సాక్షి, న్యూఢిల్లీ:స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రచారం కోసం రాష్ట్ర బీజేపీ ప్రకటించిన తొమ్మిది మంది ప్రముఖుల పేర్లలో ఆప్ మాజీ నేత షాజియా ఇల్మి పేరు కూడా ఉండడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఈ పేర్లను ప్రకటించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు రాష్ట్ర శాఖ ఇంచార్జి ప్రభాత్ జోషీ కూడా పాల్గొన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేయడం కోసం మేధావులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులు, డాక్టర్లను ప్రచారకర్తల జాబితాలో చేర్చినట్లు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. అయితే ఈ జాబితాలో షాజియా ఇల్మీ పేరు ఉండడం చర్చకు దారితీసింది.
మోదీపై ఇల్మి ప్రశంసలు
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో భాగస్వామిని కాగలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంద న్నారు. బీజేపీలో చేరాలని యోచిస్తున్నారా? అని ప్రశ్నించగా ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. కాగా బీజేపీ రాష్ర్ట విభాగంప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడుస్తోంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ విజయవంతానికి సచిన్ టెండూల్కర్, సల్మాన్‌ఖాన్ మొదలైన తొమ్మిది మంది ప్రముఖులను ప్రధాని సూచించిన రీతిలోనే రాష్ట్ర బీజేపీ శాఖ కూడా తొమ్మిది మంది ప్రముఖులను ప్రచారకర్తలుగా ప్రకటించింది.
నగరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ వారి పేర్లను ప్రకటించారు. వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత షాజియా ఇల్మీతో పాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ దినేష్‌సింగ్, రెజ్లర్ సుశీల్‌కుమార్, డా. కె..కె. అగర్వాల్, కథక్ కళాకారిణి ఉమాశర్మ , డీసీఎం గ్రూప్ ఎండీ వినయ్ భరత్‌రామ్, ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ ప్రసిడెంట్ సిరాజుద్దీన్ ఖురేషీ, సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) అధ్యక్షుడు మోహిత్ నాగర్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగల కుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నా రు. ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని, ఈ కార్యక్రమమాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని రంగాలకు చెందిన వారిని ఇందులో భాగ స్వాములను చేస్తున్నామని ఆయన చెప్పారు. స్వచ్ఛ్ భారత్ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాకపోయినా... దేశప్రజల సహకారంతో అక్టోబర్ 2, 2019 నాటికి భారత్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దగలుగుతామంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయస్వేచ్ఛ కంటే పారిశుధ్యం ముఖ్యమని మహాత్మాగాంధీ చెప్పారని, అది ఆయన నినాదమ ని, మన ఇంటిని, పరిసరాలను దుకాణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన కర్తవ్యమని, దానిలో విజయం సాధిస్తే అది గాంధీజీకి అత్యున్న త నివాళి అవుతుందని మంత్రి చెప్పారు. ప్రజలను జాగరూకులను చేయడం, మౌలిక వసతులను కల్పించడం, పారిశుధ్య వసతులు కల్పించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదని, అన్ని రాజకీయ పార్టీలు ఇం దులో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
యావద్భారతానికి స్ఫూర్తి
రాష్ట్ర బీజేపీ శాఖ ఇంచార్జి ప్రభాత్ ఝా మాట్లాడుతూ విశిష్ఠ వ్యక్తులు స్వచ్ఛభారత్ ప్రచారంలో పాల్గొనడం యావత్ భారతావనికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ తొమ్మిది మంది ప్రముఖులతో పాటు సులభ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి బిదేశ్వర్ పాఠక్, ప్రముఖ గాయని శిబాని కశ్యప్, ఫిక్కీ మహిళా విభాగం సభ్యురాలు హరిజిందర్ కౌర్, ఢిల్లీ నివాస సముదాయ సమాఖ్య అధ్యక్షుడు జితేందర్ త్యాగి, కార్యదర్శి సౌరవ్ గాంధీ, వీడియో డెరైక్టర్ రవీంద్రలు కూడా స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగస్వామ్యానికి ముందుకువచ్చారని తెలిపారు.
వాల్మీకికాలనీలో పారిశుధ్య కార్యక్రమం
స్వచ్ఛ్ భారత్ అభియాన్ కింద రాష్ర్ట రెవెన్యూ శాఖ సిబ్బంది వాల్మీకినగర్‌లో గురవారం పారిశుధ్య కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మీడియాతో మాట్లాడుతూ అరబిందో మార్కెట్ అసోసియేషన్ సహకారంతో నివాస సంక్షేమ సంఘాలకు 50 డస్ట్ బిన్‌లను అందజేశామన్నారు. ప్రధానమంత్రి ఇచ్చి న పిలుపును స్ఫూర్తిగా తీసుకుని నగరవాసులు స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పెద్దసంఖ్యలో పాల్గొనాలని, పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవాలన్నారు.
కమలం గూటిలో ఇల్మి?
Published Thu, Oct 9 2014 10:58 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement