సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన ఘజియాబాద్ లోక్‌సభ ఎన్నికల పోరు ఆసిక్తకరంగా మారింది. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీపడ్తున్న ఈ నియోజకవర్గం లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు బయటివారే కావడం విశేషం.
ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన లక్నో నుంచి పోటీ చేయాలనుకోవడంతో ఖాళీ అయిన సీటును మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ వి.కె. సింగ్‌ను బరిలోకి దింపింది. పదవీ విరమణ తరువాత అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక పోరాటంలో చురుకుగా పాల్గొన్న సింగ్ ఇటీవలే బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్‌ను నిలబెట్టింది. రాజ్‌బబ్బర్ ప్రస్తుతం ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యతి రేకపవనాలు బలంగా వీస్తోన్న ఈ తరుణంలో రాజ్‌బబ్బర్ బాలీవుడ్ గ్లామర్‌పైనే కాంగ్రెస్ ఆశలుపెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ షాజియా ఇల్మీకి టికెట్ ఇచ్చింది. ఘజియాబాద్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిల్లుగా పరిగణిస్తారు.
ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్, మనీష్ సిసోడియా ఇక్కడివారే. ఆప్ ఆవిర్భావం నుంచి ఢిల్లీలో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వరకు.. ఆప్ కార్యకలాపాలకు ఘజియాబాద్ వేదికగానే సాగాయి. స్వస్థలంలో ఆప్‌ను గెలిపించవలసిన బాధ్యత షాజియాపై పడింది. షాజియా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌కే పురం నుంచి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
యూపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే సమాజ్ వాదీ పార్టీనిగానీ, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థినిగానీ ఘజియాబాద్ ఓటర్లు ఇంతవరకు ఎన్నుకోలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గం పరిధిలోని ఐదు స్థానాల్లో నాలుగింటిని బీఎస్పీ దక్కించుకోవడంతో ఆ పార్టీ కూడా ఈసారి లోక్‌సభ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. ఘజియాబాద్ నుంచి బీఎస్పీ ముకుల్ ఉపాధ్యాయ, ఎస్పీ సుధేన్‌కుమార్ రావత్‌ను బరిలోకి దింపాయి.
కులమతాలదే కీలక పాత్ర
పట్టణీకరణపరంగా చూస్తే ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తోన్న పట్టణాలలో జాబితాలో ఘజియాబాద్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ యూపీలోని ఇతర నియోజకవర్గాలన్నింటి మాదిరిగానే ఇక్కడ కూడా రాజకీయాలలో కులమతాలే పెద్ద ప్రాత పోషిస్తున్నాయి. ఈ నియోజకవర్గ రాజకీయాలలో బ్రాహ్మణులు, రాజపుత్రులదే పైచేయిగా ఉంది.
జిల్లాలోని 567 గ్రామాలలో 124 గ్రామాలను ఠాకూర్ల గ్రామాలుగా పేర్కొటారు. సిట్టింగ్ ఎంపీ రాజ్‌నాథ్‌సింగ్ కూడా ఠాకూరే కావడంతోపాటు బీజేపీ అభ్యర్థి వి.కె. సింగ్ కూడా రాజపుత్రుడే. ముస్లింలు, దళితులు. పంజాబీలు, వైశ్యులు, త్యాగీలు, జాట్లతోపాటు దక్షిణాది ప్రాంతాల నుంచి బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడినవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌బబ్బర్ ముస్లిం, దళిత ఓటర్లను ఆకుట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణ ప్రాంతాలకే పరిమితం కావడం ఆప్‌కు ప్రతికూలాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 23,55,467.
స్థానికేతరులదే హవా..!
Published Thu, Mar 27 2014 10:35 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement