సాక్షి, న్యూఢిల్లీ :విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జుగ్గీవాసులను ఆకట్టుకునేందుకు బీజేపీ... నానావిధాలుగా యత్నిస్తోంది. ఇందులోభాగంగా గురువారం స్థానిక పార్టీ కార్యాలయం నుంచి జాతీయ కార్యాలయం వరకు ప్రత్యేక రన్ నిర్వహించనుంది. ఈ రన్‌లో జుగ్గీజోపిడీలకు చెందిన యువత భారీసంఖ్యలో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నగరంలో దాదాపు 700 పైగా జుగ్గీజోపిడీ క్లస్టర్లు ఉన్నాయి. వాటిలో 30 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ఒకప్పుడు జుగ్గీవాసులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా పరిగణించేవారు. అయితే గత ఎన్నికలలో ఈ పరిస్థితి మారిపోయింది. వారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటుబ్యాంకుగా మారిపోయారు. దీంతో ఇప్పుడు వారిని తనవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జుగ్గీజోపిడీవాసులను ఆకట్టుకోనట్లయితే రానున్న ఎన్నికల్లో తాము లక్ష్యంగా నిర్ణయించిన 60 పైగా సీట్లను గెలవడం సాధ్యం కాదని బీజేపీ ఎన్నికల వ్యూహకర్తలు గుర్తించారు.
అందువల్లనే బీజేపీ నేతలు ఈక్లస్టర్లలో జోరుగా ప్రచారం చేయడంతోపాటు జుగ్గీ జోపిడీలను అభివృద్ధి చేస్తామంటూ హామీలను గుప్పించాలని నిర్ణయించారు. ఎక్కడ జుగ్గీ ఉంటే అక్కడ పక్కా ఇల్లు నిర్మిప్తామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రారంభించిందని చెబుతున్నారు. ఈ నెల పదో తేదీన రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందుకు సంబంధించి ఓ ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. జుగ్గీవాసులకు వైద్యం అందించడం కోసం డి స్పెన్సరీలను ప్రారంభిస్తామని, మాదకపదార్థాలు, సట్టా నుంచి జుగ్గీ జోపిడీలకు విముక్తి కల్పిస్తామని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి గురించి జుగ్గీజోపిడీలలో మోడీ వికాస్ రథ్ విస్తృతంగా ప్రచారం చేయనుంది.
సంప్రదాయరీతిలోనూ ప్రచారం
ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒకవైపు సామాజిక మాధ్యమంతోపాటు అత్యాధునిక సమాచార వ్యవస్థలను సైతం వినియోగించుకుంటున్న కమలదళం... మరోవైపు సంప్రదాయ రీతిలోనూ ప్రచారం చేయనుంది. 50 లక్షల మంది ఓటర్లను తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వముందుకు సాగుతున్న బీజేపీ ఈ నెల 12వ తేదీ నుంచి నగరవ్యాప్తంగా వీధినాటకాలకు తెర తీయనుంది. ఢిల్లీలోని 14 జిల్లాల్లో ఈ ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ నాటకాల్లో పాలుపంచుకునే కళాకారులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృ త్వంలోని ప్రభుత్వ పనితీరును ప్రేక్షకులకు కడురమ్యంగా వివరించనున్నారు. నాటక రంగంలో నిపుణులను ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈ విషయమై బీజేపీ సంప్రదాయ ప్రచార కమిటీ గజేంద్ర సోలంకి మాట్లాడుతూ ‘ఈ నెల 12వ తేదీనుంచి వీధి నాటకాలను ప్రారంభించనున్నాం. టెలివిజన్లు, ఇంటర్నెట్‌లను చూసే తీరిక, ఓపిక అందరికీ ఉండకపోవచ్చు. వీధి నాటకాల ద్వారా 50 లక్షలమంది ఓటర్లకు చేరువ కావాలనేది మా లక్ష్యం’అని అన్నారు.
జుగ్గీజోపడి ఓటుబ్యాంకుపై బీజేపీ దృష్టి
Published Wed, Jan 7 2015 10:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement