సాక్షి, న్యూఢిల్లీ : విధానసభ ఎన్నికల ప్రకటన ఈ వారం వెలువడొచ్చనే ఊహాగానాల నే పథ్యంలో నగరంలోని మూడు రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచార సన్నాహాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామ్‌లీలామైదాన్‌లో నిర్వహించనున్న ర్యాలీతో తమ ఎన్నికల ప్రచారానికి నూతనోత్సాహం వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టకీ ఈ ర్యాలీ ఏర్పాట్లలో తలమనకలై ఉంది. ఈ ఎన్నికల్లో విజయావకాశాలు అంతగా లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రయత్నం తాను చేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఆ పార్టీ ఎన్నికల ప్రకటన వెలువడకముందే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో 24 మంది పేర్లున్నాయి. ఇక రెండో జాబితా వచ్చేవారం వెలువడుతుందని అంటున్నారు. మొదటి జాబితాలో గత విధానసభ ఎన్నికలలో గెలిచిన వారితోపాటు రెండో స్థానంలో నిలిచిన వారికి టికెట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎవరికి అవకాశం కల్పిస్తుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. రెండో జాబితాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ పేరు ఉండొచ్చని అంటున్నారు. ఆమె గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఆమె పోస్టర్లు ఈ నియోజకవర్గంలో దర్శనమిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో బెంగాలీ ఓటర్ల సంఖ్య ఎక్కువ, మినీ బెంగాల్‌గా పరిగణించే చిత్తరంజన్ పార్క్ వంటి ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ కైలాష్ టికెట్ శర్మిష్ట ముఖర్జీకి కేటాయించినట్లయితే కాంగ్రెస్‌కు విజయావకాశాలు అధికంగా ఉంటాయని ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచేవారు అంటున్నారు.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి షీలాదీక్షిత్ ఉత్సాహంగా లేరన్న వార్తల నేపథ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ఎవరిని బరిలోకి దింపుతుందనే అంశంపై కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి కిరణ్ వాలియా, మాజీ మేయర్ ఫర్హాద్‌సురి పేర్లతో పాటు సరోజినీనగర్ మార్కెట్ అసోసియేషన్ ప్రసిడెంట్ అశోక్ రణ్‌ధవా, స్థానిక నేత యోగేష్ మాలిక్, వాల్మీకీ సముదాయానికి చెందిన నేత ఆర్ ఎన్ చందేలియా తదితరులు ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.
మాజీ స్పీకర్ యోగానందశాస్త్రిని మాలవీయనగర్ నుంచి మాజీ మంత్రి మంగత్‌రామ్‌సింఘాల్‌ను ఆదర్శనగర్ , నీరజ్‌బసోయాను కస్తూర్బానగర్ నుంచి నిలబెట్టే విషయాన్ని పార్టీ పరిశీలిస్తోందని అంటున్నారు. కస్తూర్బానగర్ టికెట్ ఆశిస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ అభిషేక్ దత్ నియోజకవర్గమంతటా తన పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటుచేయడంద్వారా టికె ట్ రేసులో తానుకూడా ఉన్నాననిపించుకున్నారు.
ఎవరికి ఏ సీటు దక్కేనో?
Published Wed, Jan 7 2015 10:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement