సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో ఒకనాటి ప్రముఖ నేత షాజియా ఇల్మీ .. ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఇల్మీ... గురువారం బీజేపీలో చేరే అవకాశముందని అంటున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమె కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేస్తారని కూడా అంటున్నారు. షాజియా ఇల్మీ గత విధానసభ ఎన్నికలలో ఆర్ కేపురం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేసి 326 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘజియాబాద్ నుంచి మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ వీకే సింగ్‌కు వ్యతిరేకంగా పోటీచేశారు. అప్పటికే ఆమెకు ఆప్ తో విబేధాలు మొదలయ్యాయని, అంతేకాకుండా అయిష్టంగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారని వార్తలొచ్చిన సంగతి విదితమే. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఆమె ఆప్‌కు దూరమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, ఆ పార్టీలో ఒక్కరి మాటే చెల్లుతుం దని ఆమె ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, స్వరాజ్‌గురించి మాట్లాడే అధిష్టానం ఆ విధానాన్ని పార్టీలో అమలు చేయడం లేదని విమర్శించారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో ఆమె పాల్గొన్నారు.
ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు
షాజియా ఇల్మీ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ ప్రతిస్పందిస్తూ తనకు ఆ విషయం తెలియదని, ఎక్కడి నుంచైనా పోటీ చేసే స్వేచ్ఛ పౌరులకు ఉందని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ తరఫున బరిలోకి కిరణ్‌వాలియా
ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కిరణ్ వాలియా బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు తొలుత వాలియా నిరాకరించినప్పటికీ పార్టీ ఆదేశించడంతో అందుకు ఆమె అంగీకరించారు. కాగా గత ఎన్నికల్లో ప్రతిష్టాత్మక న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన షీలాదీక్షిత్ పరాజయం పాలైన సంగతి విదితమే. కేజ్రీవాల్... 25 వేల ఓట్ల తేడాతో షీలాను ఓడించారు. షీలాదీక్షిత్ ప్రభుత్వంలో కిరణ్ వాలియా... వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన వాలియాను ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతి ఓడించారు. అయితే 1999చ 2003, 2008 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో వాలియా... విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే.
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేయనున్న ఇల్మీ?
Published Thu, Jan 15 2015 12:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement