకముందే అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమంలో కేజ్రీవాల్‌తో కలిసి పనిచేశారు. కేజ్రీవాల్ పార్టీని ఏర్పాటు చేశాక ఆప్‌లో చేరారు. రాయ్ బరేలీ, కాన్పూర్ లేదా ముంబై నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఇల్మీ భావించినా పార్టీ ఆమెను ఘజియాబాద్ నుంచి బరిలోకి దించింది. కాగా స్థానికేతరురాలైన తనను బరిలోకి దించడంపై ఆమె మాట్లాడుతూ.
ఇక్కడి నుంచి గతంలో బరిలోకి దిగినవారిలో ఎక్కువమంది స్థానికేతరులేనని, బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగి గెలుపొందిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టకపోవడంతో నగరవాసులు ఆయనపట్ల అసంతృప్తిగా ఉన్నారని, దీనిని గమనించే ఆయన ఈసారి లక్నో నుంచి బరిలోకి దిగుతున్నారని ఇల్మీ ఆరోపించారు. ఇదిలాఉండగా ఘజియాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ గురించి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీ మెట్రోను దిల్షాద్ గార్డెన్ వరకు విస్తరించే ప్రతిపాదనను ఆమోదించింది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమని, దానిని సమాజ్‌వాదీ, బీజేపీ పార్టీలు తమ ఘనతగా చెప్పుకుంటూ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
Advertisement
Advertisement